ఆయుష్
11వ ఆయుర్వేద దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజల భాగస్వామ్యం
30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 9,700కు పైగా కార్యక్రమాల నిర్వహణ: ఆయుర్వేదానికి మద్దతు తెలిపిన 89 లక్షల మంది
3.6 లక్షల మందికి పైగా నమోదు: అనేక దేశాల్లో కార్యక్రమాల నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 3:33PM by PIB Hyderabad
సెప్టెంబర్ 23న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించుకొనేందుకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో ‘‘ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఆయుర్వేదం’’ అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యం ఊపందుకుంది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9,700కు పైగా కార్యక్రమాలు జరిగాయి. అధికారిక ఆయుర్వేద దినోత్సవ వెబ్‌సైట్ ద్వారా 3.6 లక్షల మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ ద్వారా దాదాపు 89.3 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి మద్దతును ప్రకటించారు.
దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పౌర భాగస్వామ్యం, నమోదు, నివేదికల కోసం డిజిటల్ వేదికగా ayurvedaday.org.in లో అందుబాటులో ఉన్న ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ పనిచేస్తుంది.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాలు గణనీయమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాయి. ఇది దేశవ్యాప్త ఉత్సవాల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
ఆయుర్వేదంపై అవగాహన కల్పించడానికి, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి విస్తృత స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించారు. వాటిలో ఆయుర్వేద అవగాహన కార్యక్రమాలు, సమాచారం, విద్య, ప్రసార (ఐఈసీ) కార్యకలాపాలు, ప్రచార కార్యక్రమాలు, ఆయుర్వేద ఆరోగ్యం, వెల్‌నెస్ క్యాంపులను ప్రధాన కార్యక్రమాలుగా చేపట్టారు.
పాఠశాలలు, కళాశాలల్లో ఔషధ మొక్కలను నాటడం, పరిరక్షణ కార్యక్రమాలు, ఆయుర్వేద అవగాహన కార్యక్రమాలు, యువతను భాగస్వామ్యం చేసే కార్యక్రమాలు, ఆయుర్వేద ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే ప్రచారాలు, పౌర ప్రతిజ్ఞ కార్యక్రమాలు, ఆయుర్వేద క్విజ్ లాంటివి ఇతర కార్యకలాపాల్లో ఉన్నాయి.
అవగాహన, ఆరోగ్యం, భాగస్వామ్య కార్యకలాపాల ద్వారా ఈ కార్యక్రమాలు పౌరులను, విద్యా సంస్థలను, సమాజాలను, వివిధ సంస్థలను ఒకే చోటకు తీసుకువస్తున్నాయి. అలాగే ఆయుర్వేద దినోత్సవాల్లో విస్తృత ప్రజా భాగస్వామ్యానికి అవకాశాలను కల్పిస్తున్నాయి.
11వ ఆయుర్వేద దినోత్సవం–2026లో భారతదేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా భాగస్వామ్యం కనిపించింది. 10 దేశాలు, ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహించారు. వాటిలో 1,900 మందికి పైగా పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న దేశాలు, ప్రాంతాల్లో బ్రిటిష్ హిందూ మహా సముద్ర ప్రాంతం, యునైటెడ్ కింగ్‌డమ్, ఆఫ్ఘనిస్థాన్, బల్గేరియా, స్పెయిన్, అల్జీరియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఐస్‌ల్యాండ్, అమెరికా ఉన్నాయి.
ఆయుర్వేద దినోత్సవానికి పెరుగుతున్న ఆదరణను ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం ప్రతిబింబిస్తోంది. అలాగే భారత్ వెలుపల ఆయుర్వేద అవగాహన, ఆరోగ్యం, ప్రజా భాగస్వామ్యంలో సమాజాలు, సంస్థలు చురుగ్గా పాల్గొనడాన్ని సూచిస్తోంది.


***
(రిలీజ్ ఐడి: 2313244)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6