శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మై భారత్ వెబ్‌సైట్లో ‘సీఎస్ఐఆర్ క్విజ్’ను నిర్వహిస్తున్న సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసర్చ్ కౌన్సిల్
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 1:12PM by PIB Hyderabad
సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసర్చ్ కౌన్సిల్ (సీఎస్ఐఆర్) 85వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మై భారత్ (మేరా యువ భారత్) వెబ్‌సైట్లో సీఎస్ఐఆర్ సైన్స్, ఇన్నొవేషన్ క్విజ్ (సీఎస్ఐఆర్ సైక్విజ్)ను ప్రారంభించారు. సైన్స్, టెక్నాలజీ శాఖలో భాగమైన సీఎస్ఐఆర్.. యువజన వ్యవహారాలు, క్రీడల శాఖకు చెందిన యువజన వ్యవహారాల విభాగం సహకారంతో ఈ క్విజ్ పోటీని నిర్వహిస్తోంది.
ఈ నెల 20 నుంచి 26 వరకు కొనసాగే క్విజ్‌లో భారత ప్రజలు పాల్గొనవచ్చు. క్విజ్‌లో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలుంటాయి. శాస్త్రవిజ్ఞాన రంగంలో సీఎస్ఐఆర్ సాధించిన విజయాలు, చేసిన నూతన ఆవిష్కరణలు, సంస్థలతో పాటు సమాజానికీ, దేశానికీ సీఎస్ఐర్ అందిస్తున్న సేవకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు.
ఆరోగ్యసంరక్షణ, వ్యవసాయం, పర్యావరణం, మౌలిక సదుపాయాల కల్పన, ఇంధనం, ఏరోస్పేస్, బయోటెక్నాలజీతో పాటు వ్యూహాత్మక సాంకేతికతలు సహా సీఎస్ఐఆర్ పరిధిలోకి వచ్చే వివిధ రంగాలపై ప్రశ్నలుంటాయి. సీఎస్ఐఆర్ పరిశోధనలు సమాజానికీ, పరిశ్రమకూ అవసరమైన పరిష్కారాలను ఏయే విధాలుగా అందిస్తున్నాయన్న ప్రస్తావనలు ఈ ప్రశ్నల్లో ఉంటాయి.
భారతదేశంలో ప్రధాన పరిశోధన ప్రయోగశాలల నెట్‌వర్క్‌ను గురించి తెలుసుకోవడానికి ఒక చర్చావేదికగా ఉపయోగపడుతూ, ప్రజలలో ముఖ్యంగా యువతలో విజ్ఞానశాస్త్రం పట్ల చైతన్యాన్నీ, ఆసక్తినీ, అభిరుచినీ పెంపొందింపచేయాలన్నదే ఈ క్విజ్ పోటీ ప్రధానోద్దేశం. ఇది ఈ పోటీలో పాల్గొనే వారికి విజ్ఞానశాస్త్ర రంగంలో సీఎస్ఐఆర్ సాధించిన విజయాలు, అవలంబించిన సాంకేతికతలు, నూతన ఆవిష్కరణలు, దేశ నిర్మాణానికి సంస్థ అందిస్తున్న తోడ్పాటును గురించి తెలుసుకొనే ఆకర్షణీయ అవకాశం లభిస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా, పోటీలో పాల్గొనే వారు సీఎస్ఐఆర్‌కు చెందిన తాము కోరుకున్న ఏదైనా ఒక ప్రయోగశాలను ఒక రోజు పాటు సందర్శించే అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. ఈ అవకాశం వల్ల వారు దేశంలో విజ్ఞానశాస్త్ర పరిశోధన, నూతన ఆవిష్కరణలతో ముడిపడిన విస్తారిత అనుబంధ వ్యవస్థను గురించి నేరుగా తెలుసుకోవచ్చు.
సెప్టెంబర్ తరువాత కూడా సీఎస్ఐఆర్ సైక్విజ్‌ను కొనసాగిస్తారు. రాబోయే నెలల్లో మై భారత్ వెబ్‌సైట్లో మరిన్ని క్విజ్ కార్యక్రమాలను నిర్వహించాలన్న ఆలోచన కూడా ఉంది. సీఎస్ఐఆర్ పరిశోధన, నూతన ఆవిష్కరణలు, విజయాలతో ముడిపడిన వివిధ అంశాలను ఆయా క్విజ్‌లలో చేరుస్తారు.
ఈ కార్యక్రమం పౌరులకు విషయాలు తెలుసుకొనే, నేర్చుకునే, పోటీ పడే, విజేతలుగా నిలిచే అవకాశాలను అందిస్తుంది. అలాగే సైన్సునూ, నూతన ఆవిష్కరణలనూ సమాజానికి చేరువ చేసే దిశగా సీఎస్ఐఆర్ సాగిస్తున్న ప్రయాణంలో ఈ క్విజ్ రూపేణా ప్రజలు తామూ పాలుపంచుకోవచ్చు.
క్విజ్‌లో పాల్గొనడానికి ఈ కింది లింకులోకి వెళ్లండి:
https://mybharat.gov.in/quizzes/yuva/
***
(రిలీజ్ ఐడి: 2313242)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13