సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ పథకాల కారణంగా 6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గిన నిరుద్యోగిత రేటు: కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్

చెన్నైలో జరిగిన 20వ రోజ్‌గార్ మేళాలో 285 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 SEP 2026 8:02PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహించిన 20'రోజ్‌గార్ మేళా'లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్నారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను అందజేశారు.

చెన్నైలోని డి.జి. వైష్ణవ్ కళాశాలలో జరిగిన రోజ్‌గార్ మేళాలో కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు ఎంపికైన 285 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఆదాయపు పన్ను శాఖ, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రక్షణ మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ, జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్), సదరన్ రైల్వే వంటి కీలక సంస్థల్లో చేరుతున్న యువతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ మాట్లాడుతూ... కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతున్న యువతపై 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే పెద్ద బాధ్యత ఉందన్నారు. ఈ ఉద్యోగాన్ని కేవలం ఒక బతుకుదెరువులా చూడకుండా, దేశ సేవకు దక్కిన అవకాశంగా భావించి దేశ ప్రగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగ నియామక పత్రం అంటే కేవలం ఉద్యోగం రావడం కాదు, దేశ సేవకు దక్కిన అవకాశం అని ఆయన అన్నారు. కార్యాలయాల్లో ప్రజలను కలిసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి గుర్తింపుగా నిలుస్తారని పేర్కొన్నారు. అందుకే ప్రజలతో మాట్లాడేటప్పుడు నిజాయతీ, బాధ్యత, సానుభూతి, మానవత్వంతో నడుచుకోవడం చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్రా లోన్స్ వంటి పథకాల వల్ల యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే పరిస్థితి నుంచి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ రకమైన ప్రభుత్వ ప్రయత్నాల వల్లే దేశంలో నిరుద్యోగం 6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గిందని ఆయన వెల్లడించారు.

2014 నాటికి మన దేశంలో కేవలం 400 అంకురసంస్థలు మాత్రమే ఉండేవనీ, ఇప్పుడు వాటి సంఖ్య 2.5 లక్షలు దాటిందని కేంద్ర మంత్రి తెలిపారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ అంకురసంస్థలు స్థాపించిన వారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వయసున్న యువతేనని ఆయన వివరించారు.

నిరంతర అభ్యసనం, సరికొత్త సాంకేతికతలను అలవర్చుకోవడం, వృత్తిపరమైన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాల్సిన ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి వంటి అత్యాధునిక రంగాల్లో యువతకు పెరుగుతున్న అవకాశాలనూ ఆయన ప్రస్తావించారు. అంతరిక్షం, రక్షణ, విద్య, పరిపాలన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ సహా అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.

యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన రోజ్‌గార్ మేళాల ద్వారా 12.75 లక్షల మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలను అందించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

అనంతరం మీడియాతో కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ మాట్లాడుతూ.. తమిళనాడులో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయడం వల్ల పేద, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకూ నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. ఇది మాతృభాషలో ప్రాథమిక విద్యను సులభతరం చేయడంతో పాటు, విద్యార్థులు పలు భారతీయ భాషలను నేర్చుకునేందుకు గొప్ప అవకాశాలను కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి తమిళనాడు, పుదుచ్చేరి ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శ్రీ సునీల్ బాజ్‌పాయ్, ఇతర ఉన్నతాధికారులు, కొత్తగా నియమితులైన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

 

***


(రిలీజ్ ఐడి: 2312832) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Kannada