హోం మంత్రిత్వ శాఖ
కర్ణాటకలోని హుబ్బళ్లిలో జేబీజీఎంఎం మెడికల్ కాలేజ్, కేఎల్ఈ హాస్పిటల్ - మెడికల్ రీసెర్చ్ సెంటర్ ప్రాంగణాన్ని సందర్శించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
విద్య, వైద్య సేవల ద్వారా 110 ఏళ్లకు పైగా దేశానికి సేవలందిస్తున్న కేఎల్ఈ
కర్ణాటక వ్యాప్తంగా ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ సేవలను విస్తరించడంలో నూతన మైలురాయిగా 250 ఎంబీబీఎస్ సీట్లు, 1,200 పడకల సామర్థ్యంతో ఏర్పాటయిన నూతన సదుపాయంలో నిరుపేదల కోసం 300 పడకలు కేటాయింపు
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2026 8:58PM by PIB Hyderabad
కర్ణాటకలోని హుబ్బళ్లిలో జేబీజీఎంఎం మెడికల్ కాలేజ్, కేఎల్ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ప్రాంగణాన్ని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు సందర్శించారు.
“కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఉన్న జేబీజీఎంఎం మెడికల్ కాలేజ్, కేఎల్ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ప్రాంగణాన్ని ఈ రోజు సందర్శించాను. విద్య, వైద్య సేవల ద్వారా కేఎల్ఈ సంస్థ 110 ఏళ్లకు పైగా దేశానికి సేవలందిస్తోంది. 250 ఎంబీబీఎస్ సీట్లు, 1,200 పడకలతో ఏర్పాటు చేసిన ఈ కొత్త సదుపాయంలో 300 పడకలను పేదల కోసం కేటాయించారు. కర్ణాటక అంతటా ప్రపంచస్థాయి వైద్య సేవలను విస్తరించడంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది” అని శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మెడికల్ కాలేజ్, ఆసుపత్రి సముదాయంలో మొత్తం 20 లక్షల చదరపు అడుగుల కట్టుబడి విస్తీర్ణం ఉంది. ఈ ఆసుపత్రిలో ఒకే చోట విస్తృత స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, ప్రసూతి, స్త్రీ వ్యాధులు, నేత్ర వైద్యం, చెవి - ముక్కు - గొంతు వైద్యం (ఈఎన్‌టీ), మానసిక వైద్యం, దంత వైద్యం, ఫిజియోథెరపీ మొదలైన ప్రాథమిక ప్రత్యేక వైద్య విభాగాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, అవయవ మార్పిడి, యూరాలజీ, ఆంకాలజీ, ఎండోక్రైనాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు ఆధునిక ప్రయోగశాల సదుపాయాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో 24 గంటల పాటు వేగవంతమైన అత్యవసర, ట్రామా వైద్య సేవలు, ఆధునిక డయాలసిస్ విభాగం, డిజిటల్ ఎక్స్‌రే, హై రిజల్యూషన్ సీటీ స్కానింగ్, అల్ట్రాసోనోగ్రఫీ వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2312830)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2