సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మిషన్ కర్మయోగి కింద శిక్షణా సంస్థల ఆధునీకరణకు ప్రాంతీయ కార్యశాలలను (సాధన శృంఖల) ప్రారంభించనున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ)

సెప్టెంబర్ 29, 30 తేదీల్లో విజయవాడలో తొలి సదస్సు; హాజరుకానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

ఈ సదస్సులో పాల్గొననున్న తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులు, శిక్షణ సంస్థలు

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2026 4:21PM by PIB Vijayawada

మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణ సంస్థలను నైపుణ్యంతో కూడిన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ) "సాధన శృంఖల 2026" (స్ట్రెంథెనింగ్ అడాప్టివ్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ ఆప్టిట్యూడ్ ఫర్ నేషనల్ అడ్వాన్స్మెంట్) పేరుతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలల శ్రేణిని నిర్వహిస్తోంది. అంతకుముందు 2026 ఏప్రిల్ 2 నుండి 8 వరకు నిర్వహించిన 'సాధన సప్తాహ్ 2026' దేశంలోనే అత్యంత పెద్ద భాగస్వామ్య సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సంప్రదింపుల స్ఫూర్తిని కొనసాగిస్తూ, సంస్థాగత సంస్కరణలపై జాతీయ స్థాయిలో సాగిన చర్చను రాష్ట్రాలకు, స్థానిక శిక్షణ సంస్థలకు విస్తరించడమే ఈ 'శృంఖల' ప్రధాన ఉద్దేశం. ఈ శ్రేణిలో మొదటి ప్రాంతీయ వర్క్షాప్ 2026 సెప్టెంబర్ 29, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుంది.

 సాధన సప్తాహ్ నుండి సాధన శృంఖల వరకు

'వికసిత్ భారత్ 2047' లక్ష్యాలను సాధించడంలో మరియు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్పందించే పౌర-కేంద్రీకృత సివిల్ సర్వీస్ను సిద్ధం చేయడంలో శిక్షణ సంస్థల పాత్ర ఎంతో కీలకమైనది. గడిచిన ఏడాది కాలంగా కౌన్సిల్ రీజినల్ టాస్క్ ఫోర్స్ సమావేశాలు, సాధన సప్తాహ్ మరియు మే 2026లో నిర్వహించిన జాతీయ శిఖరాగ్ర సదస్సు ద్వారా వివిధ భాగస్వాములతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. ఈ చర్చలు శిక్షణ సంస్థలను, రాష్ట్ర ప్రభుత్వాలను, పరిశ్రమ భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి. శిక్షణ సంస్థలు కేవలం కోర్సులు నిర్వహించే స్థాయి నుంచి వ్యూహాత్మక, నైపుణ్య ఆధారిత సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా మారడానికి ఒక ఉమ్మడి విధానం అవసరమని ఈ భేటీలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే సాధన శృంఖల జాతీయ స్థాయి చర్చలను ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా విస్తరించి, ఆచరణాత్మక చర్యలకు బాటలు వేస్తోంది.


శిక్షణ సంస్థల రూపాంతర ఫ్రేమ్వర్క్ వైపు

ఈ ప్రాంతీయ కార్యశాలల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థల విభిన్న అవసరాలు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా 'శిక్షణ సంస్థల రూపాంతర ఫ్రేమ్వర్క్'ను అభివృద్ధి చేయడానికి కమిషన్ రాష్ట్రాలు, శిక్షణ సంస్థలు మరియు ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. ఈ చర్చల్లో ప్రధానంగా సంస్థాగత పాలన మరియు నాయకత్వం, కార్యాచరణ సమర్థత మరియు భాగస్వామ్య సహకారం, బోధనా సిబ్బంది (ఫ్యాకల్టీ) మరియు నైపుణ్యాభివృద్ధి, అలాగే డిజిటల్ మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల నిర్మాణాత్మక స్వీకరణ వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తున్నారు. విభిన్న రాష్ట్రాలు, సంస్థల అనుభవాలు, ప్రాధాన్యతలు మరియు స్థానిక సందర్భాల ద్వారా రూపుదిద్దుకుంటూనే, శిక్షణ సంస్థల రూపాంతరానికి ఒక స్పష్టమైన ఉమ్మడి దిశను అందించే ఫ్రేమ్వర్క్ను రూపొందించడమే దీని ప్రధాన లక్ష్యం. అందువల్ల ఈ విధానాన్ని రూపాంతరం కోసం అందరూ ఉమ్మడిగా భాగస్వామ్యం వహించే ఒక రోడ్మ్యాప్గా అభివృద్ధి చేస్తున్నారు. సాధన శృంఖల ఈ చర్చలను ప్రాంతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, అక్కడ వచ్చే కీలక సిఫార్సులను సమగ్రంగా పరిశీలించి ధృవీకరించడానికి మరియు వాటిని ఆచరణాత్మక ప్రాధాన్యతలుగా మార్చడానికి ఒక బలమైన వేదికను అందిస్తోంది.

ఈ రూపాంతర విధాన అమలును 'సాధన సప్తాహ్' సందర్భంగా ప్రారంభించిన యూనిఫైడ్ న్యూ-ఏజ్ నేషనల్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (UNNATI) పోర్టల్ద్వారా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారు. ఇది ఈ ఫ్రేమ్వర్క్కు ప్రధాన డిజిటల్ మూలస్తంభంగా నిలుస్తుంది. ఒకే ప్లాట్ఫారమ్లో 700కి పైగా శిక్షణ సంస్థలను అనుసంధానించడం ద్వారా, ఉన్నతి పోర్టల్ ఈ ఫ్రేమ్వర్క్ లక్ష్యాలను ఆచరణలోకి తెస్తుంది. ఇది సంస్థల పనితీరులో పారదర్శకతను పెంచుతూ, సజావుగా సమాచారాన్ని పంచుకోవడం, పరస్పర సహకారం మరియు ఉమ్మడి సృష్టి ద్వారా నిరంతరం డేటా ఆధారిత సంస్థాగత అభివృద్ధికి తోడ్పడుతుంది.

విజయవాడలో తొలి ప్రాంతీయ వర్క్షాప్

విజయవాడలో జరిగే ప్రారంభ ప్రాంతీయ కార్యశాలకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ గౌరవ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు, శిక్షణ సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ భాగస్వాములు, విషయ నిపుణులు మరియు స్టార్టప్ ప్రతినిధులు పాల్గొంటారు.

విజయవాడ వర్క్షాప్ అనంతరం సాధన శృంఖల దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఈ ప్రాంతీయ సంప్రదింపుల ద్వారా లభించే విలువైన సూచనల ఆధారంగా 'శిక్షణ సంస్థల రూపాంతర ఫ్రేమ్వర్క్'కు ఆఖరి రూపునిస్తారు. ఈ చొరవ ద్వారా అనుసంధానించిన, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధంగా ఉండే సామర్థ్య నిర్మాణ వ్యవస్థ ఏర్పడుతుంది. 'వికసిత్ భారత్ 2047' లక్ష్యంలో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేలా ప్రభుత్వ అధికారులకు పూర్తి స్థాయిలో నైపుణ్య శిక్షణ ఇచ్చి సిద్ధం చేయడమే 'మిషన్ కర్మయోగి' ముఖ్య లక్ష్యమని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.

 

*****


(రిలీజ్ ఐడి: 2312181) సందర్శకుల సూచీ సంఖ్య : : 76
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Odia , Tamil , Kannada , Malayalam