సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పురానా ఖిలాలో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమాన్ని నిర్వహించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి నాయకత్వంలో దేశంలో ప్రజల విశ్వాసం బలోపేతం, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
నాడు పోస్టు చేయడమైనది:
18 SEP 2026 10:29AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా 2026 సెప్టెంబర్ 17న న్యూఢిల్లీలోని పురానా ఖిలాలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ “భారత్ మాతా కీ జై” నినాదాల మధ్య ‘ఆశీర్వాద్ కా దియా’ (ఆశీర్వాద దీపం) వెలిగించి ప్రారంభించారు.

కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ‘ఆశీర్వాద్ కా దియా’ కేవలం ఒక దీపం మాత్రమే కాదని, ప్రజల ఆశీర్వాద శక్తికి సేవకు, కృతజ్ఞతా భావానికి, వికసిత్ భారత్ లక్ష్య సాధన సంకల్పానికి ప్రతీక అని అన్నారు. భారతీయ సంస్కృతిలో దీపం తనను తాను దహించుకుంటూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడం, చీకటిని తొలగించడం, ప్రజా సంక్షేమానికి మార్గం సుగమం చేయడాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ దీపం దేశ సేవ పట్ల సమష్టి సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి.. ఆయన ప్రజా జీవితం జాతీయ ప్రయోజనం, ప్రజాసేవకు అంకితమైందని అన్నారు. బాల్యం నుంచి నేటి వరకు ఏ బాధ్యతలో పనిచేసే అవకాశం లభించినా, దేశమే ప్రథమం అనే భావనతో పూర్తి అంకితభావంతో, సేవా స్ఫూర్తితో పనిచేశారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం నుంచి ప్రధానమంత్రిగా దేశానికి నాయకత్వం వహించే వరకు జాతీయ సేవ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి పట్ల ఆయన నిబద్ధత ఏమాత్రం తగ్గకుండా, స్థిరంగా కొనసాగిందని తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసే అవకాశం లభించడం తన ప్రజా జీవితంలో ఎంతో గౌరవప్రదమైన అనుభవమని అన్నారు. శ్రీ మోదీని తాను కేవలం ప్రధానమంత్రిగా మాత్రమే కాకుండా, అంకితభావంతో పనిచేసే కార్యకర్తగా, అన్వేషకుడిగా, తపస్విగా, సంస్థాగత కార్యకర్తగా చూశానని తెలిపారు. తన ప్రవర్తన, పని విధానం, మార్గదర్శకత్వం ద్వారా ప్రధానమంత్రి ప్రతి స్థాయిలోని ప్రజలకు స్ఫూర్తినిస్తారని, ప్రభుత్వ పదవిని ప్రతిష్టగా కాకుండా బాధ్యత, సేవకు ఒక సాధనంగా భావిస్తారని చెప్పారు.
ప్రధానమంత్రి పని విధానం ఫలితాల ఆధారిత పాలనపై కేంద్రీకృతమై ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. పథకాలను కేవలం ప్రక్రియలు లేదా గణాంకాల ఆధారంగా కాకుండా, అవి సమాజంపై చూపుతున్న వాస్తవ ప్రభావం, చివరి వ్యక్తి వరకు చేరుతున్న మార్పు ఆధారంగా సమీక్షిస్తారని అన్నారు. ఒక ఫైల్‌ను ముందుకు పంపడం మాత్రమే పని పూర్తయినట్లు కాదని, దాని ద్వారా ప్రజా సంక్షేమానికి కలిగే ఫలితాలే సుపరిపాలనకు అసలైన కొలమానమని ప్రధానమంత్రి స్పష్టంగా భావిస్తారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

2014 తర్వాత భారత్ అభివృద్ధి, సుపరిపాలన దిశగా ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందని శ్రీ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశంలో ప్రజల విశ్వాసం బలోపేతమైందని, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి జరిగిందని తెలిపారు. “వారసత్వం, అభివృద్ధి” పరస్పర విరుద్ధమైనవి కావని, ఒకదానికొకటి పరిపూరకమైనవని ప్రధానమంత్రి విశ్వసిస్తారని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఈ రెండింటికీ సమానమైన పాత్ర ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ “వికాస్ భీ, విరాసత్ భీ” అనే సంకల్పంతో పనిచేస్తోందని అన్నారు. దేశంలోని శాస్త్రీయ, జానపద, సాంస్కృతిక సంప్రదాయాలు మన నాగరికతా చైతన్యానికి అమూల్యమైన వారసత్వ సంపద అని, వాటిని పరిరక్షించడం, ప్రోత్సహించడం, కొత్త తరానికి విస్తృతంగా పరిచయం చేయడం మంత్రిత్వ శాఖ ప్రధాన ప్రాధాన్యత అని తెలిపారు. తన వారసత్వ స్ఫూర్తితో ముందుకు సాగే సమాజమే వికసిత్ భారత్ లక్ష్యం వైపు విశ్వాసంతో, గర్వంతో పయనించగలదని ఆయన అన్నారు.
తన ప్రసంగంలో శ్రీ షెకావత్ ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సును ప్రస్తావించారు. ప్రపంచ స్థాయిలో భారత్ పోషిస్తున్న పాత్ర, భారత్‌పై ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న విశ్వాసం దేశం చూపుతున్న నిర్ణయాత్మక నాయకత్వాన్ని, జాతీయ ప్రయోజనాల పట్ల దాని నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లు ఎదురైనప్పటికీ జాతీయ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ సమాజం ముందు భారత్ తన సమర్థవంతమైన పాత్రను స్థాపించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ, కథక్ కేంద్రం, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, లలిత కళా అకాడమీ, జోనల్ సాంస్కృతిక కేంద్రాలకు చెందిన కళాకారులు, విద్యార్థులు భారతీయ శాస్త్రీయ, సాంస్కృతిక సంప్రదాయాల ఆధారంగా ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి కళాకారులు, విద్యార్థులు, జాతీయ సాంస్కృతిక నిధి, ‘అడాప్ట్ ఎ హెరిటేజ్’ కార్యక్రమ ప్రతినిధులు, ఇతర భాగస్వాములతో సమావేశమై, భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, ప్రోత్సాహంలో వారు అందిస్తున్న సేవలను అభినందించారు.
‘ఆశీర్వాద్ కా దియా’ను సామూహికంగా వెలిగించడంతో కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా అమృత్ కాలంలో సేవ, సంస్కృతి, దేశ నిర్మాణం, వికసిత్ భారత్ 2047 సాధన కోసం తమ సంకల్పాన్ని మరోసారి చాటిచెప్పారు.
***
(రిలీజ్ ఐడి: 2312074)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10