రక్షణ మంత్రిత్వ శాఖ
డీఆర్డీవో - పరిశ్రమల భాగస్వామ్య సదస్సు ‘విమర్శ్’లో కీలక విధానపరమైన కార్యక్రమాలను వెల్లడించిన రక్షణ మంత్రి
ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థల సాధికారతే లక్ష్యం.. లైసెన్సు పొందిన పరిశ్రమలతో సాఫ్ట్‌వేర్ సోర్స్ కోడ్‌లను పంచుకునేలా విధానాన్ని ప్రారంభించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్
సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కోసం- 13 తయారీ రంగ భాగస్వామ్య సంస్థలకు 9 లైసెన్సింగ్ ఒప్పందాలు
పరిశ్రమలతో సంబంధాల విస్తరణ దిశగా అవగాహన ఒప్పందాలు
డీఆర్డీవో - పరిశ్రమల మధ్య సంబంధాల విస్తరణ, రక్షణ రంగ సరఫరా వ్యవస్థతో ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలను ఏకీకృతం చేసి ప్రపంచస్థాయి ఉత్పత్తుల కేంద్రంగా భారత్‌ను నిలపడం ఆవశ్యకం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
“ఆర్థికంగా బలమైన, సాంకేతికంగా ఆత్మనిర్భర, సామాజిక సమ్మిళిత, పర్యావరణ సుస్థిర, వ్యూహాత్మక సురక్షిత దేశాన్ని సాకారం చేయడమే వికసిత భారత్ లక్ష్యం”
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2026 1:45PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో 2026 సెప్టెంబర్ 15న నిర్వహించిన ‘విమర్శ్’ (డీఆర్‌డీవో - పరిశ్రమల భాగస్వామ్య సదస్సు)లో పలు కీలక విధానపరమైన నిర్ణయాలను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. ఎంఎస్ఎంఈలు, డీప్‌టెక్ అంకుర సంస్థలకు సాంకేతిక, ఆర్థిక అవరోధాలను తగ్గించడం కోసం.. ప్రత్యక్ష నిధులు, ప్రారంభ పూర్వ మద్దతు, డీఆర్డీవో పరీక్ష కేంద్రాలను వినియోగించుకునే వెసులుబాటుతో కూడిన సమగ్ర విధానాన్ని ప్రకటించారు. అలాగే సాఫ్ట్‌వేర్ ఆధారిత రక్షణ సామర్థ్యాలను వేగవంతం చేయడం, పాత సాంకేతికతల సమస్యలను పరిష్కరించడం కోసం.. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ సోర్స్ కోడ్‌లను లైసెన్స్ పొందిన పరిశ్రమలతో పంచుకునేందుకు ఒక ప్రామాణిక, సురక్షిత విధానాన్ని కూడా ప్రారంభించారు.
అత్యాధునిక రక్షణ వ్యవస్థల వాణిజ్యపరమైన ఉత్పత్తికి మార్గం సుగమం చేసేలా.. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కోసం రూపొందించిన తొమ్మిది (9) లైసెన్సింగ్ ఒప్పందా (ఎల్ఏటీవోటీ)లను రక్షణ మంత్రి సమక్షంలో 13 తయారీ రంగ భాగస్వామ్య సంస్థలకు అందించారు.
పరిశ్రమలకు అప్పగించిన ఎల్ఏటీవోటీల జాబితా
పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడం, క్షేత్రస్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా.. భారత రక్షణ రంగ తయారీ సంస్థల సొసైటీ (ఎస్ఐడీఎం), లఘు ఉద్యోగ్ భారతి సంస్థలతో వ్యూహాత్మక అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. అలాగే దేశీయ రక్షణ ఉత్పత్తుల నాణ్యత, తయారీ సామర్థ్యాన్ని అంచనా వేసి రేటింగ్ ఇచ్చే.. ‘అధునాతన ఉత్పత్తుల అంచనా, రేటింగ్ వ్యవస్థ (సమర్) 2.0 వెర్షన్ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో డీఆర్‌డీవో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
రక్షణ మంత్రి మాట్లాడుతూ.. డీఆర్‌డీవో - పరిశ్రమల భాగస్వామ్యం ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకూడదన్నారు. పరిశోధన, రూపకల్పన, పరీక్షలు, ధృవీకరణ, తయారీ దశ వరకు... ప్రతి దశకూ ఈ భాగస్వామ్యాన్ని విస్తరించాలని స్పష్టం చేశారు. ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్‌ను నిలపడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. ‘‘డీఆర్‌డీవో వద్ద విజ్ఞానం, సాంకేతికత ఉన్నాయి. పరిశ్రమలకు భారీ తయారీ సామర్థ్యముంది. అంకుర సంస్థలతో నూతన ఆవిష్కరణలు, ఉత్తేజం జనిస్తాయి. మన యువత నవ భారతాన్ని స్వప్నిస్తోంది. ఈ నాలుగు శక్తులూ కలిసి ముందుకు సాగితే, అసాధ్యమైన లక్ష్యమంటూ ఏదీ లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆర్థికంగా బలమైన దేశాన్ని నిర్మించడం మాత్రమే కాదు.. సాంకేతిక స్వయంసమృద్ధ, సామాజిక సమ్మిళిత, పర్యావరణ సుస్థిర, వ్యూహాత్మక భద్రత కలిగిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమే ‘వికసిత భారత్’ లక్ష్యమని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ‘‘2047 నాటికి కీలక సాంకేతికతల్లో మనం ఆత్మనిర్భరత సాధించాలి. స్వదేశీ పరికరాల వాటాను గణనీయంగా పెంచుకోవాలి. రక్షణ ఎగుమతుల్లో అనేక రెట్ల వృద్ధిని సాధించాలి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో భారత్ భాగస్వామ్యాన్ని బలంగా నెలకొల్పాలి’’ అని ఆయన స్పష్టం చేశారు.
కొన్నేళ్లుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో రక్షణ రంగంలో చేపట్టిన అపూర్వ సంస్కరణలను మంత్రి వివరించారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, ఆత్మనిర్భరత దిశగా ముందడుగు వేసేలా.. దేశీయ తయారీదారుల నుంచే కొనుగోలు చేయాల్సిన రక్షణ పరికరాల జాబితాలను రూపొందించడం, మేక్ ఇన్ ఇండియా, ఐడెక్స్, అదితి పథకాలతోపాటు రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి బడ్జెటులో 25 శాతాన్ని ప్రైవేటు రంగానికి కేటాయించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. సాంకేతికత అభివృద్ధి నిధి ద్వారా అంకుర సంస్థలకు గ్రాంట్లను అందిస్తున్నామని, అనేక సాంకేతికతలు ఇప్పటికే ఉత్పత్తి దశకు చేరుకున్నాయని తెలిపారు. ఆర్మీ వాస్తవ కార్యాచరణ అవసరాల ఆధారంగా అంకుర సంస్థలు నూతన ఆవిష్కరణలు చేసేలా.. ఒక కొత్త వ్యవస్థను ఐడెక్స్ సృష్టించిందని ఆయన కొనియాడారు.
దేశ నూతన ఆవిష్కరణల పతాకధారులుగా అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ప్రధాన రక్షణ వ్యవస్థలకు అవసరమైన కీలక భాగాలు, ఉపవ్యవస్థలు, అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఈ సంస్థలదే ‘ఆత్మనిర్భర భారత్’ సాధనలో ప్రధాన పాత్ర అని వివరించారు. భారీ పరిశ్రమలతోపాటు ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలను కూడా రక్షణ సరఫరా వ్యవస్థలో అంతర్భాగంగా అనుసంధానించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కొత్త విధానపరమైన నిర్ణయాలు పరిశ్రమలకు నూతన అవకాశాలను అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్తగా ప్రకటించిన విధానపరమైన నిర్ణయాలు.. పరిశ్రమల నేతృత్వంలో పరిశోధన- అభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు అంకుర సంస్థలు, ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సాయం, మార్గనిర్దేశం అందించడం, విద్యాసంస్థలు-పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. అలాగే కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, హైపర్ సోనిక్స్, డైరెక్టెడ్ ఎనర్జీ వంటి భవిష్యత్ సాంకేతికతల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రక్షణ రంగ దిగుమతిదారు స్థాయి నుంచి ఎగుమతిదారు స్థాయికి భారత్ వేగంగా చేరుకుంటోందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. డ్రోన్ సాంకేతికత, కృత్రిమ మేధ, సైబర్ భద్రత వంటి పలు రంగాల్లో ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు వినూత్న ఆవిష్కరణలను వేగవంతం చేసి, దేశ సాంకేతిక, వ్యూహాత్మక సామర్థ్యాలను నూతన శిఖరాలకు చేర్చగలవని ఆయన అన్నారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలు వెన్నెముక. రక్షణ రంగానికి అత్యంత కీలకమైన బలం ఇవే. బడా కంపెనీలతో భాగస్వామ్యాలను విస్తరించుకుంటూనే.. నాణ్యత, తగిన సమయంలో సేవలందించడం, ఆవిష్కరణలు, అంతర్జాతీయ ప్రమాణాలపై ఎంఎస్‌ఎంఈలు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
సొంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశానికే తన భవిష్యత్తును స్వయంగా నిర్దేశించుకునే శక్తి ఉంటుందని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. దేశ స్వభావంలో, ఆలోచనా వైఖరిలో ‘ఆత్మనిర్భరత’ అంతర్భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘నేడు నూతన, ఆధునిక సాంకేతికతల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలే రేపటి రోజున అగ్రగాములుగా నిలుస్తాయి. సాంకేతికతలో ముందంజలో ఉన్న దేశమే భవిష్యత్ యుద్ధాల్లో వ్యూహాత్మక ఆధిక్యాన్ని సాధిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ మాట్లాడారు. అత్యాధునిక వాణిజ్యపరమైన ఆవిష్కరణలతో దేశ రక్షణ రంగాన్ని సంసిద్ధం చేసేలా.. ‘వార్తా సే వికాస్’ అన్న ప్రధాన ఇతివృత్తంతో వ్యూహాత్మకంగా ఈ ‘విమర్శ్ 2026’ సదస్సును నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రక్షణ వ్యవస్థలో ప్రైవేట్ రంగ సామర్థ్యాలను క్రమబద్ధంగా జోడించడం దీని లక్ష్యమన్నారు. రక్షణ రంగాన్ని కేవలం కొనుగోలుదారు-అమ్మకందారు సంబంధంగా కాకుండా.. ఉమ్మడి భాగస్వామ్యంతో కూడిన సాంకేతిక వ్యవస్థగా నిలపడంలో ఈ వేదిక ఎంతగానో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ స్వయంసమృద్ధి చర్యల ఫలితంగా గడిచిన కొన్నేళ్లలో రక్షణ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ వివరించారు. ‘‘సాంకేతిక పరిజ్ఞాన బదిలీల విస్తరణ ద్వారా సైనిక దళాల అవసరాలను తీర్చేందుకు సమాంతర ఉత్పత్తి మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది ఎంఎస్‌ఎంఈలకు నేరుగా లబ్ధి చేకూర్చడమే కాకుండా.. గతంలో పరిమితంగా ఉన్న ఉత్పాదక రంగానికి అడ్డంకిగా నిలిచిన పరిమితులను తొలగించడంలో సహాయపడింది. ఇప్పటివరకు 1,100కు పైగా పరిశ్రమలకు 2,300కు పైగా సాంకేతిక పరిజ్ఞాన బదిలీలు జరిగాయి. పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం లక్ష్యంగా.. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన దాదాపు 50 క్షిపణి సంబంధిత సాంకేతికతలను ప్రస్తుతం పరిశ్రమలకు అందుబాటులో ఉంచాం’’ అని ఆయన తెలిపారు.
‘డిఫెన్స్ సిస్టమ్స్ ఫర్ రెసిలియంట్ భారత్ - అడ్వాన్సింగ్ ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్’ అనే పుస్తకాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. 2014 నుంచి 2026 వరకు డీఆర్‌డీవో టెక్నాలజీ క్లస్టర్లు రూపొందించిన ముఖ్యమైన రక్షణ వ్యవస్థల విశేషాలను ఇందులో క్రోడీకరించారు. దీనితోపాటు డీఆర్‌డీవోలో మానవ వనరుల అవుట్‌సోర్సింగ్ సేవా కాంట్రాక్టుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. డీఆర్డీవో ప్రయోగశాల్లో మానవ వనరుల అవుట్‌సోర్సింగ్ ప్రక్రియ కోసం ఒక సమగ్రమైన విధానాన్ని ఈ మార్గదర్శకాలు అందిస్తున్నాయి. కొనుగోళ్లకు సంబంధించి నిర్దేశాలను రూపొందించడం, తగిన సంస్థల ఎంపిక, కాంట్రాక్టుల నిర్వహణ, పనితీరును పర్యవేక్షించడం, కాంట్రాక్టు నిబంధనలతోపాటు చట్టబద్ధమైన బాధ్యతలను నెరవేర్చడంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి.
రక్షణ ఉత్పత్తి విభాగం కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్, రక్షణ ఆర్థిక విభాగం కార్యదర్శి శ్రీ విశ్వజిత్ సహాయ్, డీఆర్డీవో విశిష్ట శాస్త్రవేత్త, డైరెక్టర్ జనరల్ (ఉత్పత్తి సమన్వయం, సేవల అంతర్గత అనుసంధానం) డాక్టర్ (శ్రీమతి) చంద్రికా కౌశిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాంకేతిక సదస్సుల్లో భాగంగా.. వైమానిక వ్యవస్థలు, క్షిపణులు, ఆయుధ సామగ్రి, మైక్రోఎలక్ట్రానిక్స్, నౌకాదళ వ్యవస్థల్లో భవిష్యత్ సాంకేతిక ప్రణాళికలను డీఆర్‌డీవో టెక్నాలజీ క్లస్టర్ల డైరెక్టర్ జనరళ్లు వివరించారు. నిబంధనల ప్రక్రియలను సులభతరం చేయడం, పరీక్ష కేంద్రాల కేటాయింపును వేగవంతం చేయడం, లైసెన్సింగ్ ప్రక్రియల కాల వ్యవధిని తగ్గించడం లక్ష్యంగా రూపొందించిన కొత్త కార్యక్రమాలను డీఆర్‌డీవో ప్రధాన కార్యాలయం ఆవిష్కరించింది.
ఉన్నత స్థాయి నిపుణుల బృంద చర్చలో.. డీఆర్డీవో, రక్షణ ఉత్పత్తి విభాగం (డీడీపీ), సాయుధ బలగాల సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా స్వీకరించడం, ‘అభివృద్ధితోపాటే ఉత్పత్తి భాగస్వామ్య’ విధానాలను మెరుగుపరచడం, దేశీయ సాంకేతికతలను త్వరితగతిన సైన్యంలోకి ప్రవేశపెట్టేందుకు అవసరమైన చర్యలపై వారు సమగ్రంగా చర్చించారు.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి రక్షణ రంగ పరిశ్రమకు చెందిన 250 మందికి పైగా ప్రముఖులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ, సైనిక ఉన్నతాధికారులు, సీనియర్ డీఆర్డీవో శాస్త్రవేత్తలు హాజరయ్యారు. డీపీఐఐటీ కార్యదర్శి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దేశీయ రక్షణ - పారిశ్రామిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ‘విమర్శ్ 2026’ సదస్సు ఒక వ్యూహాత్మక వేదికగా నిలిచింది. డీఆర్డీఓ అభివృద్ధి చేస్తున్న సాంకేతిక పరిశోధనలను, అత్యాధునిక డీప్‌టెక్ అంకుర సంస్థలను, దేశంలోని బలమైన తయారీ వ్యవస్థను ఒకే తాటిపైకి తెచ్చింది. మరింత పారదర్శకమైన, వేగవంతమైన, విస్తృతమైన ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అందించే వాతావరణాన్ని సృష్టించింది.
***
(రిలీజ్ ఐడి: 2310763)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4