ఉప రాష్ట్రపతి సచివాలయం
ఐసీడబ్ల్యూఏ 25వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఫలప్రదమైన సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, విదేశాంగ శాఖకు అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి
దేశాలు ఇతర దేశాల ఆందోళనలను అర్థం చేసుకొని, పరస్పర హితం కోరి పనిచేసినప్పుడే మానవ ప్రగతి, ప్రపంచ శాంతి సాధ్యమన్న ఉపరాష్ట్రపతి
శాంతిని, ప్రగతిని, సమృద్ధిని భారత్ కోరుకుంటూ అంతర్జాతీయ వేదికపై వాణిని బిగ్గరగా వినిపిస్తోంది: ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2026 2:34PM by PIB Hyderabad
జాతీయ ప్రాధాన్యం కలిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ఐసీడబ్ల్యూఏ) 25వ వార్షికోత్సవాలను ఈ రోజు న్యూఢిల్లీ లోని సప్రూ హౌస్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి, ఐసీడబ్ల్యూఏ అధ్యక్షుడు శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ప్రసంగించారు. రజతోత్సవం అంటే కృతజ్ఞత చాటుకుంటూ, ఇప్పటి వరకు సాగించిన ప్రస్థానాన్ని సమీక్షించుకునే సందర్భమని ఆయన అన్నారు. కౌన్సిల్ విశిష్ట వారసత్వానికి తోడ్పడిన వ్యవస్థాపకులు, పూర్వ నేతలు, డైరెక్టర్ జనరళ్లు, పండితులు, దౌత్యవేత్తలు, పరిశోధకులతో పాటు సిబ్బందిని ఆయన ప్రశంసించారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఐసీడబ్ల్యూఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్. జైశంకర్, విదేశీ వ్యవహారాల కార్యదర్శి శ్రీ విక్రమ్ మిశ్రీతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన పూర్తి బృందానికి ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. సంఘర్షణలు, వైరుధ్యాలతో సతమతం అవుతున్న ప్రపంచంలో, న్యూఢిల్లీ నేతల ప్రకటన ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చెప్పుకోదగిన విజయమని ఆయన అన్నారు.
దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడమే దౌత్యం ప్రథమ లక్ష్యమని శ్రీ సి.పి. రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. మానవ ప్రగతి, ప్రపంచ శాంతి చెట్టపట్టాల్ వేసుకొని ముందుకు సాగాలని, ఇదంతా దేశాలు ఇతర దేశాల బాధలను అర్థం చేసుకొని, పరస్పర హితం కోసం పనిచేసినప్పుడు మాత్రమే సాధ్యపడుతుందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ అంతర్జాతీయ పాత్రకు ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు. శాంతి, ప్రగతి, సమృద్ధిల సాధనలో భారత్ బలమైన వాణిని వినిపించే దేశంగా ఎదిగిందన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని అర్థం వచ్చే ‘వసుధైవ కుటుంబకమ్’ గురించి శ్రీ రాధాకృష్ణన్ ప్రస్తావిస్తూ, కోవిడ్ సంక్షోభ సమయంలో ‘వ్యాక్సీన్ మైత్రి’, విపత్తుల వేళల్లో భారత్ ప్రతిస్పందించి చేపట్టిన చర్యలు, ‘మిషన్ లైఫ్’ (LiFE), అంతర్జాతీయ సౌర కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలు ఈ సిద్ధాంతాన్ని చేతలలో చూపిన ఉదాహరణలని వివరించారు.
యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా భారత్ సాధించిన విజయాలను గురించి ఉపరాష్ట్రపతి ప్రస్తావించి, ‘‘పారదర్శక చెల్లింపు పద్ధతులు పారదర్శక పరిపాలన వైపు తీసుకువెళ్తాయి’’ అన్నారు. అభివృద్ధి కోసం తపిస్తున్న దేశాలతో భారత్ తన సాంకేతిక, సంస్థాగత శక్తియుక్తులను పంచుకుంటోందని, దీనికోసం ఐటీఈసీ, విద్యా రంగ సహకారం వంటి వాటిని వినియోగిస్తోందని ఆయన అన్నారు. జాంజిబార్‌లో మొదటి ఐఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన సంగతిని గుర్తుచేశారు. ‘‘అభివృద్ధి కోసం తపిస్తున్న దేశాలకు ప్రపంచ వేదికపై భారత్ నాయకత్వం వహిస్తోంది’’ అని ఆయన అన్నారు. భారత్ పట్ల అంతర్జాతీయ భాగస్వామ్య దేశాల్లో నమ్మకం, భరోసా అంతకంతకూ పెరుగుతున్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా స్థితిగతులు మారిపోతున్న నేపథ్యంలో ఐసీడబ్ల్యూఏ పాత్ర మరింత ప్రధానమైందిగా మారిందని శ్రీ రాధాకృష్ణన్ అన్నారు. కౌన్సిల్‌కు నాలుగు ప్రాధాన్యాలు ఉన్నాయని ఆయన వివరించారు. భారత్ అనుసరిస్తున్న పొరుగుదేశాలకు ప్రాధాన్యం, యాక్ట్ ఈస్ట్, గ్లోబల్ సౌత్, ఇండో-పసిఫిక్ అంశాలపై పరిశోధనను పటిష్టపరచడం, సైబర్ భద్రత, అంతరిక్షం, క్రిటికల్ టెక్నాలజీలు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ సంబంధిత పనులను విస్తరించడం, విశ్వవిద్యాలయాలు, యువ పరిశోధక విద్యార్థులతో అనుబంధాన్ని పెంపొందింప చేసుకోవడం, ప్రామాణిక భారతీయ దృక్పథంతో ప్రపంచ వ్యవహారాలకు సంబంధించిన ఓ విశ్వసనీయ జ్ఞాన భాండాగారంగా మారడం.. ఈ నాలుగూ ఐసీడబ్ల్యూఏ ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అంశాలని ఆయన అన్నారు.
2047కల్లా ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు తోడ్పడటానికి ఐసీడబ్ల్యూఏ మేధాపరంగా, సంస్థాగతంగా తనను తాను సన్నద్ధపరుచుకోవాలని, అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయనానికి ప్రపంచంలో గౌరవనీయ కేంద్రాల్లో ఒకటిగా నిలిచేందుకు పనిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఐసీడబ్ల్యూఏ స్వర్ణోత్సవ వేళకల్లా భారత్‌కే కాకుండా శాంతియుత ప్రపంచానికి మరింత ఎక్కువ తోడ్పాటును అందించగలుగుతుందని తాను విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు.
ఐసీడబ్ల్యూఏ ప్రస్థానాన్ని, పరిణామ క్రమాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఓ ఛాయాచిత్ర ప్రదర్శనను ఉపరాష్ట్రపతి చూశారు. కౌన్సిల్‌కు గతంలో డైరెక్టర్ జనరల్‌గా ఉంటూ సేవలను అందించిన వారికి మెమెంటోలను ఆయన ప్రదానం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2310525)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6