ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్‌’ ద్వారా పాకిస్థాన్‌ నుంచి వచ్చిన 362 మెట్రిక్‌ టన్నులకు పైగా ఎండు ఖర్జూరాలను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ

నాడు పోస్టు చేయడమైనది: 14 SEP 2026 12:23PM by PIB Hyderabad

పాకిస్థాన్‌ నుంచి దిగుమతులపై భారత్‌ విధించిన నిషేధాన్ని తప్పించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కీలక చర్యలో భాగంగా రెవెన్యూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) పాకిస్థాన్‌ మూలానికి చెందిన 362 మెట్రిక్‌ టన్నులకు పైగా ఎండు ఖర్జూరాలను స్వాధీనం చేసుకుంది.

 

నిర్దిష్ట నిఘా సమాచారంతో చర్యలు చేపట్టిన డీఆర్‌ఐ అధికారులు.. ముంబైకి చెందిన ఒక సంస్థ దిగుమతి చేసిన ఎండు ఖర్జూరాలతో కూడిన 13 కంటైనర్లను నాసిక్‌లోని సీఎఫ్‌ఎస్‌ అంబాడ్‌ వద్ద అడ్డుకున్నారు. ఈ సరుకులు యూఏఈలోని జెబెల్‌ అలీ నుంచి వచ్చినట్లు, దిగుమతి పత్రాల్లో సరుకుల మూల దేశంగా యూఏఈని పేర్కొన్నట్లు గుర్తించారు.

 

 

ప్రాథమిక దర్యాప్తులో సరుకుల పాకిస్థాన్‌ మూలాన్ని దాచేందుకు పక్కాగా రూపొందించిన రవాణా వ్యవస్థను ఉపయోగించినట్లు వెల్లడైంది. ఎండు ఖర్జూరాలను తొలుత పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టు నుంచి ఒక నౌకలో ఒక సెట్‌ కంటైనర్ల ద్వారా యూఏఈలోని జెబెల్‌ అలీ పోర్టుకు తరలించారు. అక్కడ సరుకులను కేవలం మరో సెట్‌ కంటైనర్లలోకి మార్చి, అనంతరరం మరో నౌకలోకి ఎక్కించి, పాకిస్థాన్‌ పౌరులు నిర్వహిస్తున్న సంస్థల ద్వారా భారత్‌కు తరలించినట్లు దర్యాప్తులో తేలింది.

 

పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం జాతీయ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉత్పత్తి అయిన లేదా పాకిస్థాన్‌ నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువుల ప్రత్యక్ష లేదా పరోక్ష దిగుమతులు, రవాణాపై పూర్తి నిషేధం విధించింది. ఈ నిషేధం 2025 మే 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు 2025 మే 2న డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్‌ నంబర్‌ 06/2025-26 జారీ చేసింది. దీనికి అనుగుణంగా డీఆర్‌ఐ ‘ఆపరేషన్‌ డీప్‌ మానిఫెస్ట్‌’ కింద మూడవ దేశాల మార్గాల ద్వారా భారత్‌లోకి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌ మూలాలు గల వస్తువులను నిరంతరం గుర్తించి, అడ్డుకుని, స్వాధీనం చేసుకుంటోంది.

 

తప్పుడు ప్రకటనలు, సరుకుల రవాణా, పత్రాల్లో తారుమారు వంటి పద్ధతుల ద్వారా వాణిజ్య నిషేధాలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న అధునాతన వ్యవస్థలను గుర్తించడం, అడ్డుకోవడం, విచ్ఛిన్నం చేయడంలో డీఆర్‌ఐ తన నిరంతర నిబద్ధతను ఈ స్వాధీనం మరోసారి స్పష్టం చేస్తోంది. తద్వారా జాతీయ భద్రతను కాపాడటంతో పాటు సరఫరా వ్యవస్థ సమగ్రతను పరిరక్షించేందుకు డీఆర్‌ఐ కట్టుబడి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2310220) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , Marathi , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Gujarati , Tamil