ఆయుష్
సంప్రదాయ వైద్యంపై నిపుణుల బృందానికి బ్రిక్స్ మద్దతు.. సాక్ష్యాధారిత ప్రపంచ సహకారానికి పిలుపు
వైద్య వ్యవస్థల బలోపేతం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధనలో
టీసీఐఎం రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యతను వెల్లడించిన న్యూఢిల్లీ ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2026 2:07PM by PIB Hyderabad
సంప్రదాయ, అనుబంధ, సమగ్ర వైద్య విధానాల్లో (టీసీఐఎం) అంతర్జాతీయ సహకారానికి 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించింది. వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ (యూహెచ్‌సీ) సాధనకు దోహదపడటంలో టీసీఐఎంకి పెరుగుతున్న ప్రాధాన్యతను ఈ ప్రకటన గుర్తించింది.
బ్రిక్స్ ఆరోగ్య ట్రాక్ పరిధిలో టీసీఐఎంపై బ్రిక్స్ నిపుణుల కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను స్వాగతించడం ఈ ప్రకటనలోని కీలక ఫలితాల్లో ఒకటి. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య చర్చలు, సహకారం, సమాచార మార్పిడికి ఈ ప్రతిపాదిత వర్కింగ్ గ్రూప్ ఒక వేదికగా పనిచేయనుంది. సంప్రదాయ వైద్య రంగంలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక వ్యవస్థీకృత వ్యవస్థను ఇది అందించనుంది.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ మాట్లాడుతూ.. “న్యూఢిల్లీ ప్రకటనలో సంప్రదాయ, అనుబంధ, సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడం సంప్రదాయ వైద్య రంగంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు. ప్రతిపాదిత బ్రిక్స్ నిపుణుల కార్యవర్గం.. సభ్య దేశాలకు జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనను బలోపేతం చేయడానికి, సాక్ష్యాధారిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి అర్థవంతమైన వేదికను అందిస్తుంది. శాస్త్రీయ పరిశోధన, నాణ్యతా ప్రమాణాల హామీ, అంతర్జాతీయ సహకారం ద్వారా ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉంది. తద్వారా సురక్షితమైన, సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సంరక్షణకు ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాలు దోహదపడేలా కృషి చేస్తాం” అని అన్నారు.
ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ.. “బ్రిక్స్ దేశాల మధ్య సంప్రదాయ, అనుబంధ, సమగ్ర వైద్య విధానాలపై నిర్మాణాత్మక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో న్యూఢిల్లీ ప్రకటన ఒక కీలక అడుగు. ప్రతిపాదిత నిపుణుల వర్కింగ్ గ్రూప్ ఆధారాలను పంచుకోవడం, పరిశోధన సహకారాన్ని బలోపేతం చేయడం, నాణ్యత, నియంత్రణ విధానాలను మెరుగుపరచడం కోసం ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుంది. ఆయుష్ వ్యవస్థ ద్వారా సురక్షితమైన, సమర్థవంతమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణకు తోడ్పడేలా కఠినమైన పరిశోధన, ఆధారాలతో కూడిన విధానాలను ప్రోత్సహిస్తూ ఈ సహకారానికి దోహదపడేందుకు భారత్ కట్టుబడి ఉంది” అని తెలిపారు.
చికిత్స, వ్యాధుల నివారణ కోసం ఉపయోగించే ఔషధ మొక్కలు, మూలికా తయారీలపై పరిశోధనలో మరింత సహకారం అందించాలని ఢిల్లీ ప్రకటన ప్రత్యేకంగా పిలుపునిచ్చింది. బ్రిక్స్ సభ్య దేశాలకు ఉమ్మడిగా ఉన్న సంప్రదాయ ఔషధ గ్రంథాలు సురక్షితమైన, సమర్థవంతమైన, సరసమైన చికిత్సా ఉత్పత్తుల అభివృద్ధికి కీలకంగా ఉపయోగపడగలవని పేర్కొంది.
బ్రిక్స్ కూటమిలోని దేశాల్లో ఉమ్మడి పరిశోధనలు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ దేశాల్లో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వైద్య పద్ధతులు ఉనికిలో ఉండటంతోపాటు మూలికలు, మూలికా ఔషధాలు ఇక్కడి ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక భాగంగా మారడమే ఇందుకు కారణం. ఈ దేశాలు ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల వైజ్ఞానిక పరిశోధనలు, సమాచార మార్పిడి, శాస్త్రీయ ఆధారాల సేకరణ వేగవంతం అవ్వడమే కాకుండా నాణ్యమైన, సురక్షితమైన మూలికా ఔషధాలను సులభంగా తయారు చేయడానికి వీలవుతుంది.
సభ్య దేశాల జాతీయ పరిస్థితులకు అనుగుణంగా, సాక్ష్యాధారితో కూడిన విధానాలు, తగిన నియంత్రణ వ్యవస్థల ద్వారా సంప్రదాయ, అనుబంధ, సమగ్ర వైద్య విధానాలు (టీసీఐఎం), ఉత్పత్తుల నాణ్యత, భద్రత, సమర్థతను నిర్ధారించాల్సిన ప్రాముఖ్యతను ఈ ప్రకటన మరింత స్పష్టం చేసింది.
సాక్ష్యాధారాలు, నాణ్యత, భద్రత, సమర్థతపై దృష్టి సారించడం సంప్రదాయ వైద్యంపై విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ముఖ్య ఆధారంగా నిలుస్తుంది. పరిశోధన పద్ధతులు, ఔషధ ప్రమాణాలు, నాణ్యతా హామీ, నియంత్రణ విధానాలు, సంప్రదాయ వైద్య విధానాలు, ఉత్పత్తుల శాస్త్రీయ ధ్రువీకరణ వంటి రంగాల్లో బ్రిక్స్ దేశాలు తమ అనుభవాలు, నైపుణ్యాన్ని పరస్పరం పంచుకునేందుకు కూడా ఇది అవకాశం కల్పిస్తుంది.
భారత్ బ్రిక్స్ అధ్యక్షతన సంప్రదాయ వైద్యంలో నిర్మాణాత్మక సహకారానికి సరికొత్త ఊతం
భారత్ బ్రిక్స్ అధ్యక్షతన 2026 జూలై 21న చండీగఢ్‌లో నిర్వహించిన బ్రిక్స్ సంప్రదాయ, అనుబంధ, సమగ్ర వైద్య విధానాల సమావేశం అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది టీసీఐఎంకు సంబంధించిన పరిశోధన, విద్య, సమాచార మార్పిడి, నియంత్రణ వ్యవస్థల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. ప్రతిపాదిత టీసీఐఎంపై బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్‌కు సంబంధించిన విధి విధానాలపై కూడా ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది.
ప్రతిపాదిత నిపుణుల వర్కింగ్ గ్రూప్ ద్వారా ఈ సహకారాన్ని మరింత సంస్థాగతం చేయడంతో పాటు, బ్రిక్స్ దేశాల్లోని పరిశోధనా సంస్థలు, నిపుణులు, విధాన రూపకర్తలు, విద్యా సంస్థల మధ్య నిరంతర భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది.
భారత్‌కు ఈ పరిణామం ప్రత్యేకంగా ప్రాధాన్యత కలిగినది. పరిశోధన, శాస్త్రీయ ఆధారాల సేకరణ, నాణ్యతా హామీ, అంతర్జాతీయ సహకారం ద్వారా ఆయుర్వేదం, ఇతర ఆయుష్ వైద్య విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత బలాన్నిస్తుంది. సంప్రదాయ వైద్యాన్ని ఆరోగ్య సంరక్షణలో బాధ్యతాయుతంగా సమగ్రపరుస్తూనే.. శాస్త్రీయ ఆధారాలు, భద్రత, సమర్థత, తగిన ప్రమాణాల ప్రాముఖ్యతను భారత్ నిరంతరం వెల్లడిస్తోంది.
ఔషధ మొక్కలు, మూలికా తయారీలపై దృష్టి సారించడం ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య మరింత లోతైన శాస్త్రీయ, సాంకేతిక సహకారానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. సమన్వయంతో చేపట్టే పరిశోధన ద్వారా ఔషధ వనరులపై మెరుగైన డాక్యుమెంటేషన్, శాస్త్రీయ అవగాహనకు దోహదపడటంతో పాటు, ఔషధ ప్రమాణాలపై పరిజ్ఞానాన్ని బలోపేతం చేసి, నాణ్యతకు హామీ ఉన్న చికిత్సా ఉత్పత్తుల అభివృద్ధికి మద్దతు అందించవచ్చు.
వైద్య వ్యవస్థల్లో సంప్రదాయ వైద్యానికి సరైన పాత్రపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. శాస్త్రీయ ఆధారాలను బలోపేతం చేయడం, భద్రత, నాణ్యతను నిర్ధారించడం, వైద్య విధానాల్లో సంప్రదాయ వైద్యాన్ని తగిన విధంగా సమగ్రపరచడానికి మద్దతు ఇవ్వడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంతర్జాతీయ సంప్రదాయ వైద్య వ్యూహం 2025–2034 దృష్టి సారించింది. సంప్రదాయ వైద్యంపై అంతర్జాతీయ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ ప్రయత్నాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ) కీలక పరిణామంగా పేర్కొంది.
న్యూఢిల్లీ ప్రకటనలో టీసీఐఎంకు దక్కిన ప్రాధాన్యత కేవలం సంప్రదాయ వైద్యానికి లభించిన గుర్తింపునకే పరిమితం కాకుండా, శాస్త్రీయ ఆధారాలతో కూడిన మరింత లోతైన అంతర్జాతీయ సహకారానికి పిలుపునివ్వడంలోనూ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ప్రతిపాదిత నిపుణుల కార్యవర్గం ద్వారా సంప్రదాయ, అనుబంధ, సమగ్ర వైద్య విధానాల్లో బ్రిక్స్ దేశాల విభిన్న అనుభవాలను ఒకచోట చేర్చి, పరిశోధన, శాస్త్రీయ ఆధారాల సేకరణ, సామర్థ్య నిర్మాణం, సమాచార మార్పిడి, నియంత్రణ విధానాల్లో సహకారానికి మార్గాలను సుగమం చేస్తుంది.
బ్రిక్స్ దేశాల మధ్య సంప్రదాయ వైద్య సహకారానికి మరింత క్రమబద్ధమైన విధానానికి న్యూఢిల్లీ ప్రకటన ఒక కీలక ముందడుగుగా నిలుస్తుంది. సంప్రదాయ జ్ఞానం, శాస్త్రీయ పరిశోధన, ఔషధ మొక్కల వనరులు, ఔషధ ప్రమాణాల నైపుణ్యం, నియంత్రణ అనుభవాన్ని ఒకచోట చేర్చేందుకు ఇది దోహదపడుతుంది.
భారత్‌కు ఈ ఫలితం ఆయుర్వేదం, విస్తృత ఆయుష్ వ్యవస్థకు అంతర్జాతీయ వేదికను మరింత బలోపేతం చేస్తుంది. ఆధారాలతో కూడిన సంప్రదాయ వైద్యం, నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, స్థితిస్థాపక వైద్య విధానాలపై ప్రపంచస్థాయి చర్చలకు ఇవి మరింతగా దోహదపడేందుకు అవకాశం కల్పిస్తుంది.
టీసీఐఎంను బ్రిక్స్ ఆరోగ్య ట్రాక్‌లో భాగం చేయడంతో పాటు, సహకారాన్ని సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, శాస్త్రీయ ఆధారాలు, నాణ్యత, భద్రత, సమర్థతతో అనుసంధానించడం ద్వారా సురక్షితమైన, సమర్థవంతమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం సభ్య దేశాల మధ్య నిరంతర సహకారానికి న్యూఢిల్లీ ప్రకటన బలమైన ప్రారంభాన్ని అందిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2309890)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11