ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సులో ‘సార్వజనీన అంతర్జాతీయ పరిపాలన బలోపేతం’పై చర్చలో ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 12 SEP 2026 4:08PM by PIB Hyderabad

మహోదయులు..

గౌరవనీయ ప్రముఖులారా…

అందరికీ నమస్కారం!

   ఈ విశిష్ట కార్యక్రమం కోసం భారత్‌ వచ్చిన మిమ్మల్ని శుభాకాంక్షలతో స్వాగతించడం నాకెంతో ఆనందదాయకం. బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలలో భాగంగా ప్రజాకేంద్రక, మానవాళి ప్రధాన విధానాన్ని భారత్‌ అనుసరిస్తోంది. పునరుత్థాన సామర్థ్యం, ఆవిష్కరణలలో సహకారం, సుస్థిరతలు మా అగ్ర ప్రాథమ్యాలు. ఈ దృక్కోణంతోనే బ్రిక్స్‌ సహకారాన్ని సామాన్య జన జీవనంతో మరింతగా ముడిపెట్టేందుకు మేం ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా 350కి పైగా సమావేశాలు నిర్వహించాం. దేశంలోని దాదాపు 30 నగరాల్లో మీ బృందాలన్నిటికీ స్వాగతం పలికే సదవకాశం మాకు లభించింది. బ్రిక్స్‌కు భారత్‌ అధ్యక్షతను విజయవంతం చేయడంలో మీ అందరి సన్నిహిత సహకారం, మద్దతుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

ఈ ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును ఓ కీలక మలుపుగా అభివర్ణింవచ్చు. ఆ మేరకు నేడు మనం ఈ కూటమి 20వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాం. మానవ జీవనంలో 20 ఏళ్లు పూర్తికావడమంటే- మానసిక పరిపక్వత, కర్తవ్య సహిత తదుపరి దశకు నాంది పలకడమన్న మాట!. దీన్ని యువ స్వప్నాలకు బాధ్యతలు జోడయ్యే..  సామర్థ్యం కొత్త దిశలకు మళ్లే వినూత్న దశగా పరిగణించవచ్చు.

బ్రిక్స్‌ కూడా నేడు అటువంటి కీలక పరిపక్వత మలుపును చేరింది. గడచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ యవనిపై తనదైన విశిష్ట గుర్తింపును సముపార్జించింది. స్వీయ దకృథాలను పరస్పరం గౌరవించుకుంటూ, మనమంతా ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతున్నాం. ఎవరినీ వ్యతిరేకించకుండా, కలుపుగోలు విధానంతో ముందడుగు వేయడం కోసమే మనం కృషి చేస్తున్నాం. ఈ ఐక్యత, ఏకాభిప్రాయ ధోరణిని సుస్థిర అంతర్జాతీయ ప్రయోజనంగా మలచుకోవాల్సిన తరుణమిదే. కాబట్టి, రాబోయే 20 ఏళ్ల భవిష్యత్తు దిశగా మనమొక వినూత్న, ప్రతిష్టాత్మక కార్యాచరణతో ముందుకెళ్లాలి. మన పని విధానాల బలోపేతం ద్వారా ఇందుకు మనం శ్రీకారం చుట్టాలి.

బ్రిక్స్‌ అధ్యక్షత బాధ్యతలు ఏటా ఒక్కొక్క దేశానికి బదిలీ అవుతుంటాయి. అయితే, ఈ ప్రక్రియ మన సంస్థాగత పురోగమనానికి ఎంతమాత్రం  ఆటంకం కారాదు. ఈ నేపథ్యంలో ‘బ్రిక్స్‌ శాశ్వతత్వ అమలు యంత్రాంగం’ ఏర్పాటుకు నేను ప్రతిపాదిస్తున్నాను. ‘త్రిముఖ’ సారథ్యంలో పనిచేసే ఈ యంత్రాంగం అన్ని రకాల కార్యక్రమాలు-ఫలితాలపై క్రమబద్ధ పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది. ఈ మేరకు మనమొక సురక్షిత డిజిటల్ భాండాగారాన్ని సృష్టించవచ్చు. ప్రతి నిర్ణయ సంబంధిత నోడల్ పాయింట్, కాలపరిమితి, అమలు స్థితిని ఇందులో నమోదు చేయవచ్చు.

మిత్రులారా!

ఈ కూటమిని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచ స్థాయి సంస్కరణలకూ మనం మార్గనిర్దేశం చేయాలి. ప్రస్తుత అంతర్జాతీయ పాలన స్వరూపం ఒక పిరమిడ్ తరహాలో ఉండగా, ఇందులో ఎగువన అధికారం-నిర్ణయాత్మకతలు కేంద్రీకృతమై ఉన్నాయి. దిగువ భాగంలో ఆ నిర్ణయాల వల్ల ప్రభావితమయ్యే దేశాలున్నాయి. అయినప్పటికీ, సదరు విధానాల రూపకల్పనలో ఈ దేశాల పాత్ర నామమాత్రం. నేటి ప్రపంచ సంక్షోభాలను నిభాయించడంలో వర్ధమాన దేశాలు అగ్రభాగంలో ఉన్నప్పటికీ, నిర్ణయాత్మకతలో మాత్రం పూర్తిగా వెనుకబాటులో ఉన్నాయి. కాబట్టి, ఈ “విశేషాధికారాల పిరమిడ్”ను “భాగస్వామ్య వేదిక”గా మార్చడంపై మనం దృష్టి సారించాలి. ఆ వేదికలో ప్రతి దేశం తన గళం వినిపించగలగాలి. ప్రతి సభ్య దేశానికీ భాగస్వామ్యం, ప్రతి కృషిలోనూ మానవాళి అభ్యున్నతి ప్రధాన లక్ష్యం కావాలి.

ఈ దిశగా అంతర్జాతీయ పాలన సంస్కరణల కోసం 10 ప్రతిపాదనల రూపకల్పనలో మనం సమష్టిగా కృషి చేయాలన్నది నా ప్రతిపాదన. వీటిని తదుపరి శిఖరాగ్ర సదస్సు నాటికి సంస్కరణలపై బ్రిక్స్ వ్యూహాత్మక ప్రణాళికంగా రూపొందించడానికి మనం ప్రయత్నించవచ్చు. ఈ క్రమంలో “ప్రాతినిధ్యం, ప్రతిస్పందన, నియమ-నిబంధనలకు రూపం” అనే మూడు కీలకాంశాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి.

ముందుగా- ప్రాతినిధ్యం విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సంస్కరణలపై ఇక జాప్యం తగదని నేను ప్రస్ఫుటం చేస్తున్నాను. దీనిపై పత్రాల ఆధారంగా సాగే చర్చలు విస్పష్ట నిర్దేశిత కాల వ్యవధి, నిర్దిష్ట ఫలితాలతో ముడిపడి ఉండాలి. అదేవిధంగా ఆర్థిక సంస్థలలో ఓటింగ్ అధికారం, నాయకత్వ స్థానం, విధాన ప్రాధాన్యం కూడా నేటి ఆర్థిక వాస్తవాలను ప్రతిబింబించేవిగా ఉండాలి. ప్రపంచ ఆర్థిక వృద్ధిని నడిపించే దేశాలన్నిటికీ ప్రపంచ ఆర్థిక పాలనను తీర్చిదిద్దడంలోనూ తగిన పాత్ర తప్పనిసరి.

రెండోది… ప్రతిస్పందనాత్మకత- ప్రపంచ సవాళ్లకు అంతర్జాతీయ సంస్థలు సమర్థ పరిష్కారాలను అన్వేషించగలిగితేనే మానవాళి విశ్వాసాన్ని చూరగొనడం సాధ్యం. కాబట్టి, మన సామూహిక ప్రతిస్పందన వేగం, స్థాయి, అంతిమ ప్రభావం తదితరాలపై మనం నిశితంగా దృష్టి సారించాలి.

ప్రపంచ వాణిజ్యంలో నావికా సిబ్బంది పాత్ర అత్యంత కీలకం. కానీ, కష్ట సమయాల్లో వారికి తగినంత మద్దతు లభించడం లేదు. అందువల్ల, మనం నావికా సిబ్బంది కోసం ఒక ‘అత్యవసర సహాయ యంత్రాంగం’ ఏర్పాటుకు నేను ప్రతిపాదిస్తున్నాను. దీని ద్వారా సంబంధిత దేశాల నావికా కార్యకలాపాల అధికారులను, దౌత్య కార్యాలయాలను అనుసంధానించవచ్చు. ఆపదల వేళ హెచ్చరికలు, వైద్య సహాయం, కుటుంబాలతో సంప్రదింపులు, సురక్షితంగా తరలింపు తదితర కార్యకలాపాలకు ఇది ఎంతగానో తోడ్పడగలదు.

మూడోది… నియమ నిబంధనల రూపకల్పన- భవిష్యత్‌ ప్రపంచ నియమాల రూపకల్పనలో అన్ని దేశాలకూ సమాన భాగస్వామ్యం అత్యంత అవశ్యం. నేడు కృత్రిమ మేధ, సైబర్‌ స్పేస్, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కీలక సాంకేతికతల వంటివి భవిష్యత్తు అవకాశాలను మాత్రమేగాక, పాలనా నియమాలనూ రూపుదిద్దుతున్నాయి.

ఈ నేపథ్యంలో నియమాలను పాటించే స్థాయి నుంచి వాటిని రూపొందించగల స్థాయికి వర్ధమాన దేశాలు చేరేవిధంగా మనం కృషి చేయాలి. ఈ మేరకు వర్ధమాన దేశాల యువ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలకు బ్రిక్స్‌ ద్వారా సంప్రదింపు నైపుణ్యాలు, ఆచరణాత్మక శిక్షణ, చట్టపరమైన అంశాల్లో సామర్థ్య వికాసానికి మనం తోడ్పడగలం.

ఈ రోజు యాదృచ్ఛికంగా ‘ఐక్యరాజ్య సమితి వర్ధమాన దేశాల సహకార దినోత్సవం’ కావడం ఒక శుభ సందర్భం. వర్ధమాన దేశాలకు ప్రత్యేకించిన ఇలాంటి రోజు మనమీ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. ఈ దిశగా సారథ్యానికి భారత్‌ సంసిద్ధంగా ఉంది.

మిత్రులారా!

భారత్‌ ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందేశం స్పష్టమైదిగా ఉండాలి: మనది సమష్టి భవిష్యత్తు అయినప్పుడు, దాన్ని తీర్చిదిద్దుకునే హక్కు కూడా ఉమ్మడిగానే ఉండాలి. అంటే- మన గళం వినిపించడం నుంచి ప్రభావం చూపే వరకూ… ప్రత్యేక హక్కుల నుంచి భాగస్వామ్యం దాకా మన ప్రయత్న లోపం ఉండరాదు. రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న బ్రిక్స్‌ తక్షణ సంకల్పం ఇదే కావాలి!

 

అనేకానేక ధన్యవాదాలు..

 

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

***


(రిలీజ్ ఐడి: 2309606) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , हिन्दी , Gujarati , Bengali , Assamese , Manipuri , Punjabi , English , Urdu