హోం మంత్రిత్వ శాఖ
హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీలో ‘ఎన్‌ఐడీఎం' పాలక మండలి 3వ సమావేశం
· “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వాన గడచిన 12 ఏళ్లుగా విపత్తు నిర్వహణ విధానం-పద్ధతులలో సమూల మార్పులు సాధ్యమయ్యాయి”
· “విపత్తులపై మునుపటి సహాయ-పునరావాస కోణానికి భిన్నంగా మనం నేడు ప్రమాద తీవ్రత తగ్గింపు.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు.. శూన్య ప్రాణనష్టం లక్ష్యంగా నవ శకంలో పయనిస్తున్నాం”
· “ఈ దృక్కోణం వల్ల అనేక విపత్తుల సమయంలో శూన్య ప్రాణనష్టం లక్ష్యాన్ని విజయవంతంగా కొనసాగించడం విశేషం”
· “విపత్తులను తట్టుకోగల గ్రామాలు-నగరాల రూపకల్పనపై మోదీ ప్రభుత్వ లక్ష్య సాధన ప్రధానంగా మనం ముందడుగు వేయాలి”
· “పరిశోధన-ఆవిష్కరణ-సామర్థ్య వికాసానికి జాతీయ కూడలిగా మారిన ‘ఎన్ఐడీఎం’తో విశ్వవిద్యాలయాల అనుసంధానం ద్వారా మనం సరికొత్త అవకాశాలను అన్వేషించాలి”
· “పర్యావరణ పరిరక్షణ.. ముప్పు నివారణ.. పునరుత్థానం.. సమగ్ర జాతీయ దృక్కోణం వల్ల భారత్ ప్రపంచానికే ఆదర్శంగా ఆవిర్భవిస్తోంది”
· “శిక్షణ.. మార్గదర్శకాలకు అతీతంగా విపత్తులను దృఢంగా ఎదుర్కొనగల వ్యవస్థకు రూపకల్పనలో ‘ఏకోన్ముఖ ప్రభుత్వం’ దిశగా పురోగమించాలి”
· “భూతాపం.. వాతావరణ మార్పులు సహా నేటి నవ్యావిష్కరణల శకంలో ‘ఎన్ఐడీఎం-ఎన్‌డీఎంఏ’ల ప్రాధాన్యం.. అవసరం మరింత పెరుగుతాయి.”
· “విపత్తుల నిర్వహణకు ఉద్దేశించిన మొబైల్ యాప్‌పై ప్రాథమిక-మాధ్యమిక-ఉన్నత విద్యా రంగాలలో విస్తృత ప్రచారం ద్వారా వినియోగం పెంచాలి”
· “శాస్త్రీయ-క్రమబద్ధ ప్రక్రియ ద్వారా విపత్తు సహాయ నిధుల పంపిణీపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గట్టి నిర్ణయం తీసుకున్నారు”
· “విపత్తులపై ‘ఏకోన్ముఖ ప్రభుత్వం’ తరహాలోనే ముప్పు నిర్వహణ బలోపేతంతోపాటు సంస్థాగతీకరించే విధానంతో మనం ముందుకెళ్లాలి”
· “మోదీ ప్రభుత్వ హయాంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ కేటాయింపులు దాదాపు 4 రెట్లు.. ఎన్‌డీఆర్‌ఎఫ్ కేటాయింపులు 3 రెట్లు వంతున పెరిగాయి”
· “విపత్తు నిర్వహణ విధానం మార్పు సహా పర్యావరణ పరిరక్షణకూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు”
· “లోగడ కృషి భవన్‌లో ఓ మూలకు పరిమితమైన ‘ఎన్‌ఐడీఎం’ను పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి హోంశాఖ పరిధిలోకి తెచ్చారు”
· ప్రస్తుత ప్రధాని శ్రీ మోదీ భూమి కేటాయి
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 6:09PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) పాలక మండలి 3వ సమావేశానికి కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శితోపాటు ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉప కులపతి, జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) సభ్యుడు-విభాగాఅధిపతి, జాతీయ విపత్తు ప్రతిస్పందన బలగం (ఎన్‌డీఆర్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్, వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) డైరెక్టర్, ఎన్‌ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వాన గడచిన 12 ఏళ్లుగా విపత్తు నిర్వహణ విధానం, పద్ధతులలో సమూల మార్పులు సాధ్యమయ్యాయని చెప్పారు. ఈ మేరకు యావత్ విపత్తు నిర్వహణ వ్యవస్థ పూర్తిగా రూపాంతరం చెంది, ‘శూన్య ప్రాణనష్టం’ లక్ష్యనిర్దేశంతో దేశాన్ని నడిపిస్తున్నదని పేర్కొన్నారు. ఈ లక్ష్యం దిశగా అనేక విపత్తులను మనం విజయవంతంగా ఎదుర్కోవడం గొప్ప విశేషమని ఆయన అభివర్ణించారు. విపత్తులపై మునుపటి సహాయ-పునరావాస కోణానికి భిన్నంగా నేడు మనం ప్రమాద తీవ్రత తగ్గింపు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, శూన్య ప్రాణనష్టం లక్ష్యంగా మూడు మూలస్తంభాలతో నవ శకంలో పయనిస్తున్నామని తెలిపారు. “ఇది మనందరికీ గర్వకారణం. ఈ దిశగా ఏకోన్ముఖ ప్రభుత్వం విధానం మన పని సంస్కృతిలో అంతర్భాగంగా మారుతోంది” అని మంత్రి వ్యాఖ్యానించారు. తదనుగుణంగా ప్రతి విపత్తు సమయంలోనూ ప్రభుత్వ శాఖలన్నీ తక్షణం సామూహికంగా స్పందిస్తున్నాయని చెప్పారు. ఇక నేటి సరికొత్త పరిశోధనల సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. తద్వారా ఈ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. విపత్తులపై ‘ఏకోన్ముఖ ప్రభుత్వం’ తరహాలోనే ముప్పు నిర్వహణను బలోపేతం చేయడంతోపాటు దాన్ని సంస్థాగతీకరించే విధానంతో మనం ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
విపత్తు నిర్వహణ విధానంలో మార్పు తేవడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. విపత్తుల నివారణలో అంతిమంగా పర్యావరణ పరిరక్షణే అత్యంత ప్రభావశీల మార్గమని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, ముప్పు నివారణ, పునరుత్థానం, సమగ్ర జాతీయ దృక్కోణం వల్ల భారత్ ప్రపంచానికే ఆదర్శంగా ఆవిర్భవిస్తోందని తెలిపారు. ఈ మేరకు ‘పర్యావరణం కోసం జీవనశైలి’ (మిషన్ లైఫ్), ‘భూగోళ మిత్ర మానవాళి’ (ప్రో-ప్లానెట్ పీపుల్), ‘అంతర్జాతీయ సౌర కూటమి' (ఐఎస్‌ఏ) వంటి కార్యక్రమాలు విపత్తు నివారణలో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. విపత్తు సంభవించిన ప్రదేశంలో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టడం కాకుండా అసలు విపత్తులు సంభవించకుండా చూడటం ద్వారా ‘శూన్య ప్రాణనష్టం’ లక్ష్యాన్ని సాధించవచ్చని శ్రీ అమిత్ షా అభిప్రాయపడ్డారు. వివిధ దేశాల అధినేతల సంప్రదాయ విధానాలకు భిన్నంగా సురక్షిత, సమతుల ప్రపంచానికి రూపుదిద్దాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.
‘ఎన్‌ఐడీఎం’ ఒకప్పుడు ‘జాతీయ విపత్తుల నిర్వహణ కేంద్రం’ పేరిట కృషి భవన్‌లో ఓ మూలన దాదాపు నిష్క్రియంగా మూలుగుతూండేదని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. అయితే, 2003లో నాటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి చారిత్రక నిర్ణయంతో దీన్ని హోంశాఖ పరిధిలోకి తేవడం ద్వారా కొత్త ఊపిరులూదారని చెప్పారు. దీనికిగల విస్తృత పరిధిని, వివిధ సంస్థల మధ్య సమన్వయం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ చర్య తీసుకున్నారని పేర్కొన్నారు. అటుపైన ఈ సంస్థకు పునరుజ్జీవనం కల్పించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. దీంతో పరిణామాత్మకంగా బలోపేతమైన ‘ఎన్‌డీఐఎం’ ఇప్పుడు ప్రతిష్టాత్మక సంస్థగా ఆవిర్భవించిందని తెలిపారు.
ఇక భవిష్యత్తులో ‘ఎన్‌ఐడీఎం’, ‘ఎన్‌డీఎంఏ’ రెండింటికీ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. భూతాపం, వాతావరణ మార్పుల వల్ల విపత్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అదే సమయంలో విజ్ఞాన శాస్త్రం పరిధిలో కొత్త అనువర్తనాల రూపకల్పన, వాటి విస్తృత వినియోగంతో కొత్త రకాల విపత్తులు కూడా తలెత్తే ముప్పుందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, విధాన రూపకల్పన నుంచి శిక్షణ-అమలు దాకా బాధ్యతలన్నిటినీ ఈ రెండు సంస్థలు పంచుకుంటున్నాయని చెప్పారు. మరికొన్ని రంగాలలో ఈ రెండూ సంయుక్తంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
నేటి సమావేశం నిర్ణయాల సమర్థ అమలు దిశగా ఆయా శాఖలలో ప్రత్యేక, కేంద్రీకృత విభాగాలను ఏర్పాటు చేయాలని శ్రీ అమిత్ షా ఆదేశించారు. అటుపైన ఆయా శాఖల అధిపతులు మూడు నెలలకు ఒకసారి పురోగతిని సమీక్షించి అవసరమైన ప్రాథమ్యాలను నిర్ణయించాలని ఆయన సూచించారు.
విపత్తుల నిర్వహణ రంగంలో ప్రపంచవ్యాప్త పరిశోధనలను ఈ రెండు సంస్థలూ అధ్యయనం చేయాలని హోం మంత్రి ఆదేశించారు. అలాగే, స్థానిక అవసరాలకు అనుగుణంగా దేశంలో వాటి ఫలితాల అమలుకు కృషి చేయాలని చెప్పారు. పాకిస్థాన్ వైపు నుంచి దాడిచేసే మిడతల దండును ఎదుర్కోగల శాశ్వత సన్నద్ధతపై వ్యవసాయ శాఖ దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇలాంటి దాడులను ఎదుర్కోవడంలో ఇతర దేశాలు అనుసరించే ఉత్తమ పద్ధతులను మనం పరిగణనలోకి తీసుకోవాలని పిలుపునిచ్చారు. విపత్తు నిర్వహణలో కఠిన శిక్షణకు పెద్దపీట వేయాలని, సంబంధిత కార్యక్రమాలలో నిబద్ధతగల వారికే ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.
‘ఎన్‌ఐడీఎం, ఎన్‌డీఎంఏ’లు సంయుక్తంగా యావద్దేశానికీ వర్తించే మార్గదర్శకాలను జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి చెప్పారు. వివిధ రకాల విపత్తుల సమయంలో చేయాల్సిందేమిటి… చేయకూడనివి ఏమిటి? పరిస్థితుల నిర్వహణ ఏ విధంగా ఉండాలి.. తదితరాలపై ఈ మేరకు స్పష్టతనివ్వాలని చెప్పారు. శిక్షణ సంబంధిత అంశాన్ని ఎన్‌ఐడీఎం చేపట్టాలని, ఈ మార్గదర్శకాల క్షేత్రస్థాయి అమలులో ‘ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్’లు ఇతర సంబంధిత సంస్థలతో కలసి పనిచేయాలని నిర్దేశించారు.
విపత్తులకు దారితీసిన కారణాలను గుర్తించి, విస్తృత పరిశోధన ద్వారా ఒక సమగ్ర పత్రం రూపొందించడం అత్యంత కీలకమని శ్రీ అమిత్ షా అన్నారు. దీని ఆధారంగా సమర్థ సహాయ-నివారణ చర్యలకు రూపమివ్వచ్చున్నారు. ప్రతి విపత్తు తర్వాత ‘ఎన్‌డీఎంఏ, ఎన్‌ఐడీఎం’ ఒక సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ కూడా ఇందులో భాగస్వాములు కావాలని నిర్దేశించారు. ఈ నాలుగు సంస్థలు ఏకమై నష్టానికి గల కారణాలను అధ్యయనం చేసి, సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని చెప్పారు.
పరిశోధన, ఆవిష్కరణ, సామర్థ్య వికాసం, విధానపరమైన మద్దతు, శిక్షణ విభాగాల మధ్య సహకారం దిశగా ‘ఎన్ఐడీఎం’ ఒక జాతీయ కూడలిగా ఎదిగిందని శ్రీ అమిత్ షా చెప్పారు. ఈ నాలుగింటి పరిధిలో ఇంకా అన్వేషించని రంగాలున్నాయని, అందుకే వాటిని మరింత బలోపేతం చేసే దిశగా రాబోయే రోజుల్లో దృష్టి సారించాలన్నారు. ఈ క్రమంలో ఎన్‌ఐడీఎం ఇప్పటికే చర్యలు చేపట్టిందదని ఆయన చెప్పారు. విజ్ఞానం, ఉత్తమ విధానాలను కేవలం ఒక విభాగానికే పరిమితం చేయకుండా విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. భవిష్యత్తులో విభాగ పరిధులకు అతీతంగా సమన్వయంతో పనిచేయడాన్ని అలవరచుకోవాలని సూచించారు.
శాస్త్రీయ విధానంలో విపత్తు నిధుల పంపిణీ చేపట్టాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు హోం మంత్రి తెలిపారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) కింద కేటాయింపులు దాదాపు 4 రెట్లు పెరగగా, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) కింద కేటాయింపులు 3 రెట్లు పెరిగాయని చెప్పారు. గత 11 ఏళ్లలో ఈ రంగంలో సుమారు ₹2.5 లక్షల కోట్లు ఖర్చు చేయడం గొప్ప విశేషమన్నారు. విపత్తు నిర్వహణ చట్టానికి 20 ఏళ్ల తర్వాత సవరణలు చేయగా, పట్టణ విపత్తు నిర్వహణ అధికారుల భావనను ప్రతిపాదించడమే కాకుండా నియామకం కూడా చేపట్టారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలలో డిజిటల్ విపత్తు డేటాబేస్‌లను రూపొందించే ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి చెప్పారు. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ)కి చట్టబద్ధ హోదా కల్పించడమే కాకుండా 16వ ఆర్థిక సంఘం ₹2 లక్షల కోట్ల మేర నిధులను కేటాయించిందని వెల్లడించారు.
విపత్తుల నిర్వహణకు ఉద్దేశించిన మొబైల్ అనువర్తనంపై ప్రాథమిక-మాధ్యమిక-ఉన్నత విద్యా రంగాలలో విస్తృత ప్రచారం ద్వారా వినియోగం పెంచాలని శ్రీ అమిత్ షా అన్నారు. ‘ఎన్‌ఐడీఎం’ బలోపేతానికి ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందని, ఇటీవలే ఈ సంస్థకు 4 ఎకరాల భూమిని కూడా కేటాయించిందని తెలిపారు. తననుతాను అంతర్జాతీయ ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దుకునేందుకు ఎన్‌ఐడీఎం శ్రమిస్తోంది. ఈ మేరకు రెండు ప్రాంగణాలూ నిరంతరం పనిచేస్తున్నాయి. ఈ విధంగా అంతర్జాతీయ సహకారం విస్తృతికి యత్నించడం నిస్సందేహంగా అభినందనీయం. అయినప్పటికీ, దేశంలోని 5 లక్షల గ్రామాలపైనే మనం ప్రధానంగా దృష్టి నిలపాలని శ్రీ అమిత్ షా అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రపంచం నుంచి సాధ్యమైనంత ఎక్కువగా నేర్చుకోవాలని చెప్పారు. అలాగే ప్రపంచానికి మన అనుభవాలను సాధ్యమైనంత పంచడంలోనూ ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు. విపత్తులను తట్టుకునే సామర్థ్యంగల గ్రామాలు, నగరాల రూపకల్పనే మోదీ ప్రభుత్వ లక్ష్యమని, దానికి ప్రాధాన్యమినిస్తూనే మనం ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నత స్థాయి సమావేశం ఏటా కనీసం ఒకసారి నిర్వహించాలని శ్రీ అమిత్ షా సూచించారు. ఈ సమావేశాలు అర్థవంతంగా, ఫలితాధారితంగా ఉండటమే కాకుండా నిర్ణయాల సమర్థ అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంస్థ ద్వారా మనం విజ్ఞానాన్ని సామర్థ్యంగా.. సామర్థ్యాన్ని సంసిద్ధతగా.. సంసిద్ధతను సత్ఫలితంగా మార్చాలన్నారు. అలా చేయగలిగితేనే ‘శూన్య ప్రాణనష్టం’ లక్ష్యాన్ని సమష్టిగా సాధించగలమని ఆయన స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2308970)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3