ఆర్థిక మంత్రిత్వ శాఖ
బంగారం స్మగ్లింగ్‌పై దేశవ్యాప్త దాడులను ముమ్మరం చేసిన డీఆర్ఐ
సుమారు రూ. 62 కోట్ల విలువైన 41 కిలోల విదేశీ మూలాలు కలిగిన బంగారాన్ని పట్టుకున్న అధికారులు
ముగ్గురు విదేశీయులతో సహా మొత్తం 24 మంది అరెస్టు
విమానాశ్రయాలు, రైలు మార్గాలు, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా సాగుతున్న వ్యవస్థీకృత అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను, నిందితుల అత్యాధునిక దాచిపెట్టే (కన్సీల్‌మెంట్) పద్ధతులను బయటపెట్టిన ఆపరేషన్లు
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 5:30PM by PIB Hyderabad
బంగారం వ్యవస్థీకృత అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల చేపట్టిన ఆరు వేర్వేరు నిఘా ఆధారిత ఆపరేషన్లలో సుమారు రూ. 62 కోట్ల విలువైన దాదాపు 41 కిలోల విదేశీ మూలాలు కలిగిన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్లలో ముగ్గురు విదేశీయులతో సహా మొత్తం 24 మందిని అరెస్టు చేశారు. విమానాశ్రయాలు, రైలు మార్గాలు, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా సాగుతున్న వ్యవస్థీకృత అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను, నిందితుల అత్యాధునిక దాచిపెట్టే (కన్సీల్‌మెంట్) పద్ధతులు వీటిలో బట్టబయలయ్యాయి.
ఢిల్లీలో చేపట్టిన ఒక ప్రధాన ఆపరేషన్‌లో విదేశీ బంగారాన్ని తీసుకొచ్చి దాని రూపం మార్చే కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తికి చెందిన ప్రాంగణాలపై 07.09.2026న ఏకకాలంలో డీఆర్‌ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక నివాస ప్రాంతంలో బంగారాన్ని కరిగించడం, రోలింగ్ చేయడం, డై-కటింగ్ చేయడానికి అవసరమైన యంత్రాలతో కూడిన తయారీ కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఒక్కో కిలో ఉన్న నాలుగు విదేశీ బంగారు బిస్కెట్లతో పాటు అక్రమ రవాణా చేసిన బంగారంతో తయారు చేసిన సుమారు 6.2 కిలోల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం స్వాధీనం చేసుకున్న బంగారం సుమారు 10.2 కిలోలకు చేరింది. ఆ తయారీ కేంద్రానికి సంబంధించిన ఒక యజమానిని అరెస్టు చేశారు.
ఢిల్లీలో నాలుగు విదేశీ బంగారు బిస్కెట్లు స్వాధీనం
2026 సెప్టెంబర్ 8న నిర్వహించిన వేరువేరు ఆపరేషన్‌లలో పంజాబ్ నుంచి వస్తున్న ఒక వాహనాన్ని ఢిల్లీలోని డీఆర్‌ఐ అధికారులు పట్టుకొని 1.21 కిలోల బంగారంతో పాటు సుమారు రూ. 43.50 లక్షల విలువైన విదేశీ నగదను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విషయంలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
దీనికంటే ముందు 2026 సెప్టెంబర్ 5-6 మధ్య సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) సమన్వయంతో డీఆర్‌ఐ అధికారులు ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులోని బీఓపీ హల్దర్‌పరా సమీపంలో ఒక వ్యక్తి నుంచి సుమారు 11.3 కిలోల 89 విదేశీ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. చట్టబద్ధంగా వీటిని కలిగి ఉండేందుకు సంబంధించిన పత్రాలను ఆ వ్యక్తి సమర్పించలేకపోవడంతో కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాలో తన ప్రమేయాన్ని అంగీకరించిన సదరు వ్యక్తిని కస్టమ్స్ చట్టం-1962లోని తగిన నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.
ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో 11.3 కిలోల బంగారం స్వాధీనం
హౌరా రైల్వే స్టేషన్‌లో నాలుగు కరిగించిన విదేశీ బంగారు బిస్కెట్ల స్వాధీనం
పశ్చిమ బెంగాల్‌లో మరో దాడిలో భాగంగా 2026 సెప్టెంబర్ 3-4 తేదీల్లో హౌరా రైల్వే స్టేషన్‌లో వేరే పేరుతో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. శరీరం చుట్టూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన వస్త్రపు బెల్ట్‌లో దాచి ఉంచిన 4.6 కిలోల బరువున్న నాలుగు రూపుమార్చిన (డీఫేస్డ్) విదేశీ బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయికి తరలించడానికి వీలుగా ఆ బంగారాన్ని కరిగించి గుర్తులు లేని రూపుమార్చిన బిస్కెట్లుగా చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి ప్రయాణికుడితో పాటు ఆయన సహచరుడిని కూడా అరెస్టు చేశారు.
ముంబయిలో ట్రాన్సిట్ ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది, రిసీవర్ లేదా హ్యాండ్లర్‌తో కూడిన వ్యవస్థీకృత సిండికేట్‌ను డీఆర్‌ఐ అధికారులు భగ్నం చేశారు. 2026 సెప్టెంబర్ 9-10 తేదీలలో ముంబయి విమానాశ్రయం నుంచి కారులో రహస్యంగా బయటకు వెళ్లిన విమానాశ్రయ సిబ్బందిని సుమారు 50 కిలోమీటర్ల మేర వెంబడించి పట్టుకున్నారు. తనిఖీ చేయగా మైనపు రూపంలో బంగారు ధూళిని కలిగి ఉన్న మూడు క్యాప్సూల్స్ అతని వద్ద లభించాయి. విమానాశ్రయ ట్రాన్సిట్ ప్రాంతంలో ఒక ట్రాన్సిట్ ప్రయాణికుడు ఆ బంగారు క్యాప్సూల్స్‌ను అతనికి అందజేసినట్లు.. ఇందులో మరో మహిళా విమానాశ్రయ ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. దీనికి కొనసాగింపుగా వెంటనే ముంబయి విమానాశ్రయంలో చేపట్టిన ఆపరేషన్‌లో విమానాశ్రయ సిబ్బందికి ఐదు బంగారు క్యాప్సూల్స్‌ను అందజేస్తున్న ఇద్దరు ట్రాన్సిట్ ప్రయాణికులను అధికారులు పట్టుకున్నారు. ఆ ట్రాన్సిట్ ప్రయాణికులు మస్కట్, దుబాయ్ నుంచి వచ్చారు. వీళ్లు అక్రమ రవాణా బంగారాన్ని అప్పగించిన తర్వాత బ్యాంకాక్‌కు వెళ్లాల్సి ఉంది. విమానాశ్రయం నుంచి అక్రమంగా బంగారాన్ని తరలించడంలో ప్రమేయం ఉన్న విమానాయాన సంస్థకు చెందిన ఒక మహిళా సిబ్బందితో పాటు వాటిని తీసుకున్న వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మొత్తంగా మైనపు రూపంలో బంగారు ధూళిని కలిగి ఉన్న 8 క్యాప్సూల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి నికరంగా 3.47 కిలోల బరువున్నాయి. ఇద్దరు ట్రాన్సిట్ ప్రయాణికులు, ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది, ఒక రిసీవర్‌తో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అక్రమ రవాణా బంగారాన్ని రహస్యంగా తరలించడానికి వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లు ట్రాన్సిట్ మార్గాలను, విమానాశ్రయ సిబ్బందిని ఏ విధంగా ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నాయో ఈ ఆపరేషన్ మరోసారి తెలియజేసింది.
ముంబయిలో పేస్ట్ రూపంలో ఉన్న బంగారంతో కూడిన ఎనిమిది క్యాప్సూల్స్ స్వాధీనం
దీనికంటే ముందు 2026 ఆగస్టు 31, సెప్టెంబర్ 6 తేదీలలో వేర్వేరుగా చేపట్టిన రెండు ఆపరేషన్లలో కోల్‌కతా నుంచి ముంబయికి రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడి నుంచి 1.6 కిలోల విదేశీ బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు. రెండో ఆపరేషన్‌లో హాంకాంగ్ నుంచి దిగుమతి చేసుకున్న ట్రెడ్‌మిల్ మోటార్ నుంచి సుమారు 700 గ్రాముల బరువున్న అర్థచంద్రాకృతి కలిగిన 24-క్యారెట్ల బంగారు బిస్కెట్‌ను వెలికితీశారు. ముంబయి, చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టులలో నిర్వహించిన తనిఖీల ద్వారా దాచిపెట్టడానికి ఉపయోగించిన విడిభాగాలుగా మార్చిన ఇతర యంత్రాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చైనా జాతీయుడితో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ముంబయిలో ట్రెడ్‌మిల్ మోటార్ నుంచి బంగారం స్వాధీనం
2026 సెప్టెంబర్ 8-9 తేదీలలో ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ పోలీసుల సమన్వయంతో రంగంలోకి దిగిన డీఆర్‌ఐ అధికారులు.. కారు గేర్‌బాక్స్ కింద ఉన్న బాక్స్‌లో దాచిపెట్టిన 22 విదేశీ బంగారు బిస్కెట్ల స్వాధీనానికి సంబంధించిన విచారణను చేపట్టారు. స్వాధీనం చేసుకున్న బంగారానికి సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలను కారులో ప్రయాణిస్తున్న వారు సమర్పించలేకపోయారు. స్వాధీనం చేసుకున్న బంగారం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రవాణా అయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పట్టుకున్న సుమారు 2.56 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం- 1962 నిబంధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులను డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు.
22 బంగారు బిస్కెట్లను పట్టుకున్న డీఆర్‌ఐ వారణాసి
2026 సెప్టెంబర్ 8-9 తేదీలలో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ రాకపోకల ప్రాంతంలో నకిలీ గుర్తింపుతో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. విమానంలోపల దాచిపెట్టిన అక్రమ బంగారాన్ని తీసుకున్నాడన్న అనుమానంతో తనిఖీ చేయగా అతని బ్యాగ్ నుంచి సుమారు 1 కిలో బరువున్న ఐదు బంగారు బిస్కెట్ల ముక్కలు దొరికాయి. ఈ కేసుకు సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
చెన్నైలో 2026 ఆగస్టు 30 లేదా సెప్టెంబర్ 1 తేదీలలో కచ్చితమైన సమాచారం ఆధారంగా డీఆర్‌ఐ అధికారులు శ్రీలంక నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు వేర్వేరు విమానాలలో వస్తున్న ఇద్దరు ప్రయాణికులను పట్టుకున్నారు. మలద్వారంలో దాచిపెట్టి తరలిస్తున్న పేస్ట్ రూపంలోని బంగారాన్ని కలిగి ఉన్న ఎనిమిది క్యాప్సూల్స్‌ను వెలికితీశారు. దానిని శుద్ధి చేయగా 2.5 కిలోల 24-క్యారెట్ల బంగారం లభించింది. విమానాశ్రయ సిబ్బంది సహాయంతోనే ఈ అక్రమ తరలింపు జరుగుతున్నట్లు విచారణలో తేలింది. ఇద్దరు విదేశీ ప్రయాణికులతో సహా మొత్తం ఆరుగురిని ఈ కేసులో అరెస్టు చేశారు.
చెన్నైలో 8 క్యాప్సూల్స్ స్వాధీనం
కాలికట్‌లో 2026 సెప్టెంబర్ 1-2 తేదీలలో వేర్వేరుగా చేపట్టిన రెండు ఆపరేషన్లలో 1.7 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక కేసులో ప్రయాణికుడి చిన్న కుమార్తె ధరించిన డైపర్‌లో దాచిపెట్టిన రెండు క్యాప్సూల్స్, ఒక ప్యాకెట్ నుంచి బంగారం ఉన్న సమ్మేళనాన్ని వెలికితీసి 770 గ్రాముల బంగారాన్ని రాబట్టారు. మరొక కేసులో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు చెక్-ఇన్ లగేజీలో తెచ్చిన కాఫీ మెషీన్‌లోని బరువైన మెటాలిక్ రింగ్ భాగం నుంచి సుమారు 1 కిలో 24-క్యారెట్ల బంగారు ముక్కను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.
కాలికట్‌లో కాఫీ మెషీన్‌లో దాచిపెట్టిన బంగారం
డీఆర్‌ఐ నిఘా ఆధారిత, సమన్వయంతో కూడిన ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు అక్రమ రవాణా గొలుసులోని వివిధ దశలలో వ్యవస్థీకృత బంగారు అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను నిరంతరం ఛేదిస్తున్నాయి. ఇవి దేశంలోకి విలువైన లోహాల అక్రమ రవాణాను జరగకుండా అరికడుతున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2308965)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3