వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, పటిష్టమైన విలువ వ్యవస్థలపై నిబద్ధతను స్పష్టం చేసిన 9వ ఆసియాన్- భారత్ మంత్రుల సమావేశం
వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, డిజిటల్ ఆవిష్కరణలు, ఆహార భద్రత దిశగా ఆసియాన్- భారత్ సహకారం
కృత్రిమ మేధ, డిజిటల్ వ్యవసాయం, రైతు కేంద్రీకృత కార్యక్రమాలు, పటిష్టమైన సరఫరా వ్యవస్థలపై ఆసియాన్- భారత్ సహకార దృష్టి
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 12:56PM by PIB Hyderabad
9వ ఆసియాన్-భారత్ వ్యవసాయ, అటవీ మంత్రుల సమావేశం (ఏఐఎంఎంఏఎఫ్) 2026 సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఆసియాన్ వ్యవసాయ, అటవీ మంత్రుల అధ్యక్ష దేశం తరఫున ఫిలిప్పీన్స్ వ్యవసాయశాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పీ టియు లారెల్, భారత్ తరఫున కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహాధ్యక్షత వహించారు.
ఆసియాన్-భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఆహార, వ్యవసాయ, అటవీ రంగాల్లో పరస్పర సహకారం ఆచరణాత్మకమైన, పరస్పర ప్రయోజనకరమైన కీలక అంశమని ఈ సమావేశం పేర్కొంది. ఆహార భద్రత, పోషకాహారం, రైతుల జీవనోపాధి, సుస్థిర-తక్కువ ఉద్గారాల అభివృద్ధి, ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి, గ్రామీణాభివృద్ధితో పాటు వ్యవసాయ, అటవీ వ్యవస్థలను మరింత పటిష్టం చేసే దిశగా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయించింది.
‘‘ఆసియాన్ 2045: మన ఉమ్మడి భవిష్యత్తు”, “స్థితిస్థాపక, ఆవిష్కరణాత్మక, చురుకైన, ప్రజా కేంద్రీకృత ఆసియాన్ కోసం ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2045’’ ను ఈ సమావేశం స్వాగతించింది. 2045 నాటికి ఆహారం, వ్యవసాయం, అటవీ రంగాల అభివృద్ధికి సంబంధించిన ఆసియాన్ నాయకుల ప్రకటనను, ఆసియాన్ ఆహార, వ్యవసాయ, అటవీ రంగ ప్రణాళికను (2026–2030) కూడా స్వాగతించింది. ఈ ప్రణాళికలు సుస్థిర, సమగ్ర, పటిష్టమైన, సురక్షితమైన వ్యవసాయ-అటవీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయి. రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు చేపట్టడం వంటి లక్ష్యాలకు ఇవి దోహదపడతాయి.
ఆహారం, వ్యవసాయం, అటవీ రంగాలపై ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న అనిశ్చిత పరిస్థితులు చూపుతున్న ప్రభావాలపై సమావేశంలో చర్చించారు. ఇందులో వాతావరణ మార్పులు, తీవ్ర వాతావరణ పరిస్థితులు, భౌగోళిక-రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు, ఇంధనం, ఎరువులు, వ్యవసాయ ఉత్పాదక వస్తువుల మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గులు, వాణిజ్యం, రవాణాలో అంతరాయాలు, మొక్కలు, జంతువుల ఆరోగ్య సమస్యలు, సరిహద్దులు దాటి వ్యాపించే మొక్కల తెగుళ్లు, జంతు వ్యాధులు వంటి అంశాలు ఉన్నాయి. ఆహారం, వ్యవసాయానికి అవసరమైన కీలక ఉత్పాదక వస్తువులైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల సరఫరా వ్యవస్థ నిరంతరాయంగా కొనసాగించడం ఎంతో ముఖ్యమని సమావేశం పేర్కొంది. ప్రాంతీయ స్థాయిలో పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, సరఫరా వనరులను వైవిధ్యపరచడం, సన్నకారు రైతులు, ఇతర బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వడం అవసరమని తెలిపింది. పటిష్టమైన, సుస్థిరమైన, పరిస్థితులకు అనుగుణంగా స్పందించగల ఆహార, వ్యవసాయ వ్యవస్థలను నిర్మించేందుకు ఆసియాన్, భారత్ ఆచరణాత్మక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని సమావేశం అంగీకరించింది.
వ్యవసాయం, అటవీ రంగాల్లో సహకారం కోసం 2021-2025 ఆసియాన్-భారత్ మధ్యకాలిక కార్యాచరణ ప్రణాళిక అమలులో సాధించిన పురోగతిని సమావేశం ప్రశంసించింది.
ఈ కాలంలో ఆసియాన్, భారత్ మంత్రుల స్థాయి, ఉన్నతాధికారుల స్థాయిలో విధానపరమైన చర్చలను కొనసాగించడంతో పాటు ఆహార భద్రత, వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర వ్యవసాయం, ప్రకృతి పరిరక్షణ, ప్రకృతికి అనుకూలమైన విధానాలు, సుస్థిర నేల నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, డిజిటలైజేషన్, శాస్త్ర-సాంకేతికత, సంస్థలు- రైతుల మధ్య సమాచార మార్పిడి వంటి అంశాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేశాయి.
2021-2025 మధ్య కాలంలో జరిగిన సహకారంలో సాధించిన అనేక ముఖ్య విజయాలను ఈ సమావేశం ప్రస్తావించింది. సంక్షోభాల సమయాల్లో ఆహార భద్రత, పోషకాహారాన్ని బలోపేతం చేయడంపై ఆసియాన్-భారత్ సంయుక్త నాయకుల ప్రకటన, ఆహార వైవిధ్యం, పోషకాహారం, వాతావరణాన్ని తట్టుకునే పంటలను ప్రోత్సహిస్తూ 2023లో జకార్తా, న్యూఢిల్లీలో నిర్వహించిన ఆసియాన్-భారత్ చిరుధాన్యాల ఉత్సవాలు కీలకంగా నిలిచాయి. 2024లో వ్యవసాయం, అనుబంధ శాస్త్రాల్లో ఉన్నత విద్య కోసం ఆసియాన్-భారత్ ఫెలోషిప్‌ను ప్రారంభించారు. దీని కింద ఆసియాన్ సభ్య దేశాలకు చెందిన విద్యార్థులకు అయిదేళ్ల కాలంలో 50 మంది మాస్టర్స్ విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందించే అవకాశం కల్పించారు. వీటితో పాటు స్మార్ట్ వ్యవసాయం, నేల ఆరోగ్యం, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), సూక్ష్మ వ్యవసాయం కోసం మెషిన్ లెర్నింగ్, రైతుల మధ్య సమాచార పంపిణీ వంటి సహకార కార్యక్రమాల్లో సాధించిన పురోగతిని కూడా ఈ సమావేశం గుర్తించింది.
సహకారంలోని వివిధ రంగాల అమలు ద్వారా పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, సలహా సేవలు, వ్యవసాయ విస్తరణ సేవలు, ప్రైవేటు రంగం, రైతు సంఘాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం... సాంకేతికత అభివృద్ధికి, ఆచరణాత్మక వినియోగానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తిలో కొత్త సాంకేతికతలను భారీ స్థాయిలో ఉపయోగించుకునేలా చేయడం ఈ చర్చల ప్రధాన లక్ష్యం.
ఈ విజయాల ఆధారంగా ఆసియాన్ కొత్త వ్యూహాత్మక దిశకు అనుగుణంగా వ్యవసాయం, అటవీ రంగాల్లో సహకారం కోసం 2026 – 2030 ఆసియాన్-భారత్ మధ్యకాలిక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించి, అమలు చేయడంపై సమావేశం దృష్టి సారించింది. కొత్త ప్రణాళిక ద్వారా పరస్పర బలోపేతం చేసుకునే నాలుగు ప్రధాన రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. అవి విధానపరమైన చర్చలు, ఆహార భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, పటిష్టమైన విలువ వ్యవస్థలు.. సంస్థల మధ్య నెట్వర్కింగ్, సమాచార మార్పిడి, డిజిటల్ ఆవిష్కరణలు... సామర్థ్య పెంపు, సాంకేతిక సహకారం, సంయుక్త పరిశోధన-అభివృద్ధి... మానవ వనరుల అభివృద్ధి, రైతుల మధ్య సమాచార మార్పిడి, సమ్మిళిత గ్రామీణ సంస్థలు.
కొత్త ప్రణాళిక అమలులో ఆచరణాత్మకమైన, విస్తరించదగిన, రైతు కేంద్రీకృత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశం అంగీకరించింది. ఇందులో తక్కువ ఉద్గారాలతో వరి సాగు, నీటి వినియోగ సామర్థ్యంపై సహకారం, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఇతర అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సాంకేతికతల వినియోగంతో డిజిటల్ వ్యవసాయం, అటవీ రంగం, నేల ఆరోగ్యం, జీవ ఉత్పత్తులు, వాతావరణ మార్పులను తట్టుకునే, పోషక విలువలు కలిగిన పంటలు, ఆహార భద్రత, పంట కోత అనంతర నిర్వహణ, ఆహార నష్టం, వృథాను తగ్గించడం, పొలాల్లో పంట అవశేషాలను కాల్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలు, సర్క్యులర్ బయోఎకానమీ పరిష్కారాలు, పటిష్టమైన ఆహార సరఫరా వ్యవస్థ, వ్యవసాయ ఉత్పాదక వస్తువుల సరఫరా వంటి అంశాలు ఉంటాయి. వీటితోపాటు సుస్థిర అటవీ నిర్వహణ, అడవులు, ప్రకృతి దృశ్యాల పునరుద్ధరణ, వ్యవసాయ అటవీ విధానం, అటవీ పర్యవేక్షణ, బాధ్యతాయుతమైన అటవీ ఆధారిత విలువ వ్యవస్త, స్థానిక సమాజాల ఆధారిత వ్యాపారాలు వంటి అంశాల్లోనూ సహకారాన్ని పెంచనున్నారు.
పరిశోధన, విద్య సంస్థలు, రైతు సంస్థలు, సహకార సంఘాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, ప్రైవేటు రంగం, ఆర్థిక సంస్థలు, ఇతర సంబంధిత అభివృద్ధి భాగస్వాములు కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని సమావేశం ప్రోత్సహించింది.
మార్కెట్ అనుసంధానం, అందుబాటును బలోపేతం చేసేందుకు సమావేశం అంగీకరించింది. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, విలువను పెంచేందుకు విలువ ఆధారిత ప్రాసెసింగ్, ఉత్పత్తుల సంరక్షణ సాంకేతికతలు, పంట కోత అనంతర నిర్వహణలో సహకారాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల రవాణా, పంపిణీని సులభతరం చేసేందుకు వ్యవసాయ, అటవీ రంగాలను సులభతరం చేసేందుకు వ్యవసాయ, అటవీ రంగాల లాజిస్టిక్స్ అనుసంధానాన్ని కూడా మెరుగుపరచాలని అంగీకరించింది.
ఈ ప్రణాళికను స్పష్టమైన ప్రాధాన్యతలు, ప్రధాన బాధ్యత వహించే సంస్థలు, ఆశించిన ఫలితాలు, కాలపరిమితులు, అందుబాటులో ఉండే సహాయ వనరులతో కూడిన ఫలితాల ఆధారిత నిరంతర కార్యాచరణ ప్రణాళికగా రూపొందించి అమలు చేయాలని ఆసియాన్, భారత్‌కు చెందిన ఉన్నతాధికారులు, కార్యాచరణ వ్యవస్థలను సమావేశం ఆదేశించింది. వర్తించే నిబంధనలు, విధానాలకు లోబడి అందుబాటులో ఉన్న ఆసియాన్-భారత్ నిధుల వ్యవస్థలు, స్వచ్ఛంద జాతీయ వనరులు, పరస్పరం అంగీకరించిన ఇతర సహాయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సమావేశం ప్రోత్సహించింది. ప్రణాళిక అమలులో పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, సకాలంలో అమలు, స్పష్టమైన ప్రయోజనాలు, విజయవంతమైన కార్యక్రమాలను భారీ స్థాయిలో విస్తరించేలా చూడాలని సమావేశం నిర్ణయించింది.
వ్యవసాయ, అటవీ రంగంపై 10వ ఆసియాన్-భారత్ మంత్రుల సమావేశాన్ని 2028లో నిర్వహించేందుకు ఈ సమావేశం అంగీకరించింది.
9వ ఆసియాన్-భారత్ వ్యవసాయ, అటవీ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం అందించి, అద్భుతమైన ఏర్పాట్లు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమావేశం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
***
(రిలీజ్ ఐడి: 2308771)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8