నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పన’పై ఎంఎస్‌డీఈ ఆధ్వర్యంలో ‘స్కిల్ మంథన్’ నిర్వహణ
ఆర్థిక వృద్ధి, సంస్కరణలకు జిల్లాలే కీలక చోదక శక్తులు: ‘స్కిల్ మంథన్’ ప్రారంభోత్సవంలో శ్రీ జయంత్ చౌదరి
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 6:09PM by PIB Hyderabad
‘మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పన’ అనే అంశంపై ‘స్కిల్ మంథన్’ తొలి సమావేశాన్ని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ (ఎంఎస్) నిర్వహించింది. వర్చువల్‌గా జరిగిన ఈ చర్చలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, బిజ్నోర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను ప్రస్తావించారు. మహిళలకు సుస్థిర జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు జిల్లా పాలన యంత్రాంగాలు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత అభివృద్ధి, ఆర్థిక సహాయం, సాంకేతికత, మార్కెట్ అవకాశాలను సమన్వయం చేయగల విధానాన్ని ఈ కార్యక్రమాలు చాటిచెప్పాయి. వినూత్నమైన, ప్రభావవంతమైన జిల్లా ఆధ్వర్యంలోని కార్యక్రమాలను ప్రదర్శించేందుకు, వాటిపై జ్ఞానాన్ని పంచుకునేందుకు ‘స్కిల్ మంథన్’ ఒక వేదికగా నిలవనుంది.
ఈ కార్యక్రమంపై కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి మాట్లాడుతూ.. “వృద్ధి, సంస్కరణలు, పరివర్తనకు జిల్లాల పాలన యంత్రాంగాలే నిజమైన చోదక శక్తులు. జిల్లా ఆధారిత ప్రణాళిక విధానం ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈల) అవసరాలకు అనుసంధానమయ్యేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఉండేలా చూస్తున్నాం. జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికల మద్దతుతో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ.. యువత, స్థానిక ఆర్థిక వ్యవస్థల కోసం మరింత స్పందించే, డిమాండ్ ఆధారిత, ప్రభావవంతమైన ఫలితాలను సాధించేలా జిల్లా పాలనా యంత్రాంగాలు పనిచేస్తున్నాయి” అని అన్నారు.
ఎంఎస్‌డీఈ కార్యదర్శి శ్రీమతి దేబాశ్రీ ముఖర్జీ మాట్లాడుతూ.. “స్థానిక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగినప్పుడే దేశ నైపుణ్యాభివృద్ధి లక్ష్యాలను సాధించగలం. జిల్లా అవసరాలు, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా చేపట్టే స్థానిక స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థలో మన యువతకు సంబంధిత నైపుణ్యాలను అందించి, వారిని అర్థవంతమైన జీవనోపాధి అవకాశాలతో అనుసంధానించేందుకు ఎంతో అవసరం” అని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి జస్జిత్ కౌర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ లక్ష్మీషా, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కలెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ సింగ్‌లు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత అభివృద్ధి, మార్కెట్ అనుసంధానం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడే వినూత్న మార్గాలను వివరించారు. మీరట్‌లో మహిళా కేంద్రిత తయారీ నమూనాను ప్రదర్శించారు. ఇందులో బ్యాడ్మింటన్ రాకెట్లు, షటిల్‌కాక్‌ల తయారీలో మహిళలకు ప్రత్యక్ష శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తున్నారు. బిజ్నోర్‌లో ‘విదుర్ ప్రేరణ స్వదేశీ’ అనే జిల్లా వ్యాప్త వేదిక ద్వారా బ్రాండింగ్, మార్కెట్ అవకాశాలు, వ్యాపార మద్దతు అందిస్తూ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న విధానాన్ని వివరించారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ‘రైజ్’ ఒకే వేదిక ద్వారా నైపుణ్యాభివృద్ధి, రుణ సదుపాయాల కల్పన, మార్గదర్శకత్వం, ఉపాధి అనుసంధానం, పారిశ్రామికవేత్తలకు మద్దతు వంటి సేవలను అందించే సమగ్ర వ్యవస్థను ప్రదర్శించింది. మహిళల నేతృత్వంలోని సంస్థలకు సుస్థిర అవకాశాలను కల్పించేందుకు స్థానిక సంస్థలను సమన్వయం చేయడం ఎలా సాధ్యమవుతుందో ఇది చాటిచెప్పింది.
జిల్లా పాలన యంత్రాంగాలతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో విజయవంతమైన నమూనాలను నమోదు చేయడం, పంచుకోవడం, ఇతర ప్రాంతాల్లో అమలు చేయడం కోసం జాతీయ స్థాయి వేదికను ఏర్పాటు చేయాలన్న ఎంఎస్‌డీఈ నిబద్ధతను ఈ సమావేశం స్పష్టం చేసింది. ‘స్కిల్ మంథన్’ ద్వారా జిల్లా స్థాయిలో చేపట్టే వినూత్న కార్యక్రమాలు మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంతో పాటు, స్వయం సమృద్ధి కలిగిన సమాజాల నిర్మాణానికి, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనకు దోహదపడతాయి.
***
(రిలీజ్ ఐడి: 2308562)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13