వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

15 నెలల్లో వినియోగదారులకు రూ. 105 కోట్లకు పైగా రీఫండ్‌లను ఇప్పించిన జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్

2025 ఏప్రిల్ 25 నుంచి 2026 జూలై 31 మధ్య 35 రంగాల్లో 1,66,189 రీఫండ్-సంబంధిత ఫిర్యాదులు పరిష్కరించిన ఎన్‌సీహెచ్

రీఫండ్‌లలో రూ. 74 కోట్లకు పైగా వాటాను కలిగి ఉన్న ఈ-కామర్స్ రంగం

మే- జూలై 2026 మధ్య కాలంలో ఈ-కామర్స్ రంగంలో రూ. 1 నుంచి రూ. 35.83 లక్షల వరకు రీఫండ్‌లను ఇప్పించేలా చూసుకున్న ఎన్‍సీహెచ్

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 5:57PM by PIB Hyderabad

వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్), 2025 ఏప్రిల్ 25 నుంచి 2026 జూలై 31 వరకు పదిహేను నెలల కాలంలో 35 రంగాలకు చెందిన 1,66,189 రీఫండ్-సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా వినియోగదారులకు రూ. 105 కోట్లకు పైగా రీఫండ్‌లను ఇప్పించేలా చూసుకుంది. 

వినియోగదారులు కన్జూమర్ కమిషన్‌లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా వ్యాజ్యానికి ముందే సకాలంలో ఉపశమనం పొందేలా ఈ రీఫండ్‌లు దోహదపడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి, పరిష్కారాన్ని పొందడానికి జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ ఒకే వేదికగా నిలిచింది.

రీఫండ్-సంబంధిత ఫిర్యాదులలో ఈ-కామర్స్ రంగం అత్యధిక వాటాను కలిగి ఉంది. ఈ రంగంలో 1,00,466 ఫిర్యాదుల ద్వారా రూ. 74 కోట్లకు పైగా రీఫండ్‌లను వినియోగదారులు పొందారు. ఆ తర్వాత స్థానంలో నిలిచిన ప్రయాణాలు- పర్యాటక రంగంలో రూ. 10 కోట్లకు పైగా రీఫండ్‌లు అందాయి. 2026 మే నుంచి 2026 జూలై మధ్య కాలంలో ఈ-కామర్స్ రంగంలో వివిధ రకాల, పలు స్థాయిల విలువ కలిగిన వినియోగదారుల ఫిర్యాదుల నిమిత్తం రూ. 1 నుంచి రూ. 35,83,790 వరకు రీఫండ్‌లను ఇప్పించటంలో ఎన్‌సీహెచ్ చురుగ్గా పనిచేసింది.

విశేషాలు:

  • రూ. 105 కోట్లకు పైగా రీఫండ్‌లను ఇప్పించింది. 

  • 1,66,189 రీఫండ్-సంబంధిత ఫిర్యాదులు పరిష్కరించింది. 

  • 35 రంగాల పరిధిలో ఇవి ఉన్నాయి. 

  • 1,00,466 ఈ-కామర్స్ రీఫండ్ ఫిర్యాదులను పరిష్కరించింది.

  • ఈ-కామర్స్ రంగంలో రూ. 74 కోట్లకు పైగా రీఫండ్‌లను ఇప్పించింది.

  • ప్రయాణాలు- పర్యాటక రంగంలో రూ. 10 కోట్లకు పైగా రీఫండ్‌ల ప్రక్రియను సులభతరం చేసింది. 

  • మే-జూలై 2026 మధ్య ఈ-కామర్స్ రంగంలో రూ. 1 నుంచి రూ. 35,83,790 వరకు రీఫండ్‌లు ఉన్నాయి. 

వినియోగదారుల ఫిర్యాదులను నిర్దిష్ట సమయ వ్యవధిలో పరిష్కరించడానికి సంబంధిత కంపెనీలకు డిజిటల్ ద్వారా పంపే కన్వర్జెన్స్-ఆధారిత యంత్రాంగం కింద ఎన్‌సీహెచ్ పనిచేస్తుంది. వినియోగదారుల అభిప్రాయలను నిరంతరం పర్యవేక్షించడం, ట్రాక్ చేయడం ద్వారా ఈ ప్రక్రియ బలోపేతం అవుతోంది. 

ఎన్‌సీహెచ్ ద్వారా వచ్చిన రీఫండ్-సంబంధిత ఫిర్యాదులు దేశవ్యాప్తంగా ఉన్న మహానగరాల నుంచే కాకుండా మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చాయి. ఇది వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం దేశవ్యాప్త వేదికగా ఈ ప్లాట్‌ఫామ్‌కు ఉన్న విస్తృత ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. 

ఎన్‌సీహెచ్ ద్వారా పరిష్కారమైన వినియోగదారుల ఫిర్యాదులు

  • బెంగళూరు అర్బన్ | ఆలస్యమైన మొబైల్ ఫోన్ డెలివరీ: 2026 ఆగస్టు 21న ఆర్డర్ చేసిన రూ. 47,490 విలువైన మొబైల్ ఫోన్‌ ఆగస్టు 22న డెలివరీ కావాల్సి ఉండగా డెలివరీ తేదీని పదేపదే పొడిగించడంతో ఒక వినియోగదారుడు ఎన్‌సీహెచ్‌ను ఆశ్రయించారు. ఎన్‌సీహెచ్ జోక్యంతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ రూ. 47,490 పూర్తి రీఫండ్‌ను ఇచ్చింది.  

  • ఎన్‌టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ఒకదాని బదులు వేరే ప్రాడక్ట్‌ అందజేత: ఆర్డర్ చేసిన 2.5-అంగుళాల హార్డ్ డ్రైవ్ ఎన్‌క్లోజర్, యూఎస్‌బీ-సీ 3.0 నుంచి టైప్-సీకి బదులుగా మరొక యూఎస్‌బీ 3.1 ఎన్‌క్లోజర్‌ను వినియోగదారుడు పొందారు. ఇది అనుకున్న పరికరంతో పనిచేయలేదు. ఎన్‌సీహెచ్‌లో ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఆ ప్రాడక్ట్‌కు సంబంధించి రీఫండ్‌ను ఇచ్చింది. 

  • ఉదల్‌గురి, అస్సాం | ద్విచక్రవాహన బుకింగ్ రీఫండ్: ద్విచక్రవాహన బుకింగ్‌ను రద్దు చేసుకున్న తర్వాత రూ. 5,000 బుకింగ్ మొత్తాన్ని రీఫండ్ చేయడంలో ఆలస్యం కావడంతో ఒక వినియోగదారుడు 2026 మే 21న ఎన్‌సీహెచ్‌ను ఆశ్రయించారు. ఎన్‌సీహెచ్ జోక్యంతో డీలర్ బుకింగ్ మొత్తాన్ని రీఫండ్ చేయటమే కాకుండా ఆ మొత్తం వినియోగదారుడి ఖాతాలో జమ అయినట్లు నిర్ధారించారు.

  • పూంచ్, జమ్మూ కాశ్మీర్ | వేరే, నాణ్యత లేని ప్రాడక్ట్: రూ. 3,072 విలువైన స్పోర్ట్స్ షూస్ ఆర్డర్ చేసిన వినియోగదారుడికి వేరే, నాణ్యత లేని బ్రాండ్ డెలివరీ అయింది. రిటర్న్ అభ్యర్థనను పదేపదే రద్దు చేయడం లేదా తిరస్కరించడంతో వినియోగదారుడు 2026 జూన్ 29న ఎన్‌సీహెచ్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఎన్‌సీహెచ్ జోక్యంతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ దీనికి సంబంధించిన రీఫండ్‌ను ఇచ్చింది. 

వినియోగదారులు ఫిర్యాదులు చేసేందుకు పలు రకాల మార్గాలను అందిస్తోన్న ఎన్‌సీహెచ్

ఫిర్యాదుల పరిష్కార సౌకర్యాన్ని పొందేందుకు వినియోగదారులు కింది మార్గాల ద్వారా 17 భాషల్లో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ను సంప్రదించొచ్చు. 

  • టోల్-ఫ్రీ నంబర్: 1915

  •  వాట్సాప్/ ఎస్‌ఎంఎస్: 8800001915

  • ఇన్‌గ్రామ్ పోర్టల్

  • ఈమెయిల్: nch-ca[at]gov[dot]in

  • ఎన్‌సీహెచ్ మొబైల్ యాప్

  • వెబ్ పోర్టల్

  • ఉమాంగ్ యాప్

2025 ఏప్రిల్ 25 నుంచి 2026 జూలై 31 మధ్య కాలంలో రూ. 105 కోట్లకు పైగా రీఫండ్‌లను ఇప్పించటంలో సహాయపడటం అనేది వ్యాజ్యానికి ముందే వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండే, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ఫిర్యాదుల పరిష్కారాన్ని అందించడంలో ఎన్‌సీహెచ్ పాత్రను స్పష్టంగా తెలియజేస్తుంది. 

వినియోగదారులు ఫిర్యాదులను లేవనెత్తడానికి, సకాలంలో పరిష్కారాన్ని పొందడానికి అనుకూలమైన యంత్రాంగాన్ని అందించడం ద్వారా డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌లు, సేవా వ్యవస్థలపై వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎన్‌సీహెచ్ ఎంతగానో దోహదపడుతుంది. తమ హక్కులను పరిరక్షించుకోవడానికి, తమ ఫిర్యాదులకు పరిష్కారం పొందేందుకు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ను సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2308561) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Kannada , Malayalam