ఆయుష్
నాణ్యమైన ఆయుష్ సేవల కోసం పిలుపునిచ్చిన కేంద్రమంత్రి శ్రీ ప్రతాపరావ్ జాదవ్
ఆయుష్ వ్యవస్థ బలోపేతానికి నీతి ఆయోగ్ నేతృత్వంలో జాతీయ కార్యశాల
సదస్సులో పాల్గొన్న కేంద్రం, 30కి పైగా రాష్ట్రాలు, యూటీల ప్రతినిధులు
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 12:25PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండేలా, ప్రజలే కేంద్రంగా, నాణ్యమైన ఆయుష్ సేవలు అందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ (స్వతంత్ర హోదా), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీ ప్రతాపరావ్ జాదవ్ కోరారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో నిన్న నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయుష్ వ్యవస్థ బలోపేతం' జాతీయ కార్యశాలలో ఆయన ప్రసంగించారు.
ఈ కార్యశాలలో కేంద్ర ప్రభుత్వం, 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సీనియర్ అధికారులు, వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సమావేశమయ్యారు. వారి అనుభవాలు, ఉత్తమ పద్ధతులు, పరస్పర సహకార విధానాల ద్వారా ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేయటంపై చర్చించారు.
ఈ ప్రారంభ కార్యక్రమానికి శ్రీ ప్రతాపరావ్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య శాఖ) ప్రొఫెసర్ (డాక్టర్) ఎం. శ్రీనివాస్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా కూడా పాల్గొన్నారు.

శ్రీ ప్రతాపరావ్ జాదవ్ ప్రసంగిస్తూ... ఆయుష్ వ్యవస్థల విస్తృతిని, వాటి ప్రభావాన్ని మరింత పెంచేందుకు కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత ఉండేలా, ప్రజలకు అందుబాటులో ఉండేలా, ప్రజలే కేంద్రంగా ఉండే విధానంపై ప్రత్యేకంగా దృషి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.
సమగ్ర ఆరోగ్య సంరక్షణలో సాంకేతికత, సాక్ష్యాధారిత విధానాల ప్రాముఖ్యతను ప్రొఫెసర్ (డాక్టర్) ఎం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. దీనికి భారత్‌లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచగలిగే సామర్థ్యం ఉందన్నారు.
ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేయటంలో, క్షేత్రస్థాయిలో ఆయుష్ సేవలను సమర్థవంతంగా అందించటంలో రాష్ట్రాలు, యూటీల కీలక పాత్రను వైద్య రాజేశ్ కొటేచా తెలియజేశారు.
ఆయుష్ ఆరోగ్య సేవలు, విద్య, పరిశోధన, సామర్థ్య పెంపు, ఆరోగ్య వ్యవస్థతో విసృత అనుసంధానం వంటి కీలక రంగాల్లో అనుభవాలు, ఉత్తమ పద్ధతులు, వినూత్న విధానాలను పంచుకునేందుకు రాష్ట్రాలు, యూటీలకు ఈ కార్యశాల వేదికగా నిలిచింది.
కేంద్రం, రాష్ట్రాల సహకారంతో బలమైన, ప్రజలకు అందుబాటులో ఉండే, ప్రజలే కేంద్రంగా ఆయుష్ వ్యవస్థ ఏర్పాటుకు, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందరికీ అందించాలనే ప్రభుత్వ దార్శనికతకు ఈ చర్చలు ప్రాధాన్యతనిచ్చాయి.

***
(రిలీజ్ ఐడి: 2308266)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4