కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డబ్బు కోల్పోయేలోపే రక్షణ: రూ. 5,000 కోట్లకు పైగా సైబర్ మోసాలను నివారించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ)


2025 మే 22న ప్రారంభమై పదిహేను నెలల్లోనే ప్రజలు కష్టపడి సంపాదించిన రూ. 5,000 కోట్లకు పైగా మొత్తాన్ని కాపాడిన ఎఫ్ఆర్ఐ

డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన 1,600కి పైగా సంస్థలు

1,500 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థల కోసం 25కి పైగా శిక్షణ సెషన్‌ల నిర్వహణ

ఆర్థిక సంస్థల ద్వారా ఎఫ్ఆర్ఐ వినియోగం పెరగడంతో దాదాపు ఎనిమిది రెట్లు పెరిగిన మోసాల నివారణ

మొదటి ఆరు నెలల్లో రూ. 660 కోట్ల నుంచి ఆగస్టు నాటికి రూ. 5,043.73 కోట్లకు చేరుకున్న మోసాల నివారణ

మూలం వద్దే ఆపిన ప్రతి రూపాయి అంటే అసలు మోసమే జరగనట్లు.. ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు, ఖాతా ఫ్రీజ్ లేదు, రికార్డుల సేకరణ, ప్రజలు నెలల తరబడి తిరగాల్సిన అవసరం లేకుండానే మోసాల నివారణ

నాడు పోస్టు చేయడమైనది: 08 SEP 2026 4:39PM by PIB Hyderabad

డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ప్రజల రక్షణలో భాగంగా టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీఓటీ) 2025 మే 22న ప్రారంభించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ) మొదటి పదిహేను నెలల్లోనే రూ. 5,000 కోట్లకు పైగా విలువైన సైబర్ మోసాలను నివారించడంలో సహాయపడింది. ఈ డబ్బును ట్రాక్ చేయడం, ఫ్రీజ్ చేయడం లేదా రికవరీ చేయాల్సిన అవసరం రాలేదు. ఇది మూలం వద్దే పౌరుడి ఖాతాను విడిచిపెట్టి వెళ్లలేదు.

మొదటి ఆరు నెలల కాలంలో రూ. 660 కోట్ల మోసాలను నివారించిన ఇది ఇప్పుడు రూ. 5,000 కోట్లకు పైగా ఘనతను అందుకోవటం దీని విస్తరణకు తెలియజేస్తోంది. డిజిటల్ ఆర్థిక మోసాల నుంచి ప్రజలను రక్షించడంలో టెలికాం ఇంటెలిజెన్స్ పాత్ర పెరుగుతుండటంతో పాటు టెలికాం, బ్యాంకింగ్, ఫిన్‌టెక్, సెక్యూరిటీస్, బీమా, చట్టపరమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థల మధ్య సమన్వయ చర్యలకు ఉన్న బలాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.

ప్రజల జేబులను దాటని డబ్బు

రూ. 5,000 కోట్ల గణాంకాల వెనుక లక్షలాది మందిని వ్యక్తిగతంగా కాపాడిన సందర్భాలు ఉన్నాయి. నకిలీ కేవైసీ కాల్‌ కారణంగా జీవితకాలపు పొదుపును కోల్పోని పింఛనుదారు, మోసపూరిత సరఫరాదారుకి చెల్లించే విషయంలో ఖాతా నుంచి డెబిట్ అయ్యే కొన్ని క్షణాల ముందు చెల్లింపు ఆపేసిన చిన్న వ్యాపారి, స్క్రీన్‌పై హెచ్చరికను చూసి నిలిపివేసిన మొదటిసారి డిజిటల్ యూజర్ వంటి క్షణాలు ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ తదనంతరం విచారణల ఇబ్బంది లేకుండా మోసం జరగకముందే ప్రజలకు రక్షణ అందింది.

రక్షణ విషయంలో వేగం గణనీయంగా పుంజుకుంది. బ్యాంకులు, పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ అమలు మరింత వ్యవస్థీకృతంగా మారడంతో ఎఫ్ఆర్ఐ వినియోగం ద్వారా కూడబెట్టిన పొదుపులు 2025 ఆగస్టు నాటికి ఉన్న రూ. 139.16 కోట్ల నుంచి 2026 ఆగస్టు నాటికి రూ. 5,043.73 కోట్లకు పెరిగాయి. ఒక్క 2026 ఏప్రిల్ నుంచి నాలుగు నెలల్లోనే రూ. 2,000 కోట్లకు పైగా నష్టాన్ని నివారించారు.

ఎఫ్ఆర్ఐ- మొట్టమొదటి టెలికాం ఇంటెలిజెన్స్ ఫ్రేమ్‌వర్క్

టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీఓటీ) అభివృద్ధి చేసిన ఒక వినూత్న రిస్క్-అసెస్స్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ ఎఫ్ఆర్ఐ. ఒక మొబైల్ నంబర్ సైబర్ నేరం లేదా ఆర్థిక మోసంతో సంబంధం కలిగి ఉండే అవకాశాన్ని ఆర్థిక సంస్థలు నిజ సమయంలో అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది.

డీఓటీకి చెందిన డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (డీఐపీ) ఆధ్వర్యంలో ఎఫ్ఆర్ఐ రూపుదిద్దుకుంది. ఇది ఆర్థిక మోసాలలో ప్రమేయం ఉండే సంభావ్యత ఆధారంగా మొబైల్ నంబర్లను మధ్యస్థ, అధిక లేదా అత్యధిక రిస్క్ అనే 3 విభాగాలుగా వర్గీకరిస్తుంది. ఈ వర్గీకరణ అనేక వనరుల నుంచి సేకరించిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. సంచార్ సాథీ ప్లాట్‌ఫామ్‌లో ప్రజల రిపోర్టులు.. ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు (ఐ4సీ) చెందిన నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ), టెలికాం ఆపరేటర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పంచుకున్న సమాచారం.. ఇతర టెలికాం సంబంధిత సూచికలు ఇందులో ఉన్నాయి.

డీఓటీకి చెందిన డీఐపీ ద్వారా ఈ సమాచారాన్ని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, బీమా సంస్థలు, సెక్యూరిటీస్ మధ్యవర్తులు, పింఛను రంగ సంస్థల సురక్షితంగా అందుకుంటాయి. వినియోగదారుల ఆన్‌బోర్డింగ్, బదిలీల పర్యవేక్షణ, మోసాల గుర్తింపు వ్యవస్థలతో టెలికాం-రిస్క్ ఇంటెలిజెన్స్‌ను కలపటం ద్వారా ఆర్థిక నష్టాలు సంభవించకముందే హై-రిస్క్ లావాదేవీలను గుర్తించేందుకు సంస్థలకు వీలవుతుంది. దీనివల్ల మోసాల నిర్వహణ అనేది కేవలం మోసం జరిగిన తర్వాత స్పందించే విధానం నుంచి ముందస్తుగా నివారించే విధానానికి మారుతుంది.

నివారణే రికవరీ కంటే మిన్న

ఒక సైబర్ మోసం జరిగినప్పుడు ప్రజలకు జరిగే నష్టంతో అసలు సమస్య మొదలవుతుంది. మోసం ద్వారా వచ్చిన డబ్బు సాధారణంగా కొన్ని నిమిషాల్లోనే పలు బ్యాంకుల్లో ఉన్న వరుస మ్యూల్ ఖాతాల ద్వారా తరలిపోతుంది. ఆ తర్వాత ఆ డబ్బును రికవరీ చేయడం అనేది సమయంతో చేసే పోరాటంగా మారుతుంది.

ఒక మోసం విజయవంతంగా జరిగితే అది సుదీర్ఘమైన, ఖరీదైన ప్రజా- సంస్థాగత ప్రయత్నాలకు దారితీస్తుంది. దీనికి విరుద్ధంగా లావాదేవీ ప్రారంభమైన క్షణంలోనే ఒక సెకెనులోని చిన్నవంతులో తనిఖీ పూర్తవుతుంది. ఇక్కడ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు.. కేసు దర్యాప్తు చేయాల్సిన పనిలేదు.. ఖాతాను ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు.. రికార్డులను సేకరించాల్సిన పనిలేదు.. డబ్బును వెతకాల్సిన అవసరం లేదు. ఇంకో మంచి లక్షణం ఏంటంటే.. అనేక సంస్థలలోని మాన్యువల్ చర్యలను బ్యాక్‌గ్రౌండ్‌లో నిశ్శబ్దంగా నడిచే ఒక మెషిన్-టు-మెషిన్ చెక్ భర్తీ చేస్తుంది.

ఈ కోణంలో చూస్తే రూ. 5,000 కోట్లనే గణాంకం దేశానికి చేకూరిన వాస్తవ ప్రయోజనాన్ని తక్కువ చేసి చూపుతుంది. ఇది పౌరుల వద్దే నిలిచిపోయిన డబ్బును మాత్రమే లెక్కిస్తుంది. కానీ ఎప్పటికీ నమోదు కాని ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లు, వెచ్చించాల్సిన దర్యాప్తు గంటలు, జారీ చేయని ఫ్రీజ్ నోటీసులు, అభ్యర్థించని టెలికాం రికార్డులు, చేయని బ్రాంచ్ సందర్శనలు లేదా అనుభవించని మానసిక వేదనను ఇది లెక్కలోకి తీసుకోదు. నివారణ అనేది దర్యాప్తు చేయాల్సిన అవసరాన్నే పూర్తిగా తొలగిస్తుంది.

సమగ్ర ప్రభుత్వ రక్షణ – రంగాల మధ్య సహకారానికి ఉన్న ప్రాముఖ్యత

ఆర్థిక మోసాలు ఎప్పుడూ ఒకే రంగానికి పరిమితం కావు. ఒక మోసం టెలికాం వనరుల దుర్వినియోగంతో ప్రారంభమై డిజిటల్ పేమెంట్ ఛానెల్ ద్వారా చివరికి బ్యాంకింగ్, సెక్యూరిటీస్, బీమా లేదా పింఛను ఖాతాపై దాడి చేయొచ్చు. ఇటువంటి ముప్పులను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ఇంటెలిజెన్స్-ఆధారిత సమగ్ర ప్రభుత్వ విధానం అవసరం.

దీనికి అనుగుణంగా ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, భాగస్వాములతో డీఓటీ సన్నిహితంగా పనిచేస్తూ ఎఫ్ఆర్ఐ సిగ్నల్స్‌ను వారి మోసాల గుర్తింపు, నివారణ కార్యకలాపాలతో నేరుగా అనుసంధానించింది. నిజ సమయంలో అధిక, అత్యధిక రిస్క్ ఉన్న మొబైల్ నంబర్లతో కూడిన లావాదేవీలను నిలిపివేయడానికి లేదా ఫ్లాగ్ చేయడానికి బ్యాంకులు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికే ఎఫ్ఆర్ఐ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇతర ఆర్థిక రంగ సంస్థలతో కూడిన బలమైన వివిధ ఏజెన్సీల మధ్య సహకారం ఈ ప్రయత్నానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది.

బ్యాంకింగ్‌కు మించి విస్తరిస్తున్న రక్షణ

ప్రజల డబ్బులు ఎక్కడ ఉన్నా అక్కడే మూలంలోనే రక్షణ కల్పించేలా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను కింది వాటికి క్రమంగా విస్తరిస్తున్నారు:

  • ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలతో కూడిన మోసాలను అరికట్టడానికి సెక్యూరిటీస్ మార్కెట్ మధ్యవర్తులకు

  • పాలసీ జారీ, క్లెయిమ్స్ ప్రాసెసింగ్ సమయంలో మోసాలను గట్టిగా గుర్తించేందుకు బీమా సంస్థలకు

  • పెన్షన్ ఖాతాలకు యాక్సెస్ చేసేందుకు, వాటి ద్వారా జరిగే లావాదేవీలను సురక్షితం చేయడానికి పింఛను వ్యవస్థ భాగస్వాములకు

ఆర్థిక రంగంలో సామర్థ్య పెంపుదల

ఈ స్థాయిలో నివారణ జరగాలంటే సంస్థలు తమకు అందే సిగ్నల్స్ ఆధారంగా తక్షణమే స్పందించగలగాలి. ఎఫ్ఆర్ఐ పద్ధతి, డీఐపీ ఇంటిగ్రేషన్, మోసాలను గుర్తించే పనుల్లో రిస్క్ సిగ్నల్స్‌ను ఎలా ఉపయోగించాలనే అంశాలపై 1,500 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థలకు 25కి పైగా శిక్షణా సెషన్లను డీఓటీ నిర్వహించింది. దీనివల్ల కౌంటర్ వద్ద, యాప్‌లలో వేగంగా గుర్తించడానికి, త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం సంస్థలకు చేకూరాయి.

జన్ భాగీదారి — పౌరుడే రక్షణకు మొదటి మెట్టు

ఎఫ్ఆర్ఐ విజయం 'జన్ భాగీదారి' లేదా పౌరుల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. సంచార్ సాథీ పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్‌లో అనుమానాస్పద కాల్ లేదా సందేశాన్ని రిపోర్ట్ చేసే ప్రతి పౌరుడు ఎఫ్ఆర్ఐకి శక్తినిచ్చే ఇంటెలిజెన్స్‌ను మరింత బలోపేతం చేస్తాడు. ఒక అప్రమత్తమైన పౌరుడి నుంచి వచ్చే ఒక్క రిపోర్టు కూడా సైబర్ మోసానికి గురికాగల వేలాది మందిని రక్షించే హెచ్చరికలకు దారితీస్తుంది.

ఈ వ్యవస్థను నిలబెడుతున్న ప్రజలు, సైబర్ వారియర్స్ అప్రమత్తతను, అందించిన సహకారాన్ని డీఓటీ ప్రత్యేకంగా అభినందిస్తోంది.

పౌరులు పాటించాల్సిన సూచనలు

  • చెల్లింపు హెచ్చరికలను గమనించండి. మీరు డబ్బు పంపుతున్న మొబైల్ నంబర్ లేదా ఖాతా గురించి మీ బ్యాంకింగ్ లేదా యూపీఐ అప్లికేషన్ మిమ్మల్ని హెచ్చరిస్తే చెల్లింపు చేయకుండా ఆగి ఒకటికి రెండుసార్లు స్వతంత్రంగా తనిఖీ చేసుకోండి.

  • చక్షు ద్వారా రిపోర్టు చేయండి. అనుమానాస్పద కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లు లేదా వాట్సాప్ సందేశాలను సంచార్ సాథీ పోర్టల్ (www.sancharsaathi.gov.in) లేదా ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో అందుబాటులో ఉన్న మొబైల్ యాప్‌లోని 'చక్షు' ద్వారా రిపోర్ట్ చేయండి.

  • సైబర్ మోసం జరిగితే వెంటనే సంప్రదించండి. ఆర్థిక సైబర్ మోసం జరిగినప్పుడు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. మొదటి గంట అత్యంత కీలకం.

  • మీ పేరిట ఉన్న కనెక్షన్‌లను తనిఖీ చేయండి. సంచార్ సాథీలో మీ పేరుపై జారీ చేయబడిన మొబైల్ కనెక్షన్‌లను పరిశీలించి మీవి కానివి ఏవైనా ఉంటే వెంటనే రిపోర్ట్ చేయండి.

  • పోగొట్టుకున్న ఫోన్‌లను బ్లాక్ చేయండి. పోగొట్టుకున్న లేదా దొంగతానానికి గురైన మొబైల్ హ్యాండ్‌సెట్‌లను సంచార్ సాథీ ద్వారా బ్లాక్ చేయొచ్చు లేదా ట్రాక్ చేయవచ్చు. కాబట్టి వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి.

  • మొబైల్ ఫోన్ ప్రామాణికతను నిర్ధారించుకోండి. కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే ముందు అది అసలైనదేనా లేదా అని తనిఖీ చేయండి.

క్రియాశీలకంగా మోసాలను గుర్తించటం, ఇంటెలిజెన్స్-ఆధారిత విధాన జోక్యాలు, ఏజెన్సీల మధ్య నిరంతర భాగస్వామ్యం, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలపై నిర్మితమైన సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ కోసం ఈ శాఖ కట్టుబడి ఉంది.

ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ):

టెలికాం ఆధారిత సైబర్ మోసాలను అరికట్టడానికి డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (డీఐపీ) కింద 2025 మే 22న డీఓటీ ప్రారంభించిన ఒక బహుమితీయ విశ్లేషణాత్మక ఫ్రేమ్‌వర్క్ ఈ ఎఫ్ఆర్ఐ. సైబర్ మోసాలను నివారించడానికి ఆర్థిక సంస్థలకు నిజ-సమయ ఇంటెలిజెన్స్‌ను అందించడానికి దీనిని రూపొందించారు. సంచార్ సాథీ, చక్షు, సీఈఐఆర్, ఏఎస్‌టీఆర్ వంటి డీఓటీ చేపట్టిన విస్తృత పౌర-రక్షణ కార్యక్రమాలలో ఇది భాగంగా ఉంది. 

డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (డీఐపీ):

టెలికాం ఆధారిత సైబర్ మోసాలు, టెలికాం వనరుల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి డీఓటీ అభివృద్ధి చేసిన సురక్షితమైన, దేశవ్యాప్త ఇంటెలిజెన్స్-షేరింగ్, సమన్వయ ప్లాట్‌ఫామ్ ఈ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ (డీఐపీ). 2024లో ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చట్టపరమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ప్రభుత్వ శాఖలతో సహా 1,600 మందికి పైగా భాగస్వాములు నిజ-సమయ సహకారాన్ని అందిస్తున్నాయి. దీని ద్వారా మొబైల్ నంబర్ రేవోకేషన్ జాబితా (ఎమ్ఎన్ఆర్ఎల్), అనుమానాస్పద మోసపూరిత మొబైల్ నంబర్లు (ఎఫ్ఆర్ఐ), సంబంధిత డిజిటల్ ఐడెంటిఫైయర్‌లపై ఆచరణాత్మక సమాచారాన్ని పంచుకుంటారు. సైబర్ నేరాల్లో ప్రమేయం, విఫలమైన పునః-ధ్రువీకరణ, టీఎస్‌పీ అంతర్గత విశ్లేషణ, నిర్ణీత కనెక్షన్ పరిమితుల ఉల్లంఘన వంటి కారణాల వల్ల డిస్‌కనెక్ట్ అయిన మొబైల్ నంబర్లను ఎంఎన్ఆర్ఎల్ అన్ని భాగస్వాములతో పంచుకుంటుంది. ఈ విధంగా డిస్‌కనెక్ట్ అయిన నంబర్లను వెంటనే అందించడం ద్వారా బ్యాంకులు, ఇతర భాగస్వాములు తమ మోసాల నియంత్రణను బలోపేతం చేసుకోవడానికి, పౌరులతో సేవా పరమైన కమ్యూనికేషన్ కోసం సరైన నంబర్లను అప్‌డేట్ చేయడానికి, రద్దు అయిన టెలికాం కనెక్షన్‌ల దుర్వినియోగాన్ని నివారించడానికి వీలవుతుంది. ఈ భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా మోసాల నివారణలో సమగ్ర వ్యవస్థాగత విధానానికి డీఐపీ పునాది వేసింది.

సంచార్ సాథీ పోర్టల్‌ను (www.sancharsaathi.gov.in) సందర్శించాల్సిందిగా లేదా ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న వివిధ పౌర-కేంద్రిత సేవలను పొందడానికి సంచార్ సాథీ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. 

ఆండ్రాయిడ్:

https://play.google.com/store/apps/details?id=com.dot.app.sancharsaathi

ఐఓఎస్:

https://apps.apple.com/app/sancharsaathi/id6739700695

మరిన్ని వివరాల కోసం సామాజిక మాధ్యమాల్లో డీఓటీ ఖాతాలను అనుసరించండి:

ఎక్స్: https://x.com/DoT_India

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

ఫేస్‌బుక్: https://www.facebook.com/DoTIndia

యూట్యూబ్: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa

 

 

***


(రిలీజ్ ఐడి: 2308003) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam