లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

33 శాతం రిజర్వేషన్ మహిళల రాజకీయ నాయకత్వానికి కొత్త బాటలు వేస్తుంది: లోక్‌సభ స్పీకర్

ప్రభుత్వ సేవల్లో మహిళల వాటా 50 శాతానికి పైగా ఉండే రోజు మరెంతో దూరంలో లేదు

మద్దతిచ్చే దశ నుంచి... విధానాలు, చట్టాల రూపకర్తలుగా మహిళలను సాధికారులను చేసే దిశగా దృష్టి సారించాలి

మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పురోగమించలేదు

ఫరీదాబాద్‌లో జాతీయ మహిళా కమిషన్ ‘లింగ సమానతా పరిపాలన’పై నిర్వహించిన రెండు రోజుల అఖిల భారత నైపుణ్య శిక్షణ సదస్సును ప్రారంభించిన లోక్‌సభ స్పీకర్

నాడు పోస్టు చేయడమైనది: 07 SEP 2026 6:21PM by PIB Hyderabad

లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చారిత్రక అవసరమని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను వివరించారు. వివిధ ప్రభుత్వ సేవలు, వృత్తుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడాన్ని ప్రస్తావిస్తూ.. మున్ముందు రాజకీయం, పరిపాలన, సామాజిక రంగాల్లో నవతరం మహిళా నాయకత్వం రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవల్లో 50 శాతానికి పైగా మహిళల భాగస్వామ్యం నమోదయ్యే రోజు మరెంతో దూరంలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఫరీదాబాద్‌లో.. ‘లింగ సమానతా పాలన’ అంశంపై రెండు రోజుల అఖిల భారత నైపుణ్య శిక్షణ సదస్సును ఈ రోజు ప్రారంభిస్తూ శ్రీ ఓం బిర్లా ఈ వ్యాఖ్యలు చేశారు.

కేవలం అవకాశాలను, మద్దతును అందించడానికే పరిమితం కాకుండా... విధానాలు, చట్టాల రూపకల్పన, సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలు క్రియాశీలక భాగస్వాములయ్యేలా దిశానిర్దేశం చేయడంపై ఇక నుంచి దృష్టి సారించాలని శ్రీ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. తమ ఆందోళనలను పరిష్కరించుకోవడానికి, స్వీయ ఆకాంక్షలకు అనుగుణంగా.. అవసరమైన చట్టాలను నిర్దేశించడంలో మహిళలే స్వయంగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. రాజ్యాంగబద్ధ సమానత్వంతోపాటు.. మహిళల భద్రత, సాధికారత, ఆత్మనిర్భరత దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చట్టబద్ధమైన చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎప్పటికప్పుడు గుర్తించి, తగిన పరిష్కార మార్గాలను సుగమం చేయడంలో జాతీయ మహిళా కమిషన్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలతోపాటు పంచాయతీలు, పురపాలక సంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ప్రతినిధులు.. మహిళల సమస్యలను సరైన వేదికలపైకి తేవడంలో, క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా చట్టాలు రూపుదిద్దుకునేలా చేయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని శ్రీ బిర్లా ఉద్ఘాటించారు.

భారత జనాభాలో దాదాపు సగభాగం గా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని దేశం సాధించలేదని శ్రీ ఓం బిర్లా స్పష్టం చేశారు. ప్రతి మహిళకూ ఉపాధి, ఆర్థిక స్వాలంబన, సామాజిక సాధికారత కోసం అవకాశాలు లభించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా పేదరికాన్ని, ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా సాధికారులను చేసేందుకు ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, చట్టపరమైన చర్యలపై విస్తృతంగా చర్చించాలని మహిళా ప్రజాప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు. వివిధ చట్ట సభల ప్రభావవంతమైన కార్యక్రమాలను, వారు సాధించిన విజయాలనూ అనుభవాలనూ పరస్పరం పంచుకోవడం ద్వారా.. ఉత్తమ విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి వీలవుతుందని సూచించారు. అంతేకాకుండా ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలకు తమ సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉన్న చట్టాలు, సంస్థాగత వ్యవస్థలపై మరింత అవగాహనను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

స్వాతంత్య్ర పోరాటం, దేశ నిర్మాణం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతం వరకు... దేశ పరిణామక్రమంలో మహిళలు ఎల్లప్పుడూ ముందంజలో ఉన్నారని శ్రీ ఓం బిర్లా గుర్తుచేశారు. మహిళా ప్రజాప్రతినిధులు తమ అనుభవాలు, ఆలోచనలు, దృక్పథాలను పరస్పరం పంచుకోవడానికి, తద్వారా నాయకత్వ పాటవాన్ని పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మహిళా శాసనసభ్యులు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని, చట్టసభల ద్వారా మహిళల ఆకాంక్షలకు గొంతుకగా నిలవడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్న తీరుకు ఇది అద్దం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మరింత సమర్థంగా ఈ బాధ్యతను నిర్వర్తించేలా ప్రజాప్రతినిధులు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని స్పీకర్ కోరారు.

సజీవమైన ప్రజాస్వామ్యానికి చర్చలే ప్రాణవాయువు అని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. నిరంతర చర్చలు, సంప్రదింపుల ద్వారానే ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు లభిస్తాయని, వారి ఆకాంక్షలు నెరవేరుతాయని పేర్కొన్నారు. సున్నితత్వం మహిళా నాయకత్వానికి ప్రధానమైన బలమని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, ప్రభావవంతమైన పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఇది దోహదపడుతుందన్నారు. సున్నితమైన, స్పందించే గుణం కలిగిన పని సంస్కృతి సామాజిక సవాళ్లను అధిగమించడంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో విశేషంగా తోడ్పడుతుందన్నారు. నిరంతర కృషి ద్వారా.. ప్రతీ జీవనరంగంలోనూ మహిళలు మరింతగా నాయకత్వ స్థానాలను అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం మన సమష్టి సంకల్పం కావాలని పిలుపునిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి విజయ రహాత్కర్, హర్యానా ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ రాజేశ్ నాగర్, 20 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 200 మంది మహిళా శాసనసభ్యులు పాల్గొన్నారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2307707) సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , हिन्दी , Punjabi , Gujarati , English , Urdu , Kannada , Malayalam