హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గోవా రాజధాని పనాజీలో గోవా పోలీసు విభాగానికి రాష్ట్రపతి పతాకాన్ని (ప్రెసిడెంట్స్ కలర్) ప్రదానం చేసిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


గోవా పోలీసులకు రాష్ట్రపతి పతాకాన్ని ప్రదానం చేయడం ఎనిమిది దశాబ్దాలుగా వారు అంకితభావంతో అందిస్తున్న సేవలకు, ప్రదర్శించిన ధైర్యసాహసాలకు దేశం అందించిన గౌరవంగా నిలుస్తుంది

రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంత పరిరక్షణ, పర్యాటకుల భద్రత, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టతలో గోవా పోలీసులు విశేషమైన సహకారాన్ని అందించారు.

రానున్న రోజుల్లో 1930 హెల్ప్‌లైన్ నంబర్ అన్ని రకాల సైబర్‌ మోసాల నుంచి దేశాన్ని రక్షించేందుకు బలమైన రక్షణ కవచంగా మారనుంది.

గోవా పోలీసులు 1930 హెల్ప్‌లైన్ కోసం ప్రారంభించిన కృత్రిమ మేధ ఆధారిత కాల్ ఏజెంట్, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లోని అన్ని భాషల్లో ఫిర్యాదులను నమోదు చేసి వాటిని సంబంధిత అధికార యంత్రాంగానికి
పంపిస్తుంది.

గోవా పోలీసుల 112 అత్యవసర హెల్ప్‌లైన్‌ సేవలో స్పందన సమయం 18 నిమిషాల నుంచి కేవలం 8 నిమిషాలకు తగ్గింది.

సాంకేతికత, సున్నితత్వం, ప్రాధాన్యత క్రమం, సత్వర న్యాయం అందించే సామర్థ్యం వంటి అంశాలను
పొందుపరిచిన కొత్త న్యాయ సంహితలు పోలీసింగ్‌ వ్యవస్థలో కీలకమైన ఆధునికీకరణకు నాంది పలుకుతున్నాయి.

గోవా పోలీసులు కేవలం ఒక్క ఏడాదిలోనే నేర నిర్ధారణ రేటును 30 శాతం (23 శాతం నుంచి 53 శాతానికి) పెంచారు
గోవా పోలీసు విభాగంలో అమర వీరులకు నివాళులర్పించిన శ్రీ అమిత్ షా

నషా ముక్త్‌ భారత్‌ సాధన కోసం 2026–2029 సంవత్సరాలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం - ఈ ప్రణాళిక కింద భారత్‌ను మాదక ద్రవ్యాల రహిత దేశంగా తీర్చిదిద్దుతాం

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో గోవా పోలీసులు కూడా తిరుగులేని శక్తిగా ఎదుగుతారని విశ్వాసం వ్యక్తం చేసిన శ్రీ అమిత్‌ షా

నాడు పోస్టు చేయడమైనది: 07 SEP 2026 7:19PM by PIB Hyderabad

గోవా రాజధాని పనాజీలో గోవా పోలీసులకు రాష్ట్రపతి పతాకాన్ని (ప్రెసిడెంట్స్ కలర్) కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా ఈ రోజు ప్రదానం చేశారు. గోవా ముఖ్యమంత్రి డాక్టర్‌ ప్రమోద్‌ సావంత్‌, కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యశో నాయక్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, గోవా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గోవా డీజీపీతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ అమిత్‌ షా మాట్లాడుతూ, గోవా పోలీసులకు రాష్ట్రపతి పతాకాన్ని ప్రదానం చేయడం తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఎనిమిది దశాబ్దాల విశిష్ట సేవల అనంతరం నేడు గోవా పోలీసులు దేశంలోని పలు ఇతర పోలీసు దళాల సరసన నిలిచి, భారత రాష్ట్రపతి అందించిన ఈ గౌరవాన్ని గర్వంగా స్వీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి పతాకం అందుకున్న రాష్ట్రాల పోలీసు దళాలు తమ ఘన చరిత్ర, వృత్తిపరమైన నైపుణ్యం, ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, అంకితభావానికి గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని పొందాయని అన్నారు. గోవా చిన్న రాష్ట్రమైనప్పటికీ అత్యంత కీలకమైన రాష్ట్రమని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సురక్షిత నగరం, సురక్షిత సమాజం, భద్రమైన సముద్ర సరిహద్దు ఉండేలా చూడాల్సిన బాధ్యతను గోవా పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఈ మూడు బాధ్యతలను గోవా పోలీసులు విజయవంతంగా నిర్వర్తిస్తూ, జాతీయ భద్రతకు గణనీయమైన సేవలందించారని శ్రీ షా పేర్కొన్నారు.

అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి పూర్తి అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల భద్రత కూడా అత్యంత ప్రధానమైన అవసరమని హోం మంత్రి అన్నారు. అంతర్గత భద్రతతో పాటు సరిహద్దు భద్రత  బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్న ప్రత్యేకత గోవా పోలీసులకు  ఉందని పేర్కొన్నారు. గోవా విస్తృతమైన సముద్ర సరిహద్దును కాపాడే బాధ్యత గోవా పోలీసుల భుజాలపై ఉందని అన్నారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పర్యాటకులకు భద్రత, రక్షణ కల్పించడంలోనూ, బలమైన ఆర్థిక వ్యవస్థకు దోహదపడటంలోనూ గోవా పోలీసులు ప్రశంసనీయమైన సేవలు అందించారని శ్రీ షా పేర్కొన్నారు.

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమర వీరులకు శ్రీ అమిత్ షా ఈ సందర్భంగా నివాళులర్పించారు. పోలీసు సిబ్బంది బలరామ్‌ షిండే, అభిషేక్‌ షేర్‌, శైలేష్‌ గావోంకర్‌, విశ్వాస్‌ బి. డేకర్‌లకు ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ వారి అంకితభావం, త్యాగం గోవా పోలీసులకు ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కేందుకు గణనీయంగా దోహదపడిందని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు.

ప్రపంచ దౌత్యరంగంలో భారతదేశ ప్రభావం రోజురోజుకూ విస్తరిస్తోందని శ్రీ షా అన్నారు. గత ఏడాది కాలంలో రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం, అనంతరం గల్ఫ్‌ ప్రాంతంలో ఇరాన్‌కు సంబంధించిన ఘర్షణల కారణంగా ప్రపంచ దౌత్య పరిణామాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయని తెలిపారు. ఇలాంటి సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక్క ఏడాదిలో 22 దేశాల్లో పర్యటించగా, సుమారు 15 దేశాల దేశాధినేతలు భారత్‌ను సందర్శించారని శ్రీ షా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత కారణంగా ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటూ, ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు ప్రపంచ దేశాలు సతమతమవుతున్న సమయంలో కూడా  నిరంతర చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా భారత్‌ తన ఆర్థిక ప్రగతి వేగాన్ని కొనసాగించిందని శ్రీ అమిత్ షా అన్నారు. రక్షణ, సాంకేతికత, ఇంధనం, పెట్టుబడులు, వాణిజ్యం తదితర అనేక రంగాల్లో స్పష్టమైన ఒప్పందాలు కుదిరాయని ఆయన పేర్కొన్నారు. 2026 నాటికి భారత్‌ తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని,  . ఈ ఒప్పందాలు ప్రస్తుతం 38 దేశాలతో సమర్థవంతమైన వాణిజ్య ఏర్పాట్లుగా అమల్లోకి వచ్చాయని శ్రీ అమిత్ షా తెలిపారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఒమన్‌, న్యూజిలాండ్‌, యూరోపియన్‌ యూనియన్‌లతో కుదిరిన ఒప్పందాలు భారత్‌ వాణిజ్యానికి కొత్త ఊపునిచ్చాయని పేర్కొన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాల సానుకూల ప్రభావం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత్‌ జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతానికి చేరుకోవడంలో ప్రతిబింబించిందని ఆయన అన్నారు. భారత్‌ ఆర్థిక వృద్ధిని సాధించడమే కాకుండా అనేక విధాలుగా ప్రపంచ సమాజానికి తన వంతు సహకారం అందించిందని తెలిపారు. ఇందులో వ్యాక్సిన్‌ మైత్రి, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  విజయాలను ప్రపంచంతో పంచుకోవడం, అలాగే పలు దేశాలకు విపత్తుల సహాయక చర్యలు, సామర్థ్య పెంపు రంగాల్లో సహాయం అందించడం వంటివి ఉన్నాయని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ దౌత్యం నేడు ప్రపంచ వేదికపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందని శ్రీ అమిత్‌ షా అన్నారు. ప్రపంచంలో ఎప్పుడు ఏ కీలక సమస్య తలెత్తినా, దానిపై భారత ప్రధానమంత్రి అభిప్రాయం, దృక్పథం కోసం ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్‌కు ఈ స్థాయిని, గుర్తింపును తిరిగి తీసుకువచ్చారని శ్రీ షా అన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ను సాధించాలనే సంకల్పాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ దేశం ముందుంచారని ఆయన పేర్కొన్నారు. తొలినాళ్లలో వికసిత్‌ భారత్‌ దార్శనికతకు అనేక సవాళ్లు, సందేహాలు ఎదురైనప్పటికీ తక్కువ కాలంలోనే అది 140 కోట్లమంది భారతీయుల సమష్టి సంకల్పంగా మారిందని అన్నారు. 2047 ఆగస్టు 15 నాటికి ప్రతి రంగంలోనూ భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అవతరిస్తుందనే నమ్మకం ఇప్పుడు ప్రతి భారతీయుడిలో ఏర్పడిందని శ్రీ అమిత్‌ షా అన్నారు. 

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ మోసాల ముప్పు పెరుగుతోందని, ఇందుకు భారత్‌ కూడా మినహాయింపు కాదని అన్నారు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా అన్ని రాష్ట్రాలతో ప్రత్యక్షంగా చర్చలు ప్రారంభించారని తెలిపారు. రానున్న రోజుల్లో 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌ అన్ని రకాల సైబర్‌ మోసాలకు వ్యతిరేకంగా బలమైన రక్షణ కవచంగా పనిచేస్తూ, వివిధ రంగాల్లో పటిష్ఠమైన భద్రతను అందిస్తుందని ఆయన అన్నారు. ఈ దిశగా గోవా పోలీసులు 1930 హెల్ప్‌లైన్‌ కోసం కృత్రిమ మేధ ఆధారిత కాల్‌ ఏజెంట్‌ను ప్రవేశపెట్టి మరో ముందడుగు వేశారని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే గోవా పోలీసులు ముందంజలో ఉన్నారని ఆయన అన్నారు. ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా కొంకణి, మరాఠీ, హిందీ భాషల్లో ఫిర్యాదులను నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అదే సమయంలో, ఇతర భారతీయ భాషల్లోనూ ఫిర్యాదులను నమోదు చేసుకుని, వాటిని సంబంధిత అధికారులకు పంపించేలా ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు గోవాను సందర్శిస్తారని శ్రీ అమిత్‌ షా అన్నారు. అందువల్ల ముఖ్యమంత్రి తన దూరదృష్టిని ప్రదర్శిస్తూ ఏఐ ఏజెంట్‌ను కేవలం కొంకణి, మరాఠీ భాషలకే పరిమితం చేయకుండా, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషలకు విస్తరించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. పర్యాటకుల ప్రయోజనం కోసం ఇది ముఖ్యమైన, దూరదృష్టితో కూడిన చర్య అని శ్రీ షా పేర్కొన్నారు.

గోవా పోలీసులు మొదటి నుంచి ప్రతి రంగంలోనూ ప్రశంసనీయమైన సేవలు అందిస్తున్నారని శ్రీ షా అన్నారు. క్రీడల్లో గోవా పోలీసులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం వారి ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు. 2029లో అంతర్జాతీయ పోలీస్‌ క్రీడల ఛాంపియన్‌షిప్‌ భారత్‌లో జరగనుందని, ఇందులో పోలీసు, అగ్నిమాపక సేవల సిబ్బందికి సంబంధించిన క్రీడా పోటీలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా ఈవెంట్‌లో పతకాల పట్టికలో భారత్‌ వెనుకబడకుండా చూడాలని గోవా పోలీసు సిబ్బందికి హోం మంత్రి పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించి పూర్తి ఉత్సాహంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనాలని గోవా పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. గోవా పోలీసులు కేవలం ఫుట్‌బాల్‌లోనే కాకుండా, ఇతర క్రీడా విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు సిద్ధం కావాలని అన్నారు. గోవాకు సుదీర్ఘ సముద్రతీరం, 15 లక్షలకు పైగా జనాభా ఉన్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది శారీరకంగా దృఢంగా, చురుగ్గా ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పోలీసు సిబ్బందిని శారీరకంగా దృఢంగా, సమర్థంగా, అప్రమత్తంగా ఉంచేందుకు క్రీడలు శక్తివంతమైన సాధనమని శ్రీ అమిత్‌ షా అన్నారు.

ఎనిమిది దశాబ్దాలుగా గోవా పోలీసుల నిబద్ధతతో పాటు ‘శాంతి, సేవ, న్యాయం’ అనే వారి మార్గదర్శక నినాదం గోవాను మరింత సురక్షితంగా మార్చడంలో నిరంతరం దోహదపడుతున్నాయని  శ్రీ అమిత్‌ షా అన్నారు. అందుకే గోవా ప్రజల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడా గోవా పోలీసులకు నిరంతరం ప్రశంసలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసర సేవ 112 కింద గోవా పోలీసుల స్పందన సమయం గతంలో 18 నిమిషాలు ఉండగా, ప్రస్తుతం కేవలం 8 నిమిషాలకు తగ్గిందని ఆయన తెలిపారు. ప్రజా సేవల రంగంలో ఇది గణనీయమైన మెరుగుదల అని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు. ప్రజా సేవల రంగంలో ఇది గణనీయమైన మెరుగుదల అని ఆయన పేర్కొన్నారు. దాదాపు 20,000 కాల్స్‌కు సత్వర సహాయం అందించినట్లు తెలిపారు. మరిన్ని వాహనాలు, ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పోలీసుల స్పందన సమయాన్ని ఆరు నిమిషాల కంటే తక్కువకు తగ్గించగలమనే విశ్వాసాన్ని శ్రీ షా వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే ఇతర రాష్ట్రాలకు గోవా పోలీసుల పర్యాటక పోలీస్‌ విభాగం ఆదర్శంగా నిలవగలదని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు.

మొత్తం నేర న్యాయ వ్యవస్థలో సమూల మార్పు తీసుకురావడానికి మూడు కొత్త న్యాయ సంహితలను అమలు చేసినట్లు శ్రీ అమిత్‌ షా తెలిపారు. ఈ సంహితల్లో సాంకేతికత, సున్నితత్వం, ప్రాధాన్యత క్రమం, సత్వర న్యాయం అందించే సామర్థ్యం వంటి అంశాలను పొందుపరిచినట్లు పేర్కొన్నారు. పోలీసింగ్‌ వ్యవస్థలో ఇది ఒక కీలకమైన ఆధునికీకరణ అని ఆయన అభివర్ణించారు. జైళ్లు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలు, న్యాయస్థానాలు, న్యాయవాదులు, పోలీస్‌ స్టేషన్లు, ఆసుపత్రులు తదితర మొత్తం వ్యవస్థను సాంకేతికత ద్వారా అనుసంధానించి దాని ఆధారంగా న్యాయం అందించడం ఒక కీలక ముందడుగు అని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు. కొత్త నేర న్యాయ సంహితల అమలులో గోవా పోలీసులు పలు నెలల పాటు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని ఆయన తెలిపారు. ప్రస్తుతం 93.38 శాతం పురోగతితో దేశంలో రెండో స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం తొమ్మిది ప్రమాణాల్లోనూ గోవా పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచారని శ్రీ అమిత్‌ షా అన్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే గోవా పోలీసులు నేర నిర్ధారణ రేటును 30 శాతం పాయింట్లు పెంచారని శ్రీ షా తెలిపారు. గతంలో నేర నిర్ధారణ రేటు 23 శాతం ఉండగా, ప్రస్తుతం 53 శాతం ఎఫ్ఐఆర్‌లలో నేర నిర్ధారణ సాధిస్తున్నారని, ఇది గణనీయమైన విజయమని ఆయన పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో మాదక ద్రవ్యాలపై మరింత బలోమైన పోరాటాన్ని ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్‌ షా  తెలిపారు. ఇందుకోసం 2026 నుంచి 2029 వరకు అమలు చేసే కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యాచరణ ప్రణాళిక కింద దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం, ప్రతి నగరాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం సంబంధిత అన్ని శాఖలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చర్యలు చేపట్టనున్నట్లు శ్రీ అమిత్‌ షా తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో గోవా పోలీసులు కూడా అగ్రగామి శక్తిగా ఎదుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2307706) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati