ఉప రాష్ట్రపతి సచివాలయం
గువాహటి విశ్వవిద్యాలయంలో రూ.110 కోట్ల విలువైన మౌలిక వసతులకు ఉపరాష్ట్రపతి శంకుస్థాపన
గువాహటి విశ్వవిద్యాలయంలో భూపేన్ హజారికాపై పుస్తకాన్ని, అస్సామీ నిఘంటువును విడుదల చేసిన ఉపరాష్ట్రపతి
అస్సామీ-తమిళ సాహిత్య అనువాదాలు భారతదేశ సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబిస్తాయి: ఉపరాష్ట్రపతి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి, సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి, క్రమశిక్షణతో ఉండండి: యువతతో ఉపరాష్ట్రపతి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత... భారత్ అంతటా ఉన్నత విద్యావకాశాలను విస్తరించింది: ఉపరాష్ట్రపతి
విద్య, మౌలిక వసతులు, ఉపాధి కల్పనలో అస్సాం సాధించిన పురోగతిని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2026 2:24PM by PIB Hyderabad
గువాహటి విశ్వవిద్యాలయంలో రూ.110 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. వీటిలో మల్టీడిసిప్లినరీ విద్యాభవనం, బాలురు, అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహం, ఆడిటోరియం, గ్రంథాలయానికి సంబంధించిన పనులు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగించారు. గువాహటి విశ్వవిద్యాలయానికున్న చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించారు. ‘భారతరత్న గోపీనాధ్ బోర్డోలోయ్ లాంటి ప్రముఖ నాయకుల నేతృత్వంలో జరిగిన ప్రజా ఉద్యమం ఫలితంగా ఈశాన్య భారతదేశంలో మొదటి విశ్వవిద్యాలయంగా 1948 జనవరి 26న గౌహతి విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. న్యాక్ ఏ ప్లస్ అక్రిడిటేషన్, ఎన్ఐఆర్ఆఫ్–2025లో రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తొమ్మిదో ర్యాంకుతో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థగా ఈ విశ్వవిద్యాలయం ఎదిగింది’ అని ఆయన తెలియజేశారు.
భారతీయ భాషా వారసత్వాన్ని పరిరక్షించేందుకు విశ్వవిద్యాలయం చేస్తున్న ప్రయత్నాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. నాగరికత జ్ఞాపకాలు, జ్ఞానం, గుర్తింపు భాషలో ఉంటాయన్నారు. అస్సామీ, తమిళ రచనల పరస్పర అనువాదాలను ఆయన స్వాగతించారు. అస్సాం, తమిళనాడు మధ్య విస్తృతమైన విద్య, సాహిత్య ఆదానప్రదానాలను ప్రోత్సహించారు. సాంస్కృతిక ఐక్యతతో భారతదేశ భాషా వైవిధ్యం సుసంపన్నమవుతుందన్నారు.
బ్రహ్మపుత్ర బేసిన్‌లో అంతరించిపోతున్న భాషలు, బహుభాషా విధానం, మహిళల అధ్యయనాలు, పర్యావరణ సుస్థిరత, భారతీయ జ్ఞాన వ్యవస్థలపై విశ్వవిద్యాలయం చేస్తున్న పరిశోధనను శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రశంసించారు. పర్యావరణ, ఆర్థిక, నాగరికత శక్తిగా బ్రహ్మపుత్రను వర్ణించారు. ప్రాంతీయంగా, జాతీయంగా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో పరిశోధనకున్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు.
2014 నుంచి భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థలో విస్తరణ గురించి శ్రీ సీపీ రాధాకృష్ణన్ వివరించారు. దేశవ్యాప్తంగా విద్యావకాశాలను విస్తరించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. దేశంలో నూతన ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, ఇతర సంస్థల ఏర్పాటు గురించి ప్రస్తావించారు. అలాగే ఉన్నత విద్యలో మహిళల నమోదు 2014-15లో 1.57 కోట్ల నుంచి 2023-24 నాటికి 2.24 కోట్లకు అంటే 42.2 శాతం పెరిగిందని ఆయన తెలియజేశారు. పెరుగుతున్న మహిళల భాగస్వామ్యాన్ని, విద్యారంగంలో వారు సాధిస్తున్న విజయాలను సాధికారతకు ఒక ముఖ్యమైన సూచికగా అభివర్ణించారు.
ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో అస్సాం సాధిస్తున్న పురోగతిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ముఖ్యంగా మౌలిక వసతులు, అనుసంధానం, విద్య, పెట్టుబడులు, ఉపాధి రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. రాష్ట్రంలో మెరుగుపడిన విద్యా రంగం, ఐఐఎం గువాహటిలో ఎంబీయే తొలి బ్యాచ్ ప్రారంభం, 2021 నుంచి ప్రతిభ ఆధారంగా చేపట్టిన 1.64 లక్షలకు పైగా ప్రభుత్వ నియామకాల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వికసిత్ భారత్ – 2047 లక్ష్యానికి తోడ్పాటును అందించాలని విద్యార్థులు, పరిశోధకులకు శ్రీ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ధైర్యంగా కలలు కనాలని, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా పరిశోధనలను చేపట్టాలని, సాంకేతిక పరిజ్ఞానం మానవాళికి సేవ చేసేలా చూడాలని, సమ్మిళితాభివృద్ధికి ఆవిష్కరణలను వాహకంగా మార్చాలని సూచించారు. స్వామి వివేకానందుని ఉటంకిస్తూ.. ‘‘మేల్కొనండి, లేవండి, మీ లక్ష్యం చేరే వరకు ఆగకండి’’ అని యువతను కోరారు.
ఈ సందర్భంగా అంకురన్ దత్త, నాని గోపాల్ మహంత సంపాదకత్వం వహించిన భూపేర్ హజారికా: హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఏ వాండరింగ్ సాంగ్స్ పుస్తకాన్ని, సవరించిన, మెరుగుపరిచిన చంద్రకాంత అభిధాన్ అయిదో సంచికను శ్రీ సీపీ రాధాకృష్ణన్ వివరించారు.
అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ.. గువాహటి విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి వీక్షించారు. విద్యార్థులతో, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారితో ఆయన ‘నో టు డ్రగ్స్’ ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, క్రమశిక్షణ పాటించాలని, సమయాన్ని తెలివిగా సద్వినియోగం చేసుకోవాలని, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి కోరారు.
అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ, విద్యా శాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కోట, గువాహటి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ శ్రీ నాని గోపాల్ మహంత, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉత్పల్ శర్మ, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, ఇతర విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2307614)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5