వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పెంచుతూ కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
2027 మార్చి నాటికి 300 కేవీకేల ఉన్నతీకరణ, 2028 డిసెంబరు నాటికి అన్ని కేవీకేల్లో ఇంక్యుబేషన్- నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2026 3:00PM by PIB Hyderabad
రాష్ట్రాల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడం ద్వారా కృషి విజ్ఞాన్ కేంద్రాలను (కేవీకే) బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025లో నిర్వహించిన అయిదో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సదస్సు వేదికగా.. కృషి విజ్ఞాన్ కేంద్రాలపై వచ్చిన కీలక సిఫార్సులపైనా, వాటి అమలును వేగవంతం చేసే చర్యలపైనా ప్రధానంగా చర్చించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌదరి, వ్యవసాయ పరిశోధన - విద్యా విభాగ (డీఏఆర్ఈ) కార్యదర్శి, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగీలాల్ జాట్, మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2027 మార్చి నాటికి ప్రాధాన్యతా ప్రాతిపదికన.. ఎంపిక చేసిన 300 కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ వసతులను ఆధునికీకరించే కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీల భాగస్వామ్యం వహించి, సకాలంలో సహకారాన్ని అందించి.. నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. ప్రాధాన్యత క్రమంలో కేవీకేలను ఆధునికీకరించేందుకు అవసరమైన ఆర్థిక, సంస్థాగత మద్దతును కూడగట్టేందుకు వ్యవసాయ పరిశోధన - విద్యా విభాగం (డీఏఆర్ఈ) కార్యదర్శి ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. పలు రాష్ట్రాలు తమ పరిధిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించాయి. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు.. విశ్వవిద్యాలయాలు/ కేవీకేల నుంచి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు అందాయి. కాగా, ఇతర రాష్ట్రాలు ఈ నివేదికల తయారీ, అమలు ప్రక్రియల్లో వివిధ దశల్లో ఉన్నాయి.
అలాగే 2028 డిసెంబరు నాటికి అన్ని కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో ఇంక్యుబేషన్ - నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే కార్యాచరణ అంశంపైనా సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమం కింద.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సాంకేతిక భాగస్వామ్య సంస్థలు, జిల్లాల వారీగా ఉన్న వ్యవసాయ అవకాశాలతో కృషి విజ్ఞాన కేంద్రాలను అనుసంధానిస్తున్నారు. నిధుల సమీకరణ, అమలులో భాగస్వామ్యం కోసం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమర్పించేందుకు వీలుగా కేవీకేల వారీగా ప్రాజెక్టు ఇంక్యుబేషన్ ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
కేవీకే సిబ్బందికి సంబంధించిన సంస్కరణలపై వివరంగా చర్చించారు. సిబ్బంది జీతభత్యాలు, పదోన్నతులకు సంబంధించి ప్రతిపాదించిన సంస్కరణలకు వ్యయ విభాగం (డీవోఈ) ఆమోదం తెలిపింది. నిబంధనల ప్రకారం కేవీకే సిబ్బందికి ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. కృషి విజ్ఞాన్ కేంద్రాలు సమర్థంగా పనిచేయడానికి, నిర్దేశిత కార్యకలాపాలను పూర్తిస్థాయిలో నిర్వహించడానికి వీలుగా.. ఖాళీగా ఉన్న పోస్టులను సకాలంలో భర్తీ చేయాలని కేంద్ర మంత్రి రాష్ట్రాలను కోరారు.
ముఖ్యంగా వ్యవసాయ కాలపరిమితి దాటకుండా ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలను అమలు చేయాలంటే.. కాలానుగుణ వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించి కృషి విజ్ఞాన్ కేంద్రాలకు సకాలంలో నిధులను విడుదల చేయడం ఎంత కీలకమైన అంశమో ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 2026–27 సంవత్సరానికి గాను పప్పుధాన్యాలు, నూనెగింజలపై చేపట్టిన సమూహ క్షేత్రస్థాయి ప్రదర్శనల్లో (సీఎఫ్ఎల్‌డీ) భాగంగా.. 24 రాష్ట్రాల్లోని 353 కేవీకేలు/జిల్లాల ద్వారా 12,349 హెక్టార్ల లక్ష్యంతో కార్యకలాపాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే 9,750 హెక్టార్ల పరిధిలో లక్ష్యాన్ని సాధించారు. కొన్ని రాష్ట్రాల్లో నిధుల మంజూరులో జాప్యం, నిధుల ప్రవాహ మ్యాపింగ్ సమస్యలపైనా వివరంగా చర్చించారు. అటారీ, కేవీకే స్థాయుల్లో నిధులకు ఆటంకం లేకుండా, సకాలంలో చేరేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. అలాగే సిఫార్సు చేసిన నాణ్యమైన విత్తనాలు, రకాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రదర్శనల రూపకల్పన, అమలులో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకానికి మద్దతుగా కృషి విజ్ఞాన్ కేంద్రాలు పోషించాల్సిన పాత్రను కూడా ఈ సమీక్ష సమావేశంలో ప్రముఖంగా చర్చించారు. నిర్దేశిత విధుల నిర్వహణతోపాటు, పీఎం ధనధాన్య కృషి యోజన కింద జిల్లా స్థాయి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికల అమలు కోసం.. కేవీకేలకు తగిన ఆర్థిక సహకారాన్ని అందించాలని రాష్ట్రాలను కోరారు. అలాగే సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలతోపాటు.. జిల్లా స్థాయిలో కేవీకేలు చేపట్టే కార్యకలాపాలను సేకరించి నిర్దేశిత పోర్టల్‌లో క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఫలితాల సమగ్ర పర్యవేక్షణ, నివేదికల రూపకల్పన, అంచనా ప్రక్రియలను ఇది సులభతరం చేస్తుంది.
కేంద్రం - రాష్ట్రాల మధ్య బలమైన సమన్వయం, సకాలంలో ఆర్థిక మద్దతు, ఆధునిక మౌలిక సదుపాయాలు, తగిన మానవ వనరులు, జిల్లాలవారీగా కార్యాచరణ ప్రణాళికల సమర్థమైన అమలుతోనే కేవీకేల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం సాధ్యమవుతుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రైతులకు సమర్థంగా సేవలందించేందుకు అత్యావశ్యకమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతుతోపాటు.. వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా అధిగమించేలా కృషి విజ్ఞాన్ కేంద్రాలు సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
శాస్త్రీయ విజ్ఞానాన్ని, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను, మెరుగైన ఉత్పాదక రకాలను, నైపుణ్యాలను, ఆవిష్కరణలను, వ్యవస్థాపక అవకాశాలను రైతులకూ గ్రామాలకూ చేరువ చేయడంలో శక్తిమంతమైన కృషి విజ్ఞాన్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. అంగీకారం కుదిరిన కార్యాచరణ అంశాల అమలును.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను ఈ చర్చలు స్పష్టం చేశాయి. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తికి కేవీకేలు సమర్థమైన వేదికలుగా రూపుదిద్దుకునేలా కేంద్రం - ఇతర భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థాపక ధోరణిని పెంపొందించడం, తద్వారా వికసిత, సమృద్ధ వ్యవసాయ రంగం ఆవిష్కృతమయ్యేలా భరోసానివ్వడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు.
***
(రిలీజ్ ఐడి: 2307613)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4