హోం మంత్రిత్వ శాఖ
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న 'వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్'ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
క్రీడాకారులతోపాటు అహ్మదాబాద్ నగరానికీ చిరస్మరణీయంగా సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు జరగనున్న పోటీలు
భారతదేశానికి చెందిన క్రీడాకారులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు కూడా ప్రధాన శిక్షణ కేంద్రంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా కేంద్రంలో కోచింగ్, శిక్షణ సదుపాయాల అభివృద్ధి
అన్ని రకాల క్రీడల శిక్షణకే కాకుండా క్రీడా ప్రాంగణాల నిర్మాణానికీ, క్రీడా పరికరాల తయారీకి కూడా ప్రధాన కేంద్రం కానున్న భారత్
రాబోయే రోజుల్లో క్రీడా ఇంజనీరింగ్, క్రీడా వైద్య విజ్ఞాన రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా భారతదేశం
క్రీడా గాయాల చికిత్స, పునరావాసం (రీహాబిలిటేషన్) విభాగాలలో ఒక ప్రధాన వైద్య కేంద్రం
రానున్న రోజుల్లో స్పోర్ట్స్ ఇంజినీరింగ్, స్పోర్ట్స్ మెడికల్ సైన్స్ రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా వేగంగా ఎదగడంతోపాటు, క్రీడా గాయాలకు చికిత్స, పునరావాస సేవలు అందించే ప్రముఖ వైద్య కేంద్రంగా కూడా అభివృద్ధి చెందనున్న భారత్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం - అమిత్ షా
కేవలం అత్యధిక పతకాలు సాధించడమే కాకుండా ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, పోలీస్ గేమ్స్ తదితర పోటీల్లోని అన్ని క్రీడా విభాగాలను బలోపేతం చేయడం కూడా భారత్ లక్ష్యం
వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో పాల్గొంటున్న 19 దేశాలకు చెందిన 108 మంది క్రీడాకారులు
నాగరికత మూలాల్లో వసుధైక కుటుంబ భావన అంతర్భాగంగా ఉన్న భారతదేశానికి వచ్చిన క్రీడాకారులకు స్వాగతం
2030 కామన్వెల్త్ క్రీడలు శతాబ్ది క్రీడోత్సవంగా జరగనుండటం, ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండటం ఎంతో సంతోషదాయకం - శ్రీ అమిత్ షా
ఒలింపిక్ క్రీడల నిర్వహణ కోసం అహ్మదాబాద్ నగరం ఇప్పటికే తన బిడ్‌ను సమర్పించింది. 2036 ఒలింపిక్ క్రీడలు అహ్మదాబాద్‌లోనే ఘనంగా జరుగుతాయని మేము పూర్తి విశ్వాసంతో 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి దరఖాస్తు సమర్పించిన అహ్మదాబాద్ - 2036 ఒలింపిక్ క్రీడలు అహ్మదాబాద్‌లోనే జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేసిన శ్రీ అమిత్ షా
విజేతలు కేవలం క్రీడలు, సాధన లేదా శిక్షణ ద్వారా మాత్రమే తయారుకారు - గెలవాలనే తపన, నిరంతర శ్రమ ద్వారానే రూపుదిద్దుకుంటారు - విజేతగా నిలవడానికి క్రీడాకారుడి ఆకాంక్ష, అంకితభావం గెలవాలనే దృఢ సంకల్పమే అసలైన పునా
నాడు పోస్టు చేయడమైనది:
04 SEP 2026 8:19PM by PIB Hyderabad
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న 'వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్' ను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2026 సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు జరగనున్న ఈ పోటీలు క్రీడాకారులకు అహ్మదాబాద్ నగరానికి అత్యంత చిరస్మరణీయమైన సందర్భం కానున్నాయని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో అహ్మదాబాద్, గుజరాత్... భారతదేశం క్రీడా ప్రపంచంలో ప్రధాన కేంద్రాలుగా ఆవిర్భవిస్తాయని శ్రీ అమిత్ షా అన్నారు. అన్ని రకాల క్రీడల శిక్షణకే కాకుండా, క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి, క్రీడా పరికరాల తయారీకి కూడా భారత్ ఒక ప్రధాన కేంద్రంగా ఎదుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమగ్ర దృక్పథంతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ను ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మనం ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.
మన లక్ష్యం కేవలం గరిష్ఠ సంఖ్యలో పతకాలు సాధించడమే కాదని, ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, పోలీస్ గేమ్స్, ఇతర పోటీలలోని అన్ని క్రీడలను బలోపేతం చేయడమేనని హోం మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ లభ్యమయ్యే అత్యాధునిక శిక్షణ, కోచింగ్ సదుపాయాలు కేవలం అహ్మదాబాద్, గుజరాత్ లేదా భారతదేశానికే పరిమితం కావని, అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని వీటిని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ క్రీడా కేంద్రం భారత్‌కు చెందిన క్రీడాకారులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు కూడా ప్రధాన శిక్షణ కేంద్రంగా మారనుందని, రానున్న రోజుల్లో క్రీడా గాయాలకు చికిత్స, సంరక్షణ అందించే రంగంలో భారత్‌తోపాటు గుజరాత్ కూడా ప్రపంచస్థాయి ప్రధాన కేంద్రాలుగా ఎదుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రీడలలో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా 19 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని శ్రీ అమిత్ షా తెలిపారు. "వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్"లో పాల్గొంటున్న 19 దేశాలకు చెందిన 108 మంది క్రీడాకారులకు కేంద్ర హోం మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. “ నాగరికతా మూలాల్లో వసుధైక కుటుంబం భావన కలిగిన భారతదేశానికి మీకు స్వాగతం" అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. హర్విందర్ సింగ్, శీతల్ దేవి, రాకేష్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి, పాయల్ నాగ్ వంటి క్రీడాకారులు ప్రపంచ వేదికపై భారతదేశానికి ఎనలేని ఖ్యాతిని తీసుకువచ్చారని ఆయన అన్నారు.
2030 కామన్వెల్త్ క్రీడలు శతాబ్ది క్రీడోత్సవంగా నిలుస్తాయని, వాటికి అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుండడం ఎంతో సంతోషకరమైన విషయమని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. 2036 ఒలింపిక్ క్రీడల నిర్వహణ కోసం కూడా అహ్మదాబాద్ ఇప్పటికే బిడ్‌ను సమర్పించిందని, ఆ పోటీలు కూడా అహ్మదాబాద్‌లోనే జరుగుతాయని తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని ఆయన అన్నారు. 2025 - 2026 మధ్య కాలంలో గుజరాత్ దాదాపు 10 అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యమిచ్చిందని శ్రీ షా గుర్తు చేశారు. ఈ పోటీలు పాల్గొనే క్రీడాకారులకు అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం గురించి తెలుసుకోవడానికి, ఇక్కడి అనుభవాలను పొందడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తాయని ఆయన అన్నారు. విజేతలు కేవలం క్రీడలు, సాధన లేదా శిక్షణ ద్వారా మాత్రమే తయారుకారని, గెలవాలనే తపన ద్వారానే రూపుదిద్దుకుంటారని ఆయన పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2307099)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7