భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
19వ భూ విజ్ఞానశాస్త్ర ఒలింపియాడ్ (ఐఈఎస్‌వో)- 2026లో 9 పతకాలతో చరిత్రాత్మక అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ‘భారతీయ పాఠశాల విద్యార్థుల బృందా’న్ని సత్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
న్యూఢిల్లీలోని పృథ్వీ భవన్‌లో విజేతలతో . కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి సంభాషణ... ప్రోత్సాహం
ఇటలీలోని తురిన్‌లో పోటీ
4 స్వర్ణ, 3 రజత, 2 కాంస్య పతకాలతో మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో పతకాలను సాధించిన భారత్
శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించడంలో, భూ విజ్ఞాన శాస్త్ర అభ్యసనాన్ని ముందుకు తీసుకెళ్లడంలో.. మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్న యువజన కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి: డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
04 SEP 2026 4:26PM by PIB Hyderabad
19వ అంతర్జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర ఒలింపియాడ్ (ఐఈఎస్‌వో)- 2026 విజేతలుగా నిలిచిన భారతీయ పాఠశాల విద్యార్థుల బృందాన్ని.. ఈ రోజు కేంద్ర భూ విజ్ఞాన శాఖ (స్వతంత్ర హోదా) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సత్కరించి వారితో ముచ్చటించారు. లోధి రోడ్డులోని పృథ్వి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ ప్రతిభావంతులైన యువ విద్యార్థులను ఆయన అభినందించారు.
ఈ అద్భుత విజయం గర్వకారణమంటూ విద్యార్థులను మంత్రి ప్రశంసించారు. దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిన విజేతలకు, వారి తల్లిదండ్రులకు, సంబంధిత పాఠశాలల యజమాన్యాలకు డాక్టర్ జితేంద్ర సింగ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మంత్రిత్వ శాఖ దార్శనికతను ఈ సందర్భంగా ఆయన వివరించారు. విద్యార్థి కేంద్రీకృత కార్యకలాపాలు, ప్రాథమిక స్థాయిలోనే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా యువతను సాధికారులను చేయడంతోపాటు.. భూ విజ్ఞాన వ్యవస్థల అధ్యయనం దిశగా యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
2026 ఆగస్టు 20 నుంచి 27 వరకు ఇటలీలోని తురిన్ నగరంలో అంతర్జాతీయ భూవిజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ ఐఈఎస్ఓ పోటీల్లో భారత విద్యార్థుల బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. మొత్తం 39 దేశాల ప్రతినిధులు పోటీపడగా.. తొమ్మిది పతకాలతో చరిత్రాత్మక విజయాన్ని టీమిండియా సొంతం చేసుకుంది. ఇందులో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. లిఖిత, ప్రాయోగిక పరీక్షలు, అంతర్జాతీయ బృంద క్షేత్రస్థాయి పరిశీలన (ఐటీఎఫ్ఐ), భూ విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టు (ఈఎస్పీ) విభాగాల్లో భారత్ ఈ విజయాలను సాధించింది.
అద్భుతంగా పతకాలను సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన విజేతలు వీరు:
సౌమిక్ మండల్ (డీఏవీ మోడల్ స్కూల్, దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్): 2 స్వర్ణ, 1 రజత పతకాలు (39 దేశాల విద్యార్థులతో పోటీపడి అంతర్జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచారు)
ఆరోన్ మైతీ (డీఏవీ మోడల్ స్కూల్, ఐఐటీ-కేజీపీ, పశ్చిమ బెంగాల్): 1 స్వర్ణం, 1 కాంస్యం
రిద్ధి రంజన్ (జ్ఞాన్ అస్తలి ఇంటర్నేషనల్ స్కూల్, పాట్నా, బీహార్): 1 స్వర్ణం, 1 రజతం
ఎండీ ఎహతేషామ్ రిజ్వీ బిహార్ (జేఎన్వీ, ఒక రజతం, ఒక కాంస్యం)
భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వశాఖ (ఎంవోఈఎస్) కార్యదర్శి డాక్టర్ టి. శ్రీనివాస కుమార్ కూడా విద్యార్థుల బృందాన్ని అభినందించారు. ఐఈఎస్‌వో చరిత్రలో భారత్ ఇంత పెద్ద సంఖ్యలో పతకాలను సాధించడం ఇదే మొదటి సారి అన్నారు. విద్యార్థులను, వారి మార్గనిర్దేశకులను ఆయన ప్రశంసించారు.
ఈ ప్రతిష్ఠాత్మక ఒలింపియాడ్‌లో పాల్గొనడానికి ముందు.. విద్యార్థులకు జాతీయ స్థాయిలో కఠినమైన ఎంపిక, శిక్షణ ప్రక్రియలను నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో సాధించిన ఈ విజయం వెనుక పక్కా ప్రణాళికతో కూడిన జాతీయ స్థాయి సహకారం ఉంది. భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వశాఖ.. తన అవగాహన కార్యక్రమంలో భాగంగా దీనికి పూర్తి చేయూతనిచ్చింది. జియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నిర్వహించే అఖిల భారత స్థాయి ప్రవేశ పరీక్షతో ఈ ఒలింపియాడ్ ప్రక్రియ మొదలవుతుంది. దేశవ్యాప్తంగా 500 కేంద్రాలలో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 17,800 మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలను నిర్వహించాలన్న కేంద్ర మంత్రి సూచనల మేరకు... అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది విద్యార్థులకు 2026 జూన్‌లో గుజరాత్‌లోని వడోదరలో ఉన్న ఎం.ఎస్. యూనివర్సిటీలో మూడు వారాల పాటు సమగ్ర శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు.
ఐఈఎస్‌వో వంటి ప్రతిష్ఠాత్మక కార్యకలాపాలు, డీప్ ఓషన్ మిషన్, మిషన్ మౌసమ్, పృథ్వి వంటి ముఖ్యమైన జాతీయ కార్యక్రమాల ద్వారా... ప్రజల్లో బలమైన శాస్త్రీయ అవగాహనను పెంపొందించడంలోనూ, తదుపరి తరం భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు, పరిశోధకుల్లో ప్రేరణ కలిగించడంలోనూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2307098)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14