మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రమ దోపిడి నుంచి 3,800 మందికి పైగా బాలలకు విముక్తిని కల్పించిన ఎన్‌సీపీసీఆర్ ప్రత్యేక ఉద్యమం

నాడు పోస్టు చేయడమైనది: 04 SEP 2026 11:04AM by PIB Hyderabad

‘‘అఖిల భారత స్థాయి రక్షణ, పునరావాస కల్పన’’ అనే ప్రత్యేక ఉద్యమాన్ని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) ఈ ఏడాది జూన్ 12న మొదలుపెట్టింది. ఈ ఉద్యమాన్ని కిందటి నెల 31 వరకు కొనసాగించారు. ఎన్‌సీపీసీఆర్ చట్టబద్ధ సంస్థ. ఇది కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఓ భాగం. చాకిరి చేయాలని ఒత్తిడి చేసే శక్తుల అధీనంలో ఉన్న పిల్లలను, బాలలను లైంగిక దోపిడికి, శ్రమ దోపిడికి గురి చేస్తూ డబ్బును సంపాదించడానికి చట్టం కళ్లుగప్పి మరీ వారిని దొంగచాటుగా తరలించే ముఠాల చేతజిక్కి విలవిల్లాడుతున్న పిల్లలను గుర్తించడం, అలాంటి బాధితులను కాపాడి వారికి పునరావాసాన్ని కల్పించే దిశగా ఈ సంస్థ కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన యంత్రాంగాలు, జిల్లా మేజిస్ట్రేట్లు, కార్మిక విభాగాలు, పోలీసు అధికారులు, తదితర ఆసక్తిదారు వర్గాలతో సమన్వయాన్ని ఏర్పరుచుకొంటోంది.
బాలల శ్రమ దోపిడిని నివారించాల్సిందిగాను, వారిని దొంగతనంగా పట్టుకుపోయే ముఠాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలల్లో నిర్దిష్ట రక్షణ కార్యకలాపాలను పెద్ద ఎత్తున చేపట్టాల్సిందిగాను సంబంధిత అధికారులకు ఎన్‌సీపీసీఆర్ ఆదేశాలను జారీ చేసింది. చేపట్టిన రక్షణ కార్యకలాపాలు, కాపాడిన బాలల వివరాలు, నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు, కల్పించిన పునరావాసం, బాధిత బాలలను మళ్లీ ప్రధాన స్రవంతిలోకి ప్రవేశపెట్టిన సందర్భాలు, వారిని బడిలో చేర్పించిన సమాచారం, అందించిన పరిహారం, తీసుకున్న తరువాయి చర్యలు వగైరా సమాచారాన్నంతా క్రమం తప్పక అందజేస్తూ ఉండాల్సిందిగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్‌సీపీసీఆర్ సూచనలను చేసింది.
అమలు తీరుతెన్నులను పర్యవేక్షించడానికి, క్షేత్ర స్థాయి సమస్యలను పరిష్కరించడానికి  జిల్లా పాలన యంత్రాంగాలతో ఎన్‌సీపీసీఆర్ సమావేశాలను నిర్వహించింది. రక్షణ కార్యకలాపాలను సమీక్షించడం, నిర్వహణపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడం, చేపట్టిన చర్యల నివేదికల (ఏటీఆర్‌స్)ను ఎప్పటికప్పుడు దాఖలు చేసేటట్లు చూడటంతో పాటు సంబంధిత విభాగాలు, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం.. ఇవి ఈ ఈ సమావేశాల నిర్వహణలోని ముఖ్యోద్దేశాలు.  
సామాజిక మాధ్యమాలు, ఇతర కమ్యూనికేషన్ వేదికల ద్వారా అవగాహన, ప్రజాసంబంధాల ఉద్యమాలను కూడా ఎన్‌సీపీసీఆర్ నిర్వహించింది. ఈ ఉద్యమాల్లో భాగంగా.. బాలల శ్రమ దోపిడిపై వివరాలను తెలియజేయడం, బాధిత బాలలను కాపాడిన తరువాత వారికి పునరావాసాన్ని కల్పించడంతో పాటు వారిని తిరిగి ప్రధాన స్రవంతిలో చేర్చి చదువు చెప్పించడానికి ప్రాధాన్యాన్ని ఇచ్చిన అంశాలను చాటిచెప్పారు.
పైన ప్రస్తావించిన ఉద్యమాన్ని నిరంతర ప్రాతిపదికన, క్రియాత్మకంగా పర్యవేక్షిస్తూ, రాష్ట్రాల అధికారుల సహకారంతో 3,800 కన్నా ఎక్కువ మంది బాలలను ఎన్‌సీపీసీఆర్ విజయవంతంగా కాపాడింది. దీనికి తోడు, ఉద్యమ కాలంలో 575కు పైగా ఎఫ్ఐఆర్‌లనూ నమోదు చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2306700) సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil , Kannada