సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఎమ్‌సీడీ నజఫ్‌గఢ్ జోన్లో చెత్త పోగుచేసే పనివారికి ‘నమస్తే’ కార్డుల పంపిణీని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ రాందాస్ అథావలె.. న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులు కూడా పంపిణీ
దేశంలో స్వచ్ఛత, పారిశుధ్య వాతావరణాన్ని నిర్ధారించడంలో
చెత్త పోగుచేసే పనివారందిస్తున్న అలుపెరగని సేవలకు కేంద్ర మంత్రి ప్రశంసలు..
వారి పని పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు సంక్షేమ పథకాల లభ్యతను మెరుగుపరచడంలో
ప్రభుత్వ పూర్తి సహకారం, నిరంతర మద్దతు ఉంటుందని హామీ
నాడు పోస్టు చేయడమైనది:
04 SEP 2026 9:02AM by PIB Hyderabad
ఎమ్‌సీడీ నజఫ్‌గఢ్ జోన్‌కు చెందిన చెత్త పోగుచేసే పనివారికి నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్‌డ్ శానిటేషన్ ఇకోసిస్టమ్ (ఎన్ఏఎమ్ఏఎస్‌టీఈ.. ‘నమస్తే’) కార్డుల జారీని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథావలె ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని దేశ రాజధాని లోని మటియాలాలో గల ఎమ్‌సీడీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించారు.
చెత్తను ఏరే పనివారిని ‘నమస్తే’ పథకంలో భాగంగా లాంఛనంగా గుర్తిస్తూ, వారికి సాధికారతను కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ కార్యక్రమం అద్దం పట్టింది. దేశం నలుమూలలా పారిశుధ్య కార్మికులకు భద్రతను, ఆత్మగౌరవాన్ని, సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే ఈ పథకం ముఖ్యోద్దేశం.
కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులకు ‘నమస్తే’ కార్డులతో పాటే, ఆయుష్మాన్ కార్డులను కూడా మంత్రి అందజేశారు. వీటితో కార్మికులు ఆరోగ్యసంరక్షణ సేవల ప్రయోజనాలను పొందగలుగుతారు.
శ్రీ అథవాలె ప్రసంగిస్తూ, నగరాలను పరిశుభ్రంగా ఉంచడంలో చెత్త ఏరే పనివారు అవిశ్రాంతంగా తోడ్పాటును అందిస్తున్నారంటూ ప్రశంసించారు. వారు చేస్తున్న పని.. దేశంలో స్వచ్ఛత, ప్రజారోగ్య పరిరక్షణ సంబంధిత ప్రయత్నాలకు ఎంతో అవసరమని ఆయన అన్నారు. కార్మికులకు పని పరిస్థితులను మెరుగుపరిచి, సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చడంలో ప్రభుత్వం పూర్తి సహకారాన్ని, నిరంతర మద్దతును ఇస్తుందని ఆయన హామీనిచ్చారు.

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న శ్రీ రాందాస్ అథవాలె
నజఫ్‌గఢ్ జోన్‌కు చెందిన చెత్తను పోగుచేసే పనివారు 300 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత శాఖ అమలుచేస్తున్న పథకాల్లో ‘నమస్తే’ పథకం ఒకటి. చెత్త ఏరే పనివారు, మురికి నీటి కాలువల, మురికి నీటి గొట్టాల, సెప్టిక్ ట్యాంకుల పనులను చక్కబెట్టే పనివారితో పాటు పారిశుధ్య కార్మికులకు కూడా వారి భద్రతకు, ఆత్మగౌరవానికి, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి పూచీ పడాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. వృత్తిపరమైన భద్రతను కల్పించడం, పనివారికి లాంఛనప్రాయ గుర్తింపునివ్వడం, ఆరోగ్యసంరక్షణ, సామాజిక భద్రత సంబంధిత ప్రయోజనాలను అందించడం, నైపుణ్యాలను నేర్పించడం, అపాయకరమైన పారిశుధ్య పరిరక్షణ పనులను పూర్తి చేయడంలో యంత్రాల సాయాన్ని తీసుకోవడంపై దృష్టిని కేంద్రీకరించడం.. ఇవి ఈ పథకం ధ్యేయాలు. దేశమంతటా వ్యర్థాలను కాయకష్టంతో శుభ్ర పరిచే పద్ధతులకు స్వస్తి పలకడం ఈ పథకానికి నిర్దేశించిన లక్ష్యం.
***
(రిలీజ్ ఐడి: 2306698)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19