వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
త్రిపుర నుంచి ఎన్‌పీఓపీ ధ్రువీకరించిన 18 మెట్రిక్ టన్నుల బియ్యం ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌కు ఎగుమతి.. సాయపడిన అపెడా
ఐరోపా మార్కెట్లకు ఎగుమతి చేయడానికి
సుగంధ భరిత కాలీ ఖాసా, సుగంధ భరిత హరినారాయణ్, బిరోన్, మైమీ హంగా రకాల బియ్యం సేకరణ
త్రిపుర ఆర్గానిక్ రైస్ ఎగుమతులతో
రైతులకు, ఎఫ్‌పీసీలకు ఇక కొత్త మార్కెట్లలో మరిన్ని అవకాశాలు
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2026 11:45AM by PIB Hyderabad
నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్‌పీఓపీ) ధ్రువీకరించిన నాలుగు రకాలకు చెందిన 18 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని త్రిపుర నుంచి ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌కు నిన్న, అంటే 2026 సెప్టెంబరు 2న ఎగుమతి కోసం రవాణా చేశారు. ఈ పనిలో అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్‌డ్ ఫూడ్ ప్రోడక్ట్‌స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ.. ‘అపెడా’) సాయపడింది. స్థానిక రైతులకు కొత్త మార్కెట్ల అవకాశాన్ని అందించడంతో పాటు వ్యవస్థీకృత, ఎగుమతి ప్రధాన ఉత్పాదన మాధ్యమం ద్వారా త్రిపురకు అంతర్జాతీయ మార్కెట్లతో జతపడే దిశలో ఈ ఎగుమతి సంబంధిత కార్యక్రమం ఓ ముఖ్య ఘట్టాన్ని ఆవిష్కరించింది.
ఎన్‌పీఓపీ ధ్రువీకరించిన సంప్రదాయ జాతికి చెందిన బియ్యం (కన్‌సైన్‌మెంట్)లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి సుగంధ భరిత కాలీ ఖాసా బియ్యం, సుగంధ భరిత హరినారాయణ్ బియ్యం, బిరోన్ బియ్యం (తెల్లని అంటుకునే రకం బియ్యం), మైమీ హాంగా బియ్యం (నల్ల బియ్యం). ఈ బియ్యాన్ని త్రిపుర స్టేట్ ఆర్గానిక్ ఫార్మింగ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (టీఎస్ఓఎఫ్‌డీఏ) సాయం అందిస్తున్న త్రిపురకు చెందిన ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీల (ఎఫ్‌పీసీస్) నుంచి సేకరించారు. సోనేపట్‌లోని ప్రథితి ఆర్గానిక్ ఫూడ్స్ ద్వారా ఈ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. భారతీయ ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పాదనలను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేసే సంస్థల్లో ఓ అగ్రగామి సంస్థయే ఈ ప్రథితి ఆర్గానిక్ ఫూడ్స్.
ఈ కార్యక్రమం స్థానిక రైతులకు, ఎఫ్‌పీసీలకు అంతర్జాతీయ మార్కెట్లతో ముడిపడేందుకు ఒక అవకాశాన్ని ఇస్తోంది. అంతేకాదు, ధ్రువీకరించిన ఆర్గానిక్ ఉత్పాదనలకు ప్రపంచం అంతటా గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం రాష్ట్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది. ఈ ఎగుమతి అవకాశం దక్కడంతో, భాగస్తులైన రైతులకు దేశీయ మార్కెట్‌తో పోలిస్తే 40 శాతం ఎక్కువ ధర లభించగలదని భావిస్తున్నారు. ఫలితంగా రైతులకు సంఘటిత, ఎగుమతికి ఉద్దేశించిన ఉత్పాదన ప్రక్రియలో పాలుపంచుకోవడానికి ఆర్థికపరంగా గొప్ప ప్రోత్సాహం కూడా అందనుంది.
గత నెలలో త్రిపురలో అపెడా నిర్వహించిన కొనుగోలుదారులు, అమ్మకందారుల సమావేశాన్ని (ఆర్‌బీఎస్ఎమ్) ముందుకు తీసుకుపోవడం ఈ ఎగుమతి కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఆసక్తి ఉన్న అంతర్జాతీయ కొనుగోలుదారులను, స్థానిక రైతులను ఒక చోటుకు చేర్చడంతో పాటు, మార్కెట్టు లభ్యతకు కావలసిన సంబంధాలను నెలకొల్పడంలో ఆర్‌బీఎస్ఎమ్ తోడ్పడింది.
కొనుగోలుదారు, అమ్మకందారుల ముఖాముఖి చివరకు రైతులు, ఎఫ్‌పీసీలకు బలమైన అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలను అందించేదిగా మారగలదని ప్రస్తుత ఎగుమతి కన్‌సైన్‌మెంటు నిరూపించింది.
అంతర్జాతీయ మార్కెట్లలో నాణ్యతకు, ఆహార భద్రతకు, ధ్రువీకరణకు, సమాచారాన్ని సేకరించే సామర్థ్యానికి విలువను ఇస్తుంటారు. ఈ కోణంలో నుంచి చూసినప్పుడు, త్రిపురకు చెందిన ఎన్‌పీఓపీ ధ్రువీకరించిన బియ్యాన్ని ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌కు ఎగుమతి చేయడం ముఖ్య ఘట్టం.
కన్‌సైన్‌మెంట్ రవాణాను త్రిపుర వ్యవసాయ మంత్రి శ్రీ రతన్ లాల్ నాథ్ ప్రారంభించారు. అపెడా అధ్యక్షుడు శ్రీ అభిషేక్ దేవ్, త్రిపుర వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగ కార్యదర్శి శ్రీ అపూర్బ రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో అపెడా కార్యదర్శి డాక్టర్ శాశ్వతి బోస్, నాబార్డ్ జనరల్ మేనేజర్ శ్రీమతి తనుశ్రీ భట్టాచార్య, వ్యవసాయ డైరెక్టరు శ్రీ ఫణిభూఫణ్ జమాతియా, టీఎస్ఓఎఫ్‌డీఏ మిషన్ డైరెక్టరు శ్రీ రాజీబ్ దేబ్‌బర్మ, అపెడా అధికారులు, ఎగుమతి, లాజిస్టిక్స్ భాగస్వాముల ప్రతినిధులు, ఆ ప్రాంతానికి చెందిన వరి పండించే అభ్యుదయ రైతులు తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా త్రిపుర వ్యవసాయ మంత్రి శ్రీ రతన్ లాల్ నాథ్ మాట్లాడుతూ, ఎన్‌పీఓపీ ధ్రువీకరించిన సాంప్రదాయిక బియ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం రాష్ట్రానికి సంతోషదాయక క్షణమన్నారు. ఇది రైతులు, ఎఫ్‌పీసీలు, ఇతర ఆసక్తిదారు వర్గాలు పడిన కష్టాన్ని సూచిస్తోందని చెప్పారు. ఆర్గానిక్ ఉత్పాదనలతో పాటు సాంప్రదాయిక వ్యావసాయిక ఉత్పాదనల్లో త్రిపురకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇలాంటి కార్యక్రమంతో రైతులకు కొత్త మార్కెట్ల వరకు చేరుకోవడం, మెరుగైన ధరను అందుకోవడంతో పాటు స్థిరత్వం కలిగిన జీవనోపాధిని సంపాదించుకోవడంలోనూ తోడ్పాటు లభిస్తుందన్నారు. ఆర్గానిక్ సాగు విస్తారిత అనుబంధ వ్యవస్థను పటిష్టపరచడానికి, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడంలో రైతులకు సాయపడటానికి త్రిపుర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ధ్రువీకృత సాంప్రదాయిక బియ్యాన్ని త్రిపుర నుంచి ఎగుమతి చేసే ఘటన.. భారత్‌లో నానాటికీ విస్తరిస్తున్న ఆర్గానిక్, వ్యావసాయిక ఎగుమతులలో గొప్ప తోడ్పాటును అందించే స్తోమత ఈశాన్య ప్రాంతానికి ఉందని ఎన్‌పీఓపీ నిరూపిస్తోందని అపెడా అధ్యక్షుడు శ్రీ అభిషేక్ దేవ్ అన్నారు. రైతులను ఎఫ్‌పీసీలతో జోడించడం, ధ్రువీకరణ, సమాచారాన్ని తెలుసుకునే సౌలభ్యం, నాణ్యత వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా సుస్థిర, వ్యవస్థీకృత ఎగుమతి అవకాశాలను కల్పించడానికి అపెడా దోహదం చేస్తోందని ఆయన తెలిపారు. త్రిపుర విశిష్ట వ్యవసాయ ఉత్పాదనలకు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రోత్సాహం అందేటట్లు చూడడంలో రాష్ట్ర ప్రభుత్వంతో, ఇతర ఆసక్తిదారు వర్గాలతో కలిసి పనిచేయడాన్ని అపెడా ఇక ముందూ కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
అపెడా, త్రిపుర ప్రభుత్వం, ఆర్గానిక్ వేల్యూ చైన్‌లోని అందరు ఆసక్తిదారులు చక్కని సమన్వయంతో చేసిన ప్రయత్నాలకు ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. త్రిపుర నుంచి ధ్రువీకరించిన ఆర్గానిక్ ఉత్పాదనల ఎగుమతులను విస్తరించడం, రైతులకు అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధాలను బలపరచడం, నిలకడతనం కలిగిన ఎగుమతి అవకాశాలను రైతులకు కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశాలు.
***
(రిలీజ్ ఐడి: 2306581)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21