శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారి 716 పై అత్యంత కీలకమైన 60% ఆర్ఏపీ సాంకేతికతను విజయవంతంగా ప్రదర్శించిన

సీఎస్ఐఆర్‌ - సీఆర్ఆర్ఐ (న్యూఢిల్లీ), ఓఎస్ఈపీఎల్‌, ఓమ్స్‌ ఇండియా సంస్థలు

భారతదేశంలో సుస్థిర, పునర్వినియోగ ఆధారిత, వనరుల సమర్థ వినియోగంతో కూడిన జాతీయ రహదారుల నిర్మాణం దిశగా కీలకంగా నిలచిన ఆర్ఏపీ సాంకేతికత క్షేత్రస్థాయి ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 02 SEP 2026 8:21PM by PIB Hyderabad

భారతదేశంలో సుస్థిర, పునర్వినియోగ ఆధారిత రహదారి నిర్మాణాన్ని ప్రోత్సహించడంలో భాగంగా సీఎస్ఐఆర్‌ - కేంద్ర రహదారి పరిశోధనా సంస్థ, ఓరియంటల్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓమ్స్‌ పాలిమర్‌ మోడిఫైడ్‌ బిటుమెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు చెన్నై - తిరుపతి ప్యాకేజీ - 1లోని జాతీయ రహదారి 716పై మందపాటి తారు మిశ్రమ పొరలో 60 శాతం పునర్వినియోగిత తారు కంకర మిశ్రమం (రీక్లెయిమ్‌డ్ ఆస్ఫాల్ట్ పేవ్‌మెంట్- ఆర్ఏపీ) ఉపయోగించే సాంకేతికతను విజయవంతంగా ప్రదర్శించాయి.

 

రహదారి నిర్మాణ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అధిక ఆర్ఏపీ పునర్వినియోగ సాంకేతికతను ముందుకు తీసుకెళ్లడంలో ఈ క్షేత్రస్థాయి ప్రదర్శన ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు రహదారి మౌలిక సదుపాయాల కంపెనీల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక భాగస్వాములు పాల్గొన్నారు.

 

ఈ ప్రదర్శనలో అధిక శాతం పునర్వినియోగిత తారు రహదారి పదార్థాన్ని ఉపయోగించే పూర్తి ప్రక్రియను వివరించారు. ఇందులో పునర్వినియోగిత తారు రహదారి పదార్థాన్ని సేకరించడం, శుద్ధి చేయడం, పదార్థ లక్షణాలను నిర్ధారించడం, పునరుజ్జీవనం చేయడం, మిశ్రమ రూపకల్పన, వేడి తారు మిశ్రమాన్ని తయారు చేయడం, రహదారిపై పరచడం, క్షేత్రస్థాయిలో సాంద్రీకరణ వంటి దశలు ఉన్నాయి. ప్రతినిధులు వేడి తారు మిశ్రమ తయారీ కేంద్రాన్ని సందర్శించి మిశ్రమం తయారీ ప్రక్రియను తెలుసుకున్నారు. పునర్వినియోగిత తారు రహదారి పదార్థాన్ని సేకరించడం, శుద్ధి చేయడం నుంచి కొత్త రహదారి నిర్మాణంలో తిరిగి వినియోగించే వరకు సాగిన ప్రక్రియను వివరించే ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని కూడా సందర్శించారు.

60% ఆర్ఏపీ: పాత రహదారులే వనరుల నిధి

 

ఆర్ఏపీలో విలువైన కంకర, పాత తారు బంధక పదార్థం ఉంటాయి. వీటిని శాస్త్రీయ పద్ధతిలో తిరిగి సేకరించి, వాటి లక్షణాలను నిర్ధారించి, పునరుజ్జీవింపజేసి, మళ్లీ వినియోగించవచ్చు. ఆర్ఏపీని అధికంగా వినియోగించడం వల్ల కొత్తగా సేకరించాల్సిన కంకర, తారు బంధక పదార్థం అవసరం తగ్గడమే కాకుండా, ఇప్పటికే ఉన్న రహదారి వ్యవస్థలో అందుబాటులో ఉన్న పదార్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.

 

60 శాతం ఆర్ఏపీని వినియోగించడం ద్వారా, కొత్త తారు మిశ్రమానికి అవసరమైన పదార్థాల్లో గణనీయమైన భాగం ఇప్పటికే ఉన్న రహదారి పొర నుంచే లభిస్తుంది. ఈ విధానం సహజ వనరులను పరిరక్షించడంతో పాటు, కొత్తగా సేకరించాల్సిన, దిగుమతి చేసుకోవాల్సిన ముడి పదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అలాగే, నిర్మాణ వ్యర్థాలను తగ్గించి, జాతీయ రహదారుల నిర్మాణం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది.

 

ఫలితంగా భవిష్యత్‌ రహదారి నిర్మాణానికి ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులను “వనరుల భాండాగారం”గా పరిగణించే దిశగానూ, మరింత పునర్వినియోగ ఆధారిత, వనరుల సమర్థ వినియోగంతో కూడిన మౌలిక వసతుల అభివృద్ధి విధానాన్ని ప్రోత్సహించే దిశగానూ ఈ ప్రదర్శన ఒక ముఖ్యమైన మార్గాన్ని చూపించింది.

 

రిజుబిట్: స్వదేశీ ఆర్ఏపీ పునరుజ్జీవన సాంకేతికత

ఈ ప్రదర్శనలో అత్యంత కీలకమైన భాగం రిజుబిట్. ఇది సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ, ఓమ్స్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ ఆర్ఏపీ పునరుజ్జీవన సాంకేతికత. సేకరించిన పాత ఆస్ఫాల్ట్‌లో ఉన్న తారు మూల గుణాలను పునరుద్ధరించడానికి ఈ సాంకేతికతను రూపొందించారు. దీనివల్ల ఇప్పటికే ఉన్న రహదారి పొర నుంచి లభించే అధిక పరిమాణంలో పదార్థాన్ని కొత్త తారు మిశ్రమాల్లో తిరిగి వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది.

 

ఎన్హెచ్ - 716 లో నిర్వహించిన ప్రదర్శనలో రిజుబిట్ సాంకేతికతను విజయవంతంగా వినియోగించడం స్వదేశీ సాంకేతికత భారతదేశంలో పరిశోధన స్థాయికే పరిమితం కాకుండా ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయి ఆచరణ దిశగా సాధించిన పురోగతికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది.

 

సుస్థిర రహదారి నిర్మాణ పురోగతిలో సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ పాత్ర 

 

ఈ సందర్భంగా సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ చలుమూరి రవి శేఖర్ మాట్లాడుతూ, "భారతదేశంలో సుస్థిర, పునర్వినియోగ రహదారి నిర్మాణ పురోగతికి ఈ క్షేత్రస్థాయి ప్రదర్శన ఒక ముఖ్యమైన అడుగు. ఆర్ఏపీని కేవలం వ్యర్థ పదార్థంగా చూడకూడదు. శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, పునరుజ్జీవింపజేసి, తిరిగి ఉపయోగించగల విలువైన రాతి పదార్థాలు, తారు కలిగిన ఒక ఇంజనీరింగ్ వనరుగా దీనిని గుర్తించాలి" అని తెలిపారు.

 

ఈ ప్రదర్శనలో పునర్వినియోగిత తారు రహదారి పదార్థాన్ని సేకరించడం, దాని లక్షణాలను నిర్ధారించడం నుంచి శాస్త్రీయ పద్ధతిలో మిశ్రమ రూపకల్పన, పునరుజ్జీవనం, వేడి తారు మిశ్రమం తయారీ, రహదారిపై పరచడం, వాస్తవ క్షేత్ర పరిస్థితుల్లో సాంద్రీకరణ వరకు పూర్తి పునర్వినియోగ ప్రక్రియను సమగ్రంగా ప్రదర్శించారని ఆయన తెలిపారు. భారతదేశంలో రహదారి నిర్మాణంలో పునర్వినియోగిత పదార్థాల వినియోగాన్ని మరింత పెంచేందుకు అవసరమైన క్షేత్రస్థాయి పరిజ్ఞానాన్ని పెంపొందించడం, ఈ విధానంపై నమ్మకాన్ని కల్పించడం, శాస్త్రీయ మార్గాన్ని ఏర్పరచడం వంటి అంశాల్లో ఇటువంటి ప్రదర్శనలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

 

సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, 60% ఆర్ఏపీ ఫీల్డ్ డెమోన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ లీడర్ డాక్టర్ అంబికా బెహల్ (ఎఫ్ఎల్ఈ) మాట్లాడుతూ, రీక్లెయిమ్‌డ్ ఆస్ఫాల్ట్ పేవ్‌మెంట్ ను రహదారి రంగానికి లభించిన నల్ల బంగారంగా అభివర్ణించారు. ప్రస్తుత రహదారి నెట్‌వర్క్‌లోనే పునరుద్ధరించలేని రెండు అమూల్య వనరులైన రాతి మెటీరియల్, తారు నిక్షిప్తమై ఉన్నాయని పేర్కొన్నారు.

పునర్వినియోగిత తారు రహదారి పదార్థం లక్షణాలను నిర్ధారించడం, పాత తారు బంధక పదార్థాన్ని అంచనా వేయడం, శాస్త్రీయ పద్ధతిలో మిశ్రమ రూపకల్పన చేయడం, తగిన విధంగా పునరుజ్జీవింపజేయడం, కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేయడం ద్వారా అధిక స్థాయిలో పునర్వినియోగాన్ని ఎలా సాధించవచ్చో ఈ ప్రదర్శన చూపించిందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న రహదారి పదార్థాలను మరింతగా పునర్వినియోగించుకోవడంతో పాటు, కొత్తగా సేకరించాల్సిన వనరుల వినియోగాన్ని తగ్గించేందుకు రెజుబిట్‌ వినియోగం ఒక ఆచరణాత్మక మార్గాన్ని చూపుతుందని ఆమె స్పష్టం చేశారు.

 

విస్తృత స్వీకరణ దిశగా ఉమ్మడి ప్రయత్నాలు

 

ఈ క్షేత్రస్థాయి ప్రయోగాన్ని ఓఎస్ఈపీఎల్‌, సీఎస్ఐఆర్‌ - కేంద్ర రహదారి పరిశోధనా సంస్థ, ఓమ్స్‌ ఇండియా సంస్థలు సంయుక్త సాంకేతిక సహకారంతో నిర్వహించాయి. ఇందులో జాతీయ రహదారుల నిర్మాణ నైపుణ్యం, శాస్త్రీయ పరిశోధన, ప్రత్యేక పునరుజ్జీవన సాంకేతికతలను సమన్వయం చేశారు.

 

ఓఎస్ఈపీఎల్‌ సీనియర్‌ సీపీఎం (ప్రాజెక్టు అధిపతి) శ్రీ నాగరాజ్‌ మాట్లాడుతూ, వినూత్న రహదారి నిర్మాణ సాంకేతికతకు నిజమైన పరీక్ష ప్రయోగశాలలో రూపొందించిన విధానం నుంచి మిశ్రమ తయారీ కేంద్రంలో ఉత్పత్తి దశకు, అక్కడి నుంచి వాస్తవ జాతీయ రహదారి పరిస్థితుల్లో అమలు దశకు విజయవంతంగా చేరగలగడమేనని పేర్కొన్నారు. అవసరమైన నాణ్యత నియంత్రణ వ్యవస్థను కొనసాగిస్తూ, అధిక శాతం ఆర్ఏపీతో రహదారి నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు ఈ ప్రయోగం ఒక అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన తెలిపారు.

 

ఓమ్స్‌ ఇండియా డైరెక్టర్‌ పలాష్‌ కథాల్‌ మాట్లాడుతూ, ఇప్పటికే ఉన్న రహదారి పొరల్లోని కంకర, తారు బంధక పదార్థాల నుంచి మరింత విలువను పొందేందుకు అధిక శాతం ఆర్ఏపీని వినియోగించడం దోహదపడుతుందని, అదే సమయంలో కొత్తగా సేకరించే ముడి పదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ప్రయోగశాల స్థాయి పరిశీలన నుంచి మిశ్రమ తయారీ కేంద్రంలో ఉత్పత్తి, అక్కడి నుంచి వాస్తవంగా వినియోగంలో ఉన్న జాతీయ రహదారిపై పరచే దశ వరకు 60 శాతం ఆర్ఏపీతో కూడిన మిశ్రమాన్ని తీసుకెళ్లడం సాంకేతికంగా ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన తెలిపారు.

తమిళనాడు హైవే రీసెర్చ్ స్టేషన్ నుంచి గుర్తింపు

 

ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నై రహదారి పరిశోధనా కేంద్రం ఇంజినీర్‌, డైరెక్టర్‌ శ్రీ ఎ. వెంకటాచలం మాట్లాడుతూ, 60 శాతం ఆర్ఏపీ క్షేత్రస్థాయి ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించిన భాగస్వామ్య సంస్థలను అభినందించారు. మరింత సుస్థిరమైన, వనరులను సమర్థంగా వినియోగించే రహదారి నిర్మాణం దిశగా తమిళనాడుకు ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన అభివర్ణించారు.

 

తమిళనాడులో విస్తృతంగా ఉన్న రహదారి నెట్‌వర్క్‌ ద్వారా ఇప్పటికే ఉన్న రహదారి పొరల నుంచి లభించే పదార్థాలను మళ్లీ వాడుకునేందుకు గణనీయమైన అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల కొత్తగా సేకరించాల్సిన కంకర, తారు బంధక పదార్థాల అవసరంతో పాటు నిర్మాణ వ్యర్థాలు కూడా తగ్గుతాయని తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా విలువైన క్షేత్రస్థాయి అనుభవం లభించడంతో పాటు, తమిళనాడులో అనుకూలమైన రహదారి ప్రాజెక్టుల్లో అధిక శాతం ఆర్ఏపీతో కూడిన పునర్వినియోగ విధానాన్ని విస్తృతంగా అమలు చేసేందుకు దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

ప్రయోగం గురించి

ఎన్‌హెచ్‌–716పై 60 శాతం ఆర్ఏపీ తో కూడిన ప్రయోగాత్మక రహదారి విభాగాన్ని సీఎస్ఐఆర్‌ - కేంద్ర రహదారి పరిశోధనా సంస్థ సాంకేతిక మార్గదర్శకత్వంలో నిర్మించారు. సీఎస్ఐఆర్‌ - కేంద్ర రహదారి పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్త ఎఫ్‌ డాక్టర్‌ అంబికా బెహల్‌ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించారు. ప్రయోగాత్మక రహదారి విభాగం రూపకల్పన, నిర్మాణంలో అదే సంస్థకు చెందిన శాస్త్రవేత్త (ఈ1) డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌తో పాటు ఓమ్స్‌ ఇండియా, ఓఎస్ఈపీఎల్‌ సంస్థల బృందాలు చురుకుగా పాల్గొన్నాయి.

 

ఈ కార్యక్రమం అధిక శాతం ఆర్ఏపీ వినియోగంపై సాంకేతిక, క్షేత్రస్థాయి అనుభవాన్ని పొందడంతో పాటు, భారతదేశంలో జాతీయ రహదారుల నిర్మాణంలో దీనిని బాధ్యతాయుతంగా, విస్తృతంగా అమలు చేయడానికి అవసరమైన ఆధారాలను సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

పర్యావరణహిత, పునర్వినియోగ ఆధారిత జాతీయ రహదారుల దిశగా

ఎన్‌హెచ్‌–716పై 60 శాతం ఆర్ఏపీతో చేపట్టిన క్షేత్రస్థాయి ప్రదర్శన విజయవంతం కావడం శాస్త్రీయ ఆధారిత పునర్వినియోగ సాంకేతికతలకు ఉన్న సామర్థ్యాన్ని మరింత స్పష్టం చేసింది. రహదారి నిర్మాణంలో ఉపయోగించే పదార్థాలను వ్యర్థాలుగా పరిగణించకుండా, విలువైన ఇంజినీరింగ్‌ వనరులుగా మలచడంలో ఈ సాంకేతికతలు కీలక పాత్ర పోషించగలవని ఇది రుజువు చేసింది. పరిశోధనా సంస్థలు, జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్టర్లు, సాంకేతికత అందించే సంస్థల మధ్య సహకారం భారతదేశంలో మరింత పర్యావరణహితమైన, వనరులను సమర్థంగా వినియోగించే, పునర్వినియోగ ఆధారిత జాతీయ రహదారుల నిర్మాణం వైపు మార్పును వేగవంతం చేయగలదని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

***


(రిలీజ్ ఐడి: 2306215) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil