వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ అధ్యక్షతన

భారత డేటా సెంటర్‌ వ్యవస్థ విస్తరణకు వ్యాపార సౌలభ్యంపై సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశం

భారత డేటా సెంటర్‌ పరిశ్రమలో 200 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు అవకాశాలు: పీయూష్‌ గోయల్‌

డేటా సెంటర్‌ రంగం వేగవంతమైన విస్తరణకు సులభతర వ్యాపార విధానాలపై కేంద్రం దృష్టి

విశ్వసనీయ విద్యుత్‌, వినియోగానికి సిద్ధంగా ఉన్న భూమి, సరళీకృత అనుమతులపై సమావేశంలో చర్చ

నాడు పోస్టు చేయడమైనది: 02 SEP 2026 4:07PM by PIB Hyderabad

డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచంలోనే భారత్ అత్యుత్తమ ప్రదేశమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో నేడు ‘‘భారత డేటా సెంటర్ వ్యవస్థ విస్తరణకు వ్యాపార సౌలభ్యం’’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో డేటా సెంటర్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు, వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించేందుకు పరిశ్రమకు చెందిన భాగస్వాములతో నిర్వహించిన ఈ చర్చలు ఎంతో ఉపయోగకరంగా, ఫలప్రదంగా సాగాయని తెలిపారు.

 

 

 

ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అనిశ్చితి నెలకున్నప్పటికీ భారత్‌ ఆర్థిక వృద్ధి అవకాశాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీ గోయల్‌ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వాన్ని కేంద్రమంత్రి ప్రశంసించారు. ప్రతి భారతీయుడిలో ‘అమృత్‌ కాల్‌’, ‘వికసిత్‌ భారత్‌ 2047’ లక్ష్యాల సాధనలో భాగస్వాములు అయ్యేలా విశ్వాసాన్ని నింపుతున్న శ్రీ మోదీకి, దేశ ప్రజలకి కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు.

 

 

 

డేటా సెంటర్‌, సెమీకండక్టర్‌ రంగాల సామర్థ్యం, కృత్రిమ మేధ రంగాల్లో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను, ప్రపంచ స్థాయి నాణ్యమైన ఉత్పత్తుల తయారీలో విస్తరిస్తున్న సామర్థ్యాన్ని శ్రీ పీయూష్‌ గోయల్‌ వివరించారు. రాబోయే సంవత్సరాల్లో ఈ రంగాలు భారత్‌ ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా నిలిచి, 2047 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగడానికి దోహదపడతాయని తెలిపారు. పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సమావేశం సానుకూల వాతావరణంలో సాగిందని, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల ద్వారా ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించగలిగామని శ్రీ గోయల్‌ అన్నారు. డేటా సెంటర్‌ రంగంలో దాదాపు 200 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండటంతో పరిశ్రమ విస్తరణకు సిద్ధంగా ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచ డేటా సెంటర్‌ కేంద్రంగా ఎలా అభివృద్ధి చేయవచ్చనే అంశంపై సమావేశంలో విలువైన సూచనలు, ఆలోచనలు లభించాయని మంత్రి తెలిపారు.

భారత్‌లో డేటా సెంటర్‌ రంగాన్ని వేగంగా, సుస్థిరంగా విస్తరించేందుకు అనుకూలమైన వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో.. తొలిసారిగా నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్‌కు కొనసాగింపుగా ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. వ్యాపార సౌలభ్యం, డేటా సెంటర్‌ మౌలిక సదుపాయాల వేగవంతమైన ఏర్పాటుపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా విద్యుత్‌, భూమి, నియంత్రణ, ఆర్థిక అంశాలపై దృష్టి సారించారు.

 

 

 

క్లౌడ్‌, కృత్రిమ మేధ ఆధారిత సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లకు డిమాండు వేగంగా పెరుగుతోందని సమావేశంలో ప్రస్తావించారు. 2026 తొలి అర్ధభాగంలో డేటా సెంటర్ల వినియోగంలో 80 శాతానికి పైగా వాటా హైపర్‌స్కేలర్లదే కావడం, ఏఐ మౌలిక సదుపాయాల కేంద్రంగా భారత్‌ ఎదుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, కృత్రిమ మేధ వ్యవస్థ ద్వారా ఏర్పడుతున్న అవకాశాల స్థాయిని ప్రతిబింబిస్తూ, డేటా సెంటర్‌ రంగంలో పెట్టుబడులు సుమారు 200 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

 

 

 

డేటా సెంటర్లకు తగినంత, విశ్వసనీయమైన విద్యుత్‌ అందుబాటును నిర్ధారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై భాగస్వామ్య వర్గాలు చర్చించాయి. ఇందులో క్లస్టర్‌ ఆధారిత ట్రాన్స్‌మిషన్‌, సబ్‌స్టేషన్‌ ప్రణాళిక, తొలిరోజే మంజూరైన విద్యుత్‌ లోడ్‌, రెండు వైపుల నుంచి విద్యుత్‌ ఫీడర్లు, రాష్ట్రాల సరిహద్దులు దాటి పునరుత్పాదక ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలు ఉన్నాయి. డేటా సెంటర్లకు అనుకూలంగా సిద్ధం చేసిన భూమి నిల్వలు, ముందుగానే గుర్తించిన విద్యుత్‌ సౌకర్యాలు అందుబాటులో ఉన్న స్థలాల ఆవశ్యకత గురించి సమావేశంలో ప్రస్తావించారు

 

 

 

ప్రాజెక్టుల అమలు సమయాన్ని తగ్గించి, పెట్టుబడి భరోసాను మెరుగుపరిచేలా సింగిల్‌-విండో అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, డేటా సెంటర్లకు తగిన భవన నిర్మాణ నిబంధనలు వంటి నియంత్రణ చర్యలను కూడా రౌండ్‌టేబుల్‌లో సమీక్షించారు. 

 

 

 

గతంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంతో పోలిస్తే ఈసారి చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించారు. జాతీయ బిల్డింగ్ కోడ్ 2026లో ఇప్పుడు డేటా సెంటర్లను ప్రత్యేకంగా గ్రూప్-ఈ కింద గుర్తించారు. అగ్ని ప్రమాద అంచనా, డేటా సెంటర్లకు ప్రత్యేకమైన పనితీరు సూచికలతో సహా డేటా సెంటర్లకు సంబంధించిన అవసరాలపై ప్రత్యేక అనుబంధాన్ని ఇందులో చేర్చారు.

 

ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రపంచ స్థాయి హైపర్‌ స్కేలర్ల సీఈఓలు, సీనియర్ ప్రతినిధులు, డేటా సెంటర్ డెవలపర్లు, ఆపరేటర్లు, పెట్టుబడిదారులు, మౌలిక సదుపాయల సేవలందించే సంస్థలు, ఇతర కీలక భాగస్వాములు పాల్గొన్నారు. 

 

 

 

ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ ప్రతినిధులతో పాటు సుమారు 46 డేటా సెంటర్ సంస్థల ప్రతినిధులు ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. 

 

 

 

పెట్టుబడులు, ఆవిష్కరణలను వేగవంతం చేయడం, భారత డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయడం, విశ్వసనీయమైన ప్రపంచ డేటా సెంటర్ కేంద్రంగా దేశాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా చర్యలకు అనువైన, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన, అధిక ప్రభావం చూపే సంస్కరణలకు ఈ చర్చలు పునాదిగా నిలుస్తాయి.

***

 


(రిలీజ్ ఐడి: 2306209) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil