రక్షణ మంత్రిత్వ శాఖ
బెంగళూరు వేదికగా 2027 ఫిబ్రవరి 8-12 తేదీల్లో 16వ ఏరో ఇండియా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రదర్శన స్థలం బుకింగ్ www.aeroindia.gov.in ద్వారా ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
02 SEP 2026 5:42PM by PIB Hyderabad
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన, ప్రపంచంలోని ప్రముఖ ఏరోస్పేస్, రక్షణ ప్రదర్శనల్లో ఒకటైన ఏరో ఇండియా 16వ ఎడిషన్‌ను 2027 ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు కర్ణాటకలోని బెంగళూరులో గల యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో నిర్వహించనున్నారు. రక్షణ మంత్రిత్వశాఖలోని రక్షణ ఉత్పత్తి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం... ప్రపంచంలోని ప్రముఖ ఏరోస్పేస్, రక్షణ కంపెనీలు, విధాన రూపకర్తలు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు, పరిశ్రమ భాగస్వాములు, రక్షణ దళాల సిబ్బందిని ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.
ఏరోస్పేస్, రక్షణ తయారీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణల్లో పెరుగుతున్న భారత్ సామర్థ్యాలను ప్రదర్శించే ఒక ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమంగా ఏరో ఇండియా ఆవిర్భవించింది. ఇది వ్యాపార సంబంధాలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, అంతర్జాతీయ సహకారం, వ్యూహాత్మక చర్చల కోసం ఒక చైతన్యవంతమైన వేదికను అందిస్తుంది. విస్తరిస్తున్న భారత రక్షణ రంగ పారిశ్రామిక వ్యవస్థను... ప్రపంచ ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెరుగుతున్న దాని పాత్రనూ ఇది ప్రముఖంగా చాటిచెబుతుంది.
అయిదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఒక సమగ్ర ప్రదర్శనతో పాటు పలు వ్యాపార, వ్యూహాత్మక కార్యక్రమాలు భాగంగా ఉంటాయి. ఇవి పరిశ్రమల మధ్య పరస్పర సంప్రదింపులకు, ప్రభుత్వాల మధ్య పరిశ్రమల అనుసంధానానికి, సాంకేతిక ప్రదర్శనలకు, సహకారాలకూ అవకాశాలను కల్పిస్తాయి. భారత వైమానిక దళం, ఇందులో పాల్గొనే అంతర్జాతీయ వైమానిక బృందాల అద్భుత వైమానిక ప్రదర్శనలూ ఉంటాయి. ఇవి సందర్శకులకు అధునాతన విమానయాన సామర్థ్యాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని అందిస్తాయి.
ఏరో ఇండియా-2027లో ప్రదర్శనకారులు, సందర్శకులు సజావుగా పాల్గొనడాన్ని సులభతరం చేయడానికి, వారికి సమగ్ర సేవలను అందించడానికి ఒక ప్రత్యేక వెబ్ ఆధారిత పోర్టల్‌ను అభివృద్ధి చేశారు. www.aeroindia.gov.in ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రదర్శన స్థలం బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రదర్శనకారుల రిజిస్ట్రేషన్లు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
స్వయం-సమృద్ధ భారత్‌ను సాధించాలనే భారత దార్శనికత సాకారానికి... ప్రపంచ రక్షణ, ఏరోస్పేస్ రంగాల సరఫరా వ్యవస్థలో ఒక విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భావానికి ఈ ఏరో ఇండియా-2027 గణనీయ ప్రోత్సాహాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంఎస్ఎంఈలు, అంకురసంస్థలు సహా భారత రక్షణ పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు... భాగస్వామ్యాలు, పెట్టుబడులు, ఎగుమతులు, సాంకేతిక సహకారానికి మార్గం సుగమం చేస్తుంది
.
***
(రిలీజ్ ఐడి: 2306207)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13