ప్రధాన మంత్రి కార్యాలయం
బిష్కెక్‌లో ‘ఎస్‌సీఓ’ దేశాధినేతల మండలి 26వ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 8:54PM by PIB Hyderabad
కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్‌లో ఆగస్టు 31-సెప్టెంబరు 1 తేదీల్లో నిర్వహించిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) దేశాధినేతల మండలి 26వ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు.
ఈ ఏడాదితో ఎస్‌సీఓ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం, సౌభాగ్యాల దిశగా సంస్థ పాత్రను మరింత విస్తృతం చేసే దిశగా సాగిన కృషిని సమీక్షిస్తూ నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- కిర్గిజ్ అధ్యక్షుడు శ్రీ సదిర్ జపరోవ్ ఆత్మీయతకు, ఆతిథ్యానికి తొలుత ధన్యవాదాలు తెలిపారు. ఎస్‌సీఓ ఒక బలమైన సహకార-సంప్రదింపుల సంప్రదాయాన్ని రూపొందించిందని ఆయన గుర్తుచేశారు. దీన్ని మరింత పటిష్టం చేస్తూ రాబోయే పాతికేళ్ల ప్రణాళిక రూపకల్పనలో ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు 25వ వార్షికోత్సవం సముచిత సందర్భమని శ్రీ మోదీ పేర్కొన్నారు. మునుపటి శిఖరాగ్ర సదస్సులో భద్రత, అనుసంధానం, అవకాశాలపై భారత్ తన దృక్కోణాన్ని ప్రకటించిందని తెలిపారు. ఇప్పుడు ఈ మూడు ఉమ్మడి కార్యాచరణ కార్యకలాపాల ద్వారా నిర్దిష్ట ఫలితాల సాధనకు మండలి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
యుద్ధభూమిలో సంఘర్షణాంశాల పరిష్కారం సాధ్యం కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. శాంతిసామరస్యాల దిశగా ముందడుగు వేయడంలో దౌత్యం, చర్చలు, సంప్రదింపులు వంటివే ఏకైక మార్గంగా భారత్ విశ్వసిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని మానవాళికి తీవ్రమైన ముప్పుగా ప్రకటిస్తూ ఈ భూతాన్ని సమూల స్థాయిలో నిర్మూలించడానికి నిబద్ధతతో కూడిన చర్యలు అవశ్యమని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు తావుండరాదని ఆయన ప్రస్ఫుటం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి, స్థిరత్వాలతో యురేషియా ప్రాంతంలో భద్రత ఎంతగానో ముడిపడి ఉందని చెప్పారు. ఆ దేశం అభివృద్ధి పథంలో సాగే విధంగా భారత్ ఎంతో చేయూత, మానవతా సహాయం అందిస్తున్నదని వివరించారు.
ఈ నేపథ్యంలో ఎస్‌సీఓ దేశాల సమష్టి ప్రగతి, సౌభాగ్యం దిశగా బలమైన, విశ్వసనీయ అనుసంధాన కార్యక్రమాలు కీలకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మార్కెట్ల అనుసంధానం ద్వారా వాణిజ్యాన్ని విస్తృతం చేస్తూ ప్రగతికి కొత్త అవకాశాలను సృష్టించే కృషికి భారత్ పూర్తి మద్దతునిస్తుందని హామీ ఇచ్చారు. అలాంటి కృషితోపాటు ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఆయన పునరుద్ఘాటించారు. సాంకేతికత, వ్యవస్థాపకన, ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, ప్రజల మధ్య సంబంధాలు వంటివి ఎస్‌సీఓ దేశాల ప్రజలకు అపార అవకాశాలను కల్పిస్తాయని ఆయన వివరించారు. ఈ అంశంలో కిర్గిజ్ అధ్యక్షతన యువత భాగస్వామ్యంపై ఎస్‌సీఓ దృష్టి సారించడాన్ని ఆయన అభినందించారు. ఈ ఏడాది చివరన తొలిసారిగా నిర్వహించే ‘ఎస్‌సీఓ నాగరిక సంప్రదింపుల’కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటం ఎంతో సంతోషదాయకమని ప్రధానమంత్రి చెప్పారు. సభ్య దేశాల మధ్య నాగరిక ఆదానప్రదానం పెంపొందే లక్ష్యంతో భారత్ ఈ ప్రధాన కార్యక్రమ నిర్వహణకు నడుంకట్టింది.
ఈ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బిష్కెక్ తీర్మానంతో పాటు వాతావరణం, అణు భద్రత, ఇంధన పరిరక్షణ, మాదకద్రవ్య వ్యసన విముక్తి తదితర రంగాల్లో నాలుగు అవగాహన ఒప్పందాలు, 20కి పైగా ఒడంబడికలు, ప్రకటనలకు ఆమోద ముద్ర పడింది.
బిష్కెక్ తీర్మానంలో భాగమైన అనేక కార్యక్రమాలకు భారత్ నాయకత్వంతో పాటు మద్దతునిచ్చింది. ఈ మేరకు ఎస్‌సీఓ మూలపత్రంలో ఇంగ్లిష్‌ను అధికార భాషగా చేర్చడం, నాగరిక సంప్రదింపుల వేదిక, యువ శాస్త్రవేత్తల వేదిక, యువ రచయితల సదస్సు వంటివాటికి పూర్తి తోడ్పాటును ప్రకటించింది.
చివరగా, ఈ శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై కిర్గిజ్ అధ్యక్షుడు శ్రీ సదిర్ జపరోవ్‌కు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. సమష్టి ప్రగతి, సౌభాగ్యాల కోసం ఎస్‌సీఓ కూటమితో సంయుక్త కృషికి భారత్ సదా సంసిద్ధంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
***
(రిలీజ్ ఐడి: 2305844)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam