వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
చక్కెర డీలర్లు ఈ నెల 15 నుంచి 2,000 క్వింటాళ్ల పంచదార నిల్వనే అట్టిపెట్టుకోవాలి... నిల్వ పరిమితిని తగ్గించిన ప్రభుత్వం
దొంగనిల్వలను, ఊహాకల్పిత ట్రేడింగును అరికట్టి,
తగినంత సరుకు లభ్యతతో పాటు ధరల్లో స్థిరత్వ నిర్ధారణకు తోడ్పడుతూ
వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికే ఈ నూతన నిల్వ పరిమితి
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 1:57PM by PIB Hyderabad
చక్కెర డీలర్లకు ఉద్దేశించిన నిల్వ పరిమితిని కేంద్ర ప్రభుత్వం 4,000 క్వింటాళ్ల నుంచి 2,000 క్వింటాళ్లకు తగ్గించింది. ఈ నిర్ణయం ఈ నెల 15 నుంచి ఈ ఏడాది నవంబరు 30 వరకు అమలులో ఉంటుంది. దేశీయ మార్కెట్టులో చాలినంత పంచదార అందుబాటులో ఉండేటట్లు చూడడంతో పాటు చక్కెరను దాచి ఉంచడాన్ని, అంచనాల ఆధారంగా వాణిజ్యానికి పాల్పడటాన్ని అరికట్టడానికి ఈ చర్యను తీసుకున్నారు. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లు 4,000 క్వింటాళ్ల పంచదారను తమ వద్ద అట్టిపెట్టుకోవచ్చన్న నియమం ఉంది. 2026 ఆగస్టు 1 నుంచి ఈ నిబంధన వర్తిస్తోంది. తాజాగా ఈ పరిమితిని ప్రభుత్వం 2,000 క్వింటాళ్లకు తగ్గించింది.
సవరించిన నిబంధనల్లో భాగంగా, 2026 సెప్టెంబరు 15 నుంచి చక్కెర డీలర్లు:
• సరుకును అందుకున్న తేదీ నుంచి 30 రోజుల కన్నా ఎక్కువ సమయం అట్టిపెట్టుకో కూడదు.
• దేశమంతటా ఏ ప్రాంతంలోనూ, ఏ సమయంలోనూ 2,000 క్వింటాళ్ల కన్నా ఎక్కువ పంచదారను నిల్వ ఉంచ కూడదు.
• ఏమైనా, ప్రాంతం వారీ నిర్దిష్ట మార్కెట్టు అవసరాలను లెక్కలోకి తీసుకొని, కోల్‌కతా దాని చుట్టూరా విస్తరించిన మహానగర ప్రాంతాలకు చక్కెర నిల్వ పరిమితి ఇదివరకటి మాదిరి 4,000 క్వింటాళ్లుగానే ఉంటుంది.
• కోల్‌కతా ప్రాంతం చక్కెరను ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల నుంచి అందుకుంటూ ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు సహా దేశంలోని తూర్పు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నది. ఈ కారణంగా కోల్‌కతాతో పాటు దాని పరిసరాల్లోని మహానగర ప్రాంతాల విషయంలో ఇప్పుడున్న 4,000 క్వింటాళ్ల పరిమితిని యథాపూర్వ విధంగానే ఉంచారు.
చక్కెరను దొంగచాటుగా దాచి ఉంచడాన్ని అరికట్టడం, ఊహాకల్పిత వాణిజ్యానికి పాల్పడకుండా చూడటం, మరీ ఎక్కువ పరిమాణంలో నిల్వచేయకుండా అడ్డుకోవడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ చర్య చక్కెర సరఫరా వ్యవస్థ ఒడుదొడుకులు లేకుండా సాఫీగా ఉండేందుకు తోడ్పడుతుంది. సబబయిన ధరలకు వినియోగదారులకు చక్కెర నిరంతరాయంగా అందుబాటులో ఉంటుంది.
ముమ్మర పర్యవేక్షణ, భౌతిక తనిఖీలు
చక్కెర మిల్లులు, డీలర్లు, వ్యాపారులు సహా దేశం నలుమూలలా చక్కెర నిల్వలను ప్రభుత్వం ముమ్మరంగా పర్యవేక్షిస్తూ, భౌతిక తనిఖీలు చేపడుతోంది. సరుకును అదనంగా నిల్వ చేయడం, సమాచారాన్ని వెల్లడించకపోవడం, పంచదార సరుకు అమ్మకం, రాకపోకలలో అస్తవ్యస్త వ్యవహారాలను గుర్తించడానికి ఈ ప్రక్రియ దోహదం చేసింది.
ఈ జోక్యాల వల్ల మార్కెట్టు లభ్యత మెరుగుపడి, మిల్లు వద్ద చక్కెర ధరలు ఇటీవల దాదాపు 20 శాతం మేర దిగివచ్చాయి. ( ex-mill sugar prices have declined by around 20% in recent days.) చిల్లర ధరలు కూడా తగ్గుముఖం పట్టడం మొదలైంది. మిల్లు వద్ద నమోదైన తగ్గింపు ధరలకు అనుగుణంగానే రిటైల్ ధరలూ ఉంటాయని భావిస్తున్నారు.
క్రమం తప్పక సరుకు వివరాల ప్రకటనలు, నిరంతర పర్యవేక్షణ
చక్కెర మార్కెట్టులో చోటు చేసుకుంటున్న ఘటనలను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఆహార, ప్రజా పంపిణీ విభాగానికి సంబంధించిన ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా పంచదారు నిల్వల స్థితిని క్రమం తప్పకుండా ప్రకటిస్తూ, తాజా నిల్వల సమాచారాన్ని తెలియజేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేశం అంతటా చక్కెర మిల్లులు, డీలర్లు, వ్యాపారులు సహా పంచదార నిల్వల భౌతిక తనిఖీని రాబోయే వారాల్లో కూడా కొనసాగిస్తారు. తగినంత చక్కెర అందుబాటులో ఉండేటట్లుగా చూస్తూ, సరఫరాల్లో ఒక క్రమ పద్దతికి తావిచ్చి, దేశీయ మార్కెట్టులో ధరలు నిలకడగా ఉండేలా అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వినియోగదారులకు భరోసాను కల్పిస్తోంది. దీంతో పాటు వాస్తవిక వ్యాపారం, పంపిణీ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయాలకు లోనవకుండా కొనసాగేటట్లు చూస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2305494)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2