రాష్ట్రపతి సచివాలయం
18 నిఫ్ట్ క్యాంపస్‌ల సంయుక్త స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి
విద్యార్థులు మన మూలాలను, సాంస్కృతిక విలువలను విస్మరించకుండా... అంతర్జాతీయ దృక్పథాన్ని అలవరచుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 4:10PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈ రోజు (2026 ఆగస్టు 31) నిర్వహించిన 18 జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ (నిఫ్ట్)ల సంయుక్త స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... జౌళీ, వస్త్ర పరిశ్రమ రంగం మన సాంస్కృతిక వారసత్వంలో భాగం మాత్రమే కాదని, లక్షలాది మంది ప్రజల జీవనోపాధికి వెన్నెముకగా కూడా నిలిచిందని రాష్ట్రపతి అన్నారు. సంప్రదాయ కళాకారులకు తగిన సహకారమూ, మార్గనిర్దేశమూ లభిస్తే.. వారి భవిష్యత్తు తరాలు కూడా సగర్వంగా, ఆత్మవిశ్వాసంతో ఈ వృత్తిలో కొనసాగేలా ప్రోత్సాహం లభిస్తుందన్నారు. తమ ప్రాంతాల్లోని నేత కార్మికులకూ, చేతివృత్తి కళాకారులకూ జౌళీ, వస్త్ర రంగంలో ఆధునిక మెళకువలను పరిచయం చేయడంతోపాటు.. వారిని మార్కెట్లతో అనుసంధానించడం లక్ష్యంగా ‘హస్తకళా బృంద కార్యక్రమా’ల వంటి కార్యాచరణను వివిధ నిఫ్ట్ కేంద్రాలు అమలు చేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో.. నేడు మన దేశం అంతర్జాతీయ వేదికలపై తన పాత్రను విస్తరించుకుంటోందని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచ స్థాయిలో దేశ ఉనికిని బలోపేతం చేయడంలో ఫ్యాషన్ టెక్నాలజీ రంగం కూడా విస్తృత పాత్రను పోషించగలదన్నారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ ప్రయత్నంలో విద్యార్థులు అంతర్జాతీయ దృక్పథాన్ని అలవరచుకోవాలని, అయితే మన మూలాలనూ, మౌలిక సాంస్కృతిక విలువలనూ ఏమాత్రమూ విస్మరించొద్దని రాష్ట్రపతి సూచించారు. తద్వారా వారు విజయవంతమైన నిపుణులుగా ఎదగడమే కాకుండా.. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో, సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.
విద్యార్థులు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను, బ్రాండ్లను రూపొందించాలని, అయితే అవి పర్యావరణ అనుకూలంగా ఉండేలా కూడా చూసుకోవాలని రాష్ట్రపతి అన్నారు. ఉత్పత్తుల కోసం స్థానికంగా లభించే ముడి పదార్థాలను ఉపయోగించడం.. పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక కీలక ముందడుగవుతుందని ఆమె పేర్కొన్నారు. మిగిలిపోయిన భాగాలను వ్యర్థాలుగా పారవేయకుండా.. వాటికి కొత్త రూపాన్ని, కొత్త వినియోగాన్ని, కొత్త విలువను కల్పించవచ్చని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. సంస్థ వ్యూహాత్మక ప్రణాళికలో సుస్థిరతకు, సామాజిక బాధ్యతకు నిఫ్ట్ విధాన రూపకర్తలు గణనీయమైన ప్రాధాన్యమివ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. జౌళీ, వస్త్ర పరిశ్రమ రంగంలో సుస్థిర భవిష్యత్తు దిశగా చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా.. పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ పద్ధతులను మరింత విస్తరించి, ప్రయోజనకరంగా మార్చేలా నిఫ్ట్ సమర్థ చర్యలు తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి అన్నారు. నిఫ్ట్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ప్రతిభావంతులైన యువ విద్యార్థులపై దేశం ఎన్నో అంచనాలను పెట్టుకుందన్నారు. దేశ పురోగతిలో భాగస్వామ్యం వహించేలా ప్రతి పౌరుడికీ తగిన అవకాశం లభించే సమాజాన్ని నిర్మించడంలో తమవంతు సహకారాన్ని అందించాలని వారిని కోరారు. కళ ప్రామాణిక అస్తిత్వాన్ని కాపాడుకుంటూ.. ఉత్పాదకతనూ, ఆదాయాన్నీ పెంచుకోవడంలో హస్తకళా నిపుణులకు సాయమందించేలా తీసుకునే చర్యలపైనే.. తమ విజయం ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
ఇక్కడ క్లిక్ చేసి రాష్ట్రపతి ప్రసంగాన్ని వినండి
***
(రిలీజ్ ఐడి: 2305052)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10