ప్రధాన మంత్రి కార్యాలయం
ఉజ్బెకిస్తాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటన సందర్భంగా సంయుక్త ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
30 AUG 2026 5:56PM by PIB Hyderabad
పునరుత్పాదక ఇంధనం, ఇంధన మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల అమలులో సహకార విస్తృతిపై చర్చలకు నాయకుల హర్షామోదాలు.
భూగర్భ శాస్త్రం-గనుల తవ్వకం, అణుశక్తి, పారిశ్రామిక సహకారం, కీలక-వ్యూహాత్మక ఖనిజ రంగాల్లో సహకారం దిశగా అంగీకారం. ఖనిజ వనరుల శుద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, రీసైక్లింగ్ కార్యక్రమాల సంబంధిత ప్రాజెక్టులు కూడా అంతర్భాగంగా ఉంటాయి. ఉజ్బెకిస్తాన్‌లో ఖనిజ నిక్షేపాల రంగం భవిష్యత్ అభివృద్ధిలో పాలుపంచుకునేలా భారతీయ కంపెనీలను, భారత్‌లో ఉమ్మడి సహకారం కోసం ఉజ్బెక్ సంస్థలను ప్రోత్సహించడంపై అధినేతల ఆసక్తి వ్యక్తీకరణ. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తి వినియోగంపై సహకార విస్తృతికి సుముఖత.
భూగర్భ అన్వేషణ, గనుల తవ్వకం, ఖనిజ శుద్ధి, సమీకృత విలువ వ్యవస్థల ప్రగతిలో ఉమ్మడి ప్రాజెక్టుల అమలు ద్వారా కీలక ఖనిజాల రంగ సహకార విస్తరణకు అంగీకారం.
వ్యవసాయ రంగం
వ్యవసాయ విలువ వ్యవస్థల అభివృద్ధి, ఎగుమతి సామర్థ్యాల బలోపేతం సహా వ్యవసాయ, పశుసంపద రంగాల సాంకేతిక సామర్థ్యం పెంపులో సహకారానికీ అంగీకారం.
వ్యవసాయం-ఆహార భద్రత రంగాలలో సహకార బలోపేతంపై నాయకులిద్దరూ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆవిష్కరణలు-వనరుల సమర్థ వినియోగం సాంకేతికతలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. వ్యవసాయ శాస్త్ర విజ్ఞానంలో ఆదానప్రదానం కొనసాగింపు, ఈ ప్రాంతమంతటా ఆధునిక-సుస్థిర వ్యవసాయాభివృద్ధికి ప్రోత్సాహం దిశగా బహుళపక్ష, ప్రాంతీయ వేదికల సమర్థ వినియోగానికి అంగీకారం. వ్యవసాయ ఉత్పత్తులలో ద్వైపాక్షిక వాణిజ్య సౌలభ్య కల్పనకు ఆమోదం.
వ్యవసాయ ఉత్పాదకత పెంపు, మొక్కల జన్యు వనరుల పరిరక్షణ-సుస్థిర వినియోగంలో పరిశోధన సంస్థలు-పరిశ్రమల మధ్య సహకార విస్తరణకు మద్దతుపై అంగీకారం.
రవాణా… సదుపాయాలు.. అనుసంధానం
బహుళ రవాణా సదుపాయాల వినియోగ మార్గాలు, లాజిస్టిక్స్ కారిడార్ల అభివృద్ధితో భారత్-ఉజ్బెకిస్తాన్ మధ్య రవాణా-లాజిస్టిక్స్ అనుసంధానం మెరుగుదల సహా వస్తూత్పత్తుల నిరంతరాయ రవాణానుకూల పరిస్థితుల సృష్టిపై ఉమ్మడి కృషి కొనసాగింపుపై నిబద్ధత పునరుద్ఘాటన.
రవాణా వ్యయం తగ్గింపు ద్వారా సరుకు రవాణా పునరుద్ధరణ లక్ష్యంతో సహకారం కొనసాగింగిపై నాయకులు సన్నద్ధత.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా రహదారుల నిర్మాణంలో నైపుణ్య పరస్పర ఆదానప్రదానంతో సంబంధిత అధికారుల మధ్య సహకార విస్తరణకు ఆమోదం. అలాగే, రహదారి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం-ఆధునికీకరణణపై ఉమ్మడి ప్రాజెక్టుల అమలు అవకాశాల అన్వేషణపై సుముఖత వ్యక్తీకరణ.
ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వ రవాణా రంగానికి పర్యావరణ హిత, ఇంధన పొదుపు పరిష్కారాల రూపకల్పన ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ- ఈ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుల అమలు అవకాశాలపై అన్వేషణకు అంగీకారం.
డిజిటల్ సాంకేతికతలు - ఆవిష్కరణలు - అంతరిక్ష సహకారం
భారతీయ నమూనా ప్రాతిపదికన సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా మద్దతుతో 2019లో తాష్కెంట్‌లో ఏర్పాటైన తొలి ఐటీ పార్క్ విజయవంతం కావడంపై నాయకులిద్దరి హర్షం. అలాగే, రెండు దేశాల సాంకేతిక పార్కులు, కంపెనీలు, అంకుర సంస్థలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాల విస్తరణకు అంగీకారం.
ఉన్నత సాంకేతికతలు, డిజిటల్ రూపాంతరీకరణ రంగాల్లో ద్వైపాక్షిక సహకార బలోపేతం సహా న్యూఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ 2026 ఫిబ్రవరి నాటి అవగాహన ఒప్పందాల అమలుపై నాయకుల హర్షం.
సుస్థిర ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణాధారిత అభివృద్ధి, సామాజిక సవాళ్ల సమర్థ పరిష్కారాలను ప్రోత్సహించడంపై ఏఐ సామర్థ్య వినియోగించడంపై దృష్టి. ఈ మేరకు అనుభవాలు, ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానం సహా సురక్షిత, భద్రమైన, విశ్వసనీయ ఏఐ వ్యవస్థల రూపకల్పన, పురోగమనంలో సహకార బలోపేతానికి నాయకుల అంగీకారం.
అంతరిక్ష అనువర్తనాలు, శాస్త్రీయ సమాచార ఆదానప్రదానం ఉమ్మడి వర్కుషాపుల నిర్వహణ-శిక్షణ ద్వారా సామర్థ్య వికాసం వంటి అంశాలు సహా బాహ్య అంతరిక్ష అన్వేషణ, శాంతియుత వినియోగాల్లో ఆచరణాత్మక సహకార విస్తరణపై నాయకుల సన్నద్ధత పునరుద్ఘాటన.
విద్య.. మానవ వనరుల అభివృద్ధి.. ఆరోగ్యం.. సంస్కృతి.. క్రీడలు.. పర్యాటకం
ఉజ్బెకిస్తాన్-భారత్ ప్రజల మధ్య దీర్ఘకాలిక సంబంధాల బలోపేతం దిశగా భారత విద్యార్థుల అమూల్య కృషికి నాయకుల ప్రశంసలు.
ఉజ్బెకిస్తాన్‌లో భారతీయ అధ్యయనాల నిరంతర విస్తరణపై హర్షం.. భారత్‌లో ఉజ్బెక్ అధ్యయనాల విస్తరణకు మద్దతు ప్రకటన.
ఉజ్బెకిస్తాన్-భారత్ మధ్య కీలక వారధి అయిన మానవ వనరుల అభివృద్ధిలో సహకార బలోపేతంపై ఏకాభిప్రాయం. ఈ మేరకు ఉమ్మడి పరిశోధన, విద్యా సహకార కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యం.
సామర్థ్య వికాసం, మానవ వనరుల అభివృద్ధిలో.. ముఖ్యంగా- వైద్యం, ఔషధాలు, రసాయన శాస్త్రం, నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాల్లో దీర్ఘకాలిక-పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యంపై నాయకుల ప్రశంసలు. కొన్నేళ్లుగా 2,700 మందికి పైగా ఉజ్బెక్ దేశీయులు ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అలాగే, ఆయుష్ స్కాలర్‌షిప్‌లు ‘ఐసీసీఆర్’ ఉపకారవేతనాల కింద 400 మందికి పైగా ఉజ్బెక్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో, ఉజ్బెకిస్తాన్‌లో హిందీ భాషాభివృద్ధి కోసం లాల్ బహదూర్ శాస్త్రి స్కాలర్‌షిప్‌ను భారత్ ప్రకటించడంపై ఉజ్బెక్ పక్షం హర్షం ప్రకటించింది. ‘ఐటెక్’ కార్యక్రమం కింద మానవ వనరుల అభివృద్ధిలో సహకారాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు నాయకులిద్దరూ సంసిద్ధతను పునరుద్ఘాటించారు.
ఉజ్బెకిస్తాన్ “యశీల్ మాకోన్” భారత్ “ఏక్ పెడ్ మా కే నామ్” కార్యక్రమాల ఏకరూపత తరహాలో భావితరాలకు ఆరోగ్యకర, హరిత భూగోళాన్ని సంక్రమింపజేసే ఆకాంక్షను నాయకులిద్దరూ సంయుక్తంగా వెల్లడించారు. ఈ ఉమ్మడి నిబద్ధత ప్రాతిపదికన అరల్ సముద్ర ప్రాంతంలో పచ్చదనం విస్తరణ సహా పర్యావరణ పునరుద్ధరణకు రెండు దేశాలూ సహకరించుకుంటాయి. ఇందుకు అవసరమైన సాంకేతిక మద్దతుతో సహా 1 మిలియన్ డాలర్ల విలువైన పనులను భారత్ ఆర్థిక సహాయంతో చేపడతారు.
ఆధునిక శాస్త్రీయ పరిశోధనల ద్వారా కొత్త చికిత్స విధానాలు, పద్ధతుల అభివృద్ధి కోసం పరస్పరం సామర్థ్య వినియోగానికి సుముఖత వ్యక్తం చేశారు. తద్వారా బయోమెడికల్ పరిశోధన-వైద్య ఆవిష్కరణ రంగాలు సహా ప్రజారోగ్య వ్యవస్థల బలోపేతంలో సహకార విస్తరణకు రెండు దేశాల నాయకులు అంగీకరించారు.
ఔషధ రంగంలో సహకార విస్తరణను వారిద్దరూ ఎంతగానో ప్రశంసించారు. అలాగే, ఉమ్మడి ప్రాజెక్టుల అమలు, ఆధునిక ఔషధ తయారీలో పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి స్థానికీకరణ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ సౌలభ్యం, అత్యంత నిపుణ శ్రామిక శక్తికి రూపకల్పన తదితరాల కోసం ‘తాష్కెంట్ ఫార్మా పార్క్ ఇన్నోవేటివ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ ఫార్మాస్యూటికల్ క్లస్టర్’ గణనీయ సామర్థ్యంగల సమర్థ వేదికగా ఉపయోగపడుతుందని వారిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. రెండు దేశాల సంబంధిత సంస్థలు, ఔషధ కంపెనీల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించడంపై తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.
భారతీయ కంపెనీల సహకారంతో ఉజ్బెకిస్తాన్‌లో కొత్త వైద్య కేంద్రాలు, ప్రయోగశాలలు, పరిశోధన సంస్థలు, ఉమ్మడి ఔషధ తయారీ సంస్థల స్థాపనకు నాయకులు తమ మద్దతు ప్రకటించారు.
ఉజ్బెకిస్తాన్-భారత్ ప్రజల మధ్య అనాదిగాగల చారిత్రక సంబంధాలను, ఉమ్మడి సాంస్కృతిక-నాగరిక వారసత్వాన్ని, దీర్ఘకాలిక పరస్పర గౌరవ సంప్రదాయాలను నాయకులిద్దరూ గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో సాంస్కృతిక దినోత్సవాలు, వేడుకలు, ప్రదర్శనలు, కళా బృందాల పర్యటనల నిర్వహణ ద్వారానే కాకుండా ఉభయ దేశాల సాంస్కృతిక సంస్థల మధ్య ప్రత్యక్ష సంబంధాల బలోపేతంతో సాంస్కృతిక, మానవతా సహకార విస్తరణపై నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా 2026-2030 మధ్య సాంస్కృతిక ఆదానప్రదాన కార్యక్రమంపై ఒడంబడిక కుదరటాన్ని, పురావస్తు రంగంలో ఉజ్బెకిస్తాన్-భారత్ సహకారాన్ని వారు స్వాగతించారు.
ప్రపంచ వారసత్వ ప్రదేశాల పరిరక్షణ, అధ్యయనం, పునరుద్ధరణ, ప్రాచుర్య కల్పన సహకారం ప్రాధాన్యాన్ని వారు స్పష్టం చేశారు. సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల డిజిటలీకరణ, పురావస్తు కళాఖండాల త్రీడీ నమూనాల సృష్టి-పరిరక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో సహా సంబంధిత పరిశోధన సంస్థలు, మ్యూజియంలు, పునరుద్ధరణ కేంద్రాల మధ్య సహకార విస్తరణలో ఆసక్తిని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఫయాజ్ తెపా, కర తెపాలోని ప్రాచీన బౌద్ధ ప్రదేశాల పరిరక్షణ, పునరుద్ధరణపై ఆసక్తి వ్యక్తీకరణ ఒడంబడిక కుదరటాన్ని వారిద్దరూ ప్రశంసించారు.
బ్యాడ్మింటన్, ఆర్చరీ, చెస్ వంటి క్రీడాంశాలలో ప్రతిభావంతులకు ప్రోత్సాహం, శిక్షణలో అనుభవాల ఆదానప్రదానం సహా క్రీడా రంగ సహకార బలోపేతానికి నాయకులిద్దరూ అంగీకరించారు.
ఆరోగ్యకర జీవనశైలికి ప్రోత్సాహం, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంలో యోగా పాత్రపై నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏటా జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రాధాన్యాన్ని వారు గుర్తుచేసుకున్నారు. శిక్షకులకు శిక్షణ విషయంలో ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్, భారత ఆయుష్ మంత్రిత్వశాఖల మధ్య సహకారాన్ని, అంతర్జాతీయ యోగాసన పోటీలలో ఉజ్బెకిస్తాన్ పాలుపంచుకోవడాన్ని నాయకులు స్వాగతించారు. ప్రముఖ భారతీయ నిపుణుల భాగస్వామ్యంతో ఉజ్బెకిస్తాన్‌లో యోగా ప్రచారం, అభివృద్ధికి మద్దతు కొనసాగింపుపై సంసిద్ధతను నాయకులు పునరుద్ఘాటించారు. సంప్రదాయ వైద్య రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం కుదరడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ సహకారం
ప్రపంచ శాంతిభద్రతల పరిరక్షణ ఐక్యరాజ్యసమితి కీలక పాత్ర పోషించాలని రెండు దేశాల అధినేతలూ స్పష్టం చేశారు. అలాగే, ఇతర అంతర్జాతీయ, ప్రాంతీయ వ్యవస్థలలో పరస్పర మద్దతు సహా సహకార బలోపేతానికి వారు నిర్ణయించారు.
సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా అంతర్జాతీయ శాంతిభద్రతల సమస్యల పరిష్కారంలో మరింత ప్రాతినిధ్యం సహా అది ప్రభావవంతంగా, సమర్థంగా ఉండేలా భద్రత మండలితోపాటు మొత్తంగా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర సంస్కరణలు అవశ్యమని వారిద్దరూ పునరుద్ఘాటించారు. ముఖ్యంగా భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ కృషికి ఉజ్బెకిస్తాన్ సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించింది.
వర్ధమాన దేశాల ఉమ్మడి ప్రయోజనాల దిశగా అంతర్జాతీయ వేదికలపై సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.
పరస్పర విశ్వాసం ప్రోది చేయడంతోపాటు ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాలను ప్రోత్సహించడం సహా వాణిజ్య, ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడులు, సాంస్కృతిక, మానవతా సాయం ఆదానప్రదానం రంగాల్లో సహకార విస్తరణకు షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)ను ఓ కీలక వేదికగా వారు గుర్తించారు. ఈ వేదికపై సహకార బలోపేతం దిశగా తమ నిబద్ధతను వారు మరోసారి స్పష్టం చేశారు.
బ్రిక్స్ కూటమికి 2026లో భారత్ అధ్యక్షత నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మీర్జియోయెవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు.
కాగా, 2027-2030 మధ్య అలీన ఉద్యమానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ ఉద్యమానికి వ్యవస్థాపక సభ్యురాలి హోదాలో భారత్ మద్దతు కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు.
అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ), అంతర్జాతీయ సోలార్ అలయన్స్, ఆయా రంగాల్లో ప్రపంచ సహకారం పెంపు వేదికలుగా పోషిస్తున్న కీలక పాత్రను రెండు దేశాల నాయకులూ ప్రశంసించారు. ఈ కూటములలో చేరడానికి ఉజ్బెకిస్తాన్ ఆసక్తి వ్యక్తం చేయడంపై భారత పక్షం హర్షం ప్రకటించింది. ఇందుకు అవసరమైన సంప్రదింపులు, ఇతర ప్రక్రియలు చురుగ్గా కొనసాగేలా చూసేందుకు సంసిద్ధత తెలిపింది.
ఉజ్బకిస్తాన్‌లో పర్యటన సందర్భంగా తనకు ఆత్మీయ స్వాగతం, అనుపమాన ఆతిథ్యం లభించడంపై దేశాధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్కు, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడిని భారత్ పర్యటనకు రావాల్సిందిగా ప్రధానమంత్రి మోదీ ఆహ్వానం పలికారు. దీనికి సంబంధించి దౌత్య సంప్రదింపుల ద్వారా తేదీలను నిర్ణయిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2304803)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada