ఆర్థిక మంత్రిత్వ శాఖ
సింథటిక్ డ్రగ్స్‌పై డీఆర్‌ఐ ఉక్కుపాదం: రెండు ఆపరేషన్లలో సుమారు 18 కిలోల యాంఫెటమైన్, ఎండీఎంఏ స్వాధీనం.. నలుగురు అరెస్టు
రెండు వారాల్లో సుమారు 150 కిలోల యాంఫెటమైన్ తరహా ఉత్ప్రేరక మాదకద్రవ్యాలను అడ్డుకున్న డీఆర్‌ఐ
నాడు పోస్టు చేయడమైనది:
29 AUG 2026 5:14PM by PIB Hyderabad
సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రెండు వేర్వేరు ఆపరేషన్లలో 2026 ఆగస్టు 25న బెంగళూరులో సుమారు 14.9 కిలోల యాంఫెటమైన్, పుణేలో సుమారు 2.53 కిలోల యాంఫెటమైన్‌తో పాటు 878 గ్రాముల ఎండీఎంఏ మాత్రలను స్వాధీనం చేసుకుంది. రెండు కేసుల్లో కలిపి 18 కిలోలకు పైగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోగా, నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం 1985 కింద నలుగురిని అరెస్టు చేశారు.
ఆగస్టు 25న అందిన నిఘా సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు రైలులో ప్రయాణిస్తున్న ఓ భారతీయ మహిళా ప్రయాణికురాలిని కేఎస్‌ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద భారీ మొత్తంలో అక్రమ మాదకద్రవ్యాలు ఉన్నట్లు అనుమానించారు.
ఆమె సామానును క్షుణ్ణంగా తనిఖీ చేయగా స్ఫటికాకార పదార్థంతో ఉన్న ఏడు ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటి బరువు సుమారు 14.9 కిలోలు కాగా, ఫీల్డ్ డ్రగ్ డిటెక్షన్ కిట్‌తో ప్రాథమిక పరీక్షల్లో అది యాంఫెటమైన్‌గా తేలింది. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలతో పాటు వాటిని ప్యాక్ చేసి దాచేందుకు ఉపయోగించిన సామగ్రిని ఎన్‌డీపీఎస్ చట్టం 1985 కింద స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో లభించిన సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు నిర్దేశిత డెలివరీ ప్రదేశంలో తదుపరి చర్యలు చేపట్టారు. అక్కడ సామాను తీసుకు వస్తున్న వ్యక్తి నుంచి దానిని స్వీకరించేందుకు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మొదటి వ్యక్తి నుంచి మాదకద్రవ్యాలను స్వీకరించేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా పట్టుకున్నారు. అక్రమ మాదకద్రవ్యాల రవాణా, వాటిని స్వీకరించేందుకు ప్రయత్నించిన ఈ ముగ్గురినీ ఎన్‌డీపీఎస్ చట్టం 1985 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.
ఆగస్టు 25న జరిగిన మరో నిఘా ఆధారిత ఆపరేషన్‌లో ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి పుణే మీదుగా ప్రయాణిస్తున్న మరో భారతీయ మహిళా ప్రయాణికురాలిని పుణే జంక్షన్ రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆమె సామానును తనిఖీ చేయగా తెలుపు, పసుపు రంగులోని స్ఫటికాకార పదార్థం లభించింది. అది సుమారు 2.53 కిలోల యాంఫెటమైన్‌గా అనుమానిస్తున్నారు. అలాగే 3,4-మెథైలీన్‌డయాక్సీమెథాంఫెటమైన్ (ఎండీఎంఏ) మాత్రలు సుమారు 878 గ్రాముల స్థూల బరువుతో లభించాయి. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను ఎన్‌డీపీఎస్ చట్టం కింద స్వాధీనం చేసుకొని, ఆ మహిళా ప్రయాణికురాలిని అరెస్టు చేశారు.
దేశవ్యాప్తంగా సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడం, వాటి వెనుక ఉన్న రవాణా వ్యవస్థలను ఛేదించడంపై డీఆర్‌ఐ చేపడుతున్న ముమ్మర చర్యల్లో భాగంగా ఈ తాజా స్వాధీనాలు జరిగాయి. గత రెండు వారాల్లో అయిదు ఆపరేషన్లలో కలిపి సుమారు 150 కిలోల యాంఫెటమైన్ టైప్ స్టిమ్యులెంట్ (ఏటీఎస్) తరగతికి చెందిన మాదకద్రవ్యాలను డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది. ఇందులో భారత ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో జరిగిన రెండు ఆపరేషన్లలో 76 కిలోల మెథాంఫెటమైన్ మాత్రలు, అలాగే సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్లాల్సిన ఎగుమతి సరుకులో మొక్కజొన్నతో కలిపి దాచిన 55.86 కిలోల మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2304562)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5