ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంత సరిహద్దులో రెండు చోట్ల 76 కిలోల మెథాంఫేటమిన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ
వాహనాల్లో ప్రత్యేక రహస్య అరల్లో దాచిన నిషిద్ధ మాదకద్రవ్యాలు.. ఇద్దరి అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
28 AUG 2026 12:12AM by PIB Hyderabad
రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) రహస్య సమాచారం ఆధారంగా దేశ ఈశాన్య ప్రాంత సరిహద్దు వెంబడి.. అస్సాం, మిజోరంలలో.. సోదాలు చేసి 76 కేజీల మెథాంఫేటమిన్ ట్లాబ్లెట్లను స్వాధీనం చేసుకుంది. మత్తుపదార్థాల దొంగచాటు రవాణాను అరికట్టడంలో భాగంగా నిర్వహించిన సోదాల్లో.. ‘1985 నార్కొటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్‌స్టెన్సెస్ (ఎన్‌డీపీఎస్) యాక్టు’ నిబంధనల కింద ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
56 కేజీల మెథాంఫేటమిన్ స్వాధీనం

సిల్చార్‌లో ఉన్న అస్సాం రైఫిల్స్ 38వ బెటాలియన్ సిబ్బంది సహాయంతో, డీఆర్ఐ అధికారులు 2026 ఆగస్టు 25న సోదాను నిర్వహించారు. సోదా నిర్వహించిన ప్రాంతం సిల్చార్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో గల లాల్‌పానీలో అస్సాం, మణిపూర్ సరిహద్దుకు సమీపంలో ఉంది. అక్కడ 12 చక్రాల వాహనాన్ని అనుమానంతో ఆపారు. మణిపూర్‌లోని జిరిబామ్ నుంచి వస్తున్న అనేక వాహనాల్లో ఆ ట్రక్కు కూడా ఉంది.
ట్రక్కును సోదా చేసినప్పుడు, డ్రైవర్ క్యాబిన్లో డ్రైవరు కూర్చునే సీటుకు వెనుక వైపున ప్రత్యేకంగా తయారు చేసిన ఓ అర ఉండడం చూశారు. ఆ అరలో ఒక్కొక్కటీ కిలో బరువుతో ఇటుక ముక్కల ఆకారంలో ఉన్న 36 ప్యాకెట్లూ, 200 గ్రాముల బరువున్న 100 చిన్న ప్యాకెట్లూ కనిపించాయి. వాటిలో గులాబీ, నారింజ రంగుల ట్యాబ్లెట్లు ఉన్నాయి. అవి మెథాంఫేటమిన్ కావచ్చని అనుమానిస్తున్నారు.
నమూనాలను ప్రాథమికంగా పరీక్షించిన మీదట, ఆ ట్యాబ్లెట్లలో యాంఫిటమిన్ పాళ్లు ఉన్నట్లు తేలింది. ట్రక్కుతో పాటు 56 కిలోల నిషిద్ధ వస్తువులను 1985 ఎన్‌డీపీఎస్ చట్ట నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. వాహనం నడుపుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు.
అంతకు ముందు, ఇదే నెల 18న.. మరో సోదాలో మిజోరంలోని ఐజ్వాల్, చంఫై రోడ్డుపై డీఆర్ఐ అధికారులు రహస్య సమాచారం ఆధారంగా ఐజ్వాల్‌కు దాదాపు 30 కి.మీ. దూరాన బంగ్ బంగళాలో ఓ కారును అడ్డగించారు. కారును సోదా చేస్తే 20 కిలోల గులాబీ, నారింజ రంగు ట్యాబ్లెట్లతో నిండిన 64 వేర్వేరు రకాల సరకు పట్టుబడింది. మెథాంఫేటమిన్ అయి ఉండవచ్చన్న అనుమానం వచ్చింది. కారు రెండు వైపులా రాకర్ ప్యానెళ్లు, సైడ్ సిల్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన లోతు అరల్లోనూ, ఫ్యూయల్ ట్యాంకు, కారు ఫ్లోరుకు మధ్య ఉండే చోటులోనూ సరుకును దాచిపెట్టారు.
మరో సోదాలో 20 కిలోల మెథాంఫేటమిన్ స్వాధీనం
ఎన్‌డీపీఎస్ పరీక్షా పరికరాలను ఉపయోగించి పరీక్షించిన మీదట ఆ ట్యాబ్లెట్లలో యాంఫిటమిన్ ఉందన్న విషయం బయటపడింది. ఆ డ్రగ్స్‌ను మయన్మార్ నుంచి జోఖావథర్, చంఫై సెక్టరు మీదుగా మిజోరానికి దొంగచాటుగా చేరవేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 20 కిలోల నిషిద్ధ వస్తువులతో పాటు, ఆ వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగించిన కారును 1985 ఎన్‌డీపీఎస్ చట్ట నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవరును అరెస్టు చేశారు.
మెథాంఫేటమిన్ శక్తిమంతమైన కృత్రిమ మానసిక ఉత్తేజకం. ఒకసారి వాడినవాళ్లు దీనికి బానిసలుగా మారతారు. గంభీర శారీరక, మానసిక దుష్పరిణామాలనూ కలగజేయొచ్చు. దీంతో గుండెకు సంబంధించిన సంక్లిష్టతలు, ఆందోళన పెరగడం, పరధ్యానం, ఉన్మాదానికి దారితీసే ప్రమాదాలు ఉంటాయి. చాలా కాలం వాడిన వారు దీనికి బానిసగా మారుతారు. కేంద్ర నాడీ వ్యవస్థ (వెన్నుపాము, మెదడు) ప్రభావితమవుతుంది. మెథాంఫేటమిన్‌ను 1985 ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం మానసిక రోగ కారక పదార్థంగా నోటిఫై చేశారు. దీని అక్రమ తయారీ, దీనిని దగ్గర అట్టిపెట్టుకోవడం, రవాణా చేయడం, దొంగచాటుగా తరలించడం నేరం.
***
(రిలీజ్ ఐడి: 2304106)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5