వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ జపాన్‌పర్యటన సమాప్తం
భారత్‌లో జపాన్ పెట్టుబడులు మరింత పెరగాలని.. పారిశ్రామిక భాగస్వామ్యాలు బలోపేతం కావాలని పిలుపు
సెమీకండక్టర్ రంగంపై భారత్ ఆరు మూలస్తంభాల వ్యూహంపై ప్రముఖంగా ప్రస్తావన.. జపాన్ సాంకేతికత, పెట్టుబడులకు ఆహ్వానం
భారత సెమీకండక్టర్.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థలో కార్యకలాపాల విస్తరణపై జపాన్ కంపెనీల ఆసక్తి
రాబోయే దశాబ్దంలో భారత్‌లో 10 ట్రిలియన్ జపాన్ యెన్‌ల ప్రైవేట్ పెట్టుబడులకు గోయల్ పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
27 AUG 2026 2:55PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ జపాన్‌లో తన పర్యటనను ముగించుకున్నారు. దేశంలో జపాన్ పెట్టుబడులను మరింత పెంచడం, పారిశ్రామిక భాగస్వామ్యాల బలోపేతం, ఆధునిక-వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక ఆర్థిక సహకారం విస్తరణ తదితర లక్ష్యాలతో టోక్యో, నగోయా, ఒసాకా నగరాల్లో సాగిన ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జపాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్థిక సంస్థలు, వ్యాపారవేత్తలతో శ్రీ గోయల్ విస్తృతంగా చర్చలు నిర్వహించారు. భారత్‌లో పెట్టుబడులు లేదా గణనీయ ప్రయోజనాలపై ఆసక్తి చూపుతున్న 30కి పైగా ప్రధాన కంపెనీలు, ఆర్థిక సంస్థల అధికార ప్రతినిధులు కూడా వీరిలో ఉన్నారు. పెట్టుబడుల విస్తరణ, పటిష్ట సరఫరా వ్యవస్థల బలోపేతం, సాంకేతిక భాగస్వామ్యాల విస్తృతి, రెండు దేశాల వ్యాపార సంస్థల మధ్య సహకారానికి కొత్త మార్గాల అన్వేషణపై ఈ సమావేశాల్లో దృష్టి సారించారు.
భారత్ కోసం జపాన్ దీర్ఘకాలిక సంస్థాగత మూలధన సమీకరణ శ్రీ గోయల్ పర్యటనలో ఒక ముఖ్యాంశంగా ఉంది. ఈ మేరకు ఆయన ఇతరత్రా ప్రధాన పెట్టుబడి-ఆర్థిక సంస్థలు సహా ‘ఎంయూఎఫ్‌జీ, మిజుహో, నోమురా, నిప్పన్ లైఫ్, డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ జపాన్, మోర్గాన్ స్టాన్లీ, ఎంయూఎఫ్‌జీ సెక్యూరిటీస్ వంటి ప్రసిద్ధ జపాన్ ఆర్థిక సంస్థలతో సమావేశమయ్యారు. భారత్‌కు మూలధన సమీకరణ మరింత పెంపు, అలాగే దేశంలో విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, తయారీ, సాంకేతికత, ఆర్థికావరణ వ్యవస్థకు మద్దతిచ్చేందుకు గల అవకాశాలపై ఈ చర్చల సందర్భంగా దృష్టి సారించారు.
మరోవైపు మూలధన వస్తువులు, యంత్రాలు, ఆటోమోటివ్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, అంకుర సంస్థలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల రంగాలవారీ రౌండ్‌టేబుల్ సమావేశాలకు శ్రీ గోయల్ అధ్యక్షత వహించారు. జపాన్-భారత్ వాణిజ్య సంస్థలకు చెందిన విస్తృత వర్గాలను ఈ సమావేశాలు ఒకే వేదికపైకి తెచ్చాయి. ముఖ్యంగా భారత్‌లోని 2, 3 అంచెల నగరాల్లో సరఫరాదారుల వ్యవస్థ, ‘ఎంఎస్‌ఎంఈ'లు సహా నిర్ది పెట్టుబడి, సాంకేతిక-వాణిజ్య భాగస్వామ్యాలను గుర్తించడంలో ఈ సమావేశాలు ఎంతగానో ఉపకరించాయి.
సెమీకండక్టర్, ఏఐ రౌండ్‌టేబుల్ సమావేశంలో భాగంగా 2032 నాటికి సెమీకండక్టర్ల డిమాండ్ 150 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాల నడుమ ప్రపంచవ్యాప్త పోటీతత్వంతో సెమీకండక్టర్ల వ్యవస్థను రూపొందించాలన్న భారత్ ఆకాంక్షను శ్రీ గోయల్ ప్రస్ఫుటం చేశారు. చిప్ డిజైన్, సెమీకండక్టర్ యంత్రాలు, మెటీరియల్స్, ఫ్యాబ్రికేషన్, ఏటీఎంపీ/ఓఎస్‌ఏటీ, పరిశోధన-అభివృద్ధి, ప్రతిభ-ప్రగతి వంటి భారత ఆరు స్తంభాల వ్యూహాన్ని ఈ సమావేశాల్లో ఆయన వివరించారు.
భారత్‌లో గల విస్తృత నైపుణ్యం, యువ ప్రతిభావంతులతో జపాన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంజినీరింగ్ నైపుణ్యం, తయారీ సామర్థ్యం జోడుకడితే భారత్‌లో ప్రపంచ స్థాయి సెమీకండక్టర్-సాంకేతిక విప్లవం వేగిరం కాగలదని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. సెమీకండక్టర్ తయారీ, కృత్రిమ మేధ, డేటా సెంటర్ల వంటి అధిక ఇంధన వినియోగ పరిశ్రమలకు భారత్‌లో విస్తరిస్తున్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, పటిష్ట జాతీయ విద్యుత్ గ్రిడ్ కీలక ఉపకరణాలు కాగలదని ఆయన ప్రకటించారు.
భారత్‌లో సెమీకండక్టర్ మెటీరియల్స్, పరికరాలు, పవర్ సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాజిస్టిక్స్ సంబంధిత అధునాతన సాంకేతికతల రంగాల్లో తమ కార్యకలాపాల విస్తరణపై సెమీకండక్టర్, ఏఐ చర్చలలో పాల్గొన్న జపాన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ధోలేరా, సనంద్ వంటి పురోగమిస్తున్న సెమీకండక్టర్ సముదాయాల్లో విశ్వసనీయ విద్యుత్తు, నీటి సరఫరా, నిపుణ మానవ వనరులు, సామాజిక మౌలిక సదుపాయాలు సహా అనుబంధ సౌకర్యాలపైనా చర్చల్లో దృష్టి సారించారు.
జపాన్ ఆర్థిక-వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ అకాజావా ర్యోసేతో పాటు జెట్రో, జేబీఐసీ, జైకా సంస్థల సీనియర్ ప్రతినిధులతోపై శ్రీ గోయల్ చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పటిష్ట సరఫరా శ్రేణులు, తయారీలో సహకారం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు సహా భారత్ ప్రగతి ప్రస్థానంలో జపాన్ కంపెనీలకు మరింత భాగస్వామ్యం వగైరా అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.
జపాన్‌లో 1,500కు పైగా ప్రముఖ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కెడాన్రెన్’తో సంప్రదింపుల సందర్భంగా భారత్-జపాన్ ఆర్థిక భాగస్వామ్యం పరిధి విస్తరిస్తుండటాన్ని శ్రీ గోయల్ వివరించారు. ఇందులో సంప్రదాయ వాణిజ్యంతో పాటు ఆర్థిక భద్రత, పటిష్ట సరఫరా వ్యవస్థ, ఆధునిక సాంకేతికత, కాలుష్య రహిత ఇంధనం, రక్షణ రంగ తయారీ, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాలున్నాయని ఆయన తెలిపారు. భారత్‌లో పెట్టుబడులను పెంచడంతోపాటు కార్యకలాపాలను విస్తరించుకోవాలని ఆయన జపాన్ కంపెనీలను ఆహ్వానించారు.
అంతకుముందు జపాన్ వ్యాపారవేత్తలు శ్రీ గోయల్‌కు ఘన స్వాగతం పలకడంతోపాటు అనేక కీలకాంశాలపై ఆయన తమకు అందుబాటులో ఉంటూ చురుగ్గా చర్చల్లో పాల్గొనడాన్ని ప్రశంసించారు. భారత్ పురోగమనంపై తమ ప్రగాఢ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ దేశవ్యాప్తంగా వ్యూహాత్మక సంబంధాల విస్తరణ, పెట్టుబడుల వైవిధ్యంపై తమ నిబద్ధతను వారు ప్రకటించారు.
నగోయా నగరంలో నిర్వహించిన “భారత్-జపాన్ భావితరం ఆర్థిక భాగస్వామ్యం” రోడ్‌షోలోనూ శ్రీ గోయల్ ప్రసంగించారు. చుకేరెన్, తదితర ప్రముఖ వ్యాపార సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ రోడ్‌షోలో చుబు ప్రాంతానికి చెందిన 80కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొన్నాయి. ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, మెషీన్ టూల్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటో విడిభాగాలు, సూక్ష్మఇచిన్న-మధ్య తరహా పరిశ్రమల)పైనా ఈ సందర్భంగా చర్చించారు. భారత్‌లోని యువ ప్రతిభావంతులతతో చుబు ప్రాంత సాంకేతిక-ఇంజనీరింగ్ బలాలు జోడు కడితే సరికొత్త తయారీ, సాంకేతిక భాగస్వామ్యాలకు గణనీయ అవకాశాలు ఉంటాయని శ్రీ గోయల్ చెప్పారు.
ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని, దేశానికిగల బలమైన ఆర్థిక పునాదులకు ఇది నిదర్శనమని శ్రీ గోయల్ పేర్కొన్నారు. భారత్ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యం దిశగా పురోగమిస్తోందని తెలిపారు. దేశంలో భారీ ఆకాంక్షలుగల మధ్యతరగతి, విస్తరిస్తున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పటిష్ట బ్యాంకింగ్ రంగం, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, మెరుగవుతున్న వ్యాపార వాతావరణం వంటివి దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు గణనీయ అవకాశాలను సృష్టిస్తాయని ఆయన వివరించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025నాటి జపాన్ పర్యటనలో అంగీకారం కుదిరిన మేరకు- రాబోయే దశాబ్దంలో భారత్‌లోకి 10 ట్రిలియన్ జపనీస్ యెన్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యం దిశగా కృషికి శ్రీ గోయల్ పర్యటన ఉత్తేజమిచ్చింది. భారత భావితరం వృద్ధి దశలో… ముఖ్యంగా తయారీ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవలు, సెమీకండక్టర్లు, ఏఐ, కాలుష్య రహిత ఇంధనం, భవిష్యత్తరం పరిశ్రమలలో జపాన్ సంస్థాగత పెట్టుబడిదారులు, కంపెనీల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచాలని శ్రీ గోయల్ పిలుపునిచ్చారు.
నిక్కీ ఆసియా నిర్వహించిన ఒక ఇష్టాగోష్ఠిలోనూ శ్రీ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల రూపురేఖలపై జపాన్, భారత వ్యాపార, మీడియా వర్గాలతో ఆయన చర్చించారు.
భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యంలో బలమైన పురోగతిని శ్రీ గోయల్ పర్యటన పునరుద్ఘాటించింది. అంతేకాకుండా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, పారిశ్రామిక సహకారాన్ని మరింతగా పెంచే ప్రయత్నాలకు కొత్త ఉత్తేజమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల తయారీ, సాంకేతిక, పెట్టుబడుల కేంద్రంగా భారత్ రూపాంతరీకరణలో జపాన్ మరింతగా పాలుపంచుకోవడానికి అనువైన పునాదిని ఇది బలోపేతం చేసింది. అలాగే, పరస్పర ప్రయోజనకర వృద్ధి, ఆవిష్కరణలకు కొత్త బాటలు పరచింది.
***
(రిలీజ్ ఐడి: 2303846)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7