వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టోక్యోలో ‘భారత్-జపాన్ స్టార్టప్ రౌండ్‌టేబుల్‌’ సమావేశంలో వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగం


భారత్‌లో వేగంగా పురోగమిస్తున్న అంకురావరణ వ్యవస్థను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి

స్టార్టప్.. డీప్-టెక్.. ఆవిష్కరణలు.. ‘ఎంఎస్ఎంఈ’ రంగాల్లో సహకార విస్తృతిపై నిబద్ధతను పునరుద్ఘాటించిన భారత్.. జపాన్

జపాన్‌లోని 40 కంపెనీల భాగస్వామ్యంతో భారత్-జపాన్ స్టార్టప్ రౌండ్‌టేబుల్‌ సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 26 AUG 2026 5:00PM by PIB Hyderabad

  పాన్‌ రాజధాని టోక్యోలో నిర్వహించిన భారత్-జపాన్ స్టార్టప్ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు ప్రసంగించారు. గడచిన దశాబ్ద కాలంలో దాదాపు 2,50,000 అంకుర సంస్థలు ఏర్పాటు కావడం ద్వారా ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకురావరణ వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అతి పెద్ద దేశీయ మార్కెట్ మాత్రమేగాక విస్తృత శాస్త్ర-సాంకేతిక, ఇంజినీరింగ్, మ్యాథ్‌మెటిక్స్ (స్టెమ్‌) ప్రతిభ సహా సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలతో భారత్‌ అపార అవకాశాల గనిగా ఉన్నదని పేర్కొన్నారు. అలాగే, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణావరణ వ్యవస్థ వంటివి జపాన్ సాంకేతిక, పెట్టుబడి, ఆవిష్కరణల భాగస్వామ్యాలకు భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుపుతున్నాయని చెప్పారు.

ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో రెండు దేశాల సీనియర్ ప్రభుత్వాధికారులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ అగ్రగాములు, అంకుర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంకుర సంస్థలు, డీప్ టెక్నాలజీ, ఆవిష్కరణలు, ‘ఎంఎస్ఎంఈ’ వంటి  రంగాల్లో సహకార విస్తృతికి భారత్, జపాన్‌ తమ సంయుక్త నిబద్ధతను పునరుద్ఘాటించాయి. సాంకేతికభాగస్వామ్యాల బలోపేతం, పెట్టుబడులకు ప్రోత్సాహం, ఆవిష్కరణాధారిత ఆర్థిక సహకారంలో తదుపరి దశను వేగిర పరచడం వగైరాలపై చర్చల్లో దృష్టి కేంద్రీకరించారు.

సమావేశంలో పాల్గొన్నవారికి జపాన్‌లో భారత రాయబారి నగ్మా మహమ్మద్ మాలిక్ తొలుత స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య విస్తృతమవుతున్న అంకుర సంస్థల స్థాయి సంబంధాల గురించి ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్-జపాన్ పిచింగ్ సిరీస్ ఇప్పటికే 65 భారత అంకుర సంస్థలను సుమారు 100 జపాన్‌ కార్పొరేషన్లలో అనుసంధానించగా, 30కి పైగా వాణిజ్య ఒప్పందాలు ఖరారయ్యాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో 222 మంది సభ్యుల భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందం పాల్గొనడం ద్వారా ఈ రెండు ఆవిష్కరణావరణ వ్యవస్థల మధ్య సరికొత్త-శాశ్వత భాగస్వామ్యాలకు అవకాశం లభిస్తున్నదని ఆమె వివరించారు.

భారత్-జపాన్ అంకురావరణ సహకారంలో తదుపరి దశను వేగిరపరచే దిశగా నాలుగు మూలస్తంభాల ఆధారిత దార్శనిక చట్రాన్ని శ్రీ గోయల్ ప్రతిపాదించారు. ఈ మేరకు 1.ప్రారంభ దశ పరిశోధన, డీప్-టెక్ ఆవిష్కరణలు, వాణిజ్యీకరణకు దీర్ఘకాలిక మూలధన సమీకరణ కోసం జపాన్-భారత్ డీప్-టెక్ కేపిటల్‌ కారిడార్. 2. ఉభయ దేశాల విశ్వవిద్యాలయాలు, ఇంక్యుబేటర్లు, పరిశోధన-అభివృద్ధి సంస్థలు, ప్రయోగశాలలు, పరీక్షా సౌకర్యాలను అనుసంధానించే ద్విముఖ ఆవిష్కరణల వారధి. 3. భారత విస్తీర్ణం, ఇంజినీరింగ్ ప్రతిభ, వ్యవస్థాపన చైతన్యాన్ని- జపాన్ పటిష్ట ఇంజినీరింగ్, సాంకేతికత, ఉత్పాదక సామర్థ్యాలతో అనుసంధానించే ఉత్పాదక-సాంకేతిక ఏకీకరణ. 4.భారత పారిశ్రామికవేత్తలు, జపాన్‌ కార్పొరేషన్లు, వెంచర్ ఫండ్లు, వ్యూహాత్మక పెట్టుబడిదారుల మధ్య నిరంతర సంప్రదింపుల సౌలభ్యం కోసం సంయుక్త స్టార్టప్ పిచింగ్ వేదికలు ఈ చట్రంలో కీలకంగా ఉంటాయి.

డీప్-టెక్ సంస్థలకు మద్దతుపై ప్రధానంగా దృష్టి సారిస్తూ దాదాపు 100 కోట్ల డాలర్లతో రెండో ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్‌’ ఏర్పాటుకు భారత్‌ ప్రతిపాదించిందని, ఇందులో జపాన్‌ పెట్టుబడిదారుల భాగస్వామ్యం మరింత అవసరమని ఆయన ఆహ్వానం పలికారు.

భారత అంకురావరణ వ్యవస్థ నానాటికీ పరిణతి సాధిస్తుండటంపై జపాన్ భాగస్వాములు హర్షం ప్రకటించారు. జపాన్ తన సాంకేతిక సామర్థ్యాలను పంచుకోవడమే కాకుండా సామాజిక-ప్రగతి సంబంధ సవాళ్లను విస్తరణీయ వ్యాపార అవకాశాలుగా మార్చగల భారత్‌ సామర్థ్యం నుంచి అనుభవాలను స్వీకరించగలదని పేర్కొన్నారు. ఈ మేరకు జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహే హరా మాట్లాడుతూ- ద్వైపాక్షిక భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని ప్రస్ఫుటం చేశారు. భారతీయ మార్కెట్‌లో గల అపార అవకాశాలను జపాన్‌లోని మరిన్ని అంకుర సంస్థలకు విశదం చేయాలని జైకా యోచిస్తున్నదని ఆయన తెలిపారు.

టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం, ‘జెట్రో’ సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జపాన్ కంపెనీలను భారత రాయబార కార్యాలయం భాగస్వామ్యంతో ఈ వేదిపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు “స్పార్క్స్ గ్రూప్, ఎంయూఎఫ్‌జీ ఇన్నోవేషన్ పార్ట్‌నర్స్, బియాండ్ నెక్స్ట్ వెంచర్స్ ఇంక్., ఇంక్యుబేట్ ఫండ్ ఆసియా, మిజుహో ఫైనాన్షియల్ గ్రూప్, ఎస్‌బీఐ ఇన్వెస్ట్‌మెంట్, ఫుజిత్సు లిమిటెడ్, డిజి డైవా వెంచర్స్, ఆస్ట్రో గేట్ ఇంక్., ఇంక్యుబేట్ ఫండ్, ఇన్‌స్టాలింబ్ ఇంక్., యూనివర్సల్ మెటీరియల్స్ ఇంక్యుబేటర్ కో., లిమిటెడ్, క్యోటో ఫ్యూజనీరింగ్ లిమిటెడ్ మరియు ఏరోసెన్స్ ఇంక్” వగైరా సుమారు 40 ప్రముఖ జపాన్ కంపెనీల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. వివిధ రంగాల అంకురాలు, భారత వాణిజ్య మండలాల, వ్యాపార సంస్థల ప్రతినిధి బృందాలు కూడా దీనికి హాజరయ్యాయి.

సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), అంకుర సంస్థలు, ప్రపంచ సరఫరా వ్యవస్థల అనుసంధాన ప్రాధాన్యాన్ని ప్రతినిధులందరూ స్పష్టం చేశారు. అంతేగాక భారత్‌లో తయారీ-విస్తరణను ఆకాంక్షించే కంపెనీలకు సర్వసన్నద్ధ (ప్లగ్-అండ్-ప్లే) మౌలిక సదుపాయాల కల్పన ఆవశ్యకతను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.

భారత్-జపాన్ భవిష్యత్‌ పెట్టుబడులకు కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, ఆరోగ్య సంరక్షణ, అంతరిక్షం, రక్షణ, ఆధునిక తయారీ, డీప్ టెక్నాలజీ ప్రధాన రంగాలుగా అందుబాటులో ఉంటాయని వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు పేర్కొన్నారు. భారత అంకురావరణ ప్రధానంగా ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్ వ్యాపారాల నుంచి తయారీ, సాంకేతికత ఆధారిత సంస్థల వైపు స్పష్టంగా పరిణామం చెందుతున్నదని వారు గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో- ఏరోస్పేస్-రక్షణ, డ్రోన్లు, కృత్రిమ మేధ, ఆరోగ్య సంరక్షణ, ప్రొస్థెటిక్స్, రోబోటిక్స్, వేర్‌హౌస్ ఆటోమేషన్, రవాణా, డిజిటల్ ఆరోగ్య రంగాల్లో తమ సామర్థ్యాన్ని భారత అంకుర సంస్థలు ప్రదర్శించాయి. టెక్నాలజీ ధ్రువీకరణ, ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్, పెట్టుబడి, మార్కెట్ యాక్సెస్, జపనీస్, గ్లోబల్ సరఫరా శ్రేణితో అనుసంధానం తదితరాల దిశగా అనేక కంపెనీలు జపాన్‌తో భాగస్వామ్యం అవకాశాలను అన్వేషించాయి.

భారత్-జపాన్‌ పరస్పర పూరక బలాలను ఈ రౌండ్‌టేబుల్ సమావేశం గుర్తించింది. భారత్‌ విస్తీర్ణం, ప్రతిభ, డిజిటల్ సామర్థ్యాలు, వ్యవస్థాపనకు వేగాన్నిస్తున్నాయి. ఆధునిక సాంకేతికత, తయారీ రంగంలో నాణ్యత, ప్రపంచ నాణ్యత ప్రమాణాలకు జపాన్ దీర్ఘకాలిక పెట్టుబడి భరోసానిస్తోంది. ఈ బలాలను జోడిస్తే, భారత్‌-జపాన్ తదితర దేశాల మార్కెట్లకు సేవలందించే, ప్రపంచవ్యాప్త పోటీతత్వంగల సంస్థలు, సాంకేతికతల సృష్టి సుసాధ్యం కాగలదు.

వ్యక్తిగత భాగస్వామ్యాల నుంచి సంస్థాగత భారత్-జపాన్ అంకుర, ఆవిష్కరణ భాగస్వామ్యం దిశగా పయనించాలనే సమష్టి లక్ష్యంతో ఈ సమావేశంలో చర్చలు ముగిశాయి. ఈ భాగస్వామ్యానికి క్రమబద్ధ పెట్టుబడిదారు-అంకుర సంస్థల సంప్రదింపులు, సాంకేతిక భాగస్వామ్యాలు, సహ-పెట్టుబడి యంత్రాంగాలు, రెండు దేశాల్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, ఇంక్యుబేటర్లు, పరిశ్రమల మధ్య బలమైన అనుసంధాన వంటివి మద్దతుగా ఉండటం అవశ్యం.

 

***


(రిలీజ్ ఐడి: 2303563) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam