ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి ధోరణులను నిశితంగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం
ఆందోళన అవసరం లేదు... సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా దానంతట అదే తగ్గిపోతోంది... కొత్త, అసాధారణ రకం వైరస్ జాడలేవీ లేవని తెలిపిన ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ రాజీవ్ బహల్
దేశంలో హెచ్1ఎన్1 అంచనా వేసిన సీజనల్ లక్షణాలనే చూపుతోంది... అసాధారణ జన్యు మార్పులేవీ లేవని ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
25 AUG 2026 6:21PM by PIB Hyderabad
ఆరోగ్య పరిశోధన విభాగం (డీహెచ్ఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ)లతో సమన్వయం ద్వారా... ఒక పటిష్ఠమైన దేశవ్యాప్త నిఘా నెట్‌వర్క్ సహాయంతో దేశంలో విస్తరిస్తున్న సీజనల్ శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి ధోరణిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్ఎఫ్‌డబ్ల్యూ) నిశితంగా పర్యవేక్షిస్తోంది.
ఆరోగ్య పరిశోధన విభాగం (డీహెచ్ఆర్) కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుత ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి తీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు... ఇటీవలి సంవత్సరాల్లో గమనించిన సీజనల్ నమూనాకు అనుగుణంగానే ఉన్నాయన్నారు.

73 డీహెచ్ఆర్-ఐసీఎంఆర్ వైరస్ పరిశోధన-నిర్ధారణ ప్రయోగశాలల నెట్‌వర్క్ ద్వారా కొనసాగుతున్న జన్యు సంబంధిత, వ్యాధి వ్యాప్తి సంబంధిత పర్యవేక్షణ ముఖ్యమైన భరోసాను అందించింది.
ప్రస్తుతం వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా A (హెచ్1ఎన్1) వైరస్‌లు A/మిసౌరీ/11/2025 (హెచ్1ఎన్1) పీడీఎమ్09-రకం వైరస్‌లుగా గుర్తించారు. హెమాగ్లూటినిన్ (హెచ్ఏ) జన్యు విశ్లేషణ ఈ ఐసోలేట్‌లను క్లేడ్ 6B.1A.5a2a, సబ్‌క్లేడ్ D.3.1.1కి చెందినవిగా సూచిస్తోంది.
2025 నుంచి ఈ వైరస్ రకం దేశంలో నిరంతర వ్యాప్తిలో ఉందని డాక్టర్ బహల్ తెలిపారు. గమనించిన జన్యుపరమైన మార్పులు, సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లలో కనిపించే సాధారణ యాంటిజెనిక్ డ్రిఫ్ట్‌కు అనుగుణంగానే ఉన్నాయి. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నప్పుడు ఇటువంటి చిన్న జన్యుపరమైన మార్పులు సాధారణంగా జరుగుతాయి. అవి స్వయంగా ఒక కొత్త లేదా ప్రమాదకరమైన రకం వైరస్ ఆవిర్భావానికి సూచన కాదు అని ఆయన వివరించారు.

అందువల్ల ప్రస్తుత పరిశీలనలు కొత్త ఇన్‌ఫ్లూయెంజా ముప్పు తలెత్తడాన్ని సూచించడం లేదనీ, ఇవి అంచనా వేసిన సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల ప్రవర్తనకు అనుగుణంగానే ఉన్నాయని డాక్టర్ బహల్ స్పష్టం చేశారు.
ఇన్‌ఫ్లూయెంజా A (హెచ్1ఎన్1) సహా సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా కారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో ప్రధానంగా తేలికపాటి, వాటంతట అవే తగ్గిపోయే సాధారణ శ్వాసకోశ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దీని సాధారణ లక్షణాలు: జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, అలసట, నీరసం.
చాలా మందిలో సహాయక సంరక్షణ, తగినంత విశ్రాంతి, ద్రవ పదార్థాలు తీసుకోవడం ద్వారానే లక్షణాలు మెరుగుపడతాయి. కేవలం హెచ్1ఎన్1 ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యం కలుగుతుందనీ, ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందనీ అర్థం కాదు. సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా సాధారణంగా తేలికపాటిదే అయినప్పటికీ, కొంతమందిలో అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ బహల్ తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలు లేదా అనుబంధ-వ్యాధులు ఉన్నవారు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తులు మరింత జాగ్రత్త వహించాలనీ, వారికి ఇన్‌ఫ్లూయెంజా వంటి లక్షణాలు కనిపిస్తే సకాలంలో వైద్య సలహా తీసుకోవాలనీ ఆయన సూచించారు.
ప్రజలంతా సాధారణ శ్వాసకోశ సంబంధిత పరిశుభ్రతను, అంటువ్యాధుల నివారణ చర్యలను పాటించాలని ఆయన సూచించారు.
చేయాల్సినవి:
దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కుకు చేయి లేదా రుమాలు అడ్డు పెట్టుకోండి.
సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోండి లేదా తగిన హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించండి.
అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండండి, ఇతరులతో సన్నిహితంగా మెలగవద్దు.
శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోండి, తగినంత విశ్రాంతి తీసుకోండి.
ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోండి.
లక్షణాలు తీవ్రంగా, నిరంతరాయంగా కొనసాగితే, లేదా మరింత తీవ్రమవుతుంటే వైద్య సలహా తీసుకోండి.
పరీక్షలు లేదా చికిత్సకు సంబంధించి వైద్య సలహాను పాటించండి.
చేయకూడనివి:
హెచ్1ఎన్1 ఉన్నట్లు నిర్ధారణ అయితే భయపడవద్దు.
వైద్య సలహా లేకుండా యాంటీవైరల్ లేదా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు.
లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులతో సన్నిహితంగా మెలగవద్దు.
కడగని, శుభ్రంగా లేని చేతులతో కళ్ళు, ముక్కు, నోటిని తాకవద్దు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డీహెచ్‌ఆర్, ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీలు దేశవ్యాప్తంగా ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి ధోరణులను పర్యవేక్షించడానికి నిరంతర ఎపిడెమియోలాజికల్, వైరలాజికల్, జెనోమిక్ నిఘాను నిర్వహిస్తున్నాయి. విస్తృతమైన వీఆర్‌డీఎల్ నెట్‌వర్క్... వ్యాప్తిలో ఉన్న శ్వాసకోశ వైరస్‌లను సకాలంలో గుర్తించడానికి, వాటి లక్షణాలను నిర్ధారించడానికి వీలు కల్పిస్తుంది. కొత్తగా తలెత్తే ఏవైనా ధోరణులకు ప్రజారోగ్య అధికారులు తగిన విధంగా స్పందించడానికీ ఇది సహాయపడుతుంది.
ఇన్‌ఫ్లూయెంజా కార్యకలాపాలు, వ్యాప్తిలో ఉన్న రకాలు, వ్యాధి తీవ్రతలో మార్పులను ఈ నిఘా యంత్రాంగం నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంటుంది.
ప్రస్తుతం లభించిన ఆధారాలు... హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పును గానీ, కొత్త రకం వైరస్ ఆవిర్భావాన్ని గానీ సూచించడం లేదు.
ప్రజలంతా దీని గురించి తగిన సమాచారం తెలుసుకొంటూ అప్రమత్తంగా ఉండాలి. భయపడే అవసరం లేదు. సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా మనకు సుపరిచితమైన, నిత్యం పర్యవేక్షించే సాధారణ శ్వాసకోశ సంబంధిత అంటువ్యాధి. సాధారణ నివారణ చర్యలను పాటించడం, అవసరమైనప్పుడు సకాలంలో వైద్యుడిని సంప్రదించడం, అనవసరమైన మందులను వాడకుండా ఉండటం వంటివి వ్యక్తులను, సమాజాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
***
(రిలీజ్ ఐడి: 2303311)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11