పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
మంగోలియాలోని ఉలాన్‌బాతోర్ వేదికగా జరుగుతున్న యూఎన్‌సీసీడీ సీఓపీ17 సదస్సులో భూసార పరిరక్షణ, కరవు నిరోధకతకు వైవిధ్యభరితమైన, సరైన, ఊహించదగిన, స్థిరమైన అంతర్జాతీయ ఆర్థిక సహకారం అవసరమని పిలుపునిచ్చిన భారత్
భూసార పరిరక్షణకు భారత్ విజయవంతంగా అమలు చేసిన సమ్మిళిత హరిత ఆర్థిక విధానాన్ని ప్రశంసించిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి
భూసార పరిరక్షణ కేవలం ఖర్చు కాదు… ఆహారం, నీరు, జీవవైవిధ్యం, జీవనోపాధి, దీర్ఘకాలిక స్థిరత్వంపై పెట్టుబడి: శ్రీ భూపేందర్ యాదవ్
प्रविष्टि तिथि:
24 AUG 2026 12:05PM by PIB Hyderabad
మంగోలియాలోని ఉలాన్‌బాతోర్ వేదికగా ఎడారీకరణ నిర్మూలనపై యూఎన్ సదస్సు (యూఎన్‌సీసీడీ) 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్‌లో 'భూసార పరిరక్షణ, కరవు నివారణకు వినూత్న ఆర్థిక విధానాలు' అంశంపై మంత్రివర్గ చర్చ జరిగింది. ఈ సదస్సులో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసార పరిరక్షణ, కరవు నివారణకు భారత్ అమలు చేస్తున్న వినూత్న, వైవిధ్యభరితమైన ఆర్థిక విధానాలను వివరించారు.
భూమి పునరుద్ధరణకు నిరంతరం పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ… "భూసార పరిరక్షణ కేవలం ఖర్చు కాదు… ఆహారం, నీరు, జీవవైవిధ్యం, జీవనోపాధి, దీర్ఘకాలిక స్థిరత్వంపై పెట్టుబడి" అని శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు. ఎడారీకరణ, భూసార క్షీణత, కరవులను పెద్దఎత్తున ఎదుర్కొనేందుకు ప్రభుత్వ బడ్జెట్‌కు అతీతంగా వైవిధ్యభరితమైన, ఊహించదగిన, స్థిరమైన ఆర్థిక వనరులతో పాటు బలమైన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు అవసరమని స్పష్టం చేశారు.
వాతావరణ మార్పుల అనుకూలత, సుస్థిర భూవినియోగం, అడవులు, వ్యవసాయం, అడవుల పెంపకం, జీవవైవిధ్య సంరక్షణకు నిధులను సమకూర్చే భారతదేశ సమ్మిళిత హరిత-ఆర్థిక విధానాన్ని మంత్రి వివరించారు. భూసార పరిరక్షణ, కరువు నివారణ, సుస్థిర అడవుల పెంపకం, ఇతర పర్యావరణ, వాతావరణ ప్రాధాన్యతలకు పెట్టుబడిని సమీకరించే మార్గంగా ప్రభుత్వ హరిత బాండ్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
భారతదేశ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ గురించి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది క్షీణించిన అటవీ భూముల పునరుద్ధరణకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఆర్థిక సహాయం చేసేందుకు వీలు కల్పిస్తుంది. పునరుద్ధరణ ప్రారంభించిన అయిదేళ్ల తర్వాత కనీసం 40 శాతం చెట్ల సాంద్రత సాధించిన తర్వాత ఈ క్రెడిట్లను జారీ చేస్తారు. వీటిని ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, చట్టబద్ధమైన మొక్కల పెంపకం, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనల ద్వారా ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. భారతదేశ ప్రత్యామ్నాయ అటవీ సంరక్షణ విధానంలో అటవీ భూముల మళ్లింపు ద్వారా వచ్చే నిధులను... అటవీ పునరుద్ధరణ, పర్యావరణ వ్యవస్థల పరిరక్షణకు మళ్లిస్తారని తెలిపారు. కార్పొరేట్ నిధులను పర్యావరణ నియంత్రణ ప్రక్రియలతో అనుసంధానిస్తారని చెప్పారు.
సమన్వయ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ.. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, ప్రత్యామ్నాయ అటవీ పెంపకం నిధులు వంటి విభిన్న విధానాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక వనరులను ఒకచోట చేర్చటం, పౌరుల భాగస్వామ్యంతో అనుసంధానించటం "సమగ్ర ప్రభుత్వం, సమగ్ర సమాజం" దృక్పథాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రి తెలిపారు. "ఆర్థిక వనరులు నిరంతరంగా, పరిశీలనకు వీలుగా ఉండేలా, స్థానిక కమ్యూనిటీలకు అనుసంధానమై ఉండాలి" అని శ్రీ భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. పర్యావరణ పునరుద్ధరణ, కరవు నివారణకు అదనపు, సరైన, ఊహించదగిన, అంతర్జాతీయ ఆర్థిక సహాయానికి ఇవి ప్రత్యామ్నాయం కాలేనప్పటికీ ప్రాముఖ్యత గల దేశీయ వనరులు ఏం సాధించగలవో భారతదేశ అనుభవం నిరూపిస్తోందని ఆయన తెలిపారు.
అనుభవాలు, రక్షణ విధానాలు, వ్యవస్థాగత ఏర్పాట్లు, నేర్చుకున్న పాఠాలు, దిద్దుబాట్లు అవసరమైన అంశాలను పంచుకోవటానికి భారతదేశ నిబద్ధతను మంత్రి మరోసారి స్పష్టం చేశారు. "అంతిమంగా వినూత్న ఆర్థిక సహాయాన్ని... రూపకల్పన లేదా సమీకరించిన వనరుల ఆధారంగా కాక, అవసరమైన భూమి, పర్యావరణ వ్యవస్థలు, కమ్యూనిటీలను చేరిందా, శాశ్వత పునరుద్ధరణను, స్థిరత్వాన్ని నెలకొల్పిందా వంటి అంశాల ఆధారంగా అంచనా వేయాలి" అని చెబుతూ ప్రసంగాన్ని ముగించారు.
***
(रिलीज़ आईडी: 2302834)
आगंतुक पटल : 8