ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్లో భారతదేశ తొలి నాన్-జీఎంవో అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు


భారత వ్యవసాయ పరివర్తనకు అవశ్యకమైన సాంకేతికత, ఆవిష్కరణలు, స్వయం సమృద్ధికి ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు

స్వదేశీ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనం ఆత్మనిర్భర్ భారత్ను ప్రతిబింబిస్తుంది: ఉపరాష్ట్రపతి

"ఒక చిన్న ప్రారంభం ఒక పెద్ద దార్శనికత, కలకు దారితీయాలి": ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ మార్కెట్ల వరకు గౌర్మెట్ పాప్కార్నికా ప్రయాణాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు

प्रविष्टि तिथि: 24 AUG 2026 2:05PM by PIB Vijayawada

ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులో భారతదేశ తొలి నాన్-జీఎంవో అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈరోజు ఆవిష్కరించారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం దిశగా వ్యవసాయ రంగంలో దీన్ని ఒక కీలక ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ తోపాటుగా మరో ఏడు రాష్ట్రాలకు చెందిన అత్యుత్తమ పనితీరు కనబరిచిన రైతులను మరియు గౌర్మెట్ పాప్కార్నికా అనుబంధ భాగస్వాములను ఈ సందర్భంగా ఆయన సత్కరించారు.

ఈ సభాను ఉద్దేశించిన ప్రసంగించిన ఉపరాష్ట్రపతి.. రైతులు దేశానికి వెన్నెముక అని, వ్యవసాయం భారతదేశ నాగరిక, సాంస్కృతిక జీవనాన్ని తీర్చిదిద్దిందని అన్నారు. భారత వ్యవసాయాన్ని బలోపేతానికి అవసరమైన సాంకేతికత, ఆవిష్కరణలు, స్వదేశీ విత్తనాల అభివృద్ధి ప్రాముఖ్యతను తెలియజేశారు.

అధిక నాణ్యత గల పాప్కార్న్ మొక్కజొన్న కోసం భారతదేశం చాలా సంవత్సరాలుగా దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ సాంకేతికత పైనే ఆధారపడిందని అన్నారు. ఈ కొత్త స్వదేశీ హైబ్రిడ్ కారణంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే దిశగా కీలక ముందడుగు అని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రపంచ మార్కెట్లలో పోటీపడగల సామర్థ్యంతో, భారత నేలలో పండించి భారతీయ పరిష్కారాన్ని అభివృద్ధి చేసినందుకు ఆయన గౌర్మెట్ పాప్కార్నికా సంస్థను, రైతులను ప్రశంసించారు.

కేంద్ర ప్రభుత్వ పీఎం-కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్, నమో డ్రోన్ దీదీ వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలలో ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు దూరదృష్టితో చేపట్టిన రైతు బజార్లు, ఉద్యానవన మరియు ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, రైతు ఆధారిత సహాయక వ్యవస్థలు వంటి కార్యక్రమాలను అభినందించారు.

ఎనిమిది రాష్ట్రాల్లోని 17,500 మందికి పైగా రైతులు, దాదాపు 40,000 ఎకరాల్లో సాగు చేస్తూ గౌర్మెట్ పాప్కార్నికా ప్రయాణంలో భాగస్వాములయ్యారంటూ, రైతులు - వ్యాపార సంస్థల భాగస్వామ్య విస్తర్ణ గురించి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక స్థానిక సంస్థగా ప్రారంభమైన ప్రధాన పాప్ కార్న్ మొక్కజోన్న ప్రాసెసింగ్ సంస్థగా ఎదిగి, వేలాది రైతు కుటుంబాలకు మార్కెట్ అందుబాటును, ఆదాయ అవకాశాలను పెంచిన శ్రీ ఎస్.బి.పీ పట్టాభిరామ్, గౌర్మెట్ పాప్కార్నిక సంస్థ ను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.

అభివృద్ధి చెందిన భారతదేశం "నేల నుంచి" నిర్మాణమవుతుందని, అంటే రైతులు సాగు చేసే నేల నుంచి, శాస్త్రవేత్తలుపారిశ్రామికవేత్తలు అభివృద్ధి చేసి అందించే నాణ్యమైన విత్తనాల నుంచి, స్వావలంబనైన ప్రతి పంట భూమి ద్వారానే సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆవిష్కరణ, వ్యవస్థాపకత, రైతు భాగస్వామ్యాలు కలిసికట్టుగా ఒక బలమైన, స్వయం సమృద్ధిగల, అంతర్జాతీయ స్థాయిలో పొటీపడగల వ్యవసాయ రంగాన్ని ఎలా సృష్టించగలవో ముసునూరు కార్యక్రమం నిరూపిస్తోందని ఆయన అన్నారు.

ఉపరాష్ట్రపతి గౌర్మెట్ పాప్కార్నికా ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాన్ని సందర్శించారు. మొక్కజొన్న ప్రాసెసింగ్, నాణ్యతా నియంత్రణ, ప్యాకేజింగ్, నిల్వ వంటి అంశాల గురించి ఆయనకు సంస్థ ప్రతినిధులు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు శ్రీ నారా లోకేష్, శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీ కొలుసు పార్థసారథిలతో పాటు ఇతర ప్రముఖులు మరియు గౌర్మెట్ పాప్కార్నిక ప్రతినిధులు పాల్గొన్నారు.

******


(रिलीज़ आईडी: 2302708) आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Telugu , Malayalam