ఆర్థిక మంత్రిత్వ శాఖ
'ఆపరేషన్ బ్లాక్ హాక్' ద్వారా అంతర్రాష్ట్ర హెరాయిన్ ముఠాను పట్టుకున్న సీబీఎన్… 18.6 కిలోలకుపైగా ముడి హెరాయిన్ స్వాధీనం
అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
నాడు పోస్టు చేయడమైనది:
24 AUG 2026 10:03AM by PIB Hyderabad
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చేపట్టిన కీలక చర్యలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ విభాగాల అధికారులు 'ఆపరేషన్ బ్లాక్ హాక్'ను విజయవంతంగా నిర్వహించారు. లక్నో (యూపీ) సమీపంలో వెనువెంటనే చేపట్టిన చర్యల్లో మొత్తం 18.64 కిలోల ముడి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర అక్రమ రవాణా ముఠాకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ నిషేధిత పదార్థాలను ఉత్తరప్రదేశ్‌లో విక్రయించేందుకు ఈశాన్య రాష్ట్రం నుంచి అక్రమంగా తరలించారు.
సీబీఎన్ ఎంపీ విభాగం అందించిన సమాచారం ప్రకారం... ఈశాన్య ప్రాంతం నుంచి లక్నోకు తరలిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సీబీఎన్ ఎంపీ, యూపీ బృందాలు ఉమ్మడిగా చర్యలు చేపట్టాయి. ఈ మేరకు ఆగస్టు 20 నుంచి 21, 2026 మధ్యరాత్రి సుల్తాన్‌పూర్-లక్నో జాతీయ రహదారిపై వ్యూహాత్మకంగా తనిఖీలు నిర్వహించాయి.
వివిధ టోల్ ప్లాజాల వద్ద వాహనాన్ని ట్రాక్ చేసిన తర్వాత ఆగస్టు 21న లక్నో సమీపంలో అస్సాం రిజిస్ట్రేషన్ గల హ్యుందాయ్ క్రెటా కారును ప్రత్యేక నిఘా బృందం అడ్డుకుంది. ఆ వాహనంలో ఏమీ లభించలేదు. అందులోని ప్రయాణికులు ఏమీ తెలియదని చెప్పారు. అయితే కేవలం 500 కిలోమీటర్ల వ్యవధిలోనే నాలుగుసార్లు ఇంధనం నింపినట్లు చెప్పటంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఇంధన ట్యాంకును తట్టి చూడగా, తేడాగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాంకేతిక నిపుణుల సాయంతో లక్నోలోని సీబీఎన్ ఆఫీసులో ఇంధన ట్యాంకును విడదీసి చూశారు. అందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అర కనిపించింది. అందులో 25 వాటర్‌ప్రూఫ్ ప్యాకెట్లలో దాచిన 16.46 కిలోల ముడి హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
మరో సంఘటనలో సిలిగురి-లక్నో కారిడార్ గుండా ఒక భారీ వాహనం ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సీబీఎన్ యూపీ విభాగం ముందస్తు సమాచారం అందించింది. ఆ వాహనాన్ని పలు టోల్ ప్లాజాల వద్ద సీబీఎన్ బృందాలు పరిశీలిస్తూ వచ్చి, బారాబంకి సమీపంలో అడ్డుకున్నాయి. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, దాని బాడీ ఫ్రేమ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక రహస్య గదిలో దాచిన 2.16 కిలోల ముడి హెరాయిన్ బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు.
ముగ్గురు నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం-1985లోని కఠినమైన నిబంధనల ద్వారా కేసులు నమోదు చేశారు. రవాణాకు ఉపయోగించిన రెండు వాహనాలతో పాటు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మొత్తాన్ని అధికారులు జప్తు చేశారు. ఈ సరఫరా వెనుక ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ముఠాలను గుర్తించటంతో పాటు స్థానిక పంపిణీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఛేదించేందుకు ఆర్థిక, రవాణా అంశాలకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.
జప్తునకు సంబంధించి కీలక వివరాలు
-
మొత్తం స్వాధీనం చేసుకున్న డ్రగ్స్: 18.64 కిలోలు (కారు నుంచి 16.48 కిలోలు, వాణిజ్య సరకు రవాణా వాహనం నుంచి 2.16 కిలోలు)
-
సీజ్ చేసిన వాహనాలు: అస్సాం రిజిస్ట్రేషన్ గల హ్యుందాయ్ క్రెటా కారు, వాణిజ్య సరకు రవాణా వాహనం
-
మొత్తం అరెస్టులు: ముగ్గురు అనుమానితులు (ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం అరెస్టు)
-
దాచిన విధానం: లారీ ఫ్యూయల్ ట్యాంక్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన అర, ఇతర రహస్య ఛాంబర్లు
****
(రిలీజ్ ఐడి: 2302638)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16