హోం మంత్రిత్వ శాఖ
సిలిగురిలో పలు ‘ఎస్‌ఎస్‌బీ’ ప్రాజెక్టులకు కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభోత్సవం.. శంకుస్థాపన
“మూడు దేశాలు.. 8 రాష్ట్రాలతో సంధానంగల సిలిగురి కారిడార్ దేశ భద్రతతో ప్రత్యక్షంగా ముడిపడి ఉంది.. మోదీ ప్రభుత్వం దీన్ని త్రిభుజాకార భద్రత గ్రిడ్ ద్వారా అభేద్యంగా రూపొందిస్తోంది”
“ఒకే సరిహద్దు-ఒకే దళం’ పద్ధతిలో నేపాల్-భూటాన్‌లతో కంచె రహిత బహిరంగ సరిహద్దు భద్రత కింద అత్యంత కష్టతర బాధ్యత ‘ఎస్‌ఎస్‌బీ’కి అప్పగింత.. ఈ సిబ్బంది నిబద్ధతతోపాటు పొరుగు మిత్ర దేశాలతో వారికిగల సాంస్కృతిక అనుబంధాన్ని యావద్దేశం గౌరవిస్తుంది”
“స్వాతంత్య్రం వచ్చిన 80 ఏళ్ల తర్వాత ఎర్రకోట నుంచి వందేమాతరం గీతం సంపూర్ణ ఆలాపన సాగింది… ఈ అజరామర గీత సృష్టి ద్వారా స్వేచ్ఛా భారత్ సాంస్కృతిక జాతీయవాదాన్ని స్వీకరించి ముందుకు సాగాలని బంకిం బాబు ఎరుకపరిచారు”
“మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లుకు ఆమోదం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలలో పూర్తి గీతం ఆలాపనను ఒక భాగం చేశారు.. ఇది బంకిం బాబు దేశభక్తి సందేశాన్ని పిల్లలకు.. యువతకు చేరువ చేస్తోంది”
“చొరబాట్ల నిరోధం.. పశ్చిమ బెంగాల్ సహా దేశాన్ని సురక్షితం చేయడమే మా సంకల్పం… ఈ మేరకు బలమైన కంచె ఏర్పాటు అత్యంత పటిష్ట చర్య... ఇందులో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి కేవలం 45 రోజుల్లోనే
‘బీఎస్ఎఫ్’.. ‘ఎస్ఎస్‌బీ’లకు 1,139 ఎకరాల భూమిని స్వాధీనం చేశారు”
“పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ఈ దళాల కార్యక్రమాలకు ఎన్నడూ హాజరు కాలేదు.. ఈ దళాలు సహా ఐటీబీపీ బలగం కూడా ఏ రాజకీయ పార్టీకి లేదా ప్రభుత్వానికి చెందినవి కావు.. సరిహద్దులను రక్షించే ఈ బలగాలకు రాజకీయ పార్టీలన్నీ అండగా నిలవాలి”
“కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆమోదించిన 7 హై-స్పీడ్ రైల్ కారిడార్లలో ఢిల్లీ-సిలిగురి కూడా ఒకటి… ఇది 2-3 ఏళ్లలోపు పూర్తయితే రెండు నగరాల మధ్య ప్రయాణం కొన్ని గంటల్లోనే పూర్తవుతుంది”
“అమృత భారత్ పథకం ద్వారా సిలిగురి.. జల్పాయ్‌గురి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం.. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కింద సరిహద్దు గ్రామాల అనుసంధానంతో సురక్షిత.. భద్రమైన.. చైతన్యపూరిత భూ సరిహద్దు భావనను
ప్రోది చేస్తున్నాం”
నాడు పోస్టు చేయడమైనది:
21 AUG 2026 6:14PM by PIB Hyderabad
కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) సంబంధిత వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి, డార్జిలింగ్ లోక్‌సభ సభ్యుడు శ్రీ రాజు బిస్తా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ శ్రీ మహేష్ దీక్షిత్, సరిహద్దు నిర్వహణ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్, ఎస్‌ఎస్‌బీ డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ సింఘాల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఏడాది ఆగస్టు 15నాటి 80వ స్వాతంత్ర్య దినోత్సవం ఎంతో ప్రత్యేకమైనదని శ్రీ అమిత్ షా ఈ సందర్భంగా అభివర్ణించారు. జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడిచాక ఎర్రకోట పైనుంచి ఈ పూర్తి గేయాన్ని దేశ ప్రజలు సహా యావత్ ప్రపంచం తొలిసారి ఆలకించిందని చెప్పారు. బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన ఈ అజరామర గీతం మన స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపునివ్వడమే కాకుండా, స్వతంత్ర భారత్ రూపురేఖలకు దిశానిర్దేశం కూడా చేసిందని తెలిపారు. స్వతంత్ర భారత్ సాంస్కృతిక జాతీయవాదాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగాలని బంకిమ్ చంద్ర ఛటర్జీ ఈ గేయం ద్వారా స్పష్టం చేసినట్లు శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమయాన దేశ విభజన సంభవించినా నేటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వందేమాతరం గేయాన్ని ఎన్నడూ సహృదయంతో అంగీకరించలేదని కేంద్ర హోం మంత్రి అన్నారు. ప్రజల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంటులో వందేమాతరం ఆలపించినపుడు అందరూ లేచి నిలబడినా, గేయాన్ని పూర్తిగా పాడకపోవడం బాధాకరమన్నారు. ఇటీవల కేంద్ర హోం శాఖ పార్లమెంటులో ఒక బిల్లును ఆమోదింపజేసి, వందేమాతరం గేయాన్ని పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలలో భాగంగా చేయాలని నిర్దేశించిందన్నారు. ఇదొక చారిత్రక నిర్ణయమని, దీనివల్ల మన యువతకు, భావితరాలకు బంకిమ్ చంద్ర ఛటర్జీ అజరామర సందేశం అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో నిత్యం ‘వందేమాతరం’ పూర్తిగా పాడితే, పిల్లలలో బలమైన దేశభక్తి భావన కచ్చితంగా పెంపొందుతుందని చెప్పారు.
దేశాన్ని శక్తివంతం చేసే 7 బలమైన మార్గాలను ‘సప్తధార’ పేరిట ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. తయారీ రంగ సామర్థ్యం, రక్షణ శక్తి, వ్యవసాయం, ఆహార తయారీ, కాలుష్య రహిత, నీలి ఆర్థిక వ్యవస్థ సాంకేతికత-ఆవిష్కరణలు, గతిశక్తి (మౌలిక సదుపాయాలు), దేశ సాంస్కృతిక-ప్రభావశీల శక్తి అనే 7 కీలకాంశాలతో ఇది అనుసంధానమైందని చెప్పారు. దేశ పురోగమనంలో భాగస్వాములు కావాల్సిందిగా దేశ యువతకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారని ఆయన పేర్కొన్నారు. దేశం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం సహా మరో మూడేళ్లలో 8 కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు సహా ప్రధానమంత్రి మోదీ అనేక లక్ష్యాలను నిర్దేశించారని తెలిపారు. ఈ ఏడు అంశాల బలం తోడైతే, భారత్ తన స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు చేసుకునే వేళకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ దేశం అగ్రగామిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ఏనాడూ ‘ఎస్‌ఎస్‌బీ’, ‘బీఎస్‌ఎఫ్’ కార్యక్రమాలకు హాజరైన దాఖలాలు లేవని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈ రెండు దళాలతోపాటు ఐటీబీపీ బలగం కూడా ఏ రాజకీయ పార్టీకో లేదా ప్రభుత్వానికో చెందినవి కావన్నారు. అవి దేశ సరిహద్దులను రక్షించే బలగాలని, రాజకీయ పార్టీలన్నీ వాటి సిబ్బందికి అండగా నిలవాలని స్పష్టం చేశారు. చొరబాట్ల నిరోధంతోపాటు పశ్చిమ బెంగాల్ సహా దేశ భద్రతను కాపాడటం తమ సంకల్పమన్నారు. ఈ మేరకు సరిహద్దు కంచె నిర్మాణం అత్యంత బలమైన చర్య కాగలదని అని ఆయన అన్నారు. ఈ దిశగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చొరవను ప్రశంసిస్తూ- ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సరిహద్దు భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి సత్వర-సాధ్యమైనంత సహకారం లభిస్తోందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కేవలం 45 రోజుల్లోనే బీఎస్ఎఫ్, ఎస్‌ఎస్‌బీ కోసం 1,139 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఈ భూమిని కోరుతున్నప్పటికీ, బెంగాల్‌లోని ప్రభుత్వం అంగీకరించలేదని ఆయన గుర్తుచేశారు. జాతీయ భద్రతకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వాన్ని పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎన్నుకున్నారని ఆయన అన్నారు.

సిలిగురిలోని ఎస్‌ఎస్‌బీ సరిహద్దు ప్రధాన కార్యాలయ పరిపాలన భవనానికి ఈ రోజు శంకుస్థాపన చేశామని, ఇది 80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతుందని శ్రీ అమిత్ షా తెలిపారు. ఠాకూర్‌గంజ్‌లోని 19వ బెటాలియన్, కిషన్‌గంజ్‌లోని 12వ బెటాలియన్ (ఈ-శంకుస్థాపన), న్యూ జల్పాయ్‌గురిలోని ట్రాన్సిట్ క్యాంప్ కోసం కూడా ఈ రోజు శంకుస్థాపన చేశామని ఆయన తెలిపారు. ఎస్‌ఎస్‌బీ సిబ్బందికి పరిపాలన, నివాస వసతుల కల్పన కోసం ₹189 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను ఇక్కడ ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. తాను హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘ఎస్‌ఎస్‌బీ’, ‘బీఎస్‌ఎఫ్’ లేదా అస్సాం రైఫిల్స్ వంటి భద్రత దళాల అవసరాలు హోం మంత్రిత్వ శాఖ అజెండాలో అత్యంత ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయని ఆయన తెలిపారు.
‘ఎస్‌ఎస్‌బీ’కి ఘన చరిత్ర ఉందని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈ బలగం 1965 నుంచి మణిపూర్, జమ్మూకాశ్మీర్, త్రిపురలకు, 1975లో మేఘాలయకు, 1976లో సిక్కిం, 1985లో రాజస్థాన్, గుజరాత్, 1989లో నాగాలాండ్, మిజోరం, దక్షిణ బెంగాల్ రాష్ట్రాలకు విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ బలగాన్ని ఎక్కడ మోహరించినా అక్కడ భద్రతకు భరోసా ఇవ్వడంలో సిబ్బంది రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా ప్రశంసనీయ రీతిలో పనిచేశారని కొనియాడారు. కార్గిల్ యుద్ధం తర్వాత ‘ఒకే సరిహద్దు-ఒకే దళం’ పద్ధతిలో నేపాల్, భూటాన్ వంటి పొరుగు మిత్ర దేశాలతో బహిరంగ సరిహద్దులను కాపాడే అత్యంత సవాలుతో కూడిన పనిని ‘ఎస్‌ఎస్‌బీ’కి అప్పగించినట్లు ఆయన చెప్పారు. అటుపైన 2001 నుంచి 1,751 కిలోమీటర్ల పొడవైన భారత్-నేపాల్ సరిహద్దు వెంబడి, 2004 నుంచి దాదాపు 700 కిలోమీటర్ల భారత్-భూటాన్ సరిహద్దు వెంబడి ‘ఎస్‌ఎస్‌బీ’ని మోహరించారు. ఒక సరిహద్దుకు కంచె ఉన్నప్పుడు, దాని కాపలా దళం బాధ్యత కొంత సులభం కాగలదన్నారు. అయితే, కంచె లేని సరిహద్దుల పర్యవేక్షణ బాధ్యత ఈ బలగానికి ఉందని, ఇది అత్యంత సవాలుతో కూడుకున్నదని ఆయన అన్నారు. బహిరంగ సరిహద్దుల వెంబడి వారి మోహరింపు సిబ్బందికి అత్యంత కష్టతరమైన బాధ్యతలలో ఒకటిగా ఉంటుందని తాను తరచూ చెబుతుంటానని ఆయన గుర్తు చేశారు. వారి సమన్వయం, దేశ రక్షణలో వారి అంకితభావం, పొరుగు మిత్ర దేశాలతో భారత సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి వారు చేసిన కృషిని యావద్దేశం గౌరవిస్తుందని అన్నారు.

జాతీయ భద్రత దృక్కోణంలో సిలిగురి కారిడార్ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా గుర్తించిందని శ్రీ అమిత్ షా అన్నారు. అత్యంత సున్నిత, వ్యూహాత్మకమైన ఈ కారిడార్ 8 రాష్ట్రాలను కలుపుతుందని ఆయన గుర్తుచేశారు. సిలిగురి కారిడార్‌కు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లతో 3 అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. ఇక్కడి భద్రతకు దేశ భద్రతతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ఈ మేరకు త్రిభుజాకార గ్రిడ్ ద్వారా సిలిగురి కారిడార్‌కు భద్రత కల్పించి మోదీ ప్రభుత్వం జాతీయ భద్రతను మరింత పటిష్ఠం చేసిదని హోం మంత్రి అన్నారు. అధిక జనసాంద్రత గల ఈ కారిడార్‌లో ప్రభుత్వం అప్రమత్తతను, ఉనికిని, ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నదని ఆయన చెప్పారు. భద్రతా దళాలు ఎప్పటికప్పుడు వివిధ ఆపరేషన్లు, విన్యాసాలలో పాల్గొంటున్నాయని తెలిపారు. అయితే, ఒక లోపం మాత్రం మిగిలిపోయిందని ఆయన పేర్కొన్నారు. సిలిగురి కారిడార్‌ను పూర్తిగా బలోపేతం చేయడం, భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 560 ఎకరాల భూమి అవసరమని చెప్పారు. కానీ, పశ్చిమ బెంగాల్‌లోని మునుపటి ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి సదరు 560 ఎకరాల భూమి కేటాయింపునకు సూత్రప్రాయ ఆమోదం తెలిపినందుకు కేంద్రం అభినందిస్తోందని చెప్పారు. ఏ ప్రాంతానికైనా భద్రత కల్పించే బాధ్యత భద్రత దళాలకు మాత్రమే పరిమితం కాదని, కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఒక ప్రాంతంలో జనాభా పెరుగుదల, వలసలు, పర్యాటక కార్యకలాపాలు వంటివి మన ఉనికిని బలోపేతం చేయడానికి దోహదపడతాయన్నారు. కేంద్ర బడ్జెట్ 2026-27 ఆమోదించిన 7 హై-స్పీడ్ రైల్ కారిడార్లలో ఢిల్లీ-సిలిగురి కూడా ఒకటని చెప్పారు. రాబోయే 2-3 ఏళ్లలో ఇది నిర్మితమైతే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం కొన్ని గంటల్లోనే పూర్తికాగలదని శ్రీ అమిత్ షా చెప్పారు. ‘అమృత్ భారత్’ పథకం కింద సిలిగురి, జల్పాయ్‌గురి స్టేషన్లను ఆధునికీకరించామని ఆయన తెలిపారు.
‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ గ్రామాల అనుసంధానంతోపాటు అక్కడి ప్రజానీకంతో బలమైన భావోద్వేగ బంధం ఏర్పరచుకోవడానికి కృషి చేస్తున్నామని శ్రీ అమిత్ షా అన్నారు. ఇందులో భాగంగా ₹6,839 కోట్ల వ్యయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టామని, బంగ్లాదేశ్ సహా భూటాన్ సరిహద్దు ప్రాంతాలకు ఇది ఎంతో కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. సురక్షిత, భద్రమైన, చైతన్యపూరిత భూ సరిహద్దుల భావనను ప్రభుత్వం ప్రోదిచేస్తుందని ఆయన చెప్పారు. మన సిబ్బందికి మెరుగైన వసతులు కల్పన సహా దేశ రక్షణ సామర్థ్య బలోపేతానికి ఈ రోజు ఇక్కడ ₹190 కోట్లు వెచ్చించామని ఆయన తెలిపారు. దీనికింద చేపట్టిన కార్యక్రమాలతో సిబ్బందికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉపశమనం లభించడమే కాకుండా పని వాతావరణం కూడా మెరుగుపడుతుందన్నారు.

ప్రముఖ షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్యాణ్ సింగ్‌ల వర్ధంతి నేపథ్యంలో తన ప్రసంగం ప్రారంభానికి ముందు శ్రీ అమిత్ షా వారికి నివాళి అర్పించారు. భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లడంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. రాగాలు, రాగిణీలను ప్రోత్సహించడమే కాకుండా సుసంపన్న భారత శాస్త్రీయ సంగీత సంప్రదాయానికి విశేష ప్రాచుర్యం కల్పించడానికి అవిరళ కృషి చేశారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్యాణ్ సింగ్ గురించి మాట్లాడుతూ- ఉత్తరప్రదేశ్‌లో పరిపాలనపరమైన పునర్వ్యవస్థీకరణకు తొలిసారి ఆయనెంతో కృషి చేశారని, రామ జన్మభూమి ఉద్యమంలోనూ గణనీయ పాత్ర పోషించారని హోం మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2302233)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21