వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సవరించిన విధానం కింద రూ. 4,895.65 కోట్ల విలువైన 29 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు


నియంత్రణాధికారం లేని యాజమాన్య లబ్దిని అందిస్తూ భూతల సరిహద్దు దేశాల నుంచి పెట్టుబడులు... నిబంధనలను సులభతరం చేస్తూ ఎఫ్‌డీఐ విధానంలో మార్పులు

నాడు పోస్టు చేయడమైనది: 21 AUG 2026 4:59PM by PIB Hyderabad

సవరించిన నిబంధనావళి ప్రకారం 2026 ఆగస్టు 20 నాటికి మొత్తం 29 ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రతిపాదిత పెట్టుబడుల విలువ రూ. 4,895.65 కోట్లు. సమాచార సాంకేతికత, కృత్రిమ మేధ, సమాచార- కమ్యూనికేషన్, తయారీ రంగం, ఔషధ రంగం, డేటా సెంటర్లు, రవాణా సేవల వంటి విభిన్న రంగాలకు చెందిన పెట్టుబడులు ఇందులో ఉన్నాయి.

మారిషస్, అమెరికా, కొరియా రిపబ్లిక్, జపాన్, సింగపూర్, లగ్జెంబర్గ్, కేమాన్ దీవుల వంటి పలు ప్రాంతాలకు చెందిన పెట్టుబడిదారులు/ సంస్థల నుంచి ఈ 29 పెట్టుబడులు నమోదయ్యాయి.

భారత్‌తో భూతల సరిహద్దు ఉన్న దేశాలకు చెందిన, నియంత్రణాధికారం లేని, 10 శాతం వరకూ వాటా ఉన్న యాజమాన్యాల పెట్టుబడుల విషయంలో.. ప్రభుత్వ ముందస్తు అనుమతి పొందాల్సిన నిబంధనను ఈ సవరణ ద్వారా తొలగించారు. తద్వారా భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం మరింత సులభతరమూ, వేగవంతమూ అవుతుంది. ఈ సంస్కరణ ద్వారా పెట్టుబడిదారులకు స్పష్టత లభించడంతోపాటు.. లావాదేవీల సమయం తగ్గి, దేశంలో వ్యాపార నిర్వహణ మరింత సులభతరమవుతుంది.

2026 మే 1న ప్రకటించిన పత్రికా ప్రకటన - 2 (2026), తదనుగుణంగా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ (రుణేతర సాధనాలు) నిబంధనలు- 2019కి చేసిన సవరణ ద్వారా.. లబ్ధిదారు యాజమాన్య పరీక్షను ఇకపై పెట్టుబడిదారు సంస్థ స్థాయిలోనే వర్తింపజేస్తారు. భారత్‌తో భూ సరిహద్దు ఉన్న దేశాలకు చెందిన, నియంత్రణాపరమైన అధికారం లేని, 10 శాతం వరకూ యాజమాన్య వాటా ఉన్న పెట్టుబడిదారులు... నిర్దిష్ట రంగానికి చెందిన గరిష్ట పరిమితులు, ప్రవేశ మార్గాలు, ఇతర షరతులకు లోబడి, ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేకుండానే పెట్టుబడులు పెట్టవచ్చు. దీనికి సంబంధించి అవసరమైన వివరాలను ప్రభుత్వానికి నివేదించిన అనంతరం.. ఎలాంటి ఇతర అనుమతులు పొందాల్సిన అవసరం లేకుండానే పెట్టుబడిదారు సంస్థ ముందుకు సాగవచ్చు.

గతంలో భారత్‌తో భూ సరిహద్దు ఉన్న దేశాలకు చెందిన యాజమాన్యం వాటా ఎంత స్వల్పంగా ఉన్నప్పటికీ... పత్రికా ప్రకటన – 3 (2020) ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు తప్పనిసరిగా ప్రభుత్వ ముందస్తు అనుమతి పొందాల్సి వచ్చేది. స్పష్టత, పెట్టుబడుల సరళీకరణను కోరుకునే పెట్టుబడిదారులకు ఎంతో కాలంగా ఇదొక ప్రధాన సమస్యగా ఉండేది.

 

***


(రిలీజ్ ఐడి: 2302229) సందర్శకుల సూచీ సంఖ్య : : 78
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Kannada , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam