సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
డిజిటల్ వాణిజ్యం ద్వారా ఎంఎస్ఎంఈలు స్థానిక స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి చేరుకునేలా ప్రోత్సహిస్తూ ఐఐటీ మద్రాస్‌లో జాతీయ సెమినార్‌ను నిర్వహించిన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ
ఎంఎస్ఎంఈలతో ప్రయోగాత్మక ఆలోచనలను పంచుకున్న డీజీఎఫ్‌టీ, ఈసీజీసీ, ఎక్సిమ్ బ్యాంక్, డిజిటల్ కామర్స్ వ్యవస్థకు సంబంధించిన నిపుణులు
प्रविष्टि तिथि:
20 AUG 2026 10:54AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, చెన్నైలోని ఎంఎస్ఎంఈ అభివృద్ధి, సులభతర సేవల కార్యాలయం, ఐఐటీ మద్రాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ సహకారంతో ఆగస్టు 18న చెన్నైలోని ఐఐటీ మద్రాసులో "స్థానిక స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి: డిజిటల్ వాణిజ్యం ద్వారా ఎగుమతులకు సిద్ధంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం" అంశంపై జాతీయ సదస్సును నిర్వహించింది.

ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, విధాన రూపకర్తలు, ఆర్థిక సంస్థలు, ఎగుమతి వ్యవస్థల భాగస్వాములు, డిజిటల్ వాణిజ్య నిపుణులకు ఈ సెమినార్ వేదికగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను ఎంఎస్ఎంఈలు చేరుకునేందుకు ఆచరణాత్మక మార్గాలను అన్వేషించటం దీని ఉద్దేశం.
ప్రారంభ సదస్సులో తమిళనాడు ప్రభుత్వ ఎంఎస్ఎంఈ విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రవీణ్ యాదవ్ ప్రత్యేక ప్రసంగం చేశారు. భౌగోళిక సరిహద్దులను చెరిపేస్తూ డిజిటల్ వాణిజ్యం ఎంఎస్ఎంఈలకు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశాన్ని కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈల ప్రపంచ పోటీతత్వాన్ని వేగవంతం చేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఐఐటీ మద్రాస్ ఐసీ అండ్ ఎస్ఆర్ డీన్ ప్రొఫెసర్ మను సంతనం ప్రత్యేకంగా ప్రసంగిస్తూ… ఎంఎస్ఎంఈలు నూతన ఉత్పత్తులను, సాంకేతికతలను అభివృద్ధి చేయటానికి, పోటీతత్వాన్ని పెంపొందించుకోవటానికి ఆవిష్కరణలు, విద్యా సంస్థలు-పరిశ్రమల మధ్య సహకారాల కీలక పాత్రను ఆయన స్పష్టం చేశారు.
కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ శ్రీ హంసరాజ్ వర్మ ప్రసంగించారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంపొందించుకునేందుకు నాణ్యత ప్రాథమికమని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈల వ్యాపార పరిధి విస్తరణకు డిజిటలీకరణ ప్రాముఖ్యతను తెలియజేశారు.
చెన్నై ఎంఎస్ఎంఈ డీఎఫ్ఓ డైరెక్టర్ అండ్ హెడ్ శ్రీ దయాలాన్ కీలక ప్రసంగం చేశారు. విశిష్ట అతిథులను సత్కరించారు. చెన్నై ఎంఎస్ఎంఈ డీఎఫ్ఓ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి రేష్మా రాజీవన్ స్వాగత ఉపన్యాసమిస్తూ.. దేశీయ మార్కెట్ల నుంచి అంతర్జాతీయ అవకాశాల దిశగా ఎంఎస్ఎంఈలకు మద్దతివ్వాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

భౌగోళిక సరిహద్దులను దాటి ఎంఎస్ఎంఈలు వినియోగదారులను చేరుకోవటంలో పెరుగుతున్న డిజిటల్ వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణలు, మార్కెట్ అనుసంధానాల పాత్ర, అంతర్జాతీయ వాణిజ్య రంగంలో వస్తున్న మార్పులపై ఈ సెమినార్ దృష్టి సారించింది.
ఈ సాంకేతిక సమావేశాల్లో డీజీఎఫ్‌టీ, ఎక్సిమ్ బ్యాంక్, ఈసీజీసీ ఐఐటీ మద్రాస్, ఎగుమతి, ఈ-కామర్స్ కన్సల్టింగ్ రంగాలకు చెందిన నిపుణులు, అధికారులు పాల్గొన్నారు. ఎగుమతి విధానాలు, వాణిజ్య ఫైనాన్స్, ఎగుమతి నష్ట నివారణ, మార్కెట్ గుర్తింపు, అంతర్జాతీయ చెల్లింపులు, నిబంధనల పాటింపు, డిజిటల్ ఆన్‌బోర్డింగ్, ప్రపంచ మార్కెట్లో ప్రవేశానికి ఎంఎస్ఎంఈలు ఈ-కామర్స్‌ను ఉపయోగించుకునే అవకాశాలపై ఆచరణాత్మక ఆలోచనలను పంచుకున్నారు.
ఎంఎస్ఎంఈలకు మార్కెట్ అవకాశాలను బలోపేతం చేయటానికి ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ చర్చలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన సేకరణ, మార్కెటింగ్ మద్దతు (పీఎంఎస్) పథకం, దాని సామర్థ్య నిర్మాణ కార్యక్రమంలో భాగంగా జాతీయ కార్యశాలలు, సదస్సులు ప్రత్యేక అంశంగా ఉన్నాయి. ఎంఎస్ఎంఈలకు మార్కెట్ అవకాశాలను, ప్యాకేజింగ్, దిగుమతి, ఎగుమతి విధానాలు, ఈ-కామర్స్ వేదికలు, వాటి మార్కెట్ల విస్తరణలో సహాయపడే ఇతర అంశాలపై అవగాహన కల్పించటం, శిక్షణనివ్వటం వీటి లక్ష్యం. ఈ అంశంలో భాగంగానే చెన్నైలో జాతీయ సదస్సును నిర్వహించారు. ఇది నిపుణులతో ఎంఎస్ఎంఈలు నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తూ, డిజిటల్ వాణిజ్యం, ఎగుమతి సన్నద్ధతపై ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించింది.
డిజిటల్ కామర్స్, వ్యవస్థాపకత, అంతర్జాతీయ మార్కెట్లలోని నూతన అవకాశాలను విద్యార్థులు, భవిష్యత్ పారిశ్రామికవేత్తలు అర్థం చేసుకునేందుకు ఈ సెమినార్ కీలక వేదికగా నిలిచింది.
విశిష్ట అతిథులు, వక్తలు, నిపుణులు, ప్యానెలిస్టులు, పాల్గొన్న ఎంఎస్ఎంఈలు, విద్యార్థులు, భాగస్వామ్య సంస్థలు, నిర్వాహక బృందం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం ముగిసింది.

ఎంఎస్ఎంఈలకు మార్కెట్ అవకాశాలను కల్పించటం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించటం, ఎగుమతులకు సిద్ధం చేయటం, అవసరమైన చేయూతను అందించటంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తుంది. తద్వారా భారత పరిశ్రమలను స్థానిక స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి చేర్చాలనే ఆశయానికి దోహదపడుతుంది.
***
(रिलीज़ आईडी: 2301512)
आगंतुक पटल : 5