ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 17 నుంచి 19, 2026 వరకు న్యూఢిల్లీలోని యశోభూమిలో జరగనున్న భారతదేశ అతిపెద్ద సెమీ కండక్టర్ కార్యక్రమం
సెమికాన్ ఇండియా 2026- సిలికాన్ టు సిస్టమ్స్: వ్యవస్థ నిర్మాణం
प्रविष्टि तिथि:
18 AUG 2026 3:47PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని యశోభూమి (ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్)లో సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభిస్తారు.
భారతదేశ సెమీకండక్టర్ రంగ ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని సూచిస్తూ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ వ్యవస్థలోని కీలక భాగస్వాములు, ప్రభుత్వం, పరిశ్రమల ప్రముఖులు, నిపుణులు, విద్యావేత్తలు, ప్రభుత్వాధికారులు, విద్యార్థులకు సెమికాన్ ఇండియా-2026 వేదికగా నిలుస్తుంది.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) ఆధ్వర్యంలో సెమికాన్ ఇండియా కార్యక్రమం ద్వారా భారత సెమీకండక్టర్ ప్రయాణం ఊపందుకుంటోంది. దేశంలో బలమైన, స్థిరమైన సెమీకండక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సెమికాన్ 1.0 ద్వారా పన్నెండు ప్రాజెక్టులకు అనుమతి లభించింది. భారత్‌లో పటిష్ఠమైన, సుస్థిరమైన సెమీకండక్టర్ వ్యవస్థ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు తదుపరి దశ సెమికాన్ 2.0 కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సెమీకండక్టర్లను ప్రాథమిక పరిశ్రమగా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో 332కు పైగా విద్యా సంస్థలకు, 105 అంకుర సంస్థలకు అత్యాధునిక డిజైన్ సాధనాలను అందించటం ద్వారా పరిశోధన, ఆవిష్కరణ, డిజైన్‌కు మద్దతిస్తోంది. డిజైన్ ఆధారిత ప్రోత్సాహక (డీఎల్‌ఐ) ద్వారా 24 అంకుర సంస్థలకు ఆమోదం లభించింది. కీలకమైన అప్లికేషన్లపై భారత ఆవిష్కర్తలు పనిచేసేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. ఆత్మనిర్భర్ భారత్ దృక్పథానికి అనుగుణంగా దేశంలో పటిష్ఠమైన, సమీకృత సెమీకండక్టర్ వ్యవస్థ అభివృద్ధికి ఈ ప్రారంభ చర్యలు తోడ్పడతాయి.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం), ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించే ప్రపంచ పారిశ్రామిక సంఘమైన సెమీ సంయుక్తంగా భారత సెమీకండక్టర్ రంగంలో పురోగతి వేగాన్ని పెంచేందుకు ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సెమికాన్ ఇండియా-2026 కార్యక్రమ వివరాలను ప్రకటించాయి.
ఐఎస్ఎం, సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ 5వ ఎడిషన్ "సిలికాన్ టు సిస్టమ్స్: వ్యవస్థ నిర్మాణం" ఇతివృత్తంతో సెప్టెంబర్ 17 నుంచి 19, 2026 వరకు న్యూఢిల్లీలోని ద్వారకలో ఉన్న యశోభూమి (ఐఐసీసీ) వద్ద జరుగుతుంది.
భారత ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, పథకాలపై విశ్వాసాన్ని ఈ వేడుక మరింత బలపరుస్తుంది. జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, ఇతర భాగస్వాముల మధ్య పటిష్ఠమైన, స్థిరమైన, దీర్ఘకాలిక సెమీకండక్టర్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు దేశ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.
మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో కీలక అంశాలపై ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు, ఫైర్‌సైడ్ చాట్లు, ప్రపంచ దేశాల రౌండ్‌టేబుల్స్ వంటి విభిన్నమైన, ఆలోచింపజేసే చర్చలు ఉంటాయి. సెమీకండక్టర్ ఆవిష్కరణ, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు చర్చలు, సహకారానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుంది.
సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు:
-
విభాగాలు, సెషన్లు
-
తయారీ, సాంకేతికత
-
ఏఐ డిజిటల్ పరివర్తన
-
సరఫరా వ్యవస్థ
-
రసాయనాలు, వాయువులు, మెటీరియల్స్
-
విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు
-
సుస్థిరత, ఈఎస్‌జీ
-
ఉత్పత్తి రూపకల్పన, డిజైన్
-
అంకుర సంస్థలు, ఆవిష్కరణ
-
ప్రతిభ, నైపుణ్యాభివృద్ధి
-
భారత బ్రాండ్లు, మార్కెట్ అభివృద్ధి
-
నాయకత్వ, వ్యూహాత్మక సదస్సులు
-
ప్రపంచ దేశాల 6 రౌండ్ టేబుల్ సమావేశాలు
-
మహిళా సాధికారత, నాయకత్వంపై ప్రత్యేక సెషన్
-
శ్రామిక శక్తి అభివృద్ధి సమావేశం
-
"ఐక్యతే బలం: భారతదేశ ఈఎస్‌డీఎం వృద్ధికి పరిశ్రమ సంఘాల సహకారం" అంశంపై ప్రత్యేక సదస్సు
వైవిధ్యమైన విభాగాల నుంచి వచ్చే భాగస్వాములకు, పలు కార్యక్రమాలకు సెమికాన్ ఇండియా-2026 ఎగ్జిబిషన్ వేదికగా నిలుస్తుంది. ఇందులోని ముఖ్యమైన అంశాలు:
-
ప్రపంచవ్యాప్త సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 500లకు ప్రదర్శకులు
-
240లకు పైగా అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యం
-
150 మందికిపైగా అంతర్జాతీయ ప్రముఖ వక్తలు
-
40కి పైగా దేశాల ప్రతినిధి బృందాలు
-
15000లకు పైగా చదరపు మీటర్ల ప్రదర్శనా స్థలం
-
6 దేశాల పెవిలియన్లు
-
10 రాష్ట్ర ప్రభుత్వ పెవిలియన్లు
-
అంకుర సంస్థల పెవిలియన్, ఆవిష్కరణల ప్రదర్శన
-
అంకుర సంస్థల ప్రతిపాదన పోటీ
-
విద్యార్థుల హ్యాకథాన్
-
శ్రామిక శక్తి అభివృద్ధి పెవిలియన్
ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ... "ప్రగతిశీల విధానాలు, అదనపు మద్దతుతో సెమీకండక్టర్ రంగ ప్రాముఖ్యతను భారత ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. సెమికాన్ ఇండియా సదస్సు, ప్రదర్శనలో భాగస్వామ్యం ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది రెండు కారణాల వల్ల ఈ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. మొదటిది... సెమికాన్ 1.0 ద్వారా ఆమోదించిన 12 సెమీకండక్టర్ ప్రాజెక్టుల్లో 3 ప్రాజెక్టులు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించటంతో పాటు సెమికాన్ ఇండియా కార్యక్రమం క్షేత్రస్థాయి విజయం నేపథ్యంలో ఈ సదస్సును నిర్వహించటం. రెండవది... బలమైన, స్థిరమైన సెమీకండక్టర్ వ్యవస్థ నిర్మాణానికి భారతదేశ నిబద్ధతను బలపరిచే 6 ప్రధాన అంశాలతో తదుపరి దశ సెమికాన్ 2.0ను ప్రకటించటం" అని అన్నారు.
సెమీ అధ్యక్షుడు, సీఈఓ మిస్టర్ అజిత్ మనోచా మాట్లాడుతూ... 'ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ కేంద్రాల అభివృద్ధికి అయిదు దశాబ్దాలకు పైగా సెమీ అండగా నిలిచింది. ఈ రంగంలో విజయవంతం అయ్యేందుకు వేగం, ఆశయం, ప్రతిభ, దీర్ఘకాలిక దూరదృష్టితో భారత్ ఉంది. సెమికాన్ ఇండియా-2026 ద్వారా భారత్ ప్రయాణానికి ప్రపంచ దేశాల సమష్టి బలాన్ని సెమీ అందిస్తుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో కేవలం చేరటం మాత్రమే కాక, అందులో అంతర్భాగంగా మారటమే భారత్ ముందున్న అవకాశం. ఈ ఆశయాన్ని వేగవంతం చేసేందుకు సెమికాన్ ఇండియా-2026 ఏర్పాటయింది" అని అన్నారు.
ఎంఈఐటీవై, సీఈఓ, ఐఎస్ఎం శ్రీ అమితేశ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ... "ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలు, కంపెనీల ప్రతినిధులకు, భారత్‌లో తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం పొందిన భారతీయ కంపెనీలకు, దేశంలో అవకాశాలను అన్వేషిస్తున్న కంపెనీలకు సెమికాన్ ఇండియా-2026 గొప్ప అవకాశం. ఇది సెమీకండక్టర్ డిజైన్, తయారీకి మద్దతునిచ్చే సరఫరా వ్యవస్థ భాగస్వాములతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు, విధానకర్తలను ఒకచోట చేరుస్తుంది. ప్రపంచ సెమీకండక్టర్ డిమాండ్ సుమారు ఒక ట్రిలయన్ డాలర్ నుంచి 2 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశ సెమీకండక్టర్ డిమాండ్ కూడా సుమారు 100 బిలియన్ డాలర్ల నుంచి 200 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై ఈ సదస్సులో చర్చ జరుగుతుంది. ఇందులో 'మహిళా సాధికారత, నాయకత్వం' అంశంపై ప్రత్యేక సదస్సును నిర్వహిస్తారు" అని తెలిపారు.
సెమీ ఇండియా, ఐఈఎస్ఏ అధ్యక్షుడు అశోక్ చందక్ మాట్లాడుతూ... “ 'సిలికాన్ టు సిస్టమ్స్ - వ్యవస్థల నిర్మాణం' ఇతివృత్తంతో జరిగే సెమికాన్ ఇండియా-2026... సమగ్ర, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగల సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థను రూపొందించటంలో భారతదేశ పురోగతిని ప్రతిబింబిస్తోంది. ప్రపంచ, భారతదేశంలోని కార్పొరేట్ సంస్థల నుంచి ఈ ఏడాది ఈ వేడుకకు లభించిన అసాధారణమైన స్పందన... భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణంపై పరిశ్రమల ప్రముఖులకున్న విశ్వాసానికి నిదర్శనం. పరిశ్రమల ప్రముఖులు, విధానకర్తలు, పరిశోధకులు, అంకుర సంస్థలు, పెట్టుబడిదారులు ఒకచోట చేరే వార్షిక వేదికగా సెమికాన్ ఇండియా అవతరించింది. ఇక్కడ సహకారాలు రూపుదిద్దుకుంటాయి. భాగస్వామ్యాలు ఏర్పడతాయి. భారతదేశ సెమీకండక్టర్ వృద్ధి తదుపరి దశ వేగవంతం అవుతుంది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన 'శాండ్ టు సిలికాన్ టు సిస్టమ్స్' సరఫరా వ్యవస్థ అనుభవం ద్వారా భారత్ కేవలం విశ్వాసాన్ని కలిగించటమే కాక, సామర్థ్యాన్ని నిరూపించుకునే తీరును తెలియజేస్తుంది. మొత్తం సెమీకండక్టర్ వ్యవస్థలో పెరుగుతున్న దేశ బలాన్ని ఇది ప్రపంచానికి చాటిచెబుతోంది" అని అన్నారు.
ఆలోచనల సమ్మేళనం, సహకారం, ఆవిష్కరణలకు గొప్ప వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుంది. రేపటి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశాన్ని కల్పిస్తూ... సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన అన్ని విభాగాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందిస్తుంది.
ఈ ఏడాది జరిగే వేడుకలో ప్రముఖ ప్రభుత్వాధికారులతో పాటు ఏఎస్ఎంఎల్, అప్లైడ్ మెటీరియల్స్, టెరాడైన్, ఇన్ఫినియాన్, ఇబారా, జాబిల్, ఐబీఎం రీసెర్చ్, ఎన్‌ఎక్స్‌పీ, టాటా ఎలక్ట్రానిక్స్, మైక్రాన్, మెర్క్ కేజీఏఏ, రాపిడస్, లామ్ రీసెర్చ్, సీజీ పవర్, ఉనో మిండా, అడ్వాంటెస్ట్, ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్, సెమీ, హోరిబా ఎస్‌టీఈసీ, స్క్రీన్, ఎవర్‌స్పిన్ టెక్నాలజీస్, బ్రూవర్ సైన్స్, పోలార్ సెమీకండక్టర్, టోక్యో ఎలక్ట్రాన్, ఎమర్జెన్స్ ఏఐ వంటి అగ్రగామి కంపెనీల నుంచి ప్రముఖ పరిశ్రమల నాయకులు పాల్గొననున్నారు.
సెమికాన్ ఇండియా-2026కు సందర్శకుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.
https://portal.semiconindia.org/register ద్వారా నమోదు చేసుకోవచ్చు.
సెమికాన్ ఇండియా గురించి
భారతదేశ అతిపెద్ద సెమీకండక్టర్ సదస్సు, ప్రదర్శనే సెమికాన్ ఇండియా. దీన్ని ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం), భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీకి విశ్వసనీయ ప్రపంచ కేంద్రంగా భారత్‌ను మార్చాలనే లక్ష్యానికి మద్దతిస్తూ... సహకారం, ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించటానికి ప్రపంచ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకచోట చేర్చేందుకు దేశ ప్రధాన వేదికగా ఇది పనిచేస్తుంది.
సెమీ గురించి
సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ డిజైన్, తయారీ సరఫరా వ్యవస్థకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 4,000లకుపైగా కంపెనీలను, 1.5 మిలియన్ల నిపుణులను అనుసంధానించే గ్లోబల్ ఇండస్ట్రీ అసోసియేషన్ సెమీ. న్యాయపరమైన, శ్రామిక శక్తి అభివృద్ధి, సుస్థిరత, సరఫరా వ్యవస్థ నిర్వహణ, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రధాన పరిశ్రమ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనటంలో సభ్యుల మధ్య సహకారాన్ని వేగవంతం చేస్తుంది. టెక్నాలజీ కమ్యూనిటీలు, ప్రమాణాలు, మార్కెట్ ఇంటెలిజెన్స్, సభ్య దేశాల వ్యాపార వృద్ధికి, డిజైన్, పరికరాలు, మెటీరియల్స్, సేవలు, సాఫ్ట్‌వేర్లలో ఆవిష్కరణలకు సెమికాన్ ప్రదర్శనలు, కార్యక్రమాలు తోడ్పడతాయి. తద్వారా మరింత నైపుణ్యంతో కూడిన, వేగవంతమైన, సురక్షితమైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను రూపొందించవచ్చు.
ఐఎస్ఎం గురించి
భారతదేశంలో బలమైన సెమీకండక్టర్, ప్రదర్శన వ్యవస్థను నిర్మించటం, ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైన్‌కు ప్రపంచ కేంద్రంగా భారత్‌ను మార్చాలని ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) లక్ష్యంగా పెట్టుకుంది. సెమీకండక్టర్, ప్రదర్శన పథకాలను సమర్థవంతంగా, సజావుగా అమలు చేసేందుకు ప్రధాన సంస్థగా ఇది పనిచేస్తుంది.
సెమీకండక్టర్, ప్రదర్శన వ్యవస్థల్లోని ప్రపంచ నిపుణుల నేతృత్వంలో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలు, పరిశ్రమలు, విద్యాసంస్థలతో ఈ మిషన్ సంప్రదింపులు జరుపుతుంది. సెమీకండక్టర్, ప్రదర్శన వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమాన్ని సమగ్రంగా, స్పష్టంగా, సమర్థవంతంగా, సజావుగా అమలు చేసేందుకు కీలక కేంద్రంగా పనిచేయాలని ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
***
(रिलीज़ आईडी: 2301049)
आगंतुक पटल : 5