రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 121 టోల్‌ప్లాజాలకు డిజిటల్ ఫాస్టాగ్ లోకల్ పాస్ సౌకర్యాన్ని విస్తరించిన ఎన్‌హెచ్ఏఐ


అర్హులైన ప్రయాణికులకు రాజమార్గ యాత్ర యాప్ ద్వారా నెలవారీ లోకల్ పాసులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్న కొత్త సౌకర్యం

నాడు పోస్టు చేయడమైనది: 18 AUG 2026 4:38PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా దార్శనికతకు, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచాలనే నిబద్ధతకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాలకు ఆన్‌లైన్ ఫాస్టాగ్ లోకల్ పాసుల సౌకర్యాన్ని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) విస్తరించింది. రాజమార్గ యాత్ర మొబైల్ యాప్ ద్వారా అర్హులైన ప్రయాణికులు ఆన్‌లైన్లో నెలవారీ లోకల్ పాసులను పొందవచ్చు. దీనివల్ల టోల్ ప్లాజాలకు వ్యక్తిగతంగా వెళ్లాల్సిన, అవసరమైన పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు. టోలింగ్ కార్యకలాపాల్లో పారదర్శకతను, సామర్థ్యాన్ని పెంచడానికి సాంకేతికతను ఉపయోగించడం ద్వారా జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం, పౌర కేంద్రకంగా మార్చడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్–II (యూఈఆర్–II)పై ఉన్న ముంద్కా–బక్కర్వాలా టోల్‌ప్లాజా వద్ద 2026 జులైలో మొదటిసారిగా డిజిటల్ లోకల్ పాస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతం కావడంతో ఈ సేవలను దేశవ్యాప్తంగా 120కి పైగా టోల్ ప్లాజాలకు విస్తరించారు. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా మరిన్ని టోల్‌ప్లాజాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు

డిజిటల్ లోకల్ పాస్ విధానానికి లోబడి ఎంపిక చేసిన టోల్‌ప్లాజాకు 20 కి.మీ. పరిధిలో నివాసం ఉంటున్నవారు రాజమార్గ యాత్ర మొబైల్ యాప్ ద్వారా లోకల్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వర్తించే నిబంధనల ప్రకారం, అర్హులైన ప్రయాణికులు ఆ నెలలో సంబంధిత టోల్ ప్లాజా ద్వారా అపరిమిత ప్రయాణం చేయడానికి ఈ పాస్ వీలు కల్పిస్తుంది. గతంలో లోకల్ పాస్ తీసుకోదలచిన ప్రయాణికులు సంబంధిత టోల్‌ప్లాజాను వ్యక్తిగతంగా సందర్శించి, 20 కి.మీ. పరిధిలో తమ నివాస చిరునామాను, ఇతర అర్హతలను ధ్రువీకరించే పత్రాలను సమర్పించాల్సి ఉండేది. https://rajmargyatra.nhai.gov.in/buy-fastag-local-pass ను సందర్శించి, ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వివరాలను తెలుసుకోవచ్చు.

డిజిటల్ లోకల్ పాస్ వెనుక ఉన్న సాంకేతిక పరిజ్ఞానం

ప్రయాణికుడి నివాస చిరునామా, వాహన వివరాలు, అనుసంధానించిన ఫాస్టాగ్ తదితర సంబంధిత సమాచారాన్ని పొందడానికి, ధ్రువీకరించుకోవడానికి డిజిలాకర్, వాహన్ సహా ప్రభుత్వ డిజిటల్ వేదికలతో సమ్మతి ఆధారిత అనుసంధానాన్ని డిజిటల్ లోకల్ పాస్ సౌకర్యం ఉపయోగించుకుంటుంది. ప్రయాణికుని అర్హతను జీఐఎస్ ఆధారిత ధ్రువీకరణ ద్వారా నిర్ధారిస్తారు. ఇది దరఖాస్తు చేసుకున్నవారు నమోదు చేసిన చిరునామా టోల్‌ప్లాజా నిర్దేశిత 20 కి.మీ. పరిధిలో ఉందో లేదో ధ్రువీకరిస్తుంది.

ధ్రువీకరించిన డిజిటల్ డేటా, జీఐఎస్ ఆధారిత ధ్రువీకరణను ఏకీకృతం చేయడం ద్వారా మాన్యువల్ డాక్యుమెంటేషన్, భౌతిక ధ్రువీకరణ అవసరాన్ని తొలగిస్తుంది. అదే సమయంలో స్థిరత్వం, పారదర్శకత, కచ్చితత్వాన్ని అందిస్తుంది. ఈ వ్యవస్థ మానవ జోక్యానికి ఆస్కారాన్ని తగ్గించి, అర్హులైన ప్రయాణికులకు స్థానిక టోల్ సేవల పంపిణీని క్రమబద్ధీకరిస్తుంది.

దేశవ్యాప్తంగా ఎలాంటి అవరోధాలు లేని, జాతీయ రహదారుల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పౌర కేంద్ర సేవలను అందించాలనే లక్ష్యాన్ని లోకల్ పాస్ డిజిటైజేషన్ ద్వారా ఎన్‌హెచ్ఏఐ మరింత ముందుకు తీసుకెళ్లింది.

 

***


(రిలీజ్ ఐడి: 2300925) సందర్శకుల సూచీ సంఖ్య : : 76
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Malayalam