|
భారత ఎన్నికల సంఘం
సమాచారంతో కూడిన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని విద్యాసంస్థలకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పిలుపు
प्रविष्टि तिथि:
17 AUG 2026 7:41PM by PIB Hyderabad
-
ఈ రోజు పాట్నాలో జ్ఞానభవన్లో జరిగిన ‘‘ఓటరు అక్షరాస్యత క్లబ్బులు, ఈసీఐనెట్’’ సదస్సు సందర్భంగా ఓటరు అక్షరాస్యత క్లబ్బులు (ఈఎల్‌సీ 2.0)ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రారంభించింది. ఈ సదస్సును ఉద్దేశించి ఎన్నికల ప్రధానాధికారి శ్రీ జ్ఞానేశ్ కుమార్ ప్రసంగించారు. ఎన్నికల ప్రక్రియలను బలోపేతం చేయడంలోనూ, ఎన్నికల అక్షరాస్యతను పెంపొందించడంలోనూ, సమాచారంతో కూడిన ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలోనూ విద్యా సంస్థలు కీలకపాత్ర పోషించాలన్నారు.
-
భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని, ఈసీఐ జారీ చేసిన ఆదేశాలను పాటిస్తూ... దేశంలో ఎన్నికలు ఎంత పటిష్టంగా జరుగుతాయో ప్రారంభోపన్యాసంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వివరించారు. అలాగే అన్ని దశల్లోనూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు లేదా వారి ప్రతిధుల ఏకకాల ఆడిట్‌తో పారదర్శకంగా జరుగుతాయని కూడా తెలియజేశారు. భారతదేశ ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్య విలువలు, ఓటరు నమోదు, పోలింగ్, లెక్కింపు ప్రక్రియలు, భారత ఎన్నికల కమిషన్ పాత్ర, పనితీరుపై విద్యార్థులకు, యువ ఓటర్లకు అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
-
ఎన్నికల ప్రక్రియలో యువతరాన్ని భాగస్వాములను చేయాల్సిన ప్రాధాన్యాన్ని సీఈసీ శ్రీ జ్ఞానేశ్ కుమార్ వివరించారు. ఎన్నికల ప్రక్రియపై వారికున్న విశ్వాసం, అవగాహనతో కూడిన భాగస్వామ్యమే ప్రజాస్వామ్య భవిష్యత్తుకు పెట్టుబడి అని తెలిపారు.
-
ఈ సందర్భంగా ఓటరు అక్షరాస్యతా క్లబ్బు కొత్త లోగోను ఆవిష్కరించారు. యువత, మొదటిసారి ఓటు వేస్తున్న వారు ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా, అందులో అర్థవంతంగా పాల్గొని పురోగతికి దోహదపడేలా ప్రోత్సహించాలనే లక్ష్యాన్ని ‘‘ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుందాం. ప్రజాస్వామ్యాన్ని నడిపిద్దాం’’ అనే కొత్త ట్యాగ్‌లైన్ మరింత బలోపేతం చేస్తుంది.
-
కార్యక్రమం ప్రారంభానికి ముందు నలందలోని రాజ్‌గిర్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో బూత్ స్థాయి అధికారులతో (బీఎల్ఓలు) సీఈసీ శ్రీ జ్ఞానేశ్ కుమార్ సమావేశమయ్యారు. 2026 ఆగస్టు 16, 17 తేదీల్లో బీహార్‌లో తన రెండు రోజుల పర్యటన సందర్భంగా మధుబని, వైశాలి, నలందలో క్షేత్రస్థాయిలో సీఈసీ పర్యటించారు.
-
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఓటరు అక్షరాస్యత క్లబ్బులను నిర్మాణాత్మకమైన, అందరికీ చేరువగా ఉండే, డిజిటల్ ఆధారిత వేదికలుగా ఈఎల్‌సీ 2.0 మారుస్తోంది. యువతలో ఎన్నికల అక్షరాస్యతను, వారి కుటుంబాలు, విద్యాసంస్థలు, సమాజాల్లో ఎన్నికల అవగాహనను పెంపొందించేందుకు నిరంతరాయంగా, ఏడాది పొడవునా కార్యకలాపాలను ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది.
-
ఓటరు జాబితాల నుంచి పోలింగ్ వరకు ఒక్క క్లిక్కుతో ఎన్నికల సంబంధిత సేవలను అందించే విస్తృతమైన ఈసీఐనెట్ డిజిటల్ వేదికను ఈఎల్‌సీ 2.0 ఉపయోగించుకుంటోంది. ఈసీఐనెట్‌లో ఉన్న ప్రత్యేక ఈఎల్‌సీ పోర్టల్‌ను ఉపయోగించి దేశవ్యాప్తంగా క్రమబద్దీకరించిన ఈఎల్‌సీల వ్యవస్థను అభివృద్ధి చేస్తారు.
-
సుమారు 15 లక్షల పాఠశాలలు, దాదాపు 25 కోట్ల మంది విద్యార్థులు, కోటి మందికి పైగా ఉపాధ్యాయులతో విస్తరించి ఉన్న భారతదేశ విద్యా వ్యవస్థ దృష్ట్యా ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉన్నత విద్యా రంగంలో దాదాపు 1,500 విశ్వవిద్యాలయాలు, సుమారు 70,000 విద్యా సంస్థలు ఉండగా... వీటిలో 4.33 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా.
-
ఈ విస్తృతమైన సంస్థాగత వ్యవస్థ ద్వారా వాస్తవాలతో కూడిన ప్రయోగాత్మకమైన ఎన్నికల విద్యను విస్తరించడం, భారత ఎన్నికల వ్యవస్థలోని పారదర్శకత, చిత్తశుద్ధి, విశ్వసనీయతపై అవగాహన పెంపొందించడమే ఈఎల్‌సీ 2.0 లక్ష్యం. అలాగే సంపూర్ణ అవగాహనతో యువతను ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగస్వాములను చేసి, వారిని దానికి ప్రచారకులుగా మారేలా ప్రోత్సహిస్తుంది.
-
ఓటరు నమోదు, పోలింగ్, లెక్కింపుతో సహా ఎన్నికల ప్రక్రియల్లో వివిధ దశలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచారం చేసే వేదికలుగా కూడా ఈఎల్‌సీలు పనిచేస్తాయి. ఈసీఐనెట్ యాప్‌తో పాటు భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఇతర ముఖ్యమైన కార్యక్రమాలతో పాటు ఈఎల్‌సీలు ఈ పనిలో నిమగ్నమవుతాయి.
***
(रिलीज़ आईडी: 2300809)
|