హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నూతనంగా నిర్మించిన 48 ఫ్యామిలీ క్వార్టర్స్‌ను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శనంలో... సీఏపీఎఫ్ సామర్థ్యాల బలోపేతం, ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఎంహెచ్ఏ

సీఏపీఎఫ్ సిబ్బందికి మెరుగైన నివాస వసతులను కల్పించడం, ‘గృహవసతి సంతృప్తి నిష్పత్తి’ని పెంచడం మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు

ఎస్ఎస్‌బీ కోసం ఇప్పటివరకు పూర్తయిన 10,029 గృహాల నిర్మాణం... కొనసాగుతున్న మరో 1,273 గృహాల నిర్మాణ పనులు

ఎంహెచ్ఏ మార్గదర్శనంలో, బహిరంగ అంతర్జాతీయ సరిహద్దుల భద్రత, అంతర్గత భద్రతను నిర్ధారించడానికి... సరిహద్దు ప్రాంతాల్లో విపత్తు ప్రతిస్పందన, ప్రజా భాగస్వామ్య బలోపేతం కోసం చురుగ్గా కృషి చేస్తోన్న ఎస్ఎస్‌బీ

నేపాల్, భూటాన్‌లతో పంచుకుంటున్న 2,450 కిలోమీటర్ల పొడవైన బహిరంగ అంతర్జాతీయ సరిహద్దుల భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న ఎస్ఎస్‌బీ

ఆధునిక సాంకేతికత, నిఘా ఆధారిత సరిహద్దు నిర్వహణ, మెరుగైన శిక్షణ ద్వారా మరింత బలోపేతమవుతున్న ఎస్ఎస్‌బీ కార్యాచరణ సామర్థ్యాలు

సరిహద్దు ప్రాంతాల భద్రతతో పాటు అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, విపత్తు స్పందన, మానవతా సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తోన్న ఎస్ఎస్‌బీ

2025-26 సంవత్సరంలో, మానవ అక్రమ రవాణాకు గురైన 661 మంది బాధితులను రక్షించి... చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన 6,324 మంది నేరస్తులను అరెస్టు చేసిన ఎస్ఎస్‌బీ

प्रविष्टि तिथि: 17 AUG 2026 4:13PM by PIB Hyderabad

హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో ఉన్న సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) ప్రాంగణంలో, నూతనంగా నిర్మించిన 48 'టైప్-III' ప్రత్యేక ఫ్యామిలీ క్వార్టర్‌లను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్‌బీ డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ సింఘాల్, కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ఉన్నతాధికారులు, ఎస్ఎస్‌బీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) సిబ్బందికి నివాస వసతులను మెరుగుపరచడం, ‘గృహవసతి సంతృప్తి నిష్పత్తి’ని పెంచడం మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా ఉన్నాయి. ఎస్ఎస్‌బీలో ఇప్పటివరకు 10,029 నివాస గృహాల నిర్మాణం పూర్తవగా, మరో 1,273 గృహాల నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ, ఈ నివాస సముదాయాలు కేవలం భవనాలు మాత్రమే కావని... దేశ సేవ, భద్రతకు అంకితమైన ఎస్‌ఎస్‌బీ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమం పట్ల భారత ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, అంకితభావం కలిగిన జవాన్‌ల కోసం... సురక్షితమైన, సంతోషకరమైన కుటుంబమే అత్యంత గొప్ప శక్తి వనరు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శనంలో... కేంద్ర సాయుధ పోలీసు బలగాల కార్యాచరణ సామర్థ్యాలు, ఆధునికీకరణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది సంక్షేమాన్ని నిరంతరం బలోపేతం చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ కట్టుబడి ఉందని శ్రీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

 

దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన 51 మంది వీరులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నివాళులర్పించారు. వారి కుటుంబాల పట్ల తనకు గల గౌరవాన్ని వ్యక్తం చేశారు. హోంశాఖ పర్యవేక్షణలో... బహిరంగ అంతర్జాతీయ సరిహద్దుల సమర్థ భద్రత, అంతర్గత భద్రత, విపత్తు నిర్వహణ, సరిహద్దు ప్రాంతాల ప్రజల భాగస్వామ్య బలోపేతం వంటి అంశాలపై సశస్త్ర సీమా బల్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

 

ఇండో-నేపాల్, ఇండో-భూటాన్ మధ్య ఉన్న సుమారు 2,450 కిలోమీటర్ల పొడవైన బహిరంగ అంతర్జాతీయ సరిహద్దులను కాపాడే కీలక బాధ్యతను సశస్త్ర సీమా బల్‌కు అప్పగించారు. భద్రత, అప్రమత్తత, సున్నితత్వం మధ్య సమతుల్యతను పాటిస్తూ... మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణుల సంబంధిత నేరాలు, ఇతర రకాల వ్యవస్థీకృత నేరాలపై ఎస్ఎస్‌బీ సమర్థమైన చర్యలను కొనసాగిస్తోంది. 2025-26 సంవత్సరంలో, మానవ అక్రమ రవాణాకు గురైన 661 మంది బాధితులను ఎస్ఎస్‌బీ రక్షించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న 6,324 మందిని అరెస్టు చేసింది.

మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా... సాంకేతికత ఆధారిత, నిఘా ఆధారిత, లక్ష్య నిర్దేశిత సరిహద్దు నిర్వహణను ఎస్ఎస్‌బీ నిరంతరం బలోపేతం చేస్తోంది. కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి డ్రోన్‌లు, సీసీటీవీ వ్యవస్థలు, థర్మల్ ఇమేజర్‌లు, నైట్-విజన్ పరికరాలు, జీపీఎస్ ఆధారిత పెట్రోలింగ్, సురక్షిత డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, జీఐఎస్ ఆధారిత ప్రణాళిక వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.

సరిహద్దు భద్రతతో పాటుగా అంతర్గత భద్రత, తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలు, ఎన్నికల విధులు, శాంతిభద్రతల నిర్వహణ, విపత్తు నిర్వహణలోనూ ఎస్ఎస్‌బీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడం... గాలింపు, సహాయక చర్యలు చేపట్టడం, మానవతా దృక్పథంతో సహాయం అందించడం లక్ష్యంగా ఈ బలగాలు 18 ప్రత్యేక సహాయక, రక్షణ బృందాలను సిద్ధంగా ఉంచుతాయి.

“హృదయాలనూ, మనస్సులనూ గెలుచుకోండి” అనే స్ఫూర్తికి అనుగుణంగా... సరిహద్దు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, క్రీడా కార్యకలాపాలు, మహిళా సాధికారత కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, జీవనోపాధి ఆధారిత కార్యక్రమాల ద్వారా స్థానిక సమాజాల నమ్మకాన్ని, భాగస్వామ్యాన్ని ఎస్ఎస్‌బీ బలోపేతం చేస్తోంది. తేనెటీగల పెంపకం వంటి కార్యక్రమాలు స్థానిక యువతను, గ్రామీణ సమాజాలనూ స్వయం-సమృద్ధి, ఉపాధి అవకాశాలతో అనుసంధానించడంలో సహాయపడుతున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2300516) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil