ఆర్థిక మంత్రిత్వ శాఖ
దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అక్రమంగా వినియోగించుకుంటూ జరుగుతున్న భారీ పోకచెక్కల దిగుమతి కుంభకోణాన్ని బయటపెట్టిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్
ప్రభుత్వ ఖజానాకు రూ. 2,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు దర్యాప్తులో వెల్లడి;
రూ. 75 లక్షల నగదు, 160 మెట్రిక్ టన్నుల పోకచెక్కల స్వాధీనం; తొమ్మిది మంది అరెస్టు
బంగ్లాదేశ్ ను పోక చెక్కల ఉత్పత్తి దేశంగా తప్పుగా పేర్కొంటూ నకిలీ ధృవీకరణ పత్రాలతో ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, ఇతర ఆగ్నేయాసియా దేశాల నుంచి భారతదేశంలోకి పోకచెక్కలను దిగుమతి చేసుకుంటున్న సిండికేట్లు
పోక చెక్కల అక్రమ దిగుమతుల్లో ఎక్కువ భాగం క్లియరెన్స్‌కు బాధ్యత వహించిన కస్టమ్స్ బ్రోకర్ సంస్థ లైసెన్స్ సస్పెండ్
प्रविष्टि तिथि:
16 AUG 2026 10:51AM by PIB Hyderabad
దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎస్ఏఎఫ్టీఏ) కింద లభించే సుంకం మినహాయింపులను అక్రమంగా పొందేందుకు ఆగ్నేయాసియా దేశాలకు చెందిన పోకచెక్కలను (అరేకా నట్స్) బంగ్లాదేశ్ నుంచి వస్తున్నట్లు నకిలీ వివరాలు చూపిస్తూ దిగుమతి చేసుకుంటున్న ఒక భారీ నెట్‌వర్క్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆరఐ) నెల రోజుల పాటు సాగించిన నిఘా ఆపరేషన్‌లో చేధించింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.2,500 కోట్లకు పైగా ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో సంబంధం ఉన్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
భారత్‌లోకి పోక చెక్కల దిగుమతులపై 100 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ విధిస్తారు. అయితే, ఎస్ఏఎఫ్టీఏ ఒప్పందం కింద అర్హత కలిగిన పోక చెక్కల దిగుమతులకు కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. నిర్దేశించిన మూల దేశ నిబంధనల ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే బంగ్లాదేశ్‌లో ఉత్పత్తి అయిన పోకచెక్కలకు ఎస్ఏఎఫ్టీఏ కింద కస్టమ్స్ సుంకం మినహాయింపు లభిస్తుంది.
కొన్ని సిండికేట్లు పోకచెక్కల దిగుమతులపై అత్యంత భారీ స్థాయిలో సాఫ్టా మినహాయింపు ప్రయోజనాలను మోసపూరితంగా పొందుతున్నట్లు డిఆర్ఐ సేకరించిన సమాచారంలో వెల్లడైంది. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, ఇతర ఆగ్నేయాసియా దేశాల నుంచి సేకరించి, దిగుమతి చేసుకుంటున్న పోకచెక్కలను తిరిగి దిగుమతి చేసే క్రమంలో వాటి ఉత్పత్తి తయారీ దేశం బంగ్లాదేశ్ అంటూ నకిలీ వివరాలు చూపిస్తున్నట్లు తేలింది.
కోల్‌కతా, విశాఖపట్నంలలోని దిగుమతిదారులు, కస్టమ్స్ బ్రోకర్లు, ఐఈసీ హోల్డర్లకు చెందిన పలు ప్రాంగణాల్లో ఏకకాలంలో జరిపిన సోదాల్లో పోకచెక్కల మూలం ఆగ్నేయాసియా దేశాలేనని రుజువు చేసే అనేక కీలక పత్రాలను, ముఖ్యమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా దిగుమతి చేసుకున్న సరుకు అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్ముగా భావిస్తున్న సుమారు రూ. 75 లక్షల నగదును కూడా డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రవాణాలో ఉన్న దాదాపు 160 మెట్రిక్ టన్నుల పోకచెక్కల కన్సైన్మెంట్‌ను కూడా జప్తు చేశారు.
ఇటీవలి సంవత్సరాలలో పోకచెక్కల మోసపూరిత దిగుమతులు భారీ స్థాయిలో జరిగాయని, దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 2,500 కోట్లకు పైగా కస్టమ్స్ సుంకం నష్టం వాటిల్లిందని ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుంభకోణానికి సూత్రధారులు ఆగ్నేయాసియా దేశాల నుంచి పోకచెక్కలను బంగ్లాదేశ్‌లోని ఒక నిర్దేశిత ఎగుమతి ప్రాసెసింగ్ జోన్ కు దిగుమతి చేసుకునేలా సహకరించారు. ఆ తర్వాత కేవలం కంటైనర్లు, సంచులను మార్చి, ఆ సరుకు బంగ్లాదేశ్ మూలానికి చెందిందేనంటూ నమ్మించి భారతదేశానికి తరలిస్తున్నారు. వీరు బంగ్లాదేశ్ అధికారుల నుంచి మోసపూరితంగా 'సాఫ్టా' కంట్రీ ఆఫ్ ఆరిజిన్ సర్టిఫికెట్లను పొందారు. ఈ కన్సైన్మెంట్ల దారి మళ్లింపు, డాక్యుమెంటేషన్, క్లియరెన్స్, రవాణా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూభారీ మొత్తంలో నగదు రూపంలో చెల్లింపులు స్వీకరిస్తూ ఈ వ్యవహారానికి సూత్రధారులుగా ఉన్నవారు భారతీయ దిగుమతిదారుల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లను వసూలు చేస్తున్నారు. ఈ నిధుల మళ్లింపు, వాటిని వివిధ పద్ధతుల్లో దాచిపెట్టే ప్రక్రియ కోసం హవాలా మార్గాలు, డమ్మీ సంస్థలను ఉపయోగించినట్లు కూడా దర్యాప్తులో వెలుగుచూసింది.
ఈ కేసులో మెజారిటీ మోసపూరిత పోకచెక్కల దిగుమతుల క్లియరెన్స్‌కు ముఖ్యంగా ఒకే కస్టమ్స్ బ్రోకర్ సంస్థ కారణమని దర్యాప్తులో వెల్లడైంది. డిఆర్ఐ చేపడుతున్న ప్రస్తుత దర్యాప్తును పురస్కరించుకుని, సదరు కస్టమ్స్ బ్రోకర్ లైసెన్స్‌ను సంబంధిత అధికారి సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు.
ఇటువంటి అక్రమ దిగుమతులు మార్కెట్‌లో ధరలను ప్రభావితం చేయడమే కాకుండా, చట్టబద్ధంగా వ్యాపారం చేసే సంస్థలకు సమాన అవకాశాలు లేకుండా చేస్తూ దేశీయ పోకచెక్కల రైతులను, న్యాయబద్ధమైన వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ అక్రమ కార్యకలాపాలు ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగించడంతో పాటు, నియంత్రిత వాణిజ్య పద్ధతులను, సరిహద్దు ప్రాంతాల ఆర్థిక భద్రతను కూడా దెబ్బతీస్తాయి.
ఒక దేశం వివరాలను పద్ధతి ప్రకారం తప్పుగా ప్రకటించడం, సాఫ్టా ప్రయోజనాలను మోసపూరితంగా పొందడం, భారీ స్థాయిలో కస్టమ్స్ సుంకాలను ఎగవేయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్న వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను ఈ ఆపరేషన్ ద్వారా డీఆర్ఐ సమర్థవంతంగా ఛేదించింది
***
(रिलीज़ आईडी: 2300201)
आगंतुक पटल : 29